రెండో రౌండ్‌కు చేరుకున్న లక్ష్యసేన్, మాళవిక

by Harish |

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు.

రెండో రౌండ్‌కు చేరుకున్న లక్ష్యసేన్, మాళవిక
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్‌ను 13-21, 21-17, 21-15 తేడాతో చిత్తు చేశాడు. ప్రారంభ రౌండ్‌లో గెలుపు కోసం లక్ష్యసేన్ పోరాడాల్సి వచ్చింది. ఆరంభంలోనే అతనికి షాక్ తగిలింది. తొలి గేమ్‌ ప్రత్యర్థి నెగ్గడంతో వెనుకబడ్డాడు. అనంతరం బలంగా పుంజుకున్న లక్ష్యసేన్.. ప్రత్యర్థి దూకుడుకు చెక్ పెట్టాడు. ఆత్మవిశ్వాసంతో ఆడి వరుసగా రెండు గేముల్లో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అక్కడ ఇండోనేషియాకు చెందిన జొనాటన్ క్రిస్టీతో తలపడనున్నాడు. లక్ష్యసేన్ 2022 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

మరో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ నిరాశపరిచాడు. ఫ్రాన్స్ ప్లేయర్ టోమా జూనియ్ పొపొవ్ చేతిలో 21-19, 21-16 తేడాతో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. ఇక, యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శన చేసింది. తన కంటే మెరుగైన వరల్డ్ నం.12 యో జియో మిన్(సింగపూర్‌)ను 21-13, 10-21, 21-17 తేడాతో ఓడించింది. తొలి గేమ్ నెగ్గి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. కానీ, రెండో గేమ్‌లో ప్రత్యర్థి గెలవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. అక్కడ సింగపూర్ షట్లర్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ ఏ మాత్రం తడబడకుండా ప్రత్యర్థిని నిలువరించి విజేతగా నిలిచింది. స్టార్ షట్లర్ పీవీ సింధు నేడు తొలి రౌండ్‌‌ ఆడనుంది.


Next Story