మహిళలను బలి తీసుకుంటున్న వరకట్న ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది ? ఆడపిల్ల పెళ్లి చేస్తే కట్నమివ్వాల్సిందేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-25 12:39:02  IST  )

వరకట్న దాహానికి బలవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి కేసులు కోకొల్లలు. అసలు వరకట్న ఆచారం ఎప్పుడు మొదలైంది?

మహిళలను బలి తీసుకుంటున్న వరకట్న ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది ? ఆడపిల్ల పెళ్లి చేస్తే కట్నమివ్వాల్సిందేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: అదనపు కట్న వేధింపులు భరించలేక పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్న తల్లులు కొందరుంటే.. పెళ్లైన మూడ్నాళ్లకే తనువులు చాలిస్తోన్న అబలలు ఎందరో ఉన్నారు. ఇంకా కట్నం కావాలని వేధించి వేధించి.. అతి దారుణంగా కోడళ్లను హతమారుస్తోన్న అత్తమామలు, భార్యల్ని చంపేస్తోన్న రాక్షస భర్తలు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఒకచోట ఒక ఇన్సిడెంట్ జరిగితే మరోసారి ఆ తప్పు చేయడానికే భయపడేలా శిక్ష వేయకపోవడమే మరిన్ని దారుణాలకు దారిస్తోందన్న వాదన లేకపోలేదనే చెప్పాలి. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ఎంత కట్నమిచ్చినా కొందరికి వరకట్న దాహం తీరడం లేదు. అబ్బాయిలు ఎలా అయితే పుట్టి, పెరిగి, చదువుకుని, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, ఇతర పనులు చేసి సంపాదిస్తున్నారో.. నేటికాలంలో ఆడపిల్లలూ అలాగే పెరుగుతున్నారు. అయినా ఈ వరకట్న ధోరణి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇద్దరూ సమానం అనుకున్నపుడు ఆడపిల్లల తల్లిదండ్రులే కట్నం ఎందుకు ఇవ్వాలి ? అది కూడా వారి స్థాయికి మించి అడిగినంత ధారపోయాలి. అసలు వరకట్న ధోరణి ఎప్పటి నుంచి, ఎలా మొదలైంది? నాటి కన్యాశుల్కం పద్ధతే నేటికీ ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవా?

పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఆడపిల్లకు పుట్టింట్లో ఉండే స్వేచ్ఛ ఉండదనేది జగమెరిగిన సత్యం. అక్కడ వంట, ఇతర పనులు సరిగ్గా చేయకపోతే.. మీ అమ్మ, నాన్న ఇలాగేనా నిన్ను పెంచారు, ఇవేనా నీకు నేర్పిన పనులు, పద్ధతులు అని సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. మరి అబ్బాయిని పెంచే తల్లిదండ్రులు కట్టుకున్న భార్యను కట్నం కోసం వేధించకూడదు, కొట్టకూడదు, హింసించకూడదు అని చెప్పాల్సిన బాధ్యత ఉండదా ? ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచాలని చెప్తున్న సమాజమే.. మగపిల్లల్ని కూడా ఆడపిల్లల పట్ల గౌరవంగా మెలిగేలా, సౌమ్యంగా వ్యవహరించేలా పెంచాలని గట్టిగా ఎందుకు మాట్లాడదు. ఒకరకంగా చూస్తే ఈ వరకట్నం అనే భూతాన్ని మన తాతముత్తాతల కాలం నాటి నుంచి మనమే పెంచి పోషించి.. ఇప్పుడు కట్నం తీసుకోవడం ఒక అధికారం అనే స్థాయికి తీసుకొచ్చేశాం.

ఇప్పుడంటే వరకట్నం కింద మాకు స్థలం, బంగారం, ఇంత నగదు కావాలని పెండ్లికొడుకు, అతని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు అమ్మాయికే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. దాన్నే కన్యాశుల్కం అంటాం. ప్రాచీనకాలంలో ఈ సంప్రదాయం ఉండేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి.. పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పురుషులు రోజంతా కష్టపడి డబ్బు తీసుకువస్తే.. ఇళ్లల్లో ఇల్లాలు సంసారాలను చక్కబెట్టాలి. ఇదే ఆనాడు ఉన్న సృష్టి ధర్మం. అయితే భర్త సంపాదన భార్య, పిల్లల్ని పోషించేందుకు సరిపోయేది కాదు. అందుకే ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేవారు అల్లుడికి సహాయంగా ఉంటుందని, భర్త చనిపోయినా కూతురికి ఆ డబ్బు ఎంతోకొంత సాయంగా ఉంటుందన్న ఉద్దేశతో తమకు ఉన్నంతలో ఎంతోకొంత ధనాన్ని ముట్టజెప్పేవారు. కాలక్రమేణా అది వరకట్న ఆచారంగా మారింది. ఎంత ఎక్కువ కట్నం వస్తే.. వారికి అంత డిమాండ్ ఉన్నట్లు.

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారంగా, పురుషుడికి లాభంగా మారింది. పెళ్లి వ్యవస్థ అంటేనే ఒక వ్యాపారంలా మారిపోయింది. మీ అమ్మాయిని చేసుకోవాలంటే మాకేం ఇస్తారు అని అడిగేవారే ఎక్కు. కాణీ కట్నం లేకుండా అమ్మాయిని పెళ్లాడే అబ్బాయిలు చాలా అరుదు. అలాంటివి ఎక్కువగా హైలైట్ అవ్వవు. కానీ.. వరకట్న వేధింపులే ఎక్కువగా వార్తల్లోకి వస్తుంటాయి. ఒకరిని చూసి మరొకరు అదే ధోరణి కొనసాగిస్తున్నారే తప్ప.. ఇది తప్పు అని ఎవరూ తెలుసుకోవడం లేదు.

ఈ వరకట్న వేధింపులు కొత్తగా పెళ్లయిన వారికే కాదు.. పెళ్లై 10-20 సంవత్సరాలుగా కాపురాలు చేస్తున్న వివాహితలు సైతం ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు, హత్యలకు గురైన స్త్రీల సంఖ్య అనేకం. వారంరోజుల క్రితం హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో కావ్య అలియాస్ మానస(29), రెండ్రోజుల క్రితం మహబూబ్ నగర్ కొత్తపేటలో నవ వధువు వెంకటేశ్వరి (22) ఆత్మహత్యలు చేసుకున్నారు. అశ్వారావుపేటలో లక్ష్మీప్రసన్న, యూపీ గ్రేటర్ నోయిడాలో నిక్కీ వరకట్న వేధింపులకు భర్తల చేతుల్లో బలయ్యారు.

నిజానికి పెళ్లికి కట్నం అడగటం, ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరమే. వరకట్న వేధింపులు భరించలేక వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో 1983లోనే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. సెక్షన్ ఐపీసీ 498ఏ ప్రకార కట్నం అడిగినా, ఇచ్చినా నేరమే. బాధితురాలు మెట్టినింటి ప్రాంతంలో ఫిర్యాదు చేసినా, పుట్టినింటి ప్రాంతంలో ఫిర్యాదు చేసినా ఈ సెక్షన్ కింద అత్తింటివారిపై కేసులను నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ.. స్త్రీ సాధికారత పెరిగినందున వేధింపులు ఎదుర్కొన్న వివాహిత.. గృహ హింస, వరకట్న వేధింపుల్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తేనే భర్త, అత్తమామలు, ఆడపడుచులకు చట్టరీత్యా శిక్ష పడుతుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఏ మతస్తులైనా.. ఈ చట్టం నుంచి మినహాయింపు ఉండదు. వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల వరకూ జైలుశిక్ష, జరిమానా పడే అవకాశం ఉన్నట్లు చట్టం చెబుతోంది.

Next Story