- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దున్నపోతూ ఆట సూడయ్యో.!
పండుగల గొప్పదనం అంటే ఏంటో అప్పటి దీపావళిని యాది చేసుకుంటేనే తెలుస్తది

దిశ, ఫీచర్స్: దీవిలె పండుగొచ్చిందంటే బాల్యం ఒక్కసారి గిర్రున తిరుగుతుంది. ఎక్కడికో తీసుకెళ్తుంది. అప్పుడు ఈ జమానా లేదు. ఇప్పుడున్న సౌలత్‌లు లేవు. ఎన్నో మరుపురాని జ్ఞాపకాల నిధి దీవిలె పండుగ. పండుగల గొప్పదనం అంటే ఏంటో అప్పటి దీపావళిని యాది చేసుకుంటేనే తెలుస్తది.
ఊరిచ్చీ పటాకులు కాల్చేది..
దీపావళి పండగకు రెండు మూడు రోజులు టైం ఉందనంగనే లారీ డ్రైవర్ల కాడికి.. పంచర్ దుకాన్లపొంటి తిరిగేది. ఎందుకంటే నట్టుబోల్టు కోసం. ఆ రోజుల్లో ఆ నట్టుబోల్టే కదా పటాకులు పేల్చే తుపాకీ. అప్పుడై ఐదు.. ఇప్పుడో ఐదు పైసలు జమజేస్కుంటే ఐదారు రూపాయలయ్యేవి. వాటితోనే నట్టుబోల్టులో పెట్టి కొట్టేటందుకు రెండు డబ్బీల పూర్ణీలు తీసుకునేది. చారాణకో డబ్బీ వస్తుండె. అండ్లనే కొన్ని తోక పటాకులు తీసుకునేది. దోస్తుగాళ్లు తీసుకుంటుండ్రనీ రెండు చిచ్చుబుడ్లు.. రెండు భూచక్రాలు.. ఒక సుతిల్ బాంబు కొనుక్కునేది. ఒక ఐదు సుర్ సుర్ బత్తీలు తీసుకునేది. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఎంజాయ్ చేయాలని పాము గోలీలు ఎక్కువ తీసుకునేది. అన్నీ ఒకసారే పేలిస్తే జల్ది ఐపోతయని ఊరిచ్చీ ఊరిచ్చీ కాల్చి సంబరపడేది.
దేవుడా సామీ.. సత్తెనారాయణా..
దసరా పండుగకే కొత్త బట్టలు కుట్టించుకునేది కాబట్టీ.. దీపావళికి మల్లా కొత్త బట్టలు తీసుకోకపోయేది. దసరా బట్టల్నే మంచిగా ఇస్త్రీ కొట్టించి వేసుకునేది. ప్రతీ దీపావళికి మేం చిన్నప్పుడు సుట్టాల ఇంటికో.. పక్కపొంటి ఉన్నొళ్ల నోముకు పోతుంటిమి. సత్యనారాయణ స్వామి కథ చెప్పించి.. పండుగన మంచిగ చేస్తుండే. ఇగ అప్పటిదాక ఎక్కడ ఆడుకున్నా ఏమనకపోయేదిగానీ.. పంతులొచ్చి కథ చెప్పే టైంకు ఎక్కడున్నా వచ్చి కథ కాడ కూసునేది. ఇప్పటిలెక్క అద్దగంటలోనే ఐపోగొట్టకపోయేది అప్పుడు. వామ్మో కూసుంటే గంటన్నర అయ్యేది. అరే.. స్కూళ్ల కూసోవాలె.. మల్లా ఇక్కడ కూసోవాల్నా అనిపించేది. "అరే దేవున్ని మంచిగ మొక్కుకో" అని చెప్పేది మా అమ్మ. "దేవుడా సామీ.. సత్తెనారాయణా.. నా సదువుకు సక్కగుండెటట్లు సూడయ్యా" అని వేడుకునేది అమ్మ మాటకు గౌరవమిచ్చి.
నోముంది రాండ్రీ..
బూరెలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకపోదురు అప్పుడు. దీపావళికి మాత్రమే చేసేది. అదిగూడ నోము.. వ్రతం ఉన్నొళ్లే. ఇప్పుడు చెప్తే చెప్తుండ్రు లేకపోతే లేదు. అదిగూడ వాట్సప్లో మెసేజీవెడ్తుండ్రు "నోముంది రాండ్రీ" అని. కానీ అప్పుడు ఇంటింటికీ తిరిగి "ఇయాల నోముంది రాండ్రీ శిన్నమ్మా.. కాకయ్యా" అని నోరునిండా పిలిశేది. నోమునాడు ఎంత మందికి భోజనం పెడితే అంత ముక్తి అనే నమ్మకం ఉంటుండె. "యాడాదికోసారైనా నోముకాడ తినాలె" అనే సెంటిమెంట్ జనాలల్ల ఉండేది. ఒకవేళ రాత్రిపూట ఎవరైనా మిస్ అయితే మల్ల తెల్లారి.. "భోజనానికి రాండ్రి" అని చెప్పి తోల్కపోయేటొళ్లు. అదేందోగానీ నోము కాడ భోజనంజేసి ఆ నోము బూరెలు తింటే రెండు మూడు రోజులదాక ఆ కమ్మదనం పోకపోయేది.
గడప మీద రెండు దీపాలు..
ఇప్పుడంటే ఇంటింటికీ దీపాలు పెడ్తుండ్రుగానీ అప్పట్లో నోము.. వ్రతం ఉన్నొళ్లే ఇంటి ముంగట దీపాలు వెలిగించేది. అవిగూడ రెండు దీపాలు మాత్రమే. ఇప్పటిలెక్క కాంపౌండ్ వాల్స్.. బాల్కానీలు లేవు కదా. అందుకే గడప మీద అటొకి ఇటొకటి రెండు దీపాలు వెలిగిస్తుండె. అదిగూడ పాత దీపంతల కాదు. కుమ్మరొళ్ల ఇంటికాడ తెచ్చిన కొత్త దీపంతలల్లనే వెలిగించేది. దీపావళి పండుగకు కొన్ని ఊర్లళ్ల బాగోతాలేసేది. ఒక ఊర్ల బాగాతాలు ఆడితే సుట్టూ పదూర్లకు తెలిసిపోయి జనాలు సైకిండ్ల మీద వస్తుండె. ఇక కొంచెం కొంచెం అప్డేట్ ఐనంకైతే వీసీఆర్ల సీన్మలేశెటొళ్లు. గ్యాంగ్ లీడర్.. లంకేశ్వరుడు అసొంటి సీన్మలను గోడలమీద స్క్రీన్ లెక్క ప్రొజెక్ట్ చేసి సూపెట్టేది. ఒకరికి ఒక రూపాయి టికెట్ ఉండేది.
జ్ఞాపకాల మూట..
ఊర్లళ్ల ఉండెటోళ్లకు దీపావళి అంటే పటాకులు.. నోములు.. వ్రతాలే. కానీ పట్నంల సదర్ పండుగ జరిగేది అప్పటి నుంచే. గిట్లనే ఎవరైనా పట్నంబొయ్యెటొళ్లుంటే వాళ్లెంటవడి దీపావళి మల్లతెల్లారి పట్నంబొయ్యేది. నారాయణగూడ కాడ జరిగే దున్నపోతులాటలో "దున్నపోతూ ఆట సూడయ్యో" అని మీసం దువ్వి.. తొడగొట్టి ఆడుతుంటే చూసి మస్తు మురిసిపోయేది. ఇప్పుడు సదర్ కూడా ఊర్లళ్లకు పాకింది. పట్నం దగ్గర్లున్న ఊర్లళ్ల పోరగాళ్లు దున్నపోతులు తీసి పండగ చేసుకుంటుండ్రు. దీపావళి ఇట్లా పోరగాళ్లకు పటాకుల పండుగ.. పెద్దొళ్లకు నోములు వ్రతాల పండుగ.. యూత్ పోరగాళ్లకు దున్నపోతుల పండుగను తీసుకొచ్చి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల మూటను సొంతం చేసింది.






