- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్ స్పెషల్స్.. దేశానికి తెలంగాణ ఉత్పత్తులను పరిచయం చేస్తున్న మహిళా స్టాల్స్
రాష్ట్రంలో మహిళలు లక్షాధికారులు కావాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యాలపై మహిళలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళలు లక్షాధికారులు కావాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యాలపై మహిళలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. కుటుంబానికి ఆసరా ఉండాలనే స్థాయి నుంచి తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆకాంక్షతో మహిళలు పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహయక బృందాలు పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు. మహిళా సంక్షేమమే లక్ష్య్ంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తే వారి కుటుంబాలకు బలోపేతం అవుతాయని భావించి వారికోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తూ వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి కేరళలో స్వయం ఉపాధికి జిల్లా కేంద్రాల్లోని మహిళా ప్రాంగణాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నది. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అర్హులైన మహిళా సంఘాలను సెర్ప్ ఎంపిక చేస్తున్నది. ఈ స్టాళ్లలో మహిళలు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా..
తెలంగాణ రుచులు, ఉత్పత్తులు దేశానికి అందించే ప్రణాళికలో భాగంగా రైల్వేస్టేషన్లలో తెలంగాణ మహిళా స్టాళ్లు ఏర్పాటు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో పనుల వేగవంతం చేయడంలో సెర్ప్ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్వ దేవరాజన్ చొరవతో రైల్వే స్టేషన్లలో మహిళా స్టాల్స్ ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతో మొదటి విడతలో 14 మహిళా స్టాళ్లకు రైల్వే శాఖ అనుమతులు మంజూరు కాగా ఇప్పటికే ఏడు స్టాళ్లను మహిళా సంఘాలు ప్రారంభించాయి. ఒక్కో స్టేషన్లో ఒక్కో స్టాల్ ఏర్పాటు ఏర్పాటు చేసుకునేలా రైల్వే శాఖ అనుమతులు ఇవ్వగా మొత్తం 50 స్టేషన్లలో 50 స్టాళ్లను ఏర్పాటు చేయాలని సెర్ప్ అధికారులు నిర్ణయించారు. ప్రతీ స్టేషన్లో ఒక్కో వెరైటీ ఉత్పత్తులను అమ్మడం ద్వారా రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ ఉత్పత్తుల ప్రత్యేకతలు దేశవ్యాప్తంగా బ్రాండింగ్ అవుతాయని సెర్ప్ భావించింది. దీంతో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా పనిచేస్తున్న ప్రభుత్వం మహిళలకు ఆదాయంతో పాటు పేరు తెచ్చేలా ప్రణాళికలు చేపడుతుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సక్సెస్ స్టోరీలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారే అవకాశం ఉందని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో ఎస్ హెచ్ జీ మహిళా వ్యవస్థాపక విజయం, స్పూర్తిదాయకమైన కథలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్న ప్రయాణంలో గ్రామీణ పేద కుటుంబాలన్నీంటిని ఎస్‌హెచ్‌జీ మోడ్‌లోకి తీసుకురావడంలో సెర్ప్, స్త్రీ నిధి ప్రశంసనీయమైన పురోగతి సాధిస్తుండటం విశేషం..
రైళ్లలో ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్
రైళ్లలో ప్రయాణం చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం మంచివార్త చెప్పిందనే కంటే ఇక నుంచి ఆకలి చంపుకోలేక రుచిలేని, క్వాలిటీ లేని తిండిని తినలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టైంలో ఎక్కడైనా ఇంట్లో చేసిన వంటకాలు దొరికితే నిజంగా ఆనందమే కదా.. మహిళా సంఘాలు స్వయంగా తయారుచేసే పిండి వంటలతో రైల్వే స్టేషన్లలో స్టాళ్లు పెట్టించేందుకు ప్రభుత్వం నడుం బిగించడం మంచి పరిణామం. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో మధ్యలో తినేందుకు ఇంటినుంచే భోజనాలు గానీ, ఏమైనా తినుబండారాలు గానీ తీసుకెళ్తుంటారు. మరికొంతమంది మాత్రం బయటదొరికే జంక్ ఫుడ్స్, ప్రూట్స్తోనో సరిపెట్టుకుంటారు. మరికొంత మాత్రం ట్రైన్లలో అమ్మేవాటిపైనో, స్టేషన్లలో దొరికే వాటిపైనో ఆధారపడాల్సి వస్తుంటుంది. నాణ్యాత లేకపోవడం, ఆరోగ్యరీత్యా అంత మంచివి కాకపోవడం వంటి కారణాలతో తినకపోవడం మంచిదని భావించే వాళ్లకి రైల్వే స్టాళ్లలో దొరికే స్నాక్స్ గానీ ఫుడ్ గాని శ్రేయస్కరమని భావించింది ప్రభుత్వం. ప్రయాణికులని తెలంగాణ ఇంటి వంట రుచులతో పాటు, చేతి ఉత్పత్తులు అందిస్తే మహిళలకు ఉపాధితో పాటు, ప్రయాణికులకు తాము పెట్టిన మనీకి మంచి ప్రొడక్ట్ కొన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది.
స్టాళ్లలో లభించేవి ఇవే..
ప్రస్తుతం 14 మహిళా స్టాళ్లలో ఒక్కో స్టేషన్లో ఒక్కో వెరైటీ వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. వరంగల్ స్టేషన్లో తృణధాన్యాలు, జూట్ బ్యాగులు, సికింద్రాబాద్ స్టేషన్లో పిండి వంటలు, స్టేషన్ ఘన్‌పూర్‌లో చేతి ఉత్పత్తులు, ఖమ్మంలో సకినాలు, లడ్డూలు, కారంపూస, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, వికారాబాద్‌లో గాజులు, పూసలు, హారాలు, యాదాద్రి భువనగిరిలో తెలంగాణ పిండి వంటకాలు, జనగామలో చేతివృత్తులు, స్థానికంగా లభించే ఉత్పత్తులు, నల్గొండ జిల్లా చర్లపల్లిలో పోచంపల్లి చీరలు, ఇకో ఫ్రెండ్లీ టీ కప్స్, కుండలు, పాత్రలు, వాటర్ బాటిల్స్, అసిఫాబాద్ సిర్పూర్లో సకినాలు, మురుకులు, కారంపూస, ఇంట్లో తయారుచేసుకునే వంటకాలు, భద్రాచలంలో పచ్చళ్లు, కరీంనగర్లో తృణ ధాన్యాలు రైల్వే స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.
మహిళా మంత్రి.. మహిళల కోసం
మహిళలను కోటీశ్వరులు చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పథకాల అధ్యయనంతో పాటు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయని క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాతే వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్టాళ్లు రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉండటం వల్ల మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల మహిళలు ఆర్థికంగా బలపడతారని ఆశించింది. దానికి అనుకున్నట్లుగానే సత్ఫలితాలు సాధిస్తున్నది.
భర్త, కుటుంబంనుంచి ప్రోత్సాహం
గతనెల ఖమ్మం రైల్వే స్టేషన్లో తెలంగాణ పిండివంటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రయాణికులతో పాటు వినియోగదారులు మా వంటకాలను కొనడానికి ఇష్టపడుతున్నారు. అప్పట్లో వ్యవసాయం తప్ప ఇతర పనులు దొరకని రోజులలో 1996లో ఆదర్శ సమాఖ్యలోని తులసమ్మ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరాను. 2003లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో పిండివంటలు, పచ్చళ్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. నెలరోజుల్లో పిండి వంటలు, బేకరీ, బిస్కెట్లు, మాంసాహార పచ్చళ్లు, పాల పదార్థాలు, పండ్లతో నిల్వచేసే జామ్‌ల వంటి తయారీలో నిపుణుల వద్ద మెళకువలు నేర్చుకున్నాను. ఎస్‌హెచ్‌జీ రుణాలు తీసుకుంటూ పెద్ద వంటల తయారీకి అవసరమైన సామాన్లతో పాటు కొన్ని యంత్రాలను కొనుకున్నాను. వివిధ రకాల స్నాక్స్ తయారు చేసి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, ఢిల్లీతో సహా 15 రాష్టా్ల్లో స్టాళ్ల ద్వారా విక్రయించాను. పిండి వంటలతో పాటు జ్యూట్ బ్యాగులు సైతం తయారు చేసి అమ్ముతున్నాను. హర్యానా, డెహ్రడూన్, హైదరాబాద్ ప్రాంతాల్లో నాబార్డు తరుపును బెస్ట్ ఫుడ్ అవార్డు కింద నగదు బహుమతులు అందుకున్నాను. నా భర్త ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది.
- మద్దినేని పద్మ, ఖమ్మం రైల్వే స్టాల్ నిర్వాహకురాలు
నా కొడుకు ప్రోత్సాహంతోనే సాధ్యం
ఎకో ఫ్రెండ్లీ టీ కప్స్, మట్టి కుండలు, పాత్రలు, వాటర్ బాటిల్స్ ఇలా మట్టితో చేసిన పాత్రలకు ఈ మధ్య కాలంలో గిరాకీ పెరిగడంతో మా స్టాల్‌కు వచ్చే వినియోగదారులు కూడా పెరిగారు. దానికి తగ్గట్లుగానే ఆదాయం ఉంటుంది. చాలా వరకు అవగాహన ఉన్న వాళ్లు వీటినే కొనడానికి ఇష్టపడుతున్నారు. వినియోగదారుల అభిరుచి, ఆర్డర్ల మేరకు మేము వీటిని తయారు చేసి అమ్ముతున్నాం. ఇప్పటివరకు వీటికి గిరాకీ బాగానే ఉంది. ఇక ముందు కూడా వేసవికాలం కాబట్టి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నాం. నేను రేణుక ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలిగా ఉంటూనే నల్లగొండ జిల్లా కేంద్రంలో చేతివృత్తుల కు సంబంధించి శిక్షణ తీసుకున్నాను. నా కుటుంబం నేపథ్యం కూడా చేతివృత్తులకు సంబంధించి నైపుణ్యం ఉన్న కారణంగానే, మెళకువలు పాటిస్తూ తయారుచేయడం చాలా సులువైంది. వీటి అమ్మకాలకు సంబంధించి, ఆన్లైన్ పేమెంట్లు, తదితర విషయాల్లో నా కొడుకు సహకరిస్తాడు.
- బుచ్చమ్మ, చర్లపల్లి రైల్వేస్టేషన్ స్టాల్
Read More ....






