ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో అదరగొట్టిన తెలుగు తేజం..

by Vinod kumar |

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో తెలుగమ్మాయి సురేఖ రెండు స్వర్ణాలతో మెరిసిన మరుసటి రోజే మరో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర అదరగొట్టాడు.

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో అదరగొట్టిన తెలుగు తేజం..
X

అంటాల్యా: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో తెలుగమ్మాయి సురేఖ రెండు స్వర్ణాలతో మెరిసిన మరుసటి రోజే మరో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర అదరగొట్టాడు. అరంగేట్ర వరల్డ్ కప్‌లోనే రెండు పతకాలతో మెరిసి సంచలనం సృష్టించాడు. ఆదివారం వ్యక్తిగత పురుషుల రికర్వ్ కేటగిరీలో కాంస్యం‌తోపాటు రికర్వ్ టీమ్ కేటగిరీలో రజతం కొల్లగొట్టాడు. వ్యక్తిగత పురుషుల రికర్వ్ కేటగిరీలో తొలుత సెమీస్‌లో మల్డోవా క్రీడాకారుడు డాన్ ఒలారు చేతిలో 6-4 తేడాతో ధీరజ్ ఓడిపోయి స్వర్ణ పోరుకు అర్హత సాధించలేకపోయాడు.

అయితే, బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ధీరజ్ సత్తాచాటాడు. కజకస్థాన్‌కు చెందిన లిఫాట్ అబ్దులిన్‌‌‌‌ను 7-3(28-28, 29-26, 28-29, 29-27, 29-27) తేడాతో చిత్తు చేశాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చాటిన తెలుగు కుర్రాడు.. మూడు సెట్లను గెలుచుకోవడంతోపాటు ఒక సెట్‌ను డ్రా చేసుుని విజేతగా నిలిచాడు. దాంతో ధీరజ్ తొలి వరల్డ్ కప్‌‌లోనే వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించాడు.

పురుషుల రికర్వ్ టీమ్‌లో భాగమైన ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజతం గెలుచుకున్నాడు. చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షూటౌట్‌లో ఓడటంతో భారత త్రయం రజతంతో సరిపెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 4-5(54-55, 50-56, 59-58, 56-55, 28-28*) తేడాతో ఓడిపోయింది. ముందుగా చైనా రెండు సెట్లను గెలుచుకుని లీడ్‌లోకి వెళ్లగా.. మిగతా రెండు సెట్లను భారత త్రయం సాధించి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లింది.

అయితే, షూటౌట్‌లో 28-28తో ఇరు జట్లు సమంగానే నిలిచినప్పటికీ చైనా చివరి బాణాన్ని సర్కిల్‌లో సంధించడంతో ఆ జట్టే విజేతగా నిలిచింది. మొత్తంగా భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యంతో వరల్డ్ కప్‌ను ముగించింది.

Next Story