సెంచరీతో విదర్భను ఆదుకున్న మాలేవార్

by Ajay Maddhiboyina |

విదర్భ బ్యాటర్లు డానిష్ మాలేవర్, కరుణ్ నాయర్‌లు కలిసి నిలకడగా ఆడారు. కేరళ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ నెమ్మదిగా పరుగులు రాబట్టారు.

సెంచరీతో విదర్భను ఆదుకున్న మాలేవార్
X

- రాణించిన కరుణ్ నాయర్

- మూడో వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం

- రంజీ ఫైనల్‌లో కేరళతో తలపడుతున్న విదర్భ

దిశ, స్పోర్ట్స్: విదర్భ బ్యాటర్ డానిష్ మాలేవర్ సెంచరీతో రాణించాడు. నాగ్‌పూర్‌లోని వీసీఏఎస్ క్రికెట్ స్టేడియంలో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు డానిష్ మాలేవర్ (138) నిలకడైన బ్యాటింగ్‌తో విదర్భను ఆదుకున్నాడు. మరోవైపు కరుణ్ నాయక్ (86) కూడా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 86 ఓవర్లలో 254/4 స్కోర్ చేసింది. దేశవాళీ క్రికెట్‌లో అత్యున్నత టోర్నీగా పిలిచే రంజీ ట్రోఫీ ఫైనల్ కేరళ, విదర్భ జట్ల మధ్య జరుగుతుంది. కేరళ జట్టు టాస్ గెలిచి విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే కేరళ బౌలర్లు రాణించడంతో విదర్భ టాప్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్ పార్థ్ రాఖడే (0) నిదీశ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే దర్శన్ నల్కండే (1) నిదీశ్ బౌలింగ్‌లో బాసిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ధృవ్ షోరీ (16) ఈడెన్ ఆపిల్ టామ్ బౌలింగ్‌లో అజారుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో కేవలం 24 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి విదర్భ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

విదర్భ బ్యాటర్లు డానిష్ మాలేవర్, కరుణ్ నాయర్‌లు కలిసి నిలకడగా ఆడారు. కేరళ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. అయితే సొంత గడ్డపై ఆడుతున్న మాలేవర్ 167 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. వరుసగా ఒక సిక్సు, బౌండరీ బాది సెంచరీ మార్కును చేరుకోవడం విశేషం. ఇక కరుణ్ నాయర్ కూడా సెంచరీ వైపు దూసుకెళ్లాడు. అయితే 86 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ గా వెనుదిరగడంతో విదర్భ జట్టులో నిరాశ నెలకొంది. డానిష్, కరుణ్ నాయర్ కలిసి నాలుగో వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక ఆ తర్వాత వచ్చిన యశ్ ఠాకూర్‌(5 నాటౌట్)తో కలిసి డానిష్ మాలేవర్ (138 నాటౌట్) తొలి రోజు ఆటను ముగించారు. తొలి రోజు విదర్భ జట్టు 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. నిధీష్‌కు రెండు వికెట్లు, ఈడెన్ ఆపిల్ టామ్‌కు ఒక వికెట్ లభించింది.

స్కోర్ బోర్డు:

విదర్భ : 254/4 (డానిష్ మాలేవర్ 138 నాటౌట్, కరుణ్ నాయర్ 86)

కేరళ: నిధీష్ 2 వికెట్లు, ఈడెన్ ఆపిల్ 1 వికెట్ల

Next Story