చరిత్ర సృష్టించిన అర్జున్.. ఆ ఘనత సాధించిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా

by Harish |

ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూరులో భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగు తేజం అర్జున్ ఇరిగేశి టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు.

చరిత్ర సృష్టించిన అర్జున్.. ఆ ఘనత సాధించిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా
X

దిశ, స్పోర్ట్స్ : లాస్ వెగాస్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూరులో భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగు తేజం అర్జున్ ఇరిగేశి టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. తాజాగా సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా అర్జున్ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అర్జున్ 1.5-0.5 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నొడిర్బెక్ అబ్దుసత్తోరోవ్‌పై విజయం సాధించాడు. ముందుగా ర్యాపిడ్ గేములో నెగ్గిన అర్జున్ సెకండ్ గేమును డ్రా చేసుకోవడంతో మ్యాచ్‌ గెలిచాడు. సెమీస్‌లో అతను అమెరికాకు చెందిన లెవాన్ అరోనియన్‌తో పోటీపడనున్నాడు. అర్జున్‌ది తెలంగాణలోని వరంగల్ జిల్లా. మరోవైపు, మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి. క్వార్టర్స్‌లో అతని పోరాటం ముగిసింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా చేతిలో 4-3 తేడాతో ఓడిపోయాడు.

క్వార్టర్స్‌కు హంపి, హారిక

ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు, తెలుగమ్మాయిలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరితోపాటు దివ్య దేశ్‌ముఖ్, వైశాలి కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. గురువారం నాలుగో రౌండ్‌లో రెండు క్లాసికల్ గేములు ముగిసే సరికి ఈ నలుగురి ఫలితాలు తేలలేదు. దీంతో శుక్రవారం అదే ప్రత్యర్థులతో టై బ్రేకర్స్ ఆడారు. నాలుగో రౌండ్‌ టైబ్రేకర్స్‌లో ఓ గేము నెగ్గి, మరో గేమ్ డ్రా చేసుకోవడం ద్వారా హంపి 2.5-1.5తో స్విట్జర్లాండ్‌కు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనియుక్‌ను ఓడించింది. మరోవైపు, హారిక, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ కేతరినా లాగ్నో మధ్య ఆట ఆసక్తికరంగా సాగింది. ఆరో గేములో ఫలితం తేలగా హారిక 3.5-2.5తో గెలిచింది. ఇంటర్నేషనల్ మాస్టర్ కమెలిదెవోనా మెరెట్(కజకిస్థాన్)పై మరో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి కూడా పోరాడి గెలిచింది. 8 గేములపాటు ఆట సాగిగా వైశాలి 4.5-3.5తో నెగ్గింది. దివ్య దేశ్‌ముఖ్ 2.5-1.5 తేడాతో చైనా గ్రాండ్‌‌మాస్టర్ జు జినెర్‌‌ను ఓడించింది. అయితే, క్వార్టర్ ఫైనల్‌లో హారిక, దివ్య తలపడటంతో ఒకరు మాత్రమే సెమీస్‌కు చేరుకున్నారు. మరో రెండు క్వార్టర్స్‌లో టాన్ ఝోంగి(చైనా)తో వైశాలి.. యుక్సిన్ సాంగ్(చైనా)‌తో హంపి పోటీపడనున్నారు.

slug :

Next Story