కాళ్ళకు చెప్పులు లేవని అవమానం.. కట్ చేస్తే జపాన్ లో స్టార్టప్ కంపెనీ.. విజయలక్ష్మి కురుప్పుస్వామి సక్సెస్ స్టోరీ

by Muthe.Rajitha |

కాళ్లకు చెప్పులు కూడా లేవని, మాసిన బట్టలు, చెమట వాసన అని అవమానించి నోళ్లే ఇపుడు జేజేలు కొడుతున్నాయి.

కాళ్ళకు చెప్పులు లేవని అవమానం.. కట్ చేస్తే జపాన్ లో స్టార్టప్ కంపెనీ.. విజయలక్ష్మి కురుప్పుస్వామి సక్సెస్ స్టోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : కాళ్లకు చెప్పులు కూడా లేవని, మాసిన బట్టలు, చెమట వాసన అని అవమానించి నోళ్లే ఇపుడు జేజేలు కొడుతున్నాయి. కొబ్బరికాయల పొట్టు తీస్తే బొబ్బలెక్కిన చేతులే ఇపుడు ఏఐ స్టార్టప్ విజయాన్ని సాధించాయి. తమిళనాడులోని తూత్తుకూడి దగ్గర ఒక చిన్న గ్రామం నుంచి జపాన్ లో ఏఐ స్టార్టప్ అకాడమీని స్థాపించే వరకు ఎదిగిన విజయలక్ష్మి కరుప్పస్వామి సక్సెస్ స్టోరీ గురించి విందాం...

విజయలక్ష్మి.. తూత్తుకుడిలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి వ్యవసాయదారుడు. అందులో వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. పుస్తకాలు, పెన్నులు కొనడానికి డబ్బులు లేక, ఉదయం స్కూలుకు వెళ్లే ముందు తండ్రితో కలిసి కొబ్బరికాయల పీచు తీసే కఠినమైన పనికి వెళ్ళేది. ప్రతీ ఉదయం వంద కాయల పీచు తీసి, బొబ్బలెక్కిన చేతులతో, చెమటతో కూడిన బట్టలతో, కాళ్లకు చెప్పులు లేకుండానే పుస్తకాలు పట్టుకొని స్కూలుకు పరుగెత్తేది. క్లాసులో తోటి పిల్లలు విజయలక్ష్మి అవతారం చూసి నవ్వుకునేది. తన పక్కన కూర్చుకుండా అవమానించేది. తండ్రి పాఠశాల ఫీజులు చెల్లించడానికి కూడా కష్టపడినప్పుడు, పేదరికం నుండి బయటపడే ఏకైక మార్గం విద్య అని గుర్తించింది. కాబట్టే ఏ అవమానం తన దరిచేరలేదు. పొద్దునా సాయంత్రం తల్లిదండ్రులకు సహాయంగా ఉండేందుకు ఏదొక పని చేసినా.. రాత్రుళ్ళు పుస్తకాలతో స్నేహం చేసింది. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది.

ఆమె కష్టం ఫలించి, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కోయంబత్తూర్లో సీటు సంపాదించింది. ఆ చదువు ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపించింది. అక్కడ స్పోర్ట్స్ మీద ఆసక్తి పెంచుకొని, ప్రతీ పోటీలోనూ ప్రైజ్ దక్కించుకునేది. అయితే అక్కడ కూడా ఆమె పేదరికం అనుభవించింది. ఒకసారి కోయంబత్తూరులో జరిగిన మారథాన్ లో పాల్గొనడానికి షూస్ లేకపోతే.. అలాగే పాదాలతోనే పరుగెత్తి విజయం సాధించి, స్పోర్ట్స్ షూస్ ను బహుమతిగా పొందింది. అపుడు విజయలక్ష్మి పేరు కోయంబత్తూరులో మారు మోగింది. ఇక తన కాలేజీలో జరిగే స్పోర్ట్స్ డేలో తను పార్టిసిపేట్ చేసిన అన్నిరకాల గేమ్స్ లో మొదటి బహుమతి పొంది, ఆల్ రౌండర్ గా ఎంపికయ్యేది.

ఇంజనీరింగ్ ముగిసి ఉద్యోగం సాధించి చెన్నై పట్టణానికి వెళ్ళాక ఆ మెట్రో నగరంలో విశాల అవకాశాలు ఆమెను ఇంకా ఎక్కువ ఆకర్షించాయి. తొందరగానే ఉద్యోగంలో ఉన్నతస్థానానికి చేరినప్పటికీ తన లోపల ఏదో అసంతృప్తి వెంటాడేది. ఉద్యోగం తనకు బంధీలాగా అనిపించేది. సేఫ్ జోన్ జీవితం నుంచి బయటకి వచ్చి తానే సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. తూత్తుకుడిలో ATIK ఎనర్జీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి పునరుత్పాదక ఇంధన రంగంలో తన మొదటి అడుగు వేసింది. దానిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ.. 5 సంవత్సరాల తర్వాత దానిని లాభాల పట్టించి, వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది.

అయితే వ్యాపార విస్తరణకు తూత్తుకుడి ఒక చిన్న చెరువు మాత్రమే అని గ్రహించిన విజయలక్ష్మి, మహాసముద్రం వంటి బెంగుళూరుకు తన వ్యాపారాన్ని మార్చారు. బిజినెస్ రంగంలో మరిన్ని మెళకువలు, లోటుపాట్లు తెలుసుకోవడం కోసం అక్కడే బిజినెస్ లా లో మాస్టర్స్ చేసింది. బెంగుళూరులో మొదట తన సంస్థను ఒక కో వర్కింగ్ స్పేస్ లో నిర్వహించేది. వీవర్క్, ఈజీఎల్ వంటి వంటి కో వర్కింగ్ ప్రదేశాల్లో పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా "ఫాక్స్ అకాడమీ"ని ప్రారంభించారు. ఫాక్స్ అకాడమీలో సాంకేతిక విద్యకు ఏఐ టెక్నాలజీని జోడించి శిక్షణ ఇస్తారు. ఇదొక కన్సల్టెన్సీ లాంటిదే కానీ ఇందులో మెట్రోపాలిటన్ నగరాల నుంచి కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాల యువతకు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణతో వారు మరింత రాటుదేలి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో అవకాశాలు పొందేలా చేసింది. విజయలక్ష్మి స్థాపించిన ఫాక్స్ అకాడమీకి భారీగా స్పందన రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది. వేల మంది విద్యార్థులు శిక్షణకోసం సంస్థలో చేరుతూ ఉండటంతో.. తన సంస్థను దేశంలోని ఇతర నగరాలకే కాకుండా జపాన్, సింగపూర్ కు కూడా విస్తరించింది.

తాను టైర్ 2, 3 నగరాల యువతను ఎంపిక చేసుకోవడానికి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది విజయలక్ష్మి. 'చిన్న పట్టణాల యువత ఉన్న కొద్దిపాటి వనరులతోనే, సమస్యలను పరిష్కరించుకుంటూ ఎదుగుతారు. వారికుండే భయం ఒక్కడే మెట్రో నగరాల్లో ఉండే పెద్ద అద్దాల మేడలు. అంతేతప్ప వారు సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో ఇక్కడి యువతకంటే పదిరెట్లు ముందుంటారు. వారికి కావాల్సింది కొద్దిపాటి కార్పొరేట్ ఎక్స్ పోజర్ మాత్రమే. ఆ తరువాత ఈ రంగంలో వాళ్లు రాకెట్ వేగంతో దూసుకుపోతారు." అని వివరించింది.

తన అకాడమీ టోక్యో, సప్పోరో, సింగపూర్‌ కు విస్తరించడం ద్వారా ఒక్కసారిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అలాగే జపాన్ స్టార్టప్ వీసాను పొందిన మొదటి దక్షిణ భారతీయురాలిగా విజయలక్ష్మి చరిత్ర సృష్టించింది. ఈ వీసా జపాన్‌లో కంపెనీ ఏర్పాటుకు, దాన్ని అక్కడ మరిన్ని నగరాలకు విస్తరించడానికి భారీ అవకాశాలను అందిస్తుంది. అయితే దాన్ని పొందడం అంత సులభం కాదు. ఆమె దృఢ నిశ్చయం, సాంకేతిక నైపుణ్యం ఈ అరుదైన అవకాశాన్ని సాధించడంలో సహాయపడ్డాయి. మొదట్లో జపనీస్ భాష నేర్చుకోవడం, స్థానిక వ్యాపార సంస్కృతిని అర్థం చేసుకోవడం పెద్ద సవాలే అయినప్పటికీ, ఈ అడ్డంకులను అధిగమించి, తన స్టార్టప్ కంపెనీని టాప్ లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు జపాన్ లో కూడా ఫాక్స్ అకాడమీకి శిక్షణ కోసం వేల సంఖ్యలో యువత క్యూ కడుతున్నారు.

మహిళలు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వారికి, సాంకేతిక రంగంలో విజయం సాధించడానికి విజయలక్ష్మి కురుప్పుస్వామి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. తన విజయం గురించి విజయలక్ష్మి ఏం చెబుతుంది అంటే.. "తూత్తుకుడి సముద్ర జలాల నుంచి ఒక కొబ్బరికాయ ఎన్నో కష్టాలను దాటుకొని ఈదుకుంటూ జపాన్ తీరానికి చేరింది. జపాన్ లో ఇపుడు కొబ్బరివనాలు తయారు కావడానికి అది సహాయపడుతుంది" అంటారు. ఎక్కడి తూత్తుకూడి, ఎక్కడి టోక్యో.. కలలకు హద్దులు ఉండవని, వాటిని నెరవేర్చుకోడానికి మన సంకల్పం దృఢంగా ఉంటే చాలని విజయలక్ష్మి అద్భుతమైన విజయగాథ మనకు చెబుతుంది.

Next Story