Archery World Cup : భారత్ ఖాతాలో మరో రెండు మెడల్స్.. ఏడు పతకాలతో ఘనంగా ముగింపు

by Harish |

భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి వరల్డ్ కప్ స్టేజ్-2లో కాంస్య పతకం సాధించింది.

Archery World Cup : భారత్ ఖాతాలో మరో రెండు మెడల్స్.. ఏడు పతకాలతో ఘనంగా ముగింపు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి వరల్డ్ కప్ స్టేజ్-2లో కాంస్య పతకం సాధించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఆమెకు మెడల్ దక్కింది. ఆర్చరీ వరల్డ్ కప్‌లలో ఆమెకు ఇది 37వ పతకం కావడం గమనార్హం. ఆదివారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో దీపిక 7-3 తేడాతో సౌత్ కొరియా క్రీడాకారిణి కాంగ్ చే యంగ్‌పై విజయం సాధించింది. ఐదు సెట్లలో దీపిక ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు సెట్లు ముగిసే వరకు ఇద్దరూ 3-3తో సమంగా ఉండగా దీపక చివరి రెండు సెట్లను దక్కించుకుని విజేతగా నిలిచింది. ఇక, పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత ఆర్చర్ పార్థ్ సుశాంత్ సులంఖే కూడా బ్రాంజ్ మెడల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పార్థ్ 6-4 తేడాతో ఫ్రెంచ్ ప్లేయర్ బాప్టిస్టే అడిస్‌‌పై గెలుపొందాడు. తాజాగా వచ్చిన రెండు మెడల్స్‌తో భారత్ ఈ టోర్నీని ఏడు పతకాలతో ముగించింది. అందులో రెండు స్వర్ణాలు, ఓ రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.


Next Story