కసి రగిల్చి.. జగజ్జేతలుగా నిలిపి.. భారత మహిళల జట్టు విజయం వెనుక ఉన్నదెవరో తెలుసా?

by Harish |

భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే.

కసి రగిల్చి.. జగజ్జేతలుగా నిలిపి..  భారత మహిళల జట్టు విజయం వెనుక ఉన్నదెవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : చక్ దే ఇండియా మూవీలో కబీర్ ఖాన్.. సై మూవీలో రఫీ.. గురు మూవీలో ఆదిత్య.. వీళ్లు వెండితెర కోచ్‌‌లు. కానీ, రియల్ లైఫ్‌లో వీళ్లందరూ ఒక్కరిలో కనిపిస్తే అతను అమోల్ మజుందార్. భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్. మూడు రోజుల క్రితం భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయం వెనుక మజుందార్ పాత్ర అనిర్వచనీయం. భారత మహిళల క్రికెట్‌లో ఈ కొత్త అధ్యాయం లిఖించడంలో అతని కష్టం ఎంతో ఉంది. ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు భారత్ గెలుస్తుందన్న అంచనాలు చాలా తక్కువ. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా.. ముఖ్యంగా వెరీ డేంజరస్ ఆస్ట్రేలియాను దాటి హర్మన్‌ప్రీత్ సేన విజేతగా నిలుస్తుందన్న ప్రశ్నలే ఎక్కువ. వాటికితోడు గ్రూపు దశలో మూడు పరాజయాలు భారత్‌పై ఉన్న కాసిన్ని ఆశలు లేకుండా చేశాయి. అలాంటి జట్టు చివరికి విశ్వవిజేతగా నిలిచిందంటే.. కచ్చితంగా ప్లేయర్ల శ్రమే. కానీ, వారిలో కసిని రగిల్చిన వ్యక్తి మజుందార్..

అమోల్ మజుందార్ 2023లో భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. అతని నియామకం తర్వాత కూడా భారత జట్టు ఓటములను చవిచూసింది. ప్రపంచకప్ కంటే ముందు కూడా ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. కానీ, భారత జట్టు ఆటతీరు చాలా మారింది. అదే సిరీస్‌లో మూడో వన్డేలో ఆసిస్ 412 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ భారత్ ఏ మాత్రం బెదరలేదు. ఆ మ్యాచ్‌లో ఓడింది. కానీ, 369 పరుగులు చేసిందంటే ప్లేయర్ల పోరాట పటిమను అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై రికార్డు చేజింగ్ నమోదు చేయడం.. భారత్ దూకుడు ఆటతీరుకు మరో ఉదాహరణ. మజుందార్ కోచ్‌‌గా వచ్చిన తర్వాత భారత్ ఆట ఎంతో మారిందనే చెప్పాలి. ప్లేయర్ల ఆట తీరు మాత్రమే కాదు.. ఒత్తిడిని అధిగమించడం, భారీ లక్ష్యాలను ఛేదించాలన్న భయం లేకపోవడం, గెలవాలనే తప్పన పెరగడం.. ప్లేయర్లలో కనిపిస్తున్నది. అందుకు కారణంగా కోచ్ ముజుందారే అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు.

ప్లేయర్‌గా దక్కిన చాన్స్.. కోచ్‌గా మారి

ముంబైకి చెందిన మజుందార్.. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసే క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. స్కూల్ క్రికెట్‌లో వారితో కలిసి ఆడేవాడు. దేశవాళీలోనూ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ముంబై, ఆంధ్ర, అస్సోం తరపున ఆడాడు. 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 11,167 రన్స్ చేశాడు. అందులో 30 సెంచరీలు ఉండటం విశేషం. మరో 60 హాఫ్ సెంచరీలు చేశాడు. దేశవాళీలో సత్తాచాటినప్పటికీ మజుందార్‌కు జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. అప్పటికే జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్‌ స్టార్లుగా ఉన్నారు. వారిని దాటి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ప్లేయర్‌గా దేశం తరపున ఆడకపోయినా కోచ్‌గా భారత జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

కఠిన నిర్ణయాలు.. ప్రతిభ గుర్తింపు

మజుందార్‌ భారత జట్టుకు హెడ్ కోచ్‌ నియామకం కాకముందు కోచ్‌గా అనుభవం ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ ఇవ్వలేదు. దీంతో అతన్ని నియమించినప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ, నెదర్లాండ్స్ అండర్-19, 23 జట్లకు, రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉంది. హెడ్ కోచ్‌గా నియామకమైన తర్వాత మజుందార్.. ప్లేయర్లకు స్వేచ్ఛ ఇచ్చాడు. దూకుడు నేర్పించాడు. అంతేకాదు.. ప్రతిభను ఎక్కడ ఉన్నా గుర్తించాడు. తెలుగమ్మాయి, స్పిన్నర్ శ్రీచరణి జట్టులోకి రావడం వెనుక అతని పాత్ర ఉంది. ఆమెలోని ప్రతిభను గుర్తించి జాతీయ జట్టులోకి తీసుకోవడమే కాకుండా అరంగేట్రం చేసిన నెలల్లోనే ప్రపంచకప్ ఆడించాడు. మరో బౌలర్ క్రాంతి గౌడ్‌ను కూడా ఎంకరేజ్ చేశాడు. అంతేకాదు.. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడిన జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ వంటి స్టార్లపై వేటు వేయడానికి కూడా సంకోచించలేదు. అలాగే, వారిలోని నైపుణ్యాలను తెలిసిన వ్యక్తిగా కూడా వారిని ఎక్కడా ఉపయోగించుకోవాలో అక్కడ సద్వినియోగం కూడా చేసుకున్నాడు. అందుకు ఉదాహరణలు సెమీస్‌లో రోడ్రిగ్స్ ఆడించడం, ప్రతీక రావల్ రిప్లేస్‌మెంట్‌గా షెఫాలీని జట్టులోకి తీసుకోవడం. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోని రోడ్రిగ్స్‌ను ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌‌కు తప్పించారు. కానీ, కీలకమైన ఆస్ట్రేలియాతో సెమీస్‌లో ఆమెను బరిలోకి దించగా.. రోడ్రిగ్స్ భారీ శతకం బాది జట్టు ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక,వన్డేలకు ఏడాదిపాటు దూరంగా ఉన్న షెఫాలీని ప్రతీకకు రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. సెమీస్‌లో ఆమె విఫలమైనప్పటికీ ఆమెను నమ్మాడు. ఫైనల్‌లో షెఫాలీ 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

కసిని రగిల్చి..

ప్లేయర్ల ఆటను మెరుగుపర్చడం మాత్రమే కాకుండా వారిలో బెరుకు దూరం చేయడం, గెలుపు కసిని రగల్చడం కూడా కోచ్ పనే. మజుందార్ కూడా అదే చేశాడు. లీగ్ దశలో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టంలో పడ్డాయి. ఈ సమయంలో మజుందార్ స్పీచ్ భారత క్రీడాకారుణులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే చెప్పింది. తాము నిరాశలో ఉన్నప్పుడు ముజుందర్ సర్ చెప్పిన మాటలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది. ‘ఆ రోజు రాత్రి ముజుందర్ సర్ ఒక్కటే చెప్పారు. ‘చేసిన తప్పులు చేయకండి. ఆ గీత దాటొద్దు’ అన్నారు. ఆ రోజు రాత్రి మాలో చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరిపై ఇంపాక్ట్ చూపించింది. చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని అనుకున్నాం.’అని హర్మన్ తెలిపింది. ఆ మీటింగ్ తర్వాత మన అమ్మాయిలు సివంగుల్లా మారిపోయారు. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్‌పై భారత్ సత్తాచాటింది. 340 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడమే కాకుండా 339 పరుగులు ఛేదించి రికార్డు చేజింగ్ నమోదు చేసింది. ఫైనల్‌కు ముందు కూడా అతని మాటలు అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపాయి. ‘రాబోయే 7 గంటలు చాలా కీలకం. ఎవరితో మాట్లాడొద్దు. ఏదీ పట్టించుకోవద్దు. కప్పే మన లక్ష్యం. మన కథను మనమే రాసుకోవాలి. చరిత్ర సృష్టించాలి’అని మజుందార్ భారత క్రీడాకారిణుల్లో కసిని రగిల్చాడు.


Next Story