- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: మనొళ్లు బూతులకు బూస్టింగిచ్చి.. రోతలను రోస్టింగ్ చేస్తున్నారు. నోరు తెరిస్తే కంపు డంపే. వినేవాళ్లకు.. చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉన్నా పట్టించుకోకుండా కంపును కమ్మగా వాడేస్తుంటారు. డ్రైనేజీ కంపునైనా ముక్కు మూసుకొని తప్పించుకోగలమేమోగానీ.. ఈ నోటి మాటకంపును తప్పించుకోలేక పోతున్నాం. పైగా ఈ గలీజును అందరికీ రుద్దుతూ సర్వం బూతుభాషితంగా మార్చేస్తున్నారు.
నోటితో అనకూడని మాటలా.?
ఎక్కడ చూసినా.. ఏ డిస్కషన్ విన్నా బూతుల కథే నడుస్తుంది. మామూలుగా చెప్పేదాన్ని కూడా బూతుల చుట్టూ తిప్పుతూ కంపు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా యూత్ బూతులు మాట్లాడటం ప్యాషన్ అనుకుంటోంది. ఒకప్పుడు "ఏంది వ్యా".. అంటే "వ్యా ఏంది వ్యా.. నీకు నేనేమన్నా బావనా బామ్మర్దినా" అని తప్పుబట్టేవాళ్లు. "వ్యా" అనే మాటను పలకడానికే ఎనకాముందు అయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు నోటితో అనకూడని మాటలను కూడా జాతీయం చేసేసి జాతికి అంకితమిస్తున్నారు కొందరు. కాలేజీ పోరగాళ్లయితే మరీ ఘోరంగా తయారవుతున్నారు. ఏదైనా మాట పలికేముందు పది రకాలుగా ఆలోచిస్తాం కదా.? వాళ్లట్లా కాదు. మాట ఎత్తుకోవడమే బూతునెత్తుకుంటారు. "అమ్మ.. అయ్య" మీదికెల్లి దిగితే అంతొట్టు అనుకోండి.
ఏం మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి.?
నోటికొచ్చింది మాట్లాడేసి "ఇది బూతెందుకైతదీ" అనే మేధావులు కూడా చాలామందే ఉన్నారు. అంటే వాళ్లకు బూతులు కామన్ అన్నమాట. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు "ఏం మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి" అనే సోయి ఈ రోజుల్లో కొరవడింది. ఓ డైలాగ్ రచయిత చెప్పినట్లు "శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా" అనేదానికి.. "శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా" అనేదానికి చాలా తేడా ఉంటుంది బూతుకి.. నాన్ బూతుకి. అదేందో ఏమోగానీ.. ఎవరికెక్కువ బూతులొస్తే వాళ్లకంత తెలివి ఉన్నట్లు ఫీలవుతున్నారు జనాలు. కోపంతో ఉన్నా బూతునే వెతుక్కుంటున్నారు. సంతోషంలో ఉన్నా బూతు బాతాకానీయే పెడుతున్నారు. "సావుకు.. పెండ్లికి ఒకటే మంత్రం" అన్నట్లుంటది మనొళ్ల గలీజ్ గాలీ యవ్వారం.
నవ్వించాలంటే బూతులే వాడాలా.?
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మొత్తం ఇదే రోత కంటెంట్. ఏవో నాలుగు పచ్చి బూతులనేసి ఫేమసై పోవాలనుకుంటున్నారు జనాలు. ఇంకో దరిద్రం ఏందంటే చిన్న పిల్లలతో బూతులు మాట్లాడించి రీల్స్ చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ కూడా వాళ్ల నాన్ననో.. అన్ననో తయారు చేస్తారు. వాళ్లమీదనే సెల్ఫ్ పంచులేయిస్తారు. అదిచూసి మనొళ్లు పగలబడి నవ్వడం.. పళ్లు ఇకిలించడం. ఏమన్నంటే నవ్వించడమొక కళ అంటుంటారు. నవ్వించడమే ముఖ్యమనుకుంటే దానికి బూతులే వాడాలా.? కంపు కంపరమే లేపాలా అనేది చెప్పేవాళ్లు కూడా కరువయ్యారు. అందుకే మంచి మాటలు మసకబారి.. బూతు విచ్చలవిడిగా విలసిల్లుతోంది.. బాజాప్తా భాసిల్లుతోంది. కట్టడి.. కంట్రోల్ లేక నాలుక నానా రుచుల బూతులను ఆస్వాదిస్తోంది.
మిమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకునేది.?
సొసైటీపై బూతుల ప్రభావానికి చాలా కారణాలు ఉండొచ్చు. మనలో ఎవరైనా బూతు దొర్లితే బూతద్దంలో పెట్టి వివరణకు కూడా అవకాశమివ్వని అపరమేధావులు కొందరు తెరచాటు బూతుకు తెగ చొంగకారుస్తుంటారు. బయటేమో "ఛీ.. ఏంటీ బూతులు" అని దీర్ఘాలు తీసి సుభాషితాలు ఒలకబోస్తుంటారు. కానీ లోపల వాళ్లు చేసేదేంటంటే టీవీలో ప్రసారమయ్యే బూతు స్కిట్లను చూసి ఆహా అని తరిస్తుంటారు. పిల్లలెవరైనా తెలిసీ తెలియక టంగ్ స్లిప్ అయితే "ఇదేనా నువ్వు చదువుకుని నేర్చుకునేది" అని అరుస్తుంటారు. టీచర్లకు ఫోన్ చేసి "అసలేంటండీ పిల్లోడిని ఇలా తయారుచేశారు. ఈ బూతుల కోసమేనా లక్షల రూపాయల ఫీజు కట్టేది" అని తప్పును టీచర్లమీద వేస్తుంటారు. కానీ పిల్లలు తమను ఫాలో అయ్యే ఈ మాటలు నేర్చుకుంటున్నారని మాత్రం ఒప్పుకోరు.
బీప్ లేకుండా మాట్లాడే పరిస్థితేంటి.?
గలీజ్ మాటలను గౌరవంగా ఫీలయ్యే దుస్థితిని తీసుకొచ్చిన ప్రోగ్రాంలు చాలానే దాపురించాయి ఈ మధ్య. ఇంకా గొప్ప విషయం ఏంటంటే.. ఆ రియాలిటీ షో న్యాయ నిర్ణేతులు సొసైటీలో పేరున్న వ్యక్తులే. సంభాషణలు.. సన్నివేశాలు మొత్తం కంపే. మొదట్లో కాస్త డబుల్ మీనింగ్ అర్థాలతో నడిచిన ఈ బూతు స్కిట్ల వ్యవహారం.. రానురాను పూర్తి బూతు డైలాగుల షో అయ్యింది. గలీజ్ మాటలను బీప్ లేకుండా గంభీరంగా వాడే పరిస్థితి ఏర్పడింది. ఆ భాషకు న్యాయ నిర్ణేతలు చప్పట్లు కొట్టి.. అదేదో కొత్తరకం టాలెంటును వెలికితీసినట్లు బిల్డప్. దానవీరశూర కర్ణలో నాన్ స్టాప్ డైలాగ్ చెప్పినట్లు ఈలలు.. కేరింతలు.. కెవ్వు కేకలు. "ఇదేం భాషరా నాయనా" అని వారించాల్సిందిపోయి ఎక్స్‌టార్డినరీ.. హిలేరియస్ కామెడీ అంటూ బూతుకు పట్టాభిషేకం కడుతున్నారు.
ఇదేనా సినిమా చూడాలనుకున్న మార్పు.?
బూతు భాష విపరీత ధోరణికి కారణం ముమ్మాటికి సినిమాలే. వాస్తవానికి ఒకప్పుడు సినిమాల్లో ఆర్గానిక్ హాస్యం ఉండేది. అదిప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. కామెడీ అంటే గలీజ్ డైలాగుల గబ్బే అనుకుంటున్నారు. తీసేవాడు అదే సోయిలో ఉన్నాడు.. చూసేవాడు అదే సోయిలో ఉన్నాడు. ఆ ప్రభావం సొసైటీ మీద విపరీతంగా చూపిస్తోంది. ఇలా మాట్లాడితేనే విలువ ఉంటుందనే భ్రమలో ఉంటోంది యువత. "హాయ్ హలో" అని పలకరించే స్థితి నుంచి "ఏరా నా కొడకా" అని పలకరించుకునే పరిస్థితి ఏర్పడింది. సరే వీడేదో అన్నాడనుకుంటే అవతలి వాడు నేనేం తక్కువ అన్నట్లుగా "చెప్పు బే సాలె నీయక్కా" అని భాషకే విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇదేనా సినిమావాడు చూడాలనుకున్న మార్పు.?
పలికేవి సుభాషితాలా.. బూతు భాషితాలా.?
"మందిది మంగళారం.. మనది సోమారం" అని చెప్పుకునే మంగళారం బ్యాచ్ ఒకటి మొపైంది ఈ మధ్య. చేసేదంతా చేసి.. మాట్లాడాల్సినంత మాట్లాడి గబ్బును సమాజంపై రుద్ది వాళ్లు మీదికెల్లి నీతులు చెప్తుంటారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా "అరే అమిత్.. టూ....." అనీ. అలాంటి డైలాగుల ద్వారా "సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు" అని ఒక యాంకర్ ఖండఖండాలుగా ఖండించి గుక్కతిప్పుకోకుండా ప్రశ్నిస్తుంది. అంతవరకు బాగనే ఉందిగానీ అదే సదరు యాంకర్ బూతు స్కిట్స్‌తో హిట్టయిన ఒక ప్రోగ్రాంకి ప్రధాన వాఖ్యాత. డైపర్ కంటే ఎక్కువగా కంపును దాచిపెట్టే హైపర్ ఆర్టిస్టులు విసిరే కుళ్లు డబ్బులు మీనింగ్ డైలాగులకు పడిపడి నవ్వి "రాశి ఫలాల"కు వికృతార్థం చెప్పిన ఘనత తనదీ. వీళ్లే ఇప్పుడు సమాజాన్ని మార్చే ధీరులు.
అంగట్లో అగ్గువకు దొరికేది బూతేనా.?
చూస్తున్నాం కదా "గుంజి గుంజి" అనే పాట ఎక్కడిదాక గుంజుకెళ్లిందో. సినిమా రిలీజ్‌కి ముందు హైప్ కోసం.. ప్రేక్షకుల అటెన్షన్ కోసం ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలనుకున్నాడు చంద్రహాస్ అనే పసి హీరో. ఎంతోమంది చీఫ్ గెస్టులను పిలిచారు. మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. మనోడు ఆగకుండా "గుంజి గుంజి" పాడి సాహిత్యం సడుగులు విరగ్గొట్టిండు. డబుల్ మీనింగ్ కూడా కాదు.. డైరెక్ట్ బూతు పదాలతో పెద్ద పెంట చేశాడు. అతనికి కావాల్సింది సినిమా ప్రమోషన్. ఇక్కడ అగ్గువకు దొరికేది బూతే కదా.? ఎవడెట్ల పోతే మాకేందని మైకుతో మసాలా దట్టించాడు. అతడి పాటను వాళ్ల నాన్న చూశాడు.. వాళ్లమ్మ చూసింది.. అలాగే చెల్లి కూడా చూసింది. కానీ దీని గురించి వాళ్లెవర ఫీలైనట్టు ప్రకటించలేదు. అంటే వాళ్లందరికీ ఈ బూతుభాషితం కామన్ అన్నట్టా.?
కుర్చీ తాత మాట్లాడితే గలీజ్.. మరి మహేశ్ బాబు.?
చంద్రహాస్ అంటే లేత హీరో అవగాహన లేక చెత్త వాగుడు వాగాడు సరే. మరి 40 ఏళ్ల నుంచి సినిమా రంగాన్ని శాసిస్తున్న ముదురు హీరోలు "కన్నెపిల్లను చూస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి" అని వాగితే బూతు కాదా.? దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఏదో ఆకలి మత్తులో అటో ఇటో తెలియకుండా "ఆ కుర్చీని మడతబెట్టి" అని మాట్లాడితే బూతు అని ట్రోల్ చేసి కుర్చీతాతను కుదేలు చేశారు. మరీ అదే కుర్చీతాత డైలాగును సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో "కుర్చీ"కి గుంటూరు కారం పూస్తే బూతు కాకుండా పోతుందా.? అంటే ఇక్కడ మహేశ్ బాబు కూడా బూతు వాడినట్టే కదా.? ఇంకో ముచ్చటేందంటే మనమంతా ఆ "కుర్చీ మడతబెట్టిన" తాతను ట్రోల్ చేసి "గుంటూరు కారం కుర్చీ పాట"కు స్టెప్పులేసి ఎగిరిదుంకిన వాళ్లమే కదా.?
ఇదంతా బూతు సాహిత్యమా కాదా.?
తెలుగు సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. దాన్నిప్పుడు కొందరు పిల్బ బచ్చాగాళ్లు.. అంతకంటే ముందే ముదురు చిచ్చాగాళ్లు చెరబట్టించారు. ఏదో సోషల్ మీడియా పుణ్యమానీ "గుంజి గుంజి" లాంటి ఆణిముత్యాలనే వింటున్నాం కానీ.. పెద్ద హానిముత్యాలు ఎనకటికే దాన్ని గొప్ప సాహిత్యంగా మనమీద రుద్దారు. "వానొచ్చేనంటే వరదొస్తది.. వయసొచ్చేనంటే వలపొస్తది".. "రగులుతోంది మొగలిపొద.. వగలమారి కన్నె ఎద.. నాగినిలా వస్తున్నా.. కాటేస్తావో.. వాటేస్తావో".. "ఓరోరి యోగి నన్ను కొరికెయిరో.. ఓరోరి యోగి నన్ను నమిలెయిరో".. "కొబ్బరి పెడతావో అరిచి బొబ్బలు పెడతావో".. "ఓ టెన్నీసు బంతుల పాపా.. నీ బంతులకంతటి ఊపా".. "గడపనా నీతో గంటల కొద్దీ.. అయ్ బాబోయ్ ఆ తరువాతేమైపోద్దీ" ఇవన్నీ బూతులో కాదో ఎవరు చెప్పాలి.?
కంపు మాటలకూ కంటెంట్ క్రియేటర్లా.?
కొంత భావోద్వేగానికి గురైనప్పుడు జనాలు "ఎఫ్" వర్డ్ ఉపయోగించేవాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఇది కామనైయిపోయింది. వాళ్లు వాడే అతిపెద్ద బూతు అంటే ఇదొక్కటే ఉండొచ్చు. కానీ దాన్నుంచి నేర్చుకున్న మనొళ్లేమో బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. నోటికి ఎంతొస్తే అంత.. ఏది పడితే అది మాట్లాడి రోత కంపరం పుట్టిస్తున్నారు. ఇప్పుడిదొక సామాజిక రుగ్మతగా మారి రుబాబు చెలాయిస్తోంది. పిల్లలు చిన్నప్పట్నుంచి "అమ్మా.. అయ్యా" అని కాకుండా "నీయమ్మా.. నీ అయ్యా" అని అలవర్చుకునే కుసంస్కృతికి పునాదులు పడి పైకప్పుకూడా పేర్చుకున్నాయి. ఎవడు ఏమనట్లేదు కదా అని విచ్చలవిడిగా బూతు కంటెంటును వడ్డిస్తూ పైగా కంటెంట్ క్రియేటర్లమని చెప్పుకుంటున్నారు బూతు ప్రియులు కొందరు.
పలికేదే గలీజు.. ఇక ఆ గాంభీర్యమెందుకో.?
కామన్ మ్యాన్ నుంచి ఖద్దరు నాయకుల దాకా ఎవరి నోరు తెరిచినా బూతు బాతాఖానీయే నడుస్తోంది. "లాగులిప్పుతా.. తొండలు జొర్రగొడ్తా.. రండా.. ముండా" వంటివి మాట్లాడుతూ ఛీ కొట్టించుకుంటున్నారు. బీపులుంటలేవు.. స్టాపులుంటలేవు. అంతా చీప్ భాషే. ప్రజలకు నేర్పాల్సిందిపోయి ప్రజలతో తిట్లు తింటూ "టూ...... భాష"తో టూమచ్ చేస్తున్నారు. ఆరోపణల పేరుతో గలీజు మాటలను గంభీరంగా ఫీలవుతున్నారు. కానీ మనం ఏది మాట్లాడితే అదే మనకు రిటర్న్ వస్తుందనేది తెలుసుకుంటే మంచిది. బూతు బూతే సమాధానం అన్నట్టు కౌంటర్‌గా పచ్చి బూతులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎవడన్నా చిన్న తప్పుడు మాట మాట్లాడితే నానా హంగామా సృష్టించేవాళ్లు ఇప్పుడెక్కడ బూతు స్కిట్లు చూస్తూ సేద తీరుతున్నారో.?
ఎవరు నేర్పిన భాష ఇదీ: గుర్రం సీతారాములు
చంద్రహాస్ అనే పిలగాడు "గుంజి గుంజి" పాటను గుంజి తన్నడం సరే. గుడ్డలిప్పి ఆడుతుంటే కేరింతలు కొట్టే క్షుద్ర సమాజాన్ని ఏమందాం.? ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చెయ్యాలి అన్న నాజూకు నాగరిక భాషను ఎలా తర్జుమా చేద్దాం.? ప్రజా ప్రతి ప్రతినిధులే దగ్గరుండి పండగ పేరుతో పసిపిల్లల నుండి పెద్దల దాకా వాడేసిన సబ్బు కోసం ఎగబడే సంస్కృతిని ఏమందాం.? రాత్రి కాగానే పిచ్చికుక్కల్లా రెచ్చిపోతున్న జబర్దస్త్ వికృతాన్ని వండి వారుస్తున్న రాస ఎపిసోడ్స్ గురించి ఏం రాద్దాం.? ఆ పోరగాడు గుంజి తంతా అన్నాడు తెలిసీ తెలియక. క్షమిస్తే పోయేదేముంది చెప్పండి.?
ప్రశ్నించాల్సిన చోట బూతులా.?: నవ జీవన ప్రియ
ఈ తరం యువతకు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఆలోచన అవసరం లేదు. వాళ్లకు బూతు చాలు అంతే. అందుకే ప్రశ్న అడగాల్సిన చోట తిట్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నించాల్సిన యువత అశ్లీలతలో మునిగిపోయి చప్పట్లు కొడుతోంది. రాజకీయాలేమో వాదనల స్థానంలో బూతులు.. విజన్ స్థానంలో వల్గారిటీ.. సిద్ధాంతాల స్థానంలో అరుపుల ప్రచారం చేస్తున్నాయి. యువతను చదవనివ్వకుండా.. ఆలోచించనివ్వకుండా.. ప్రశ్నించనివ్వకుండా.. బూతుతో మత్తెక్కించి అదే తిరుగుబాటు అని నమ్మిస్తే.. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువతేమో కామెంట్లలో తిట్టే సైన్యమైపోతోంది.






