వెనిజులా భూకంపంలో ఘోర విషాదం.. ఫుట్ బాల్ ఆటగాడి కుటుంబం మృతి

by Naga Rani Yarlagadda |

శతాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా వెనిజులాను వణికించిన వరుస భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి.

వెనిజులా భూకంపంలో ఘోర విషాదం.. ఫుట్ బాల్ ఆటగాడి కుటుంబం మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: శతాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా వెనిజులాను వణికించిన వరుస భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. ఐదురోజులవుతున్నా ఇంకా శిథిలాల కింది నుంచి మృతదేహాలు బయటికొస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు్ అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లూకాస్ ట్రెజో (38) తన భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయారు. వెనిజులా సెకండ్ డివిజన్ టీమ్ క్లబ్ స్పోర్ట్ మారిటిమో లా గుయైరా కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ట్రెజో ఫ్యామిలీ భూంకం ధాటికి కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకుని మరణించింది. మూడు రోజుల అన్వేషణ తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. భూకంపం సమయంలో ట్రెజో కరాకస్ లోని టీమ్ కోచింగ్ సెంటర్లో ఉన్నారు. విషయం తెలియగానే 18 మైళ్ల దూరంలో ఉన్న లా గుయైరాలోని తన ఇంటికి పరుగున వచ్చారు. అప్పటికే సముద్రతీరంలో ఉన్న వారి ఇల్లు పూర్తిగా నేలమట్టమై, శిథిలాల కుప్పగా మారింది.

తన భార్య యానినా, పిల్లలు ఆరోన్, ఐన్హోవా బ్రతికే ఉంటారన్న ఆశతో మూడురోజులపాటు చేతులతోనే శిథిలాలను తొలగిస్తూ అన్వేషించారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించేందుకు సోషల్ మీడియా ద్వారా తన ఫ్రెండ్స్, తోటి ఆటగాళ్ల సహాయంతో వేడుకున్నారు. ఆదివారం నాటికి వారి మృతదేహాలు దొరకడంతో.. లూకాస్ బాధకు అంతులేకుండా పోయింది. ఈ విషాదంపై క్లబ్ స్పోర్ట్ మారిటిమో లా గుయైరా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "లూకాస్, నువ్వు ఒంటరివి కావు.. ఈ కష్టసమయంలో నీ జట్టు నీకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.

1,400 దాటిన మృతుల సంఖ్య.. క్షీణిస్తున్న ఆశలు

వెనిజులా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఘోర భూకంపం కారణంగా ఇప్పటివరకు 1,400 మందికి పైగా మరణించారు. వేలాది మంది ఇంకా గల్లంతయ్యారు. మృతులలో విదేశీయులు కూడా ఉన్నారు. చైనాకు చెందిన ఎనిమిది మంది, స్పెయిన్‌కు చెందిన తొమ్మిది మంది మరణించినట్లు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు ధృవీకరించాయి. భూకంపం సంభవించి కీలకమైన మొదటి 72 గంటల సమయం దాటిపోవడంతో, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని రెస్క్యూ బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Next Story