గంభీర్ అసిస్టెంట్‌కు కేకేఆర్ ఆఫర్.. ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగింత

by Harish |

భారత మాజీ క్రికెటర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు.

గంభీర్ అసిస్టెంట్‌కు కేకేఆర్ ఆఫర్.. ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగింత
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ గురువారం ధ్రువీకరించింది. గత మూడు సీజన్లుగా కేకేఆర్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ ఇటీవల ఫ్రాంచైజీని వీడిన విషయం తెలిసిందే. గతేడాది అతని కోచింగ్‌లోనే కోల్‌కతా టైటిల్ గెలిచింది. దీంతో కొత్త హెడ్ కోచ్‌ కోసం అన్వేషించిన ఫ్రాంచైజీ ఆ బాధ్యతలు అభిషేక్‌కు అప్పగించింది. గతంలో కూడా కేకేఆర్‌కు సేవలందించిన అభిషేక్ మళ్లీ కోల్‌కతా గూటికే చేరాడు. 2018 నుంచి జట్టుతో అనుబంధాన్ని కలిగి ఉన్న అతను 2024లో టైటిల్ గెలిచిన జట్టుకు కూడా అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలందించాడు.

ఆ సీజన్ అనంతరం భారత జట్టుకు హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఏడాదిపాటు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అభిషేక్‌పై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘2018 నుంచి అభిషేక్ నైట్‌రైడర్స్‌లో భాగం. మైదానం లోపల, వెలుపల అను మా ప్లేయర్లను తీర్చిదిద్దాడు. ఆటపై అవగాహన, ప్లేయర్లతో అతని అనుబంధం మా వృద్ధికి కీలకం కానుంది. అభిషేక్ హెడ్ కోచ్‌గా కేకేఆర్‌ను కొత్త అధ్యాయంలోకి తీసుకెళ్లగలడు.’అని చెప్పుకొచ్చారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ యూపీ వారియర్స్‌కు అభిషేక్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


Next Story