- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్చరీ వరల్డ్ కప్.. భారత మహిళల కాంపౌండ్ జట్టుకు రజతం
మాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం కైవసం చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తనిపర్తిలతో కూడిన భారత త్రయం శనివారం జరిగిన ఫైనల్లో కొలంబియా చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్ పోరులో భారత్ 228-232 పాయింట్ల తేడాతో కొలంబియా చేతిలో పరాజయం పాలైంది.
రాణించిన యువ ఆర్చర్..
17 ఏళ్ల యువ సంచలనం ప్రీతిక ప్రదీప్ ఆరు 10లు కొట్టి అద్భుతంగా రాణించింది. అయితే, కీలక సమయంలో సీనియర్ ఆర్చర్ జ్యోతి సురేఖ ఫామ్ కోల్పోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. కొలంబియా క్రీడాకారిణి అలెజాండ్రా ఉస్కియానో వరుసగా ఎనిమిది 10లు కొట్టి ఆ జట్టు విజయానికి బాటలు వేసింది. ఈ ఏప్రిల్‌లో మెక్సికోలో జరిగిన స్టేజ్-1లో భారత మహిళల కాంపౌండ్ జట్టు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని పతకాలపై ఆశలు
ఈ టోర్నీలో భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే దిశగా దూసుకుపోతున్నారు. రజతం సాధించిన జట్టులో సభ్యురాలైన ప్రీతిక, కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ సెమీ-ఫైనల్‌కు చేరుకుని మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. రికార్వ్ విభాగంలో యువ క్రీడాకారిణి కీర్తి శర్మ మహిళల వ్యక్తిగత సెమీస్‌కు చేరుకుంది. అలాగే, భారత నంబర్ వన్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరతో కలిసి ఆమె మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో తలపడనుంది.






