తినేది తక్కువ పడేసేది ఎక్కువ.!

by Daayi Srishailam |   (  Updated:2025-07-28 05:50:43  IST  )

ఇదేనా తిండి తినే తరీఖ.?

తినేది తక్కువ పడేసేది ఎక్కువ.!
X

ఇంట్లో తింటే..

ముత్యమంత అన్నం.. చెంచెడు కూర..

అంచుకింత తొక్కు.. కుదిరితే కప్పు పెరుగు.

ఒక్క మెతుకు కూడా మిగలదు.

నీళ్లుపోసి కడిగినట్లే నాకేస్తం.

కానీ..

ఫంక్షన్స్‌కి వెళ్తే..

పానం చికెన్ మీదుండె.. మటన్ మీదుండె.

అదింత.. ఇదింత.. అంచుకు కారాబూందీ.

అన్నీ కుప్పకుప్పనే పెట్టుకొని..

ఏదీ సక్కగా తినం.

అదో బుక్క.. ఇదో బుక్క పెట్టుకొని..

అమాంతం ప్లేటు పక్కకు పడేస్తం.

ఇదేనా తిండి తినే తరీఖ.?

- దాయి శ్రీశైలం

పాపం.. ఫంక్షన్లల్ల ఎన్కొచ్చినొళ్లది పెద్ద గోసనే ఉంటది. ముందొచ్చినొళ్లు ఐటమ్సన్నీ పెట్టించుకొని దేనినీ సరిగా తినక పడేస్తరు. వాళ్లూ తినక.. వెనకొచ్చిన వాళ్లకూ మిగిలియ్యక.. పాపం తిండిలేనొళ్లకైనా ఉండనీయక లక్షలు ఖర్చుపెట్టి వండిన తిండినంతా పెంటపాలు చేస్తుంటరు. ఎంతపెద్ద నేరమిది.? ఎవరు దీనికి బాధ్యులు.? ఫంక్షన్ చేసినొళ్లా.? లేక ఫంక్షన్‌కు వచ్చి ఫుడ్డును వేస్ట్ చేసినొళ్లా.?

తీరొక్కటి వండిపెడితే..

నిన్నియాల చెవులు కుట్టించుడు, తొట్టెల పండుగ కూడా ఫంక్షన్ హాల్స్‌లనే చేస్తుండ్రు మనొళ్లు. కాలంతోపాటు అప్‌డేట్ అవుడు మంచిదే. కానీ ప్రెస్టేజ్‌కు వొయ్యి "పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టు" చేసుకుంటుండ్రు. వచ్చినొళ్లకు ఏ లోటు లేకుండా చూసుకోవాలనే ఆరాటం జనాలల్ల ఎక్కువైంది. ఒకర్నిజూశి ఒకరు ప్రతీ చిన్న ఘట్టాన్ని అట్టహాసంగా చేసుడు నేర్శిండ్రు. సరే, అందర్కీ మంచిగ అర్సుకోవాలనేది కూడా మంచిదే. కానీ ఫంక్షన్‌కి వచ్చినొళ్లతోనే పెద్ద టెన్షనైపోతుంది. పాపం.. అంత ఖాయిష్‌తో తీరొక్క వంటలు వండిపెడితే కరాబ్ చేసిపోతుండ్రు కొందరు.

ఫుడ్ సెక్షన్ సైడే..

మనలో చాలామంది ఫంక్షన్ ఉందనంగనే ఇంట్ల ఏం తినరు. స్నానంజేశి, తయారై డైరెక్టుగా ఫంక్షన్‌కే వచ్చేస్తరు. వచ్చిన ఐదు నిమిషాల నుంచే "ఫుడ్ సెక్షన్" దిక్కు చూస్తుంటరు. "ఫస్ట్ స్టేజిమీదికి పొయ్యి కలుద్దాం" అని ఎవరైనా అంటే.. "ఎహే అంతమందిల ఎప్పుడువోతం మనం. వాళ్లంతా పొయినంక మెల్లెగవోదాంగానీ ముందుగాల్నయితే ఇంత తినేసొద్దాం పాండ్రీ" అనంగనే పోతరు. ఏముంటదిగ.? "పులినిజూశి నక్క వాత పెట్టుకున్నట్లు" ఒకరెనక ఒకరు ప్లేట్లు చేతిల పట్టుకొని లైన్లు కడతరు. చూస్తే.. స్టేజిమీద కంటే ఎక్కువ "ఫుడ్ సెక్షన్" కాడనే జమైతరు జనాలు.

అన్నింటిపై ఆశ..

సరే, ఫంక్షనంటే ఫస్ట్ చూసేది ఫుడ్డే కాబట్టీ ఎవర్నీ తప్పు పట్టలేం. కానీ ఇక్కడ డిసిప్లేన్ అనేది ఒక్కశాతం కూడా కనిపించదు. అదేదో "ఆహారపు పోటీలు" పెట్టినట్లే తోసుకుంటూ.. దొబ్బుకుంటూ పోతుంటరు. కూర అంటిచ్చినవనీ ఒకరు.. ప్యాంటుమీద చారు ఒలకబోసినవని ఒకరు తినేది ఇడ్శిపెట్టి తిట్టుకుంటరు. సరే అదీ పోనీ. తినేదైనా సక్కగ తింటరా.? "అవ్వగావాలె.. బువ్వగావాలె" అన్నట్లే ఉంటది మనొళ్ల కథ. చికెన్ తినాలని ఉంటది. మటన్ రుచి చూడాలనిపిస్తది. అట్లనే గుడ్డు మీద పానం గుంజుతది. ఇవన్నీ సరిపోనట్లు వెజ్ సెక్షన్ కాడికివొయ్యి "తమ్మీ పప్పెయ్యవా" అని అంటరు.

ఎట్ల తింటం.?

ఏదన్నా మిస్సయితమేమో అనుకొని అన్నీ పెట్టుకొని ప్లేటును "కలగూర గంప" చేసేస్తరు. ఫస్ట్ రెండు రుమాల్ రోటీలు చికెన్ కర్రీతో తింటరు. అటెన్క బిర్యానీ వేసుకుంటరు. అదే చికెన్‌తోటి కొంత తిన్నంక ఇంకోసారి మటనేస్కొని తింటే ఎంత మంచిగుంటది.? కానీ అట్ల తినరు. అదే అన్నంల చికెనేస్కుంటరు.. మటనేస్కుంటరు. దానిమీదనే బూంది చల్లుకుంటరు. అంచుకొక స్వీటు. ఫస్ట్ దేన్ని తినాలె.. ఎంత తినాలె అనేది తోయక అదొక బుక్క.. ఇదొక్క బుక్క తింటే తినబుద్దయితదా.? "పెండ.. బెల్లం ఒక్కతాన కలిపినట్లు" దేనినీ ఆస్వాదించలేరు. దేనినీ సక్కగ తినలేరు.

పారేసుడొక్కటే..

ప్లేటులో కనీసం సగం కూడా అయిపోలేదు. దాన్నట్లనే డస్ట్‌బిన్‌ల పడేస్తరు. "అగో ఏమాయె అట్ల పడేస్తవూ" అని ఎవరైనా అంటే తన తప్పు గురించి చెప్పడు. "హే.. ఏం వంటలయా ఇవీ.? మంచిగ కాలేదు. అన్నీ ఉచ్చుచ్చున్నయి" అని వంకపెడ్తడు. ఇంకెవరో ఉండి "హే మరీ.. గా వెజ్జన్న సైసూడకపోయినవే" అనంగనే పానం మల్లా గుంజుతది. పాలకూర పప్పు, వంకాయ, పెరుగు కామన్‌గానే ఉంటయి వెజ్ సక్షన్ల. ఇప్పటికే ఒకసారి అన్నీ కుప్పకుప్పనే పెట్టుకొని పారేసిండు. ఈ సారైనా ఒకొక్కటి పెట్టుకొని ఆస్వాదించాల్నా.? కానీ అట్ల చెయ్యడు. మల్లా అన్నీ కుప్పలెక్కనే కుమ్మరిచ్చుకొని తినబుద్దిగాక పారేస్తడు.

స్పెషల్ సెటప్..

ఫంక్షన్‌లకు లీడర్లను పిల్సుడు ఒక ట్రెండైపోయింది కదా.? ఆయనొచ్చి అందరికంటే ముందే అక్షింతలేసి, ఫొటో దిగుతడు. ఫుడ్ సెక్షన్ కాడికి వస్తుంటే "అన్నొస్తుండు" అని స్పెషల్ సెటప్ చేస్తరు. ఆ అన్న అన్నీ తెప్పించుకొని తిన్నట్టు యాక్టింగ్ చేస్తడు. "ఇది పెట్టుకో అన్నా.. అది పెట్టుకో అన్నా" అని అనుచరులు హంగామా చేస్తరు. వాళ్లొక చెయ్యి.. వీళ్లొక చెయ్యి పెట్టి దాన్ని ఎవరూ తినకుండా చేస్తరు. ఏమైతది.. అదికూడా డస్ట్ బిన్‌కే సమర్పయామి. "మందిది మంగళారం.. మనది సోమారం" అన్నట్లు ఇంట్ల ఒక్క మెతుకుగూడ వేస్ట్ చేయరుగానీ. ఫంక్షన్లల్లయితే కిలోల కొద్ది ఫుడ్డును ఉత్తగనే పడేస్తుంటరు.

ఫ్యామిలీ మ్యాన్‌తో..

కొందర్ని చూస్తుంటం.. అందరికీ ప్లేట్లల్ల భోజనం తీస్కపోయి ఇస్తుంటరు. పిల్లలకు ముత్యమంత పెట్టుకపోవాలెగానీ.. మల్లమల్ల ఎవరొస్తరని ప్లేట్ నిండా జమాయించుకొని వెళ్లి తినిపిస్తుంటరు. అదంతా స్పైసీ ఫుడ్డాయె. పాపం.. ఆ పిల్లలెంతకూ తినరు. కసురుకొని.. విసురుకొని ప్లేట్లను ఓ మూలకు పడేస్తడు. ఐస్ క్రీమ్ తీస్కరామంటే మల్లా దొరకవేమో అనుకొని ఐదారు తీస్కపోతరు. అదొక్కటి తింటెనే చాలనిపిస్తది. ఐదారెట్ల తింటరు ఇగ.? ఇంకా కొందరైతే తింటున్నంత సేపూ ఫోన్ల మాట్లాడ్తనే ఉంటరు. నోట్లో కంటే కిందికి విసిరేసుడే ఎక్కువుంటది. అట్లా మాట్లాడుకుంట ఎక్కడికో వెళ్లిపోయి.. ప్లేట్ నెక్కడ్నో పడేస్తరు.

సిట్టింగ్ పేరుతో సగం..

ఫంక్షన్లకు వెళ్లేది మర్యాద కోసమో, మందు కోసమో అర్థమే కాదు కొందర్ని చూస్తుంటే. వచ్చేది రాంగనే "సిట్టింగ్" పెట్టిండ్రా అనేది తెలుసుకుంటరు. సిట్టింగ్ ఉందంటే ఇక ఫంక్షనంతా అయిపోయినంకనే వాళ్లొచ్చేది. బకెట్ల మీద బకెట్లు కూరలు పోతుంటయి. బేసన్ల మీద బేసన్లు అన్నం పోతుంటది. అన్న దోస్తని ఒకడు, తమ్ముని దోస్తని ఒకడు, బామ్మర్ది తాలూకా అని ఒకడు ఇట్లా కిచెన్లకు, సిట్టింగ్లకు తొవ్వ పడెటట్లు తిరుగుతుంటరు. చిన్న సగం ఫుడ్డు ఈ సిట్టింగ్ల వల్లనే ఖాళీ ఐతది. కానీ అక్కడవొయ్యి చూస్తే సగం సగం తిని పారేసిన ముక్కలు, కస్సబిస్స కలిపి వదిలేసిన అన్నం ప్లేట్లు కనిపిస్తయి.

ఏం మిగలదు..

పనుండో లేక వీలుపడకనో కొంత ఆల్శెంగొచ్చినొళ్లకైతే ఫంక్షన్‌కొచ్చిన సంతృప్తే ఉండదు. స్టేజి మీద ఫొటోలు దిగుడు అయిపాయె. డేగులల్ల భోజనం పెంటపాలాయె. ఆఖరికి ఒక చిన్నపాటి డేగుల "మెయిన్ టేబుల్" కోసమని ఉంచుతరు. ఇగ కొందరు దాన్నిజూశి "ఇదేం దావతయ్యా.. వంటలే సక్కగ చెయ్యలేదు" అని మొత్తుకుంటరు. "అయ్యా సామీ.. వంటల బొంబాట్ చేసినం.. కాకపోతే సగం తిన్నరు.. సగం పాడేశిండ్రు జనాలు" అనే ఎక్స్‌ప్లెనేషన్ ఇచ్చుకోలేడు కదా ఫంక్షన్ చేసినోడు. "ఏంది వీళ్లు మనుషులా.. కుక్కలా ఇట్ల వేస్ట్ చేసిండ్రు" అని మనసులో అనుకొని సైలెంట్‌గా ఉంటడు.

ఏంజెయ్యాలె మల్ల.?

"బఫే సిస్టం"తోనే ఫంక్షన్లల్ల ఫుడ్ వేస్టయిపోతుంది. వాటన్నింటిని చూడంగనే తినాలనే ఆశతో ఏదో పెట్టుకుంటుండ్రుగానీ, సగం వరకు కూడా సక్కగ తినలేకపోతుండ్రు. ఇట్ల జరగొద్దంటే "బంతి భోజనం" బెటర్. ఎవరికి ఎంత కావాల్నో అంతే పెడ్తరు. ఏం అవసరమైతే అదే వేస్తరు. ఫుడ్ వేస్టేజ్ కాదు. ఒకవేళ అన్నం, కూరలు మిగిలిపోతే "డొనేట్" చేయొచ్చు. ఇంకొకరి ఆకలి తీర్చొచ్చు. అంతేగానీ "వచ్చిండ్రా.. పెట్టుకుండ్రా.. తినబుద్ధి కాకపోతే పారేసిండ్రా" అనేటట్లుంటే ఆ ఫంక్షన్‌కు అర్థమే ఉండదు. లక్షలు ఖర్చుచేసి విలువైన ఫుడ్‌ను పెంటపాలు చేసినొళ్లం అవుతం.

లెక్కలేం చెప్తున్నయి.?

ఇండియాలో శుభకార్యాలు, పెండ్లిళ్లలో సుమారు 15-20% వృథా అవుతుందని అధ్యయనాలు చెప్తున్నయి. పెద్ద ఈవెంట్లలో ఇది 30% వరకూ ఉంటుంది. ఒక పెండ్లిలో 1000 మంది అతిథులకు ఫుడ్ ప్రిపేర్ చేస్తే అందులో100-200 కిలోలు వేస్ట్ అవుతుందంట. ఫంక్షన్లల్ల వేస్టయ్యే ఫుడ్ విలువ దేశ జీడీపీలో 1%కి సమానమంటుండ్రు నిపుణులు. యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం ఇండియాలో ప్రతీయేడు ఒక వ్యక్తి సగటున 50 కిలోల ఆహారాన్ని వేస్ట్ చేస్తుండు. ఇంట్లో తినేదాంట్లనే ఇంత వేస్ట్ చేస్తుండ్రంటే ఫంక్షన్లల్ల ఏ స్థాయిలో చేస్తుండ్రో మరి.?

ప్రధాన సవాలు

ఇండియాలో ఆహారాన్ని "అన్నం పరబ్రహ్మ స్వరూపం"గా గౌరవిస్తరు. కానీ మన దేశంలనే ఫంక్షన్లనీ, పార్టీలనీ, ఈవెంట్లనీ ఆహారాన్ని వేస్ట్ చేస్తూ సాంస్కృతిక విలువలకు విరుద్ధంగా పోతుంటరు. వాళ్లు చేసే వృథా వల్ల కొందరు అర్ధాకలితో బతుకవలసి వస్తోంది. దేశంలో తిండి దొరకక దేశ జనాభాలో 14% మంది ఆకలితో బతుకుతుండ్రని లెక్కలు చెప్తున్నయి. ఈ సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ.. సరైన నిర్వహణ.. ప్రజల్లో విచక్షణ లేకపోవడం వల్ల ఆహార వృథా అనేది ప్రధాన సవాలుగా మారుతోంది.

అమెరికాలో

సంవత్సరానికి సుమారు 60 మిలియన్ టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. ప్రతి వ్యక్తి సగటున 59 కిలోలు వేస్ట్ చేస్తడు. పెండ్లిళ్లు, ఇతర సోషల్ ఈవెంట్స్‌లో 10-15% వృథా అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి $218 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇది 130 బిలియన్ భోజనాలకు సమానం. అమెరికాలో ఫుడ్ బ్యాంక్స్.. డొనేషన్స్.. డ్రైవ్స్ బాగా అభివృద్ధి చెంది ఫుడ్ వేస్టేజీని కంట్రోల్ చేస్తున్నయి. అయినప్పటికీ ఇంకా 35% సర్‌ప్లస్ ఫుడ్ భూమిలో కలిసిపోతుంది.

చైనాలో

సంవత్సరానికి 108 మిలియన్ టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. ప్రతి వ్యక్తి సగటున 76 కిలోలు వేస్ట్ చేస్తడు. దీనికోసం 2021లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి వేస్టేజీ కంట్రోలింగ్ చేస్తుండ్రు. ఎక్కువ సంఖ్యలో అతిథులు వస్తరనే అంచనాతో భారీ ఎత్తున వంటలు ప్రిపేర్ చేయడం.. అనుకున్న దానికంటే తక్కువ మంది రావడం వల్ల ఫుడ్ మిగిలిపోయినా డొనేట్ కాన్సెప్ట్‌తో వేస్టేజ్‌ని తగ్గిస్తుండ్రు.

జర్మీనీ, జపాన్‌లో

జర్మనీలో సంవత్సరానికి సుమారు 12 మిలియన్ టన్నులు, ఒక వ్యక్తి సగటున 55 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తడు. ఫంక్షన్స్‌లో ఈ వేస్టేజీ ఇండియా కంటే చాలా తక్కువ. ఫుడ్ రీసైక్లింగ్.. కంపోస్టింగ్ సిస్టమ్స్ బాగా డెవలప్ అయి ఉన్నాయక్కడ. జపాన్లో సంవత్సరానికి 6.2 మిలియన్ టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఒక వ్యక్తి సగటున 47 కిలోలు వేస్ట్ చేస్తడు. జపాన్లో ఫుడ్ బ్యాంక్ సిస్టమ్ డెవలప్ అయుండి వేస్టేజీని గణనీయంగా తగ్గిస్తున్నయి.

అమ్మ ఫీలైనట్లే: నిహారికా రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్

మ్యారేజెస్‌లో.. ఫంక్షన్స్‌లో కొందరు తినేదానికంటే చాలా ఎక్కువ ఫుడ్ పెట్టుకుంటరు. ఏదో కొంచెం తిన్నట్లుచేసి మిగిలింది పడేస్తరు. ఒక్కో ప్లేటుకు రూ.1000కి పైనే ఖర్చుచేసి ఫంక్షన్స్ చేస్తుంటే వీళ్లేమో ఇట్లా వేస్ట్ చేస్తుంటరు. అలా కాకుండా మితంగా తింటి ఫుడ్ అందరికీ సరిపోతుంది. మిగిలిదాన్ని కూడా డొనేట్ చేయొచ్చు. మన ఇంట్లో అన్నం వేస్ట్ చేస్తే అమ్మ ఫీలవుతుంది కదా. లక్షలు ఖర్చు చేసినొళ్లు కూడా అమ్మలెక్కనే ఫీలైతరు కదా.?

పంచుకుంటాం: నాగరాజు గుర్రాల, సౌతాఫ్రికా

ఇండియాలో ఫంక్షన్స్ జరిగితే మనొళ్లు సగం ఫుడ్ వేస్ట్ చేస్తరు. ఫంక్షన్స్ చేసేటొళ్లు కూడా మోతాదుకు మించి ప్రిపేర్ చేస్తరు. కానీ కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నం సౌతాఫ్రికాలో మనంత ఫుడ్ వేస్ట్ ఉండదు. మేం సౌతాఫ్రికాలో ఏదైనా ఫంక్షన్ చేస్తే లిమిటెడ్ గానే ప్రిపేర్ చేస్తుంటం. ఒకవేళ ఫుడ్ మిగిలితే ఇండియాల మనొళ్లు మొహమాట పడ్డట్లు ఉండదు. ఎవరింట్ల ఫంక్షన్లో ఫుడ్ మిగిలినా అందరం పార్సిల్ తీస్కపోతం. అంతగాదంటే హోటల్స్ వాళ్లే వచ్చి తీస్కెళ్తరు.

తగ్గించడమే బెటర్: సురేష్ బండి, పర్యావరణ ప్రేమికుడు

శుభకార్యాలు, పెండ్లిళ్లలో మనొళ్లు ఎక్కడలేని గమ్మతి పనులు చేస్తరు. ఒకాయన ముక్కలు తినకుండానే పారేస్తడు. ఇంకొకాయన రెండు ముద్దలు అన్నం తినకుండానే పారేస్తడు. ఇంకొకాయన పిల్లలకు తినిపిద్దామని ప్లేట్ల కొద్దీ తీసుకెళ్లి వాళ్లు తింటలేరని డస్ట్ బిన్లో పడేస్తడు. ఇలా ఎంతో విలువైన ఫుడ్ వేస్టయిపోతుంది. నా వరకు అసలు అంత భారీగా ఫుడ్ ప్రిపేర్ చేసుడే కరెక్ట్ కాదు. దానిని తగ్గిస్తే తిండిలేనివాళ్లకు అన్నం దొరుకుతుంది.

Next Story