‘మనం ఏమైనా మొసాద్ ఏజెంట్లమా’: ఫిడే తనిఖీలపై చెస్ స్టార్ నకమురా ఫైర్

by Kema Shiva Kumar |

చెస్ టోర్నమెంట్‌లో తనిఖీలపై వరల్డ్ నంబర్ 2 హికారు నకమురా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాను ‘మొసాద్ ఏజెంట్’తో పోల్చుకుంటూ ఫిడే (FIDE) నిబంధనలపై ఫైర్ అయ్యారు.

‘మనం ఏమైనా మొసాద్ ఏజెంట్లమా’: ఫిడే తనిఖీలపై చెస్ స్టార్ నకమురా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) నిర్వహిస్తున్న ‘కాండిడేట్స్ టోర్నమెంట్’ ఘాటు వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారింది. టోర్నీ సందర్భంగా అమలు చేస్తున్న కఠినమైన భద్రతా తనిఖీలపై అమెరికన్ చెస్ దిగ్గజం హికారు నకమురా (Hikaru Nakamura) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటగాళ్లపై జరుగుతున్న సోదాలను ఆయన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ (Mossad) నిర్వహించే ఆపరేషన్లతో పోల్చడం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారింది.

అసలు వివాదం ఏంటంటే..

చెస్ క్రీడలో టెక్నాలజీ సాయంతో జరిగే మోసాలను (Cheating) అరికట్టడానికి ఫిడే ఈసారి నిబంధనలను కఠినతరం చేసింది. ఆటగాళ్లు హాల్‌లోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు మెటల్ డిటెక్టర్లు, బాడీ స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనిపై నకమురా స్పందిస్తూ.. ‘ప్రతిసారీ ఇలాంటి స్కానింగ్‌లు ఏంటి..? మనం ఏమైనా ఇరాన్‌లోకి చొరబడిన ‘మొసాద్’ ఏజెంట్లమా..? మనం కేవలం చెస్ ప్లేయర్లం మాత్రమే. కొంచెం వాస్తవికంగా ఆలోచించండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, నకమురా వ్యాఖ్యలపై భారతీయ చెస్ క్రీడాకారులు విభిన్నంగా స్పందించారు గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ థిప్సే మాట్లాడుతూ.. చెస్ బోర్డుపై మోసం అనేది చాలా ప్రమాదకరమైనదని అన్నారు. చిన్న చిప్ సాయంతో ఎవరైనా ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించవచ్చని అన్నారు. అందుకు తనిఖీలు తప్పనిసరే కదా అని కామెంట్ చేశారు. అయితే, స్కానింగ్‌కు బదులుగా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని 30 నిమిషాలు ఆలస్యం చేస్తే మోసాలను మరింత సులభంగా అరికట్టవచ్చని ప్రవీణ్ థిప్సే ఆయన సూచించారు.

సమర్థించుకున్న ఫిడే (FIDE)

ఈ నకమరా అమెరికన్ చెస్ ఛాంపియన్ విమర్శలపై ఫిడే అధికారులు స్పందిస్తూ.. భద్రతా చర్యలు కేవలం ఆటలో పారదర్శకత కోసమేనని స్పష్టం చేశారు. నకమురా మినహా మరే ఇతర టాప్ ప్లేయర్ ఈ తనిఖీలపై ఫిర్యాదు చేయలేదని వారు వెల్లడించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కోసం జరిగే ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Next Story