లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ క్రికెట్ జట్టు.. ఎలా సాధ్యమంటే?.. అదే జరిగితే 128 ఏళ్ల తర్వాత బరిలోకి

by Harish |

2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే.

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ క్రికెట్ జట్టు.. ఎలా సాధ్యమంటే?.. అదే జరిగితే 128 ఏళ్ల తర్వాత బరిలోకి
X

దిశ, స్పోర్ట్స్ : 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌‌లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. 128 ఏళ్ల తర్వాత క్రికెట్ విశ్వక్రీడలకు తిరిగొచ్చింది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. పాల్గొనే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ క్రికెట్ జట్టు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో గ్రేట్ బ్రిటన్ టీమా?.. ఇంతవరకు ఆ జట్టు ఆడింది.. చూసింది లేదే?.. అని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు అనుకునేది కూడా నిజమే. మరి, అలాంటప్పుడు ఆ జట్టు ఎలా పాల్గొంటుంది? అన్న ప్రశ్న రావొచ్చు. ఇంగ్లాండ్ జట్టే బ్రిటన్ టీమ్‌గా ఆడబోతున్నది. అందుకోసం స్కాట్లాండ్ జట్టుతో జతకట్టనుంది. ఇరు దేశాల ప్లేయర్లు ఒలింపిక్స్‌లో బ్రిటన్ టీమ్‌గా ఆడబోతున్నారు. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిండ్‌బ్లేడ్ వెల్లడించారు.

సాధారణంగా యూకేలోని దేశాలు(ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్) ఒలింపిక్స్‌లలో అన్ని క్రీడా ఈవెంట్లలో గ్రేట్ బ్రిటన్‌‌గా ప్రాతినిధ్యం వహిస్తాయి. క్రికెట్‌లోనూ అదే సాంప్రదాయాన్ని కొనసాగించనున్నాయి. ‘మాకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికె్ట్‌ బోర్డుతో మంచి సంబంధాలు ఉన్నాయి. మేము వారితో మాట్లాడాం. ఇంగ్లాండ్‌కు బదులుగా గ్రేట్ బ్రిటన్ టీమ్‌ బరిలోకి దిగుతుంది. జట్టు కూర్పు ప్రాసెస్‌లో ఉంది.’అని లిండ్‌‌బ్లేడ్ తెలిపారు. మరోవైపు ఈసీబీ కూడా సానుకూలంగానే స్పందించింది. తదుపరి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

128 ఏళ్ల తర్వాత

టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ను నిర్వహించబోతున్నారు. టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-6 జట్లు ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పురుషుల విభాగంలో 2వ స్థానం, మహిళల విభాగంలో 3వ స్థానంలో ఉన్నది. కాబట్టి, ఆ జట్టు ఎంపికవడం ఖాయమే. బ్రిటిష్ ఒలింపిక్ అసోసియేషన్(బీవోఏ) కింద బరిలోకి దిగనుండటంతో ఇంగ్లాండ్ బదులుగా బ్రిటన్ జట్టు పోటీచేయనుంది. 1900 ఒలింపిక్స్‌లో తొలిసారి, ఆఖరి సారిగా క్రికెట్‌ను నిర్వహించారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆ జట్టు మళ్లీ బరిలోకి దిగబోతున్నది.


Next Story