అల్కరాజ్ అదుర్స్.. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో సిన్నర్‌పై అదిరే విక్టరీ

by Phanindra |

అల్కరాజ్ అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో సిన్నర్‌పై అద్భుతమైన విక్టరీతో ట్రోఫీతోపాటు నెంబర్ వన్ ర్యాంకు కూడా కొట్టేశాడు.

అల్కరాజ్ అదుర్స్.. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో సిన్నర్‌పై అదిరే విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరో ఘనత సాధించాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జానిక్ సిన్నర్‌పై అద్భుతమైన విజయం సాధించాడు. హార్డ్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్స్‌లో వరుసగా 27 మ్యాచులు నెగ్గిన జానిక్ సిన్నర్‌ విన్నింగ్ స్ట్రీక్‌కు అల్కరాజ్ బ్రేకులు వేశాడు. వరుసగా 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో సిన్నర్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది అతని కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం గమనార్హం. ఈ విజయంతో ట్రోఫీతోపాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును కూడా అల్కరాజ్ సాధించాడు. 2023 సెప్టెంబరు తర్వాత టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అల్కరాజ్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. జూన్ నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్‌లో కూడా వీళ్లిద్దరే తలపడగా.. అప్పుడు కూడా అల్కరాజే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది అల్కరాజ్ చేతిలో సిన్నర్‌కు రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమి తర్వాత మాట్లాడుతూ.. ‘నేను నా బెస్ట్ ప్రదర్శన చేశా. ఇంతకుమించి ఏమీ చెయ్యలేకపోయా’ అని సిన్నర్ చెప్పాడు.

డిఫెన్స్ ఇంపాజిబుల్..

2004 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు యూఎస్ ఓపెన్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ డిఫెండ్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత మరెవరూ కూడా పురుషుల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన సిన్నర్ కూడా ఫైనల్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. యూఎస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవడం గమనార్హం.

Next Story