పైలం గురూ.. సంక్రాంతికి వస్తున్నాం.!

by Daayi Srishailam |

పండగను ప్రయాసగా మార్చి సంక్రాంతిలో సందడి లేకుండా చేయొద్దు

పైలం గురూ.. సంక్రాంతికి వస్తున్నాం.!
X

దిశ, ఫీచర్స్: పండగంటే ఇంటిల్లిపాది ఇష్టంగా చేసుకునే సంబరం. కష్టాలు.. నష్టాలు ఎన్నున్నా పండగపూటైతే నిమ్మళంగా ఉండాలనుకుంటారు. కానీ.. కొందరు ఆ సంబరాన్ని సమస్యగా మారుస్తుంటారు. ఆతిథ్యానికి భంగం కలిగించి మర్యాదకు మాట తీసుకొస్తుంటారు. వెళ్లామా.? తిన్నామా.? వచ్చామా.? అని కాకుండా పండగను ప్రయాసగా మార్చి సంక్రాంతిలో సందడి లేకుండా చేస్తుంటారు.

బంధువులే కానక్కర్లేదు..

పవన్ కల్యాణ్ ఒక మాటన్నాడు. "సంక్రాంతికి వచ్చేవాళ్లు ఆంధ్రాప్రాంత ప్రేమను తీసుకెళ్లండి.. గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని పొందండి" అనీ. ఎక్కడెక్కడి నుంచో ప్రతీయేట లక్షలాది మంది సంక్రాంతి సంబరాలకు ఆంధ్రాకెళ్తుంటారు. గోదావరి పచ్చదనాన్ని.. కోనసీమ అందాల్ని చూసి తరిస్తారు. మామూలుగా అయితే పండగలు ఫ్యామిలీ మెంబర్స్.. చుట్టాలు కలిసి చేసుకుంటారు. కానీ ఆంధ్రా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వారి ఆతిథ్యం పొందాలంటే కుటుంబ సభ్యులే అయుండాల్సిన అవసరం లేదు. బంధువుల జాబితాలోనే ఉండాల్సినక్కర్లేదు. "తెలిసినవాళ్ల తెలిసినవాళ్లకు తెలిసినవాళ్లు" అయితే సరిపోతుంది. అంటే ఆతిథ్యమిచ్చే వారికి.. దానిని పుచ్చుకునేవారికి అప్పటి వరకు ఎలాంటి రిలేషన్‌షిప్.. కనెక్షన్ ఉండదు. అయినా కూడా ఆత్మీయ ఆతిథ్యం పొందుతారు.

పదిరోజుల ముందే టీమ్ రెడీ..

దసరా పండక్కి మామూలుగా ఎవరినోట విన్నా "పండక్కి ఏం చేస్తుండ్రు"? అనేమాట వినిపిస్తుంది. అదే సంక్రాంతికైతే "ఎటువోతుండ్రు"? అనే పలకరింపులు వినిపిస్తుంటాయి. అంటే సంక్రాంతికి ఇంటి పట్టున ఉండక ఎటైనా టూర్ వెళ్లాలని మెజార్టీ పబ్లిక్ ఆలోచిస్తుంటారు. అలా సంక్రాంతికి టూరింగ్ వెళ్లే ప్రాంతాల్లో టాప్ ప్రయారిటీ ఆంధ్రాదే. ఇక యూత్ అయితే చెప్పనక్కర్లేదు. సంక్రాంతి సంబరాలను ఆంధ్రాలో జరుపుకోవడం ఒక ట్రెండ్‌గా భావిస్తోంది. అందుకే ప్రతీ సంవత్సరం బ్యాచులు బ్యాచులుగా ఆంధ్రా వెళ్తుంటారు. నూతన సంవత్సర వేడుకలు ముగియగానే సంక్రాంతి ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంటారు. పండగకు వారం.. పదిరోజుల ముందే టీమ్ రెడీ చేసుకొని మిగతా ఏర్పాట్ల కోసం ప్రణాళిక వేసుకుంటుంటారు. జాబితాను సిద్ధం చేసుకుంటారు.

సంబరాలను మిస్ కావొద్దంతే..

సంక్రాంతికి ఆంధ్రాకు పోవాలన్న ఆత్రంలో కొందరు మిగతా పనులన్నింటినీ పక్కకు పెడతారు. ఎగ్జామ్స్ ఉన్నా లైట్ తీసుకుంటారు. జాబ్ చేసేవాళ్లయితే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే గడువు సమీపిస్తున్నా "తర్వాత చేద్దాంలే" అని లీవ్ తీసుకునే ఛాన్సే లేనిచోట కాళ్లావేళ్లాపడి లీవ్ సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్లో పనిచేసేవాళ్లు స్పెషల్ లీవ్ తీసుకొని "ఛలో ఆంధ్రా" అంటుంటారు. ఇక పెండ్లయిన వాళ్లయితే పిల్లల్ని.. భార్యను ఎలాగోలా ఒప్పించి రంగానికి సిద్ధమవుతుంటారు. మరీ అంత ఇబ్బంది అనుకుంటే భార్యను పుట్టింటికి పంపించైనా సరే ఆ సంక్రాంతి సంబరాలను మిస్ చేసుకోవద్దనుకుంటారు. పైగా "ఎంజాయ్ ఇప్పుడు చెయ్యకుంటే ఇంకెప్పుడు చేస్తాం" అని ఇంకొర్ని మోటివేట్ చేస్తుంటారు. ప్రతీ ఊర్లో ఇలాంటి సందడి కనిపిస్తుంటుంది.

పెండ్లి కంటే ఎక్కువ హడావిడి..

కొత్త బ్యాచ్ ఒకటుంటుంది. వాళ్లు ఇంతకుముందెప్పుడూ ఆంధ్రాకు.. సంక్రాంతి సంబరాలకు వెళ్లి ఉండరు. ఇంటి పక్కవాళ్లో లేదా ఫ్రెండ్సో.. రిలేటివ్సో ప్రతీ సంవత్సరం వెళ్తుంటే చూసీ వీళ్లకూ బుద్ధి పుడుతుంది. వాస్తవానికి అక్కడికెళ్లి ఏంచేయాలో.. అసలక్కడ ఏముంటాయో కూడా వాళ్లకు తెలియదు. కానీ వెళ్లాలనుకుంటారు. ఏదో ఒకటిచేసి ఇంట్లోవాళ్లను ఒప్పిస్తారు. క్రికెట్ జట్టులెక్క పది పన్నెండు మంది తయారవుతారు. ఫస్ట్ టైం గోవాకు పోయేవాళ్లు ఎగిరి గంతేస్తారు. చంద్రమండలానికి పోతున్నట్టు ఫీలయ్యి ఊరంతా డప్పు కొడతారు. వెళ్లడానికి మూడు నాలుగు రోజుల నుంచి వాట్సప్ స్టేటస్‌లు.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు పెడుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. బహుశా పెండ్లికి కూడా ఇంత హడావిడి చేయరు కావచ్చు.

నెలల తరబడి ఎదురుచూపులెందుకో.?

"సంక్రాంతికి వస్తున్నాం" అని అంత హడావిడి చేస్తారు కదా.? నిజంగా వాళ్లంతా ఆంధ్రాకు పోయేది ఎందుకు అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. "కోడి పందాలు" చూడటానికే అని 90శాతం మంది చెప్తుంటారు. వాళ్లన్నట్టు కోడి పందాలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించలేం. ఎన్నో యేండ్ల నుంచి అదొక సంప్రదాయంగా కొనసాగుతోంది. అధికారికంగా ఈ పోటీలను నిర్వహించకపోయినా ఒకరకంగా ఇది లాంఛనమే. చిన్నా పెద్దా.. పేద ధనిక అందరూ ఈ కోడి పందాలను ఆస్వాదిస్తారు. నెలల తరబడి వీటి కోసం ఎదురుచూస్తుంటారు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. వచ్చేవాళ్లకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు నిర్వహకులు. కోడి పందాలే ఆదాయ వనరుగా ఆధారపడి వుండేవాళ్లు కూడా కొందరుంటారు.

భారాన్ని తలపై వేసుకొని వెళ్లాలా.?

సంక్రాంతి సంబరాలు.. కోడిపందాలు ఇంతవరకు బాగానే ఉన్నా వాటి వెనక కూడా కొన్ని బాధ్యతలు.. బరువులు.. సమస్యలు.. సాదకబాధకాలు ఉంటాయి. ఇప్పుడు మనొళ్లు జట్లు జట్లుగా కాకినాడ.. కోనసీమ.. అమలాపురం.. ముమ్మిడివరం.. మురమళ్ల.. కొత్తపేట.. భీమవరం.. తాడేపల్లిగూడెం.. తణుకు.. నరసాపురం.. పాలకొల్లు.. ఏలూరు.. కృష్ణా.. గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అంతదూరం వెళ్లాలంటే ఊకెనే ఐతుందా.? ఒకొక్కరికి ఎంతలేదన్నా తక్కువలో తక్కువ పదివేల రూపాయలు అవుతుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులే అంతంతమాత్రం. కానీ మనొళ్లు ఇంట్లో వాళ్లపై ఒత్తిడి చేసి.. లేదా అప్పు తీసుకొని.. చేతి బదుళ్లు అడుక్కొని వెళ్తుంటారు. ఆఫీసులు.. డ్యూటీలు బంకు కొట్టి భారాన్ని తలపై వేసుకొని పోతారు.

అందరూ ఉన్నొళ్లే ఉండరు కదా.?

సంక్రాంతి సరదా.. గోదావరి అందాలను ఆస్వాదించడానికి వెళ్లారే అనుకుందాం. కానీ పోయిన జాగల్నే ఉండే రకం కాదుకదా మనొళ్లు. కోస్తాంధ్ర మొత్తం గుత్తకు పట్టినట్లు అన్నీ చుట్టేస్తారు. ఇంటి దగ్గర్నుంచి బయల్దేరినప్పటి నుంచి మళ్లీ ఇంటికి తిరిగొచ్చేదాక మధ్య మధ్యలో సిట్టింగేసి చిల్ అవుతారు. ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండగ కాబట్టీ ఎవరికి ఉన్నంతలో వాళ్లు సంతోషంగా పండగ చేసుకుంటారు. మర్యాద కొద్దీ ఆహ్వానిస్తే ఎనకాల ఎనభై తోకలను వెంట తీసుకొని వెళ్తాడు. అందరూ ఉన్నొళ్లే ఉండరు కదా.? పాపం.. వాళ్లు ఉప్పిడి ఉంటారో ఉపాసముంటారో.. పండగైనా తృప్తిగా జరుపుకుందామని అనుకుంటే వీళ్లు వెళ్లి నానా హంగామా చేస్తారు. పండగపూట ఇల్లుజొచ్చుకొని వచ్చినవాళ్లను ఉత్తగ పంపియ్యరు కదా.. తీరొక్క మర్యాద చేసి పంపిస్తారు.

మర్యాద కొద్దీ పిలిస్తే..

సంతోషాల పండగను భారంగా జరుపుకోవాల్సి వస్తుందని ఏ మాత్రం ఆలోచించరు అతిథులు. తీరొక్క రకాల వంటకాలు చేస్తే తిని బ్రేవ్‌మంటారు. అలా అని వారు ఆతిథ్యమిచ్చిన వాళ్లకు అంతగా కావాల్సిన చుట్టాలేం కాదు. ఆ పది మందిలో ఎవరో ఒకరికి మ్యూచువల్ ఫ్రెండ్ అయుంటారు. మర్యాద కొద్దీ పిలిస్తే ఎవరినైతే పిలిచారో వాళ్లే వెళ్లాలి. మరీ ఒక్కరమేం వెళ్తామనిపిస్తే తనతో ఇంకో ఒకర్నో.. ఇద్దర్నో తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఆతిథ్యమిచ్చిన వాళ్లకు పండగపూట అతిథులకు ఏమి లోటు లేకుండా చూసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. వెళ్లినవాళ్లకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అలా కాకుండా మందకు మందనే పోతే ఆతిథ్యమెలా ఇవ్వాలి.? మర్యాద ఏం చేయాలి.? వచ్చినవాళ్లకు దేవుడెరుగు ఇంట్లోవాళ్లను కూడా చూసుకోకుండా లూటీ పోతుంది.

పండగ వాతావరణం చెడగొట్టొద్దు..

ఆతిథ్యమిచ్చే అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుందా అని అంటే.. అందరిదీ ఇలాగే ఉండకపోవచ్చు కానీ.. ఎంతచెట్టుకూ అంతేగాలి అన్నట్టు ఎవరికుండే సమస్యలు వాళ్లకుంటాయి. శృతి మించితే ఎవరకైనా సమస్యే కదా.? అందుకే అతిథిగా వెళ్లినా.. ఆహ్వానం మేరకు వెళ్లినా ఒకరింటి పరిస్థితి గురించి తెలుసుకుంటే మంచిది. అంతేకదా అనీ గోదారొళ్ల మర్యాద అనిచెప్పి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు. ఈ రోజుల్లో చిన్నపాటి సండేకే వెయ్యి రూపాయలు అవుతున్నాయి. అలాంటిది పండగంటే ఉత్తగవుతుందా.? పండగకు ముందు ఎలా ఉన్నారో.. పండగ తర్వాత కూడా అట్లనే ఉంటే ఆహ్వానించినొళ్లకు.. అతిథులుగా వచ్చినొళ్లకు ఇద్దరికీ సంతృప్తిగా ఉంటుంది. అందుకే మన ఎంజాయ్ కోసం పండగ వాతావరణాన్ని చెడగొట్టొద్దు ఎవరైనా.

ఎంతసేపూ చిల్ అవ్వాలనే ధ్యాసేనా.?

పోయేది సంక్రాంతి పండుగకు. కానీ మనొళ్లు ప్రత్యక్షమయ్యేది ఎక్కడంటే జూదాలు.. పేకాట.. కోడి పందాల స్థావరాల దగ్గర. నిజంగా సంక్రాంతిని ఆస్వాదిద్దామనే ఆలోచనే ఉంటే అంతకన్నా గ్రాండ్‌గా బోగిమంటలు జరుగుతాయి. అక్కడ కనిపిస్తారా ఎవరైనా.? బూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. కోడి పందాలు చూడొచ్చు.. నాటుకోడి పులుసు తినొచ్చు.. నానా రకాల రుచులు ఆస్వాదించొచ్చన్న భావనతోనే ఉంటారు. లేకపోతే అంత రిస్క్ ఎందుకు చేస్తారు.? వద్దని వారించినా వినకుండా ఎందుకు పరుగులు తీస్తారు.? బోగి మంటలు తిలకించేందుకు అంతగా తంటాలు పడే బాపతు కదా. బయల్దేరేటప్పుడు మనసులో చిల్ అవ్వాలనే ధ్యాస పెట్టుకుంటారు. పైసలెంతైనా పర్వాలేదు.. ఎప్పుడు మర్చిపోనంత ఎంజాయ్ చేయాలని వందకు వందశాతం న్యాయం చేస్తారు.

ఆతిథ్యమంటే జడుసుకునే పరిస్ధితి..

కోస్తాంధ్ర కోడి పందాల క్రేజ్ ఏందోగానీ వ్యయ.. ప్రయాసల్ని లెక్కచేయకుండా వెళ్తుంటారు. ఇంకా స్టయిలిష్‌గా వెళ్లాలనే థీమ్ ఒకటి. ఏంచక్కా పంచకట్టుతో.. రేబాన్ కళ్లజోడు పెట్టుకొని వెళ్తారు. రిచ్ లుక్ ఉండాలని మంచి కార్ ఒకటి కిరాయికి తీసుకుంటారు. ఇవన్నీ ఒకెత్తు అక్కడి ఎంజాయ్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ఒక రెంటల్ హెచ్డీ కెమెరా. తక్కువ అవుతుందా ఖర్చు. వెళ్లినవాళ్లకు ఇంతగా ఖర్చవుతుందీ అంటే.. ఇక ఆతిథ్యమిచ్చే వాళ్లకు తడిసిమోపెడు అవుతుంది. పాపం.. మళ్లీ ఆతిథ్యమంటే జడుసుకునే పరిస్థితి. ఏదో మొహమాటానికి పర్లేదు అంటుంటారుగానీ.. జట్లు జట్లువొయ్యి జల్సా చేస్తే భరించడం ఎవరివల్ల అవుతుంది. సో.. ప్లాన్ లేకుండా అంగట్లో అమ్మయ్య అని నోరు తెరుచుకొని వెళ్తే ఇద్దరికీ ఇబ్బందే.. చెప్పుకోరాని అసౌకర్యమే.

రాంగ్ ఇండికేషన్ వద్దు..

నిజంగానే కోనసీమ అందాల్ని.. కొబ్బరి తోటల్ని.. కోడి పందాల రాజసాన్ని.. గోదారొళ్ల ఆతిథ్యాన్ని స్వీకరించేందుకే సంక్రాంతికి వెళ్తే మాత్రం ఒక ప్లా‌న్‌తో వెళ్లాలి. ఒక పద్ధతిని అలవర్చుకోవాలి. ఎంతవుతుందో ఎస్టిమేట్ వేసుకోవాలి. ఆతిథ్యమిచ్చే వాళ్లను అసౌకర్యానికి గురిచేయొద్దు. కోడి పందాలే కాదు.. ఉభయ గోదారి జిల్లాల్లో చూడాల్సిన అందాలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ఆస్వాదించాలి. పవన్ కల్యాణ్ అన్నట్టు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లేలా.. గోదారొళ్ల ఆతిథ్యాన్ని ఆనందించేలా ఉండాలి. ఆద్యంతం ఆనందంగా సాగే పండగలో భాగమవ్వాలి. సంక్రాంతి అంటే పేకాట.. జూదం.. అనే రాంగ్ ఇండికేషన్ ఇచ్చేలా చేయొద్దు. సంస్కృతి మూలాలను పరిరక్షిస్తూ.. సాంప్రదాయంలో భాగమవుతూ బహుముచ్చటగా ఎంజాయ్ చేయాలి.

మాట మర్యాదకు హ్యాట్సప్: నవీష్, జగిత్యాల

చాలామంది కోడి పందాల కోసమే వెళ్తుంటారు. కానీ నేను అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్తాను. 2018 నుంచి ప్రతి సంక్రాంతి ఆంధ్రాలో జరుపుకోవడం అలవాటుగా మారింది. రెండుసార్లు మినహా ప్రతిసారి ఒక్కణ్నే వెళ్లాను. అక్కడివాళ్ల మాటా మర్యాద.. పచ్చదనం.. పండగ వాతావరణం.. ఆతిథ్యం.. ఫుడ్.. కోళ్ల పందాలు.. కనుమ జాతర అంటే రికార్డింగ్ డాన్సులు.. ఎన్నెన్నో నన్ను ప్రతిసారీ మొదటిసారే అన్నట్టు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గత సంవత్సరం పెళ్లయింది ఇద్దరం కలిసి వెళ్లాం. ఈసారి వెళ్దామంటే పాప 4నెలలే ఉంది కాబట్టి వీలఅయ్యేలా లేదు. వచ్చే యేడు ముగ్గురం కలిసి వెళ్లి రెండేళ్లకు సరిపడా ఎంజాయ్ చేసొస్తాం.

ఫస్ట్ టైం వెళ్దామనుకుంటున్నా: నవీన్, బీఫార్మసీ స్టూడెంట్

నేను ఇప్పటివరకు సంక్రాంతికి ఆంధ్రా వెళ్లలేదు. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తుంటారు. వెళ్లి వచ్చాక చాలా గొప్పగా చెప్తుంటారు. అక్కడి తిని.. తిరిగి ఎంజాయ్ చేయడానికి కాకుండా సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన సంక్రాంతి పండుగను ఆస్వాదిద్దామనే ఆలోచనతో ఈసారి వెళ్దామనుకుంటున్నా. కోనసీమ అందాలు.. కోళ్ల పందాల కథేందో తెలుసుకుంటా.

పవన్ పిలుపుతో: తరుణ్ తేజ్ యాదవ్, టాటా ఏరోస్పేస్ ఉద్యోగి

నాకు పవన్ కల్యాణ్ అంటే అభిమానం. ఆయన పిలుపునిచ్చినట్లు ఆంధ్రా ప్రేమను ఆస్వాదించడానికి ఈసారి సంక్రాంతికి వెళ్తున్నా. పోయినసారే వెళ్దామనుకున్నా. కానీ ఆఫీసులో లీవ్ దొరక్క వెళ్లలేదు. కానీ ఈసారి ముందుగానే ప్లాన్ చేసి పక్కా ప్రణాళికతో వెళ్తున్నాం. బీమవరం.. కాకినాడ.. కోనసీమ.. అమలాపురం.. పాలకొల్లు చుట్టేయాలని పెద్ద ప్లానే వేసుకొని పక్కా బడ్జెట్ టూర్ ప్లాన్ చేసుకున్నాం.

Next Story