- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరు పల్లమెరుగు.. మనిషి వృథాయెరుగు.!
నీళ్లు బయటికి ఎంతపోతే లోపల అంత ఊరుతయనే కవరింగ్

దిశ, ఫీచర్స్: నీళ్లు లేకుండా మనిషి మనుగడ లేదు. అలాంటి నీటిని భద్రంగా చూసుకోవాలి. బాధ్యతగా ఖర్చు చేయాలి. ఒద్దికగా ఒడిసి పట్టుకొని పదికాలాలవ పాటు పదిలంగా చూసుకోవాలి. కానీ మనమేం చేస్తాం.? ఆఫ్టరాల్ నీళ్లే కదా అని విచ్చలవిడిగా వృథా చేస్తుంటాం. చాదస్తం కొద్దీ ఊరికే పారబోస్తుంటాం. ఫ్రీగా దొరికేవే కదా అని అవసరం లేకున్నా నల్లాలు విప్పి పెడతాం. మోటార్లు ఆన్ చేసి పెడతాం. పైగా.. నీళ్లు బయటికి ఎంతపోతే లోపల అంత ఊరుతయనే కవరింగ్. ఏంచేస్తం ఇగ.?
బాత్‌రూం సింగర్స్ బహుపరాక్..
రోజూ అయితే స్నానం చేస్తాం కదా.? చాలామంది స్నానం చేసేటప్పుడు షవర్ లేదా నల్లాను 10-20 నిమిషాలు పూర్తి ప్రెషర్‌తో రన్ చేస్తారు. మధ్యలో సబ్బుగానీ లేదా షాంపూగానీ రుద్దుకునేటప్పుడు కూడా ఆ నల్లా అలాగే నడుస్తుంటుంది. బకెట్ నిండి వృథాగా పోయే నీళ్లు పోతనే ఉంటాయి. ఇంకా కొందరైతే ''బాత్‌రూం సింగింగ్''లో మునిగి స్నానం చేస్తున్నామనే విషయమే మర్చిపోయి సంగీత లోకంలో విహరిస్తుంటారు. అలా చాలామంది ఒక్కోసారి స్నానానికి 80-150 లీటర్ల నీటిని వృథా చేస్తున్నారు. 15-20 నిమిషాల వారి స్నానంలో ఎంతలేదన్నా 50 లీటర్ల వృథా జరుగుతుంది. ఇండియాలో దాదాపు 30% మంది ఇలాగే చేస్తుంటరని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా రోజుకు 20-30% డొమెస్టిక్ వాటర్ వేస్ట్ అవుతోంది.
స్లీపీ బ్రషింగ్ అలవాటే కారణం..
స్నానమంటే ఏదో కాస్త పెద్ద ప్రాసెస్.. కొన్నిసార్లు నీటి వృథా జరిగిపోతుంది అనుకుందాం. కనీసం ముఖం కడుక్కునేటప్పుడైనా నీళ్లు వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఉంటామా అంటే అదీ ఉండదు. ముఖం కడుక్కునేటప్పుడైనా.. మూతి కడుక్కునేటప్పుడైనా మన విధానంలో మార్పుండదు. ఎప్పటిలెక్కనే నల్లా ఇప్పాలి. నలువైపులా నీటిని పారించాలి. అప్పుడే మనకు మనసు కొంత సమ్మగా ఉంటది. మహానుభావులు మనలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారట. అందుకదే కేవలం బ్రష్ వేసుకునేటప్పుడు 3-5 నిమిషాల్లోనే 8-15 లీటర్ల నీరు వృథాగా పోతుందంటా. దీనిని ''స్లీపీ బ్రషింగ్'' అలవాటు అని చెప్తున్నారు నిపుణులు. వ్యక్తిగత శుభ్రత పేరు చెప్పి మనం రోజుకు 10-20 లీటర్ల నీటిని వృథా చేస్తున్నామని లెక్కలు చెప్తున్నాయి.
చారాణా బట్టలకు బారాణా నీళ్లు..
బట్టలు కూడా రోజూ ఉతుక్కోవాల్సిందే కదా.? ఇక బట్టలు ఉతకడమంటే మనలో చాలామంది నీళ్లు పారబోయడమే అనుకుంటారు. చారాణా బట్టలకు బారాణా నీళ్లు వేస్ట్ చేస్తుంటారు. మొదటి జత బట్టల్ని పిండేటప్పుడు ఓపెన్ చేసిన నల్లా.. చివరి జతను శుభ్రం చేసేదాక్ ఆన్‌లోనే ఉంటుంది. నీళ్లు పోయేవి పోతూనే ఉంటాయి. అధ్యయనాలు చెప్పేదేంటంటే.. మనొళ్లు బట్టలుతకడం ముందరేసుకున్న ప్రతీసారి 50-100 లీటర్ల నీళ్లు ఉత్తగనే పోతయంటా. ఇక వాషింగ్ మెషీన్ల బాగోతం ఇంకోలెక్క ఉంటది. మెషీన్లో రెండు జతల బట్టలేసినా నీళ్లు మాత్రం ఫుల్‌లోడ్‌కి పోసినట్లే పోస్తాం. దీనివల్ల 40-60 లీటర్ల నీళ్లు వేస్ట్ అవుతాయి. కొందరు రెండు రెండుసార్లు పిండుతుంటారు దానివల్ల అదనంగా మరో 30-50 లీటర్లు వేస్ట్ అవుతాయి.
వృథాగా పోతున్నా పట్టించుకోం..
మన ఇంట్లో ఉండే నల్లాలు.. ట్యాంకుల్లోని నీరే మనది.. మిగతా నీటితో మనకు ఎలాంటి సంబంధం లేదు అనుకుంటారు చాలామంది. అందుకే ఎక్కడైనా వృథాగా పోతున్న నల్లా కనిపించినా పట్టించుకోం. దానిని ఆఫ్ చేద్దామని అనిపించదు మనకు. మరీ అంతగాదంటే ఆ నల్లా దగ్గర మన బండిని కడుక్కోవాలని చూస్తాం. బయట వాటర్ వాష్ చేయించాలంటే రూ.100 అవుతుంది కదా. అందుకే ఫ్రీగా వచ్చిన ఆ నీటితో వాష్ చేసుకుంటారు. బండిని అటు ఇటు సుమారు గంటసేపు తోముతాం. 15 లీటర్లతో అయిపోయేదాన్ని 100-150 లీటర్ల దాకా తీసుకొస్తాం. బండి కడిగినంక ఇంట్లో వాళ్లు ఊకుంటరా.? రోడ్డంతా రొంపి అయిందనీ.. వాకిలంతా బురద అయ్యిందని దాన్ని సవరించి సరిచేయడానికి ఇంకో 20-30 లీటర్ల దాక కింద పోసేస్తారు.
రోజుకు 20-30 లీటర్లు వృథా..
కూరగాయలు కడిగేటప్పుడు చూడాలిక. కడిగేది తక్కువ కరాబ్ చేసేది ఎక్కువ. సింక్ కింద పెట్టి రన్నింగ్ ట్యాప్‌లో కూరగాయలు.. ఆకు కూరలు కడుగుతాం. అలా కడగడం వల్ల వాటికున్న మట్టి.. క్రిములు తొలగిపోవు. కూరగాయలు కూడా శుభ్రం కావు. కానీ రన్నింగ్ ట్యాప్ వల్ల 10-15 లీటర్ల నీరు వేస్ట్ అవుతుంది. బౌల్‌లో కడిగితే 2 -3 లీటర్లతో పనైపోతుంది. ఇంకా మనలో కొందరు గమ్మతి మనుషులుంటారు. వాళ్లింట్లో నల్లాలు లేదా పైపుల నుంచి వాటర్ లీకేజీ అవుతుంది. ఒక్కరోజో రెండ్రోజులో కాదు నెలల తరబడి ఆ లీకేజీలు కనిపించినా సరిచేయరు. "ఏదో చిన్న లీకేజే కదా.? దానికిప్పుడు ప్లంబర్ని పిలిస్తే కొత్త పైపు తీసుకురమ్మంటాడు. పైప్ చార్జి.. ప్లంబర్ చార్జి వెయ్యి రూపాయలు అవుతుందని లైట్ తీసుకుంటారు. దీనివల్ల రోజుకు 20-30 లీటర్ల నీరు వృథా పోతుంది.
80% ఉత్తగనే ఆవిరైపోతుంది..
నీటితో చిత్ర విచిత్రాలు చాలా చేస్తుంటారు మనొళ్లు. మొక్కలకు పగటిపూట నీళ్లు పోస్తుంటారు. ఏమైతుంది దానివల్ల.. 80% ఉత్తగనే ఆవిరైపోతుంది. మొక్కలు కూడా వాడిపోతాయి. అలా కాకుండా ఉదయం వేళల్లో మొక్కలకు నీళ్లు పోస్తే నీళ్లు ఆదా అవుతాయి. మొక్కలూ ఆరోగ్యంగా ఉంటాయి. మనం చేసేది కాకుండా మన పిల్లలతో కూడా ఈ పొరపాట్లు చేయిస్తుంటాం. ఇవి చడటానికి చిన్న చిన్నవే అయినా భవిష్యత్‌లో వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పిల్లలు ట్యాప్ ఆన్ చేసి ఆటల్లో మునిగి మర్చిపోతుంటారు. పేరెంట్స్ వాళ్ల బిజీలో వాళ్లుండటం వల్ల నీరు అట్లనే వృథాగా పోతుంది. అలా రోజుకు 10-15 లీటర్లు ఉత్తగనే కింద కారిపోతుంటాయి. ఇక పండగలు.. పబ్బాలకు వృథా అయ్యే నీటి లెక్క ఉండనే ఉండదు.
మన వృథా ఇంకొకరికి శాపం..
నీటి విలువ తెలిస్తే దాన్ని మనం జాగ్రత్తగా వాడుకుంటాం. మనకేంది హైదరాబాదులో మున్సిపాలిటీ వాళ్లు కావాల్సినంత నీళ్లిడుస్తారు. దర్జాగా మనం బాత్రూంలోకి వెళ్లి ట్యాప్ ఆన్ చేస్తాం. బకెట్ నిండిపోయినా పెద్దగా పట్టించుకోం. బాత్రూంలోకి కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్లే పాడు అలవాటొకటి ఉందిగా మనకు.. దాంట్లో స్క్రోల్ చేసే పనిలో పడి నల్లాను.. నీటిని పూర్తిగా మర్చిపోయి వేరే లోకంలో విహరిస్తుంటాం. కానీ.. ఒక్కసారైనా ఆలోచించారా.? చాలా పల్లెల్లో ఇప్పటికీ నీటి సౌకర్యం లేక పదుల కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొన్ని పట్టణాల్లో కూడా రాత్రిళ్లు కూడా క్యూలో నిలబడి బిందెల కొద్ది వాటర్‌ను తెచ్చుకుంటున్నారు. మనం చేసే నీటి వృథా ఇంకొకరికి ఎలా శాపంగా మారుతుందో చూడండి.
ముందు మన ఆలోచన మారాలి..
ఇదేదో చిన్న విషయం అనుకుంటున్నాం మనం. నీళ్లు పారబోస్తెనే ఇవన్నీ జరుగుతయా అనేవాళ్లూ ఉన్నారు. అంతెందుకు.. నీళ్లు వృథా కాకుండా స్నానమెలా చేయాలి.. బట్టలెలా ఉతకాలి.. వంట ఎలా చేసుకోవాలి.. అసలు బతికేది ఎలా అనే సందేహాలూ వస్తాయి. స్నానం చేయడమంటే.. బట్టలు ఉతకడమంటే నీళ్లు పారబోయడమే అనే భ్రమలోంచి ముందు జనాలు బయటికి రావాలి. నీటి వృథాను ఆపమంటే మొత్తానికే స్నానం చేయకుండా.. బట్టలుతకకుండా.. వంట చేసుకోకుండా ఉండాలని కాదు. వాడే నీటిని పొదుపుగా.. జాగ్రత్తగా వాడుకోమని అర్థం. దానిని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటే పాజిటివ్‌గా అర్థమవుతుంది. నెగెటివ్‌గా అర్థం చేసుకుంటే నెగెటివ్‌గా అర్థమవుతుంది. కాబట్టీ ముందు మన ఆలోచన విధానం మారాలి.
నీళ్ల సోయి లేకనే ఈ వృథా..
చాలాచోట్ల చూసే ఉంటాం. రైతులు కొందరు అవసరం లేకున్నా మోటార్లను ఆన్ చేసి నీటిని కాలువలోకి ఉత్తగనే వదిలేస్తుంటారు. అలా చేస్తున్నారేంటి అని అడిగితే చాలా వింత సమాధానాలు చెప్తుంటారు. "బోర్ ఎప్పుడూ పోస్తుండాలి. లేకపోతే మన బోర్ నీళ్ల పక్క బోర్ గుంజుకొని నీళ్లన్నీ ఇంకిపోతాయి" అని అంటుంటారు. అవసరం లేకున్నా కంప చెట్లకు పైపులేసి రోజంతా నీటిని మల్లిస్తారు. దానివల్ల పవర్ వృథా ఇంకా నీళ్లు వృథా. ఫ్రీ కరెంటు కదా అని అలా ఇష్టమున్నంత సేపు బోర్ ఆన్ చేసి పెడతారు. ఒకదిక్కు కరెంటు లేక బయటి నుంచి కొనుక్కుంటుంది సర్కారు. ఇంకోదిక్కు భూగర్భజలాలు అడుగంటి రైతులు లబోదిబోమంటున్నారు. మనవాళ్లేమో ఇగో ఇలా కరెంట్ సోయి.. నీళ్ల సోయి లేకుండా అన్నింటినీ దుర్వినియోగం చేసి వృథాకు ఛాన్స్ ఇస్తు్న్నారు.
ఈ పరిస్థితికి కారణం మనం కాదా.?
నీటి వృథా అనేది మనకు తెలియకుండానే చాప కింద నీరులా మారి "సైలెంట్ క్రైసిస్"గా మారుతోంది. ఇప్పటికే మనం లీటరు నీటికి రూ.20 పెట్టి కొనుక్కుంటున్నాం. మినరల్ వాటర్ కాకుండా జనరల్ వాటర్‌ని కూడా ఒక బబుల్ క్యాన్‌ను గ్రామీణ ప్రాంతాల్లో రూ.20.. పట్టణ ప్రాంతాల్లో రూ.50 దాక పెట్టి కొనుక్కుంటున్నాం. దీనికంతటికీ కారణం నీటి కొరతే. ఈ కొరత ఎలా ఏర్పడింది.? మనం నీటిని వృథా చేయడం వల్లే కదా.? ఒకవైపు విలువైన నీటిని వృథా చేస్తూ మరోవైపు 50 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాం. కానీ ఇదంతా పట్టించుకోం మనం. బాధ్యతలేనట్టే వ్యవహరిస్తాం. కొరతను మన చేతిలో నుంచే సృష్టించి.. కొనుక్కోవడం కూడా ఈ చేత్తోనే చేస్తుంటాం. ఈ పరిస్థితికి కారణమేంటో ఇప్పటికైనా తెలుసుకోలేమా.?
ఇంత కేర్‌లెస్ ఎందుకు.?
వాటర్ క్రైసిస్ అనేది ఎలా ఉంటుందో.. అది మన జీవితాల్లోకి ఏ విధంగా చొచ్చుకొస్తుందో చెప్పడానికి ఢిల్లీ ఒక్కటి చాలు. ఢిల్లీ వాటర్ క్రైసిస్ నేపథ్యంలో చేసిన అధ్యయనాల ప్రకారం.. సగటు ఇండియన్ తన రోజువారీ నీటి అవసరాల్లో 30 శాతం వృథా చేస్తున్నాడు. వివిధ సందర్భాల్లో.. వివిధ రూపాల్లో ఒక వ్యక్తి రోజుకు సుమారు 30-40 లీటర్ల నీటిని వృథా చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా 49 బిలియన్ లీటర్ల నీరు రోజుకు ''కేర్‌లెస్‌నెస్'' కారణంగా వృథా అవుతోంది. 33 శాతం మంది భారతీయులు స్నానం లేదా టూత్ బ్రష్ చేస్తున్నప్పుడు ట్యాప్ తెరిచి ఉంచి శుభ్రమైన నీటిని వృథా చేస్తున్నారు. ఇక ఆర్‌ఓ ఫిల్టర్ల ద్వారా ప్రతి లీటరు శుద్ధికి మూడు లీటర్లు వృథా అవుతున్నాయి. ఇవే ళ్లీ నీటి కొరత పెరగడానికి ప్రధాన కారణాలు.
2050 నాటికి తీవ్ర నీటి కొరత..
నీటి వృథాపై మనొళ్ల ఉద్దేశం ఎలా ఉంటుందంటే.. నీళ్లు మస్తుగుంటయి. ఎంత వాడితే అంత వస్తాయి అనుకుంటారు. అందుకే ట్యాప్ ఆన్ చేసి మరిచిపోతారు. లీకేజీలను పట్టించుకోరు. జాగ్రత్త పడాల్సిన చోటు అజాగ్రత్తగా ఉండి నీటి లాంటి వనరులను విస్మరించడం వల్ల యుద్ధాలు జరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి వ్యక్తికి రోజుకు 50-100 లీటర్లు నీరు అవసరం. తాగడానికి.. వంట చేసుకోవడానికి.. వ్యక్తిగత శుభ్రతకు దీనిని వినియోగించాలి. తాగడానికి 2.7-3.7 లీటర్లు వాడాలి. కానీ.. మనం తాగేది తక్కువ వొలకబోసేది ఎక్కువ. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2030 నాటికి నీటి డిమాండ్ రెండు రెట్లు పెరుగుతుంది. 2050 నాటికి 50 శాతం జిల్లాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటాయి.
అధ్యయనాలేం చెప్తున్నాయి.?
నితి ఆయాగ్ రిపోర్టు ప్రకారం.. దేశంలో అనేక ప్రాంతాలు 'హై టు ఎక్స్‌ట్రీమ్' నీటి కొరతలో ఉన్నాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు ప్రకారం.. రెగ్యులేషన్ లేకపోవడం.. ప్రైవేటైజేషన్ కారణంగా ఏండ్ల తరబడి కొన్ని ప్రాంతాలు దాహార్తితో ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ప్రకారం.. ఇండియా గ్రౌండ్‌వాటర్‌ను 25 శాతం వాడుతోంది. చైనా-అమెరికా వాడకంటే ఇది చాలా ఎక్కువ. కాలంబియా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. వర్షపు నీటి సంరక్షణ.. వేస్ట్‌వాటర్ రీయూస్ లేకపోతే క్రైసిస్ డీపెన్ అవుతుంది. వేస్ట్‌వాటర్‌ను రీసైకిల్ చేయకపోతే 72 శాతం అర్బన్ వేస్ట్‌వాటర్ పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందనేది నిపుణులు.. అధ్యయన సంస్థలు చెప్పేమాట.
ప్రతి నీటిబొట్టు మీ భవిష్యత్తు: ఎం.కరుణాకర్ రెడ్డి, ఫౌండర్, వాక్ ఫర్ వాటర్
జనాలు నీటి వృథాను సమాజం సమస్యగా చూస్తారు కానీ తన సమస్యగా చూడరు. ట్యాప్ ఓపెన్ పెట్టి బ్రష్ చేయడం.. కారు కడగడం.. గార్డెన్‌లో స్ప్రింక్లర్ పెట్టడం ఇవన్నీ సాధారణ విషయాలే అనిపిస్తాయి. ఎందుకంటే పైసలు పడేస్తే నీళ్లు దొరుకుతయి. ఈ దుకాణ్లో కాకపోయినా ఇంకో దుకాణ్లో దొరుకుతాయి. ఈ ఆలోచన ఉన్నంక ఇక వాటి విలువ ఎలా తెలుస్తుంది.? నీటి ఖరీదు.. దాని కొరత గురించి తెలిస్తే మనిషి ధోరణి మారిపోతుంది. మా "వాక్ ఫర్ వాటర్ అండ్ ఇగ్నైటింగ్ మైండ్స్" సంస్థ ద్వారా మేము ఇచ్చే అవగాహన ఒక్కటే.. "ప్రతి నీటిబొట్టు మీ భవిష్యత్తు. దాన్ని వృథా చేయడంమంటే మీ పిల్లల భవిష్యత్తును వృథా చేయడమే" అనీ.
ప్రతీ నీటిబొట్టు స్వచ్ఛమైనదే: నాగరాజు గుర్రాల, ఎన్నారై, జొహన్నెస్‌బర్గ్
రోజువారీ నీటి వృథా మనకు చిన్నదిగా కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా ఇది భారీ నీటి సంక్షోభానికి దారితీస్తుంది. నేను ఇండియాలో చూసినదానికి.. ఇప్పుడిక్కడ సౌతాఫ్రికాలో చూస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. మన దగ్గర ఉన్నట్లు ఇక్కడ మంచినీళ్లు.. ఉప్పునీళ్లు అని సెపరేట్‌గా ఏమీ ఉండవు. ఇక్కడ సప్లయ్ అయ్యే ప్రతీ నీటిబొట్టు స్వచ్ఛమైనదే. మనలాగా ఎప్పుడూ నల్ల పారుతూనే ఉండదు. వారంలో కొన్ని రోజులు నీళ్లు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా నింపి పెట్టుకుంటారు. నీటి విలువేంటో చిన్నప్పటి నుంచే తెలుస్తుంది కాబట్టీ వాళ్లు అలా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్నిసార్లు సంక్షోభం వస్తుంటుంది.
పాఠశాల స్థాయిలో అవగాహన: బజారు భిక్షపతి, సామాజిక కార్యకర్త
మనలో చాలా మంది మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయకుండొచ్చు కానీ దాని ప్రభావం భవిష్యత్‌పై చాలా పడుతుంది. మన అలవాట్లు.. అవగాహన లోపం వల్ల జరుగుతున్న ఈ వృథాను అరికట్టాలి. ఎందుకంటే మనమంతా ఈ భూమి మీద ఒకే కుటుంబం లాంటివారం. చిన్న చిన్న తప్పులు కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. వాటిలో నీరు ముఖ్యమైనది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగా నీరు వృథా అవుతుంది. అది మనకు తెలియకపోవడమే అసలు సమస్య అని పాఠశాల స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా చాలా మార్పు రావాలి. దానికోసం వీటిని కొనసాగిస్తూనే ఉంటాం.






