ICC Rankings : కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించిన అభిషేక్.. దిగ్గజాల సరసన చేరిక

by Harish |

టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20ల్లో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించాడు.

ICC Rankings : కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించిన అభిషేక్.. దిగ్గజాల సరసన చేరిక
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20ల్లో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించాడు. ఇప్పటికే అతను టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐసీసీ బుధవారం రిలీజ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ తన రేటింగ్ పాయింట్స్‌ను 907కు పెంచుకున్నాడు. ఆసియా కప్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న అతను గత రెండు మ్యాచ్‌ల్లో యూఏఈపై 38, పాక్‌పై 74 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని రేటింగ్ పాయింట్స్ మెరుగుపడ్డాయి. దీంతో అభిషేక్ 900+ రేటింగ్ పాయింట్స్ సాధించిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. అభిషేక్ కంటే ముందు విరాట్ కోహ్లీ, డేవిడ్ మలన్, సూర్యకుమార్, బాబర్ ఆజామ్, ఆరోన్ ఫించ్ ఈ లిస్ట్‌లో ఉన్నారు.

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ చెరో స్థానం వెనక్కినెట్టి 3వ, 6వ స్థానాల్లో నిలిచారు. టాప్-10లో ముగ్గురు బ్యాటర్లు ఉండటం విశేషం. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. నం.1 ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా బౌలర్‌గా 6 స్థానాలు ఎగబాకి 60వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, పాక్ క్రికెటర్లు తాజా ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఆసియా కప్‌లో నిలకడగా రాణిస్తున్న స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఏకంగా 12 స్థానాలు అధిగమించి 4వ స్థానంలో నిలిచాడు. హరిస్ రౌఫ్ 9 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. బ్యాటర్లు ఫర్హాన్ 31 స్థానాలు అధిగమించి 24వ ర్యాంక్‌కు, హుస్సేన్ తలట్ 1,474 స్థానాలు ఎగబాకి 234వ ర్యాంక్‌కు, సైఫ్ మసన్ 133 స్థానాలు వెనక్కినెట్టి 81వ ర్యాంక్‌కు చేరుకున్నారు.

Next Story