- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Special: : బ్రిటీష్ గూఢచారిగా ముస్లిం మహిళ.. స్పైగా ఎలా మారిందంటే..?
మతం, కులం ఇతరత్రా మరే రంగుకళ్లద్దాలూ వాడకుండా ఆధునిక గూఢచర్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన నూర్ వీరగాథ చిత్రాన్ని తెలుసుకుందాం.

భారతీయ గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ విషాదాంత చరిత్ర ఇది. తన పూర్వీకుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా శ్రీరంగ పట్నం యుద్ధంలో పోరాడి 1799లో అసువులు కోల్పోగా, ఒకటిన్నర శతాబ్దం తర్వాత మారిన కాల పరిస్థితుల్లో అదే బ్రిటిష్ సామ్రాజ్యం తరపున భారతీయ గూఢచారిణిగా పనిచేసి నాజీలకు చిక్కి 30 ఏళ్ల వయసులో నేల కొరిగిన ధీరోదాత్తురాలు నూర్. 72 సంవత్సరాల క్రితం ప్రాన్స్‌లో పట్టుబడి, చిత్రహింసలను అనుభవించి ప్రాణాలు కోల్పోయన వీర నారి నూర్. మతం, కులం ఇతరత్రా మరే రంగుకళ్లద్దాలూ వాడకుండా ఆధునిక గూఢచర్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన నూర్ వీరగాథ చిత్రాన్ని తెలుసుకుందాం. - కే రాజశేఖర రాజు
రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి, నిజమైన మిత్రరాజ్యాల గూఢచారుల నుండి ప్రేరణ పొంది తీసిన చిత్రం. "ఎ కాల్ టు స్పై", (గూఢచారికి పిలుపు). 1940ల ప్రారంభంలో, యూరప్ ఖండాన్ని ఆవహించిన జర్మన్ నాజీ ముప్పు ప్రమాదం పరాకాష్టకి చేరుకుంది, మిత్రరాజ్యాలు ధైర్యంగా ఏదైనా చేయవలసి వచ్చింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో విధ్వంసంకర చర్యలు చేపట్టడానికి, ప్రతిఘటనను నిర్మించడానికి 'ఆకర్షణీయమైన మహిళా గూఢచారుల' రహస్య సైన్యాన్ని సృష్టించాలని చర్చిల్ అభ్యర్థించాడు. ఆ గూఢచారుల కథే ఈ సినిమా. వారికి ఎలా శిక్షణ ఇచ్చారో, వారు తమ కార్యకలాపాలను ఎలా నిర్వహించారో. సినిమా చాలా ప్రామాణికంగా చూపిస్తుంది. సినిమా కథ వర్జీనియా హాల్ అనే గూఢచారిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. నాజీలు ఆమెను మిత్రరాజ్యాల గూఢచారులందరిలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా భావించారు.
విన్‌స్టన్ చర్చిల్ 'అందమైన గూఢచారులు'
విన్‌స్టన్ చర్చిల్ నిర్వహించే ‘స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ అనే గూఢచారి సంస్థ గూఢచారులుగా ఎలా ఉండాలో స్కౌట్ చేసి మహిళలకు ఎలా ఉండాలో నేర్పింది. ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకోవాలనుకున్న హిట్లర్ ఎజెండాను పక్కదారి పట్టించడం, అతనికి, తన సైన్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటనను సృష్టించడం వారి అన్ని మిషన్ల లక్ష్యం. ఇంగ్లీష్ ఛానల్ అంతటా యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రాన్స్ పొందలేకపోవడంతో ఈ ఏజెన్సీని ప్రారంభించారు. నాజీలు ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత 1940లో రహస్య గూఢచారి సంస్థ ప్రారంభమైంది. గూఢచారులుగా అనుమానించబడే అవకాశం తక్కువగా ఉండే అందమైన మహిళలను గూఢచారులుగా నియమించుకున్నారు అలాగే, వైర్‌లెస్ ఆపరేటర్లుగా ఉన్న మహిళల కోసం ఏజెన్సీ వెతుకులాటలో ఉంది, ఎందుకంటే యుద్ధం గురించి సమాచారం ఫ్రాన్స్‌లోని గూఢచారి ఏజెన్సీకి తిరిగి పంపించాలి మరి.
సైనైడ్ మింగడమే మేలు
నాజీలకు వ్యతిరేకంగా గూఢచారిగా ఉండటం వల్ల కలిగే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలా మంది గూఢచారులు వెంటనే పట్టుబడి మరణశిక్షకు గురయ్యారు. ఒక వేళ అలా చంపకపోతే, నెలల తరబడి నాజీలు హింసించిన తర్వాత వారిని కాన్సంట్రేషన్ క్యాంప్‌కు పంపేవారు. ఆ సమయంలో మహిళా గూఢచారులు తమ రహస్య మిషన్‌కు వెళ్లే ముందు వారికి అధికారులు ఇచ్చిన సలహా ఒళ్లు జలదరింపచేస్తుంది. వారు పట్టుబడాల్సిన స్థితి ఎదురైతే జైలులో నాజీల భయంకర హింసలు ఎదుర్కొనే బదులు ఆత్మహత్య చేసుకోవడానికి ఏజెన్సీ వారికి సైనైడ్ మాత్రలు ఇచ్చింది.
బతికి ఉండటం, పట్టుబడటం మధ్య తేడా
యుద్ధం ముదిరే కొద్దీ, చరిత్ర గతిని మార్చబోతున్న ప్రమాదకరమైన మిషన్ కోసం కొంతమంది యుద్ధానుభవం ఏమాత్రం లేని మహిళల బృందాన్ని నియమిస్తారు. తమ ధైర్యం, తెలివితేటలతో వారు మోసం, గోప్యత, ప్రాణాంతక ప్రమాదాలతో కూడిన వలయాన్ని దాటాలి. ప్రమాదాలు పెరిగేకొద్దీ, స్నేహితుడు, శత్రువు మధ్య రేఖ ప్రమాదకరంగా అస్పష్టంగా మారుతుంది. అదే సమయంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయం బతికి ఉండటం, బంధించబడటం మధ్య ఉండే వ్యత్యాసాన్ని సూచిస్తుంటుంది. వారు తమ రహస్య మిషన్‌లో విజయం సాధిస్తారా? లేదా గూఢచర్యం నీడలు వారిని కబళించేస్తాయా? అనేది తెలుసుకోవాలంటే, రహస్యంగా ఉండి పోరాడటానికి తగినంత ధైర్యం ఉన్నవారి చేతుల్లో దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉన్న ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి ఈ చిత్రం ద్వారా అడుగు పెట్టండి. 2019లో విడుదలైన 'ఎ కాల్ టు స్పై' సినిమాలో మన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ముఖ్య పాత్ర పోషించడం గమనార్హం. యుద్ధ రంగం గురించి ఏమాత్రమూ చూపించని ఒక హాలీవుడ్ సైలెంట్ వార్ సినిమాలో భారతీయ స్త్రీ ఎలా ఇమిడిపోయిందో చూడాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే.
చిత్ర కథ ఏమిటంటే..
చిత్రం ప్రారంభంలోనే, 'వారు అందంగా ఉన్నారని నిర్ధారించుకోండి' అని కళ్లద్దాలు ధరించిన స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ విసుక్కుంటూ, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ రోజుల్లో ఫ్రెంచ్ మాట్లాడే మహిళా రహస్య కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించే బాధ్యతలలో ఉన్న రొమేనియన్ సంతతికి చెందిన ‘స్పైమిస్ట్రెస్’ (స్టానా కాటిక్ పోషించిన పాత్ర) వెరా అట్కిన్స్‌తో చెబుతుంది. సారా మేగాన్ థామస్ రాసిన, లిడియా డీన్ పిల్చర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యుద్ధ ప్రయత్నాలకు మహిళల సహకారాన్ని, ముఖ్యంగా క్లరికల్ గ్రేడ్‌ల కంటే తక్కువ స్థాయి కలిగిన మహిళల సహకారంతో యుద్ధగతిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి రూపొందించబడిన నాటకీయ డ్రామా.
భారతీయ గూడఛారి నూర్ ఇనాయత్ ఖాన్
గూఢచర్య విధులను నిర్వహించగలిగే ఇద్దరు యువతుల నియామకాలపై అట్కిన్స్ దృష్టి పెడుతుంది. ఒకరు వర్జీనియా హాల్ (చిత్ర కథా రచయిత్రి థామస్ పోషించిన పాత్ర) ఒక అమెరికన్ రాయబార కార్యాలయ ఉద్యోగి, కృత్రిమ పాదం వల్ల దౌత్యవేత్తగా కెరీర్ నిరాకరించబడిన మహిళ వర్జీనియా. మరొకరు భారతీయ సూఫీ ఆధ్యాత్మికవేత్త కుమార్తె నూర్ ఇనాయత్ ఖాన్ (రాధిక ఆప్టే), ఈ మిషన్‌లో చేరడానికి ఖాన్ తన శాంతియుత ధోరణులతో పోరాడవలసి ఉంటుంది. హాల్ మొదటగా చర్యలోకి దిగి, ఏజెంట్లను సంప్రదించి వారిని బయటకు తీసుకురావడానికి ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఖాన్‌ను ఆమెతో చేరడానికి పంపారు. ఒకసారి ఫ్రాన్స్ లోకి అడుగు పెట్టిన తర్వాత, అక్రమ రేడియో ప్రసారాలను నాజీలు గుర్తించకుండా ఉండేందుకు ఆమె శాశ్వతంగా కదలికల్లో ఉండాలి. హాల్ లియోన్‌కు వెళుతుంది, అక్కడ ఆమె దాడులను నిర్వహిస్తుంది. ఏజెంట్లు వెళుతున్నప్పుడు వారికి సహాయం చేస్తుంది; ఖాన్ తన వంతుగా పారిస్‌కు వెళుతుంది, చరిత్ర నమోదు చేసినట్లుగా, అక్కడ ఆమె కోసం విపత్తు ఎదురుచూస్తోంది. ఎ కాల్ టు స్పై సినిమా రెండు గంటలకు పైగా నడుస్తున్న సమయంలో ప్రతి నిమిషం మీకు అనుభూతిని కలిగించే స్థిరమైన వేగంతో సాగుతుంది. ఊపిరి బిగబట్టి చూస్తేనే ఈ సినిమా మనకు చక్కగా అర్థమవుతుంది.
నీలిరంగు దుస్తులపై ప్రేమే ద్రోహం చేస్తే..
నూర్ ఇనాయత్ ఖాన్ ఒక భారతీయ సూఫీ ఆధ్యాత్మికవేత్త కుమార్తె, ఆమె ఫ్రాన్స్‌ని ఆక్రమించిన నాజీలకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ ప్రతిఘటనా బలగాల తరపున పోరాడుతూ, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ ఏజెంట్‌గా తన ప్రాణాలను అర్పించింది. 29 ఏళ్ల నూర్ ఇనాయత్ ఖాన్‌ను గెస్టపో బంధించి డాచౌ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఉరితీసింది. 76 సంవత్సరాల తర్వాత, అంటే 2020లో రాసిన ఒక పుస్తకం 'Code Name Madeleine: A Sufi Spy in Nazi-Occupied Paris' నీలం రంగు దుస్తులపై కలిగి ఉన్న ప్రేమే ఆమెకు ద్రోహం చేసి, శత్రువు పసికట్టేలా చేసిందని వెల్లడించింది. శత్రువులకు వెనుక వైర్‌లెస్ ఆపరేటర్‌గా లండన్‌కు కీలక సందేశాలను పంపడంలో, D-డేలో మిత్రరాజ్యాల ల్యాండింగ్ విజయానికి గణనీయంగా సహాయపడిన ఒక హీరోయిన్‌పై కొత్త వెలుగును ప్రసరింపజేసే జ్ఞాపకాలను ఈ పుస్తక రచయత్రి ఆర్థర్ మాగిడా తెలియజేశారు. మడేలిన్ అనే కోడ్‌నేమ్ ఉన్న ఆమె గెస్టపోకు అత్యంత విలువైన లక్ష్యంగా మారింది. 1943 శరద్రుతువులో, గెస్టపో ఆమెను చుట్టుముట్టడంతో, ఆమెను కాపాడటానికి ఫ్రెంచ్ ప్రతిఘటనా సేనలో పనిచేస్తున్నవారు చేయగలిగినదంతా చేస్తారు. వారు ఒక హెయిర్ సెలూన్‌కి తీసుకెళ్లి ఆమెకు పూర్తిగా కొత్త వార్డ్‌రోబ్‌ను అందిస్తారు. అయితే ఆమె ఎంచుకున్న ప్రతిదీ మునుపటిలాగే నీలం రంగులో ఉంటుంది, నూర్ నిజంగా నీలం రంగును ఇష్టపడుతుందని గెస్టపోకు తెలుసు. ఆమెను పట్టుకోవడానికి అదే కీలక అంశం. ఆమె శారీరకంగా ఎలా ఉంటుందో వారికి ఆలోచన ఉంది, కానీ వారు ఈ సందర్భంగా తీసుకున్నది నీలం రంగు రాడార్. దాని ఆధారంగానే ఆమె పట్టుబడింది. ఇక రెసిస్టెన్స్ ఫోర్స్‌కి చెందిన వియెనోట్ కోడ్‌నేమ్ “లూయిస్ డ్యూక్స్”. ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్న అతను నకిలీ పత్రాలను ఒరిజనల్‌గా మార్చడానికి జర్మన్ సీల్స్‌ను దొంగిలించడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అంతే కాకుండా నాజీలు రేడియో సిగ్నల్‌లను జామ్ చేయడానికి ఉపయోగించే పరికరాల కోసం బ్లూప్రింట్‌లను దాచడానికి డబుల్ బాటమ్ బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించాడు.
బట్టలు వొలిచి నగలకోసం వెతికి...
వాస్తవానికి నాజీలకు పట్టుబడ్డాక భారతీయ మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు మహిళా గూఢచారులను 1944 సెప్టెంబర్ 13న బవేరియాలోని దాచౌ నిర్బంధ శిబిరంలో ఉరితీశారు. (సినిమాలో నేరుగా నాజీ సైనికుడు కాల్చి చంపినట్లు తీశారు) చనిపోయాక వారి బట్టలు వలిచి ఆభరణాలకోసం నాజీలు శోధించారని సమాచారం. ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసి కూడా నాజీలకు వ్యతిరేకంగా గూఢచర్యం కోసం పరాయి దేశం వెళ్లి సాటిలేని సాహసం ప్రదర్శించిన నూర్ ఇనాయత్ ఖాన్‌కి బ్రిటిష్ ప్రభుత్వం 1949లో మరణానంతర అత్యున్నత పతకం జార్జి క్రాస్‌ని ప్రకటించి గౌరవించింది.
కన్నతల్లి కడుపుకోత ఆర్తనాదం
హాలీవుడ్ సినిమా కదా అనుకుంటూ అన్యమనస్కంగా ఈ సినిమా చూశాను. కానీ సీన్లు మారేకొద్దీ ఏదో ప్రత్యేకత కనిపించింది. 'మీ కుమార్తె మిస్సింగ్ కనిపించలేదు' అంటూ ఆమెకి సంబంధించిన ఒక లెటర్, మరికొన్ని పస్తువులు తీసుకుని వచ్చి నూర్ కన్నతల్లికి స్పై అధికారిణులు వచ్చి చెప్పినప్పుడు ఆమె ఒకటే అడుగుతుంది. ఇంతమంది ఉండి ఆమెను కాపాడలేకపోయారా.. అని ప్రశ్నిస్తుంది. వీళ్లు నిరుత్తరులైపోతారు. ఒక్క ఉదుటన తల్లి లేచి ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకుంటుంది. లోపలనుంచి కన్నతల్లి కడుపుకోత ఆర్తనాదం రూపంలో భయంకరంగా వినిపిస్తుంది. బయట ఉన్న వీళ్లకు నోట మాటలేదు. ఆ కసితోనే ఫ్రాన్స్‌లో నాజీల వేటనుంచి తప్పించుకుని వచ్చిన స్పై వర్జీనియా తిరిగి ఫ్రాన్స్‌కి వెళ్లి డి-డే అని చెప్పుకునే నార్మండీ మహా సంగ్రామానికి దారితీసిన అత్యంత సంక్లిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మిత్ర రాజ్యాల సైన్యానికి అందిస్తుంది.. లోపాలను సరిదిద్దుకుని వచ్చిన ఈ గూఢచారిణులు ఒక్క తప్పు లేకుండా తమ పనిని నిర్వరిస్తారు.
Title: A Call To Spy
Year of Production: 2019
Director: Lydia Dean Pilcher
Cast: Sarah Megan Thomas, Stana Katic, Radhika Apte






