- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయినవారిది అమృతం.. కానివారిది కల్తీ.!
కోవా బన్ను పేరు చెప్తే దడపుట్టి జడుసుకుంటున్నాం

దిశ, ఫీచర్స్: అందరికీ ఘర్ కా ఖానా"నే కావాలి. కానీ.. గంటెను చేత్తో తిప్పొద్దు. అందరూ అమ్మచేతి రుచి కావాలనుకునేవాళ్లే. కానీ పొయ్యి మనింట్లో పెట్టొద్దు. కల్తీకి కండ్లు లేవు.. మనిషికి మానవత్వంలేదు కాబట్టే అయినవారిది అమృతం.. కానివారిది విషం అవుతోంది. అందమైన లేబుల్.. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఉంటే దానికి ఏ అగ్‌మార్క్ అవసరం లేదిక. కాగితానికీ.. కవరుకూ టాక్సులేసే ఫ్రెష్షో.. మైమరిపించే మార్టో అయితే సమ్మగుంటది మనకు. కొసరకుండా.. ఇసరకుండా కొనే ఐటమేదైనా మన దృష్టిలో అది ఫ్రెష్ అండ్ క్వాలిటీ అన్నమాట.
కోవా బన్ను అంటే దడ పుడుతోందా.?
"పాలకోవా.. తీసుకోవా" అంటూ ఇరవై రూపాయలకే బన్నుకోవా ఇస్తుంటే మనమంతా ఎగబడి కొనుక్కొని తిన్నవాళ్లమే. "కొంచెం కోవా పెట్టు చిచ్చా" అంటూ అడిగినవాళ్లమే. "దో బై తీన్" ఇరానీ చాయ్ ఆర్డర్ చెప్పి మీదికెల్లి మీగడ వేయించుకున్న వాళ్లమే. కానీ ఇప్పుడు "కోవా బన్ను" పేరు చెప్తే దడపుట్టి జడుసుకుంటున్నాం. మీగడ చాయ్ అంటే "నీకో దండంరా సామీ" అని వద్దంటున్నాం. ఎందుకనీ అడిగితే కల్తీ అంటున్నాం. కల్తీని ఎవరూ సహించరు. దానంత పాపపు చర్య ఇంకొకటి ఉండదు. తిరుపతి ఎంకన్న లడ్డు గురించే పెద్ద చర్చ జరుగుతోంది. కానీ కల్తీ సామాన్యుడు అమ్మే వస్తువులోనే ఉందా.? కార్పొరేట్ వస్తు మార్పిడిలో లేదా.? ఇన్నాళ్లు ఇంట్లో.. కట్టెల పొయ్యి మీద వండిందే స్వచ్ఛమైంది అనుకున్నాం కదా.? మరి ఇప్పుడదే కల్తీ అంటున్నామెందుకు.?
కార్పొరేట్ వాడిని నిలదీయమెందుకు.?
కల్తీ మనల్ని పట్టి పీడిస్తోంది. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఎత్తు పెరిగేది అని ఒకటి.. బరువు పెంచేది అంటూ ఇంకొకటి పిల్లలు పుట్టినప్పటి నుంచి మార్కెట్లో కోరలు చాచుకొని ఉంటాయి. లేబుల్స్ అందంగా ఉంటున్నాయి కదా.? ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది కదా అని మరోమాట ఆలోచించకుండా మోసపూరిత అడ్వర్‌టైజ్ వలకు చిక్కి విలవిల్లాడుతుంటాం. కానీ దీని గురించి ఎక్కడా చర్చించం. అసలు కార్పొరేట్ కల్తీ మోసాల గురించి నోరు తెరిచే సాహసం చేసే పాపాన పోము. వాస్తవానికి ఏదైనా పదార్థంగానీ.. వస్తువుగానీ కల్తీ అనిపిస్తే దాని గురించి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మనపై కచ్చితంగా ఉంటుంది. కల్తీని రుజువు చేయించేదాక వదలొద్దు. కానీ మనం కోవా బన్నువాడిని ప్రశ్నించినంత ధైర్యంగా కార్పొరేట్ వాడిని నిలదీయలేం కదా.?
పంచాయితీ ఎందుకని ప్రశ్నించరా.?
ఫలానా రెస్టారెంట్ "దోశలో బొద్దింక".. ఫలానా సూపర్ మార్కెట్లోని "పిండిలో పురుగులు".. ఫలానా ఫుడ్‌కోర్ట్‌లోని "బిర్యానీలో బల్లి" అంటూ ఎన్ని వార్తలొస్తలేవు చెప్పండి.? ఏ ఒక్కనాడైనా వాటిని ప్రశ్నిస్తామా.? "వానితో మనకెందుకు పంచాయితీ" అని సైలెంట్‌గా డస్ట్‌బిన్‌లో పడేసి వస్తాం. వందల రూపాయలు పెట్టినా వాడు కొసరేసేవాడు కాదు.. ఎసరేసేవాడు కాదు. పైగా అదంతా మసాల కూడు. ఎముకల నూనెనో.. ఎలుకల నూనెనో కూడా మనకు తెలియదు. రుచి బాగలేకపోయినా.. కల్తీ ఉందని తెలిసినా ఏమీ అనము. అదే రోడ్డుమీద బండి పెట్టుకొని అమ్మేవాడిని మాత్రం.. "నీళ్లు పోసి అమ్ముతున్నవా.?" అని ముప్పుతిప్పలు పెట్టి ముచ్చెమటలు పట్టిస్తాం. "ఎవడు దొంగరా అంటే గుడ్డబట్టలోడు దొంగ" అనేటట్లు చేస్తాం.
ఘర్ కా ఖానాదే కల్తీ అంటారా.?
"ఇంటి వంట" అంటే అందరూ "మాకూ.. మాకూ" అనేవాళ్లే. "ఘర్ కా ఖానా" అంత స్వచ్ఛమైందనేది మన నమ్మకం. వండే విధానం.. వేసే దినుసులు చాలా స్వచ్ఛంగా.. నాణ్యంగా ఉంటాయనేది మన అభిప్రాయం. ఎవరి ఇంట్లో వండినా మన ఇంట్లో.. మన అమ్మ వండిన అనుభూతే పొందుతాం. కానీ రెస్టారెంట్లో తింటే ఆ ఫీలింగ్ ఉంటుందా.? ఉండదు కదా.? కానీ అక్కడ మూసుకొని తింటాం. హోంఫుడ్ రుచులు అందిస్తుంటే మాత్రం కల్తీ జరిగిందో.. కరాబైందో అని వాదిస్తుంటాం.. వేధిస్తుంటాం. ఆరోగ్యానికి హానికరమే అని తెలిసినా కొవ్వుల తిండినే కొసిరి కొసిరి తింటాం. అక్కడ కల్తీ కనిపించదు.. హెల్తీ కనిపించదు. ఇక్కడంతా పేరుకు అమ్మచేతి వంట.. ఘర్ కా ఖానా అని సూక్తులు చెప్తుంటారుగానీ.. వాళ్లంతా బేసికల్‌గా అడ్డమైన గడ్డికే సై అంటారు.
పెట్టే వాడిమీదే అనుమానాలా.?
రోడ్డు పక్కన చిన్న చిన్న టెంట్ల కింద పెట్టే కమ్మని వంట కోసం పెద్ద పెద్ద కార్లలో వస్తుంటారు చాలామంది. ఉప్పు.. కారం.. అల్లమెల్లిగడ్డ.. నూనె అన్నీ రోజు వాళ్లింట్లో వాడేవే వీటికీ వాడతారు. వేలకు వేలు లాభాల కోసం కాకుండా రోజూ కూలీ పడితే చాలనుకొని వడ్డించేవాళ్లే వీళ్లంతా. రెస్టారెంట్లో కంటే సగానికి తక్కువ పైసలు పెట్టి.. రెస్టారెంట్లో తిన్నదానికంటే ఎక్కువ సంతృప్తి పొందుతాం. 70 రూపాయలకే బోటి రైస్.. చికెన్ రైస్.. మటన్ రైస్ వెరైటీలు ఇస్తూ మన కడుపు నింపుతుంటే వాళ్లమీదే లేనిపోని అనుమానాలుంటాయి. "ఎలా వండారో.. ఏం వేశారో" అని కుచ్చికుచ్చి అడుగుతాం. ఇవే అనుమానాలు వందల రూపాయలు తీసుకొని.. సప్పిడి మసాలా ఫుడ్డు పెట్టినోడి దగ్గర మాత్రం రావు. ఎందుకంటే వాడు గల్లాపెట్టె చూసుకునేవాడేగానీ.. ఒకరి ఆకలి చూసేవాడు కాదు.
ఎక్స్‌పైరీ డేట్ ఎక్కడ చూపిస్తాం.?
రోజుల తరబడి ఫ్రిజ్జుల్లో నిల్వ ఉంచే మాంసానికి ఎక్స్‌పైరీ డేటేదని అడగం. నిన్న మిగిలిందీ.. మొన్న మిగిలిందీ ఒక్కదగ్గర కలిపేసి కలర్ కోటింగిస్తే లొట్టలేసుకొని తినేస్తాం. నాసిదో.. పాసిదో పెట్టి మన పొట్టను కరాబ్ చేసేవాళ్లను వెనకేసుకొచ్చీ పొట్టకూటి కోసం బన్ను ఒకచోట.. కోవా ఒకచోట కొనుక్కొచ్చి కూలీ పడితే చాలనుకొని కష్ట పడుతున్నొళ్లను మాత్రం ఎక్స్‌పైరీ డేటనీ.. కల్తీ అనీ బూతద్దంలో పెట్టి చూస్తాం. ఎక్స్‌పైరీ డేటైపోయినా అమ్ముకోవచ్చని.. కల్తీతో ప్రాణాల మీదికి తెచ్చుకోమని చెప్పట్లేదు. "దొంగలకు వండిపెట్టి కుండలు కడిగేది" మనకు బాగా అలవాటైపోయిందనేది ఇక్కడ పాయింట్. ఐనా పానీపూరీ.. పావ్ బాజీ.. బేల్ పూరీ.. మసాలా పూరీ వంటివన్నీ ఊరీలిచ్చుకుంటూ మనం రోజూ తినేవే కదా.? మరి ఎక్స్‌పైరీ డేట్ ఎక్కడ చూపిస్తాం.?
ఇది కూడా ప్రమాదమే కదా.?
హానికరం పదార్థాలు అమ్మొద్దు.. ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు ఎవరైనా. సరే పాలకోవా కల్తీ అయిందంటున్నారు. అది తింటే ప్రమాదం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు. ఐతే ఇదే నీతి అన్నింటికీ వర్తించాలి కదా.? "ఓఆర్ఎస్ బ్యాన్" అయిందనే ముచ్చటైతే మనకు తెలిందే కదా.? కానీ బ్యాన్ ఎక్కడ అమలవుతోంది. మనం ఎప్పట్లాగే తుమ్మినా దగ్గినా ఓఆర్ఎస్ కొనుక్కొని తాగట్లేదా.? పైసలు పెట్టి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నామా లేదా.? "వద్దురా సామీ ఓఆర్ఎస్ తాగకుండ్రా.. అది విషంరా" అని మొత్తుకుంటెనేమో ఎగబడి ఎగబడి కొనుక్కుంటాం. అది ప్రమాదమని తెలిసినా లెక్కచేయం. పాడైపోయిన కోవా బన్ను ఎంత డేంజరో.. బ్యాన్ అయినా బాజాప్తా కొనుక్కుంటున్న ఓఆర్ఎస్ కూడా అంతే డేంజర్ కదా.?
చాటింపేసి చెప్పినా అవసరం లేదా.?
కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. డాక్టర్లు కూడా వద్దని వారిస్తుంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగితేనే మనకు సమ్మగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థేమో "నీ కూల్ డ్రింక్స్‌కు అగ్గిదల్గా" అని చిల్కకు చెప్పినట్లు చెప్తుంది. కానీ వింటున్నామా.? కూల్‌డ్రింక్స్ వల్ల బీపీ.. షుగ్.. గుండె సమస్యలు వస్తాయని చాటింపేసి చెప్పినా పట్టించుకోం. ఆ సైలెంట్ విషాల గురించి వదిలేసి బన్నులో ఏముంది.? కోవాలో ఏముంది.? వాటిని అమ్మేవాడు మనోడా కాదా.? వంటివన్నీ ముందేసుకుంటున్నాం ఎందుకో.? కల్తీ.. ప్రమాదం గురించి తుపాకీ ఎక్కుపెట్టి.. ఇంట్లో నుంచి ఫోన్ రాగానే ఆదరబాదరగా రెండు పిజ్జాలు.. బర్గర్లు తీసుకొని వెళ్లేవాళ్లమే కదా మనమంతా. ఇప్పుడే కాదు.. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా మనమింతే.
ప్రమోషన్ చేసేవాడినీ ప్రశ్నించాలి కదా.?
తాగండి తాగండి బాబులు.. బీడీలు తాగండి బాబూ అంటూ ఊదరగొట్టి యువత ఉసురు తీసుకుంటున్నవాళ్లను.. తంబాకు తినండీ.. గుట్కాలు మింగండీ.. పలుకు పలుకులో కేసరి అంటూ అడ్డమైన చెత్తంతా తినమని బాజాప్తా ప్రమోషన్ చేస్తున్నవాళ్లను ఏమీ అనకుండా వదిలేద్దాం. పైగా వాళ్లు మన ఆరాధ్యులు.. అభిమాన తారలాయె. ఈ గుట్కాలు తిని క్యాన్సర్లొచ్చి జనాలు సచ్చిపోయి కుటుంబాలు ఆగమైతుంటే మాత్రం సప్పుడు చేయకుండా తమాషా చూస్తుంటాం. "ఏంరా వారీ.. పైసల కోసం గుట్కాలు తినమని ప్రచారం చేస్తున్నవ్.. ఎంతమంది పిల్లలు వీటికి బానిసలై ఆగమైపోతుండ్రో నీకు తెలుసా" అని ప్రశ్నించం. ఒకవేళ ప్రశ్నించినా మనదే తప్పుగా చూపించి నోరు మూయిస్తాడు వాడు. పేదోడి మీద లేచే నోర్లు పెద్దోడి మీద లేస్తయా అనేదే సూటి ప్రశ్న.
పాలు ఎలా వస్తున్నాయో తెలుసా.?
కోవా గురించి కోకొల్లలుగా మాట్లాడుతున్న మనకు అసలు మార్కెట్లోకి పాలు ఎలా వస్తున్నాయో తెలుసా.? అన్నం లేకపోయినా పర్వాలేదు గ్లాసెడు పాలు తాగితే చాలు ఎనర్జీకి ఎనర్జీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తాయి అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బర్లకు.. ఆవులకు గడ్డి పెడతలేరు జనాలు. ఒకవేళ పెట్టినా ఆ గడ్డి కూడా రసాయనాలు చల్లి పెంచిందే అయుంటుంది. ఒకసారి ఊర్లలోకి వెళ్లి చూడండి. పాలిచ్చే బర్లు.. ఆవులకు గడ్డికి బదులు బీరు పిప్పి పెడుతున్నారు. హాస్టళ్లు.. హోటల్స్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని తినిపిస్తున్నారు. పందులు కూడా తినడానికి ఆసక్తి చూపించని ఫుడ్ అది. దానిని బర్లు.. ఆవులు తిని పాలిస్తే వాటిని మురుసుకుంటూ తాగుతాం. పాలే కల్తీ అయినప్పుడు కోవా ఎలా స్వచ్ఛమైంది ఉంటుందో ఆలోచించాలి కదా.?
ఇలాంటి వాళ్లమీదా మన ప్రతాపం.?
మీ టూత్ పేస్టులో ఉప్పుందా.? పప్పుందా అంటూ బాత్రూం డోర్లు పగలగొట్టి మూతిలో మైకు పెట్టేవాళ్లు ఎంత మోసం చేసినా మనకు అవసరం లేదు. పేరుమోసిన స్వీట్ షాపులు.. బేకరీల్లో మిఠాయిల్లో కల్తీ ఉన్నా.. కేకులు.. మోడర్న్ బ్రెడ్లు నాసిరకంగా తయారైనా పట్టింపు ఉండదు. చిల్లర దుకాణాలపై ఆధారపడి ఐదు.. పది ఆశించేవాళ్లు కనిపిస్తే చాలు ఇచ్చులు కచ్చకాయలు అడిగి కంపు కాంట్రవర్సీ చేస్తుంటాం. పొద్దంతా కష్టపడి రాత్రికి ఇంటికి చేరుకోగానే.. "బియ్యం.. కూరగాయలు తెచ్చాడేమో" అనీ భార్య.. "స్కూల్ ఫీజు కడితే రేపట్నుంచి స్కూలుకు వెళ్లొచ్చు" ఆశగా చూసే పిల్లలు.. "ఇయ్యాలైనా మందులు తెచ్చిండో" అని మంచమ్మీద పండుకున్న తల్లి దీనంగా చూసే పరిస్థితులుంటాయి. అలాంటి వాళ్లమీదనా మన ప్రతాపం.?
జడ్జిమెంట్ మనమే ఇస్తే ఎలా.?
దేశం పెట్టుబడిదారుల చేతిలో బంధీ అయిపోతున్నా నోరు తెరవం. బడా సంస్థలు బజార్లో నిట్ట నిలువునా మనల్ని మోసం చేస్తున్నా ప్రశ్నించం. గొప్ప బ్రాండ్స్ అని చెప్పుకుంటున్న ఉత్పత్తులదంతా ఉత్త ప్రచారమే అని తెలిసినా నిలదీయం. కలుషిత పదార్థాలతో కల్తీ వ్యాపారం చేస్తున్నవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడం. దేశంలో దొంగలపడి దోచుకుంటున్నా చూడనట్లు వ్యవహరిస్తాం. కానీ బన్నులు అమ్ముకునే బక్కచిక్కిన వాళ్లమీద అగ్గిబరాటలు ఎగిరేస్తాం. అల్పజీవులు చేస్తే అది కల్తీ.. బడా బాబులు చేస్తే అది దేశ సేవనా.? కల్తీ ఎవ్వరు చేసినా.. మోసం ఎవ్వరు చేసినా తప్పే. దీంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. కానీ అయినవాళ్లది అమృతం.. కానివాళ్లదైతే విషం అనే విధంగా ఉండొద్దు. కల్తీ అనిపిస్తే ఫిర్యాదు చేయాలి. నిర్ధారణ అయితే శిక్షించాలి. కానీ మనమే జడ్జిమెంట్ ఇవ్వొద్దు కదా.?
ఎందుకు సాధ్యం కాదు: రేగుంట రాజేశ్వర్, నిర్మల్
పొట్ట కూటికోసం కోవా బన్ను అమ్ముతున్న వ్యక్తిని నిలదీసినంత ఈజీగా.. ధైర్యంగా మన పొట్టగొడుతున్న నయా మోసగాళ్లను నిలదీయరు మనవాళ్లు. ప్రతీసారి ఏదో ఒక సాకు చూపించి పేదొళ్లను టార్గెట్ చేస్తుంటారు. కల్తీపైనే పోరాటం చేయాలనుకుంటే కార్పొరేట్ కల్తీపై ఒక్కమాట మాట్లాడరేం.? ఊ అంటే పది రూపాయలకే కోవా బన్ను ఎలా అమ్ముతారు అని అంటున్నారు. రూ.99కే ఎకరం భూమి పంచిపెట్టడం సాధ్యమైనప్పుడు రూ.10కే కోవా బన్ను లభించడం ఎందుకు సాధ్యం కాదు.?
అసలును వదిలేద్దామా.?: నజీర్ మహ్మద్, హైదరాబాద్
దేశంలో అతిపెద్ద సమస్య కోవా అనేలా చిత్రీకరిస్తున్నారు కొందరు. అంతకన్నా పెద్ద సమస్యలేం లేవా.? ఎందుకు అంత చిన్నదాన్ని బూతద్దంలో పెట్టి చూడటం.? చలో అందరమూ కదులుదాం.. అన్ని కల్తీల గురించి.. మోసాల గురించి మాట్లాడదాం. రాజకీయం కోసమో.. వ్యక్తిగత ప్రయోజనం కోసమో అక్కడేం లేకున్నా పెద్దగా చూపించి జనాలను తప్పుదారి పట్టిస్తూ ఎంతకాలం రాజకీయం చేస్తారు.? అసలు మోసమేంటో తెలుసుకోకుండా వాట్సప్ యూనివర్సిటీ చెప్పే పాఠాలు నమ్ముతూ పోతే దేశం మునగడం ఖాయం.
వాళ్లను అడగలేదేం.?: ధాము నర్మాల, కరీంనగర్
ఏది మోసం.? పది రూపాయలకే కోవా బన్‌ను ఇస్తున్నతడిదా.? అదే కోవా బన్నును.. బన్ మస్కా పేరుతో వంద రూపాయలకు ఇస్తున్నవాళ్లదా.? బన్ మస్కా రేట్ ఎక్కువ.. ఇంకా అది పెద్దొళ్ల దుకాణ్లలో దొరుకుతుంది కాబట్టీ అది నాణ్యమైందన్నట్టు. పేదోడు.. పేదోడి కడుపు సల్లబరిచేందుకు అమ్మే కోవా బన్ను కల్తీ అన్నట్టు. ఇదేనా నీతి.? కోవా బన్నును పది రూపాయలకే ఎట్లమ్ముతున్నవని అడుగుతున్నారు కదా.? మరి అక్కడే లీటర్ నీళ్లు యాభై రూపాయలకు అమ్ముతుంటే అడగలేదేం.?






