టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్.. అతని తర్వాతే విరాట్, సూర్య

by Harish |

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో నయా చరిత్ర సృష్టించాడు.

టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్.. అతని తర్వాతే విరాట్, సూర్య
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో నయా చరిత్ర సృష్టించాడు. అతను ఇప్పటికే నం.1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఆసియా కప్‌లో సత్తాచాటిన అభిషేక్ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా రేటింగ్ పాయింట్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. 931 పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకుముందు టీ20ల్లో అత్యధిక రేటింగ్ కలిగిన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ పేరిట రికార్డు ఉండేది. 2020లో అతను 919 పాయింట్స్ సాధించగా అభిషేక్ అతన్ని అధిగమించాడు. అంతేకాకుండా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌(912), దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ(909)లను కూడా వెనక్కినెట్టడం గమనార్హం. టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అభిషేక్ నం.1 ర్యాంక్‌తోపాటు హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించడం విశేషం. ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

టాప్ ర్యాంక్ కోల్పోయిన పాండ్యా

ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ 8వ ర్యాంక్‌లో ఉండగా.. శాంసన్ 8 స్థానాలు ఎగబాకి 31వ స్థానంలో నిలిచాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ విభాగంలో టాప్ పొజిషన్‌ను కోల్పోయాడు. ఒక్క స్థానం పడిపోయిన అతను రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. పాక్ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ నం.1 స్థానాన్ని ఆక్రమించాడు. ఆసియా కప్‌లో రాణించిన అతను 4 స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. అక్షర్ పటేల్ ఒక్క స్థానం వెనక్కినెట్టి టాప్-10లో చోటు సంపాదించాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 9 స్థానాలు అధిగించి 12వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు.


Next Story