ఓటరు మహాశయులా.. కోటరు మహాశయులా.?

by Daayi Srishailam |

పైసల్లేకుండా ఓటేసే పరిస్థితే లేదా.?

ఓటరు మహాశయులా.. కోటరు మహాశయులా.?
X

దిశ, ఫీచర్స్: ఊర్లళ్ల ఓట్ల బాగోతం నడుస్తోంది. ఐదారేళ్లుగా ఏనాడు కనిపించని వాళ్లు పొద్దున ఆరింటికే తలుపు తడుతున్నారు. అన్నా.. అక్కా.. అమ్మా అని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏనాడూ సింగిల్ చాయ్ తాపించనోడు పొద్దున పదింటికే కోటర్ చేతిలపెడుతున్నాడు. లంచ్ టైంకి చికెన్ బిర్యానీ తిందురా అని పిలుస్తున్నాడు. గెలిచినంక ఏం చేయాలో వాళ్లు క్లారిటీతోనే ఉన్నారు. క్లారిటీ లేనిదల్లా మనకే. ఐనా.. అవన్నీ మనకెందుకు.? మనకు నోటు.. కోటరిస్తే చాలంతే.!

ఎన్నికలప్పుడే గుర్తుకొస్తామా.?

ఓట్ల పండుగొచ్చినప్పుడు లీడర్లకు ఊరు గుర్తుకొస్తుంది. ఊర్లో ఉండే ప్రజలు గుర్తుకొస్తారు. వాళ్ల సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ.. ఊర్లో ఉండే మనకు మాత్రం అవేవీ గుర్తుకురావు. ఓట్లేసే నాటికి మనకు నోటు గుర్తుకొస్తుంది. లీడరు ఆశచూపించే బిస్కెట్లు గుర్తుకొస్తాయి. అప్పటికప్పుడు ఓటుకు ఓ వెయ్యి రూపాయలిస్తే చాలు. అవి తీసుకొని ఓటేస్తాం. మిగతావన్నీ మర్చిపోతాం. ఐదేండ్లలో మన ఊరిదిక్కు.. వాడదిక్కు కన్నెత్తికూడా చూడనివాడు ఇప్పుడొచ్చి "అన్నా నమస్తే" అనగానే సల్లవడుతుంది మనకు. "మీ ఓటు నాకే ఎయ్యాలె సూడన్నా" అని అడిగిందే ఆలస్యం ఉబ్బితబ్బిపోయి "నీగ్గాకపోతే ఇంకెవరికేస్త" అని అనేస్తాడు. "ఇంతకుముందు గెలిచినొళ్లు ఏం చేసిండ్రు.? ఇప్పుడు నువ్వేం చేస్తవ్.? ఓట్లప్పుడు తప్ప ఇంకెప్పుడూ యాదికి రామా" అని అడిగిన పాపాన పోము.

కోటర్‌కు అమ్ముడు పోవుడేనా.?

"ఓటు వజ్రాయుధం".. "ఓటుతోనే బుద్ధిచెప్తాం" అనే మాటలు స్టేట్మెంట్లు ఇవ్వడానికే పనికొస్తయి. ఆ మాటల్ని ప్రాక్టికల్‌గా ఉపయోగించిన పాపాన పోయినమా ఏనాడైనా.? నిజంగానే మనం ఓటు వజ్రాయుధం అనుకుంటే.. కోట్ల రూపాయలు బ్యాగులో పెట్టుకొని నాయకుడు అనేవాడు ఎట్లొస్తడు ఊర్లకు.? సాయానికి పోతే సాయమాన్ల నిలబెట్టే మాట్లాడేటోడు ఇప్పుడు కోటి రూపాయలు ఖర్చు చేస్తుండు అంటే అది మనకోసమా.? వాళ్ల ధనార్జన కోసమా అనేది కనీసం ఆలోచన చెయ్యం. మనకెంతసేపూ వాళ్లిచ్చే నోటు మీదనే ధ్యాస ఉంటుంది. తాటాకు ఇచ్చి ఈతాకు దొబ్బడానికే వాళ్లు వస్తున్నారని గ్రహించే స్థితిలో ఉండం. ఎందుకంటే అప్పటికే కోటర్ పంపే ఉంటాడు.. ఆ నిషాలో ఉంటాం కాబట్టీ.. ఇంకా వేరే ఆలోచనేదీ రాదు. వచ్చినా పట్టించుకోం.

ఓటు విలువ తెలియకపోతే ఎలా.?

మన ఫ్యామిలీ మెంబర్ కాదు. కనీసం తోక సుట్టం కూడా కాదు. ఏ నాడూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేసింది కూడా లేదు. అయినా మనకు అన్నింటికీ భరోసా కల్పిస్తున్నాడు. అన్నింటికి నేనున్నా అంటున్నాడు. పుట్టింటి ఆడబిడ్డకు ఏనాడూ ఒక చీరపెట్టనోడు కూడ ఓట్ల కోసం ఊర్లో ఉన్న ఆడొళ్లందరికీ చీరలు పంచుతున్నాడు. యువతకు ఆట సామాన్లు ఇప్పిస్తున్నాడు. పోతుంటే తొవ్వల ఎవడన్నా చిన్న పిలగాడు కనిపిస్తే వాని ముక్కు తుడుస్తున్నాడు. ముడ్డి కడుగుతున్నాడు. ఇంట్లోకి ఏమేం కావాలో తెలుసుకొని తెచ్చిపెడుతున్నాడు. మీదికెల్లి "మీరంతా నావాళ్లు.. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి" అనే కొటేషన్లు కొడుతున్నాడు. ఓటు విలువ ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టే కాకాబట్టి కతలు పడుతున్నారు. కానీ.. ఆ ఓటు విలువ దాన్ని వేసే మనకే తెల్వకపాయె.

సోయితో పనిచేస్తే చాలు..

సర్పంచ్ ఎన్నికల పనుల్లో బిజీ అయిపోయి ఒకొక్కరు పొద్దున లేచి బయట పడుతున్నారు. రాత్రి పన్నెండు దాటితేగానీ ఇంటికి రావడం లేదు. పైగా ఊగుతూ తూగుతూ. అయ్యో పిల్లలెలా ఉన్నారు.? భార్య ఎలా ఉంది.? కనీసం తిన్నారా.? అనే సోయి ఏదీ ఉండదు. అలా అడిగితే "మీరు వేస్టు.. ఆ లీడరే నయం. పొద్దటి నుంచి తాగిపిస్తూ తినిపిస్తూ సొంత మనిషిని చూసుకున్నట్లు చూసుకుండు" అని తాగు పోయించినోన్ని పొద్దంతా పొగుడుతాడు. దానివల్ల తనకు టైం వేస్టవుతుంది.. పని కరాబైతుంది.. ఆరోగ్యం ఆగమైతుందని ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. ఎందుకంటే వచ్చేటప్పుడు వాడో వీడో ఇచ్చిన వందనో రెండు వందల నోట్లు జేబులో పెట్టుకొని వస్తడు కదా.? అదే తన సంపాదన.. కష్టంలేకుండా పైసలొస్తున్నయి కదా అనుకుంటాడు.

వాళ్లు పెట్టేవి మన పైసలు కాదా.?

చదువుకోని వాళ్లు.. ఎనకటి జమానా మనుషులంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. అన్నీ సదువుకున్న సన్నాసులే ఐదుకు.. పదికీ.. మందుకు.. విందుకూ అంగట్లో అమ్ముడు పోతున్నారు. జనాల్లో ఉన్న ఇంకో ఒక ఆలోచనేంటంటే.. "ఎవడెన్ని పైసలిచ్చినా తీసుకోవాలె. తాపిస్తే తాగాలె. వాడేమన్నా జేబులకెల్లి ఇస్తుండా. మన పైసలు మనకే పెడ్తుండుగా" అని అంటుంటారు. మన పైసలే వాళ్లు తింటున్నారనే సోయి ఉన్నప్పుడు మరి వాళ్లకు ఎందుకు గెలిపించుకోవడం అనేది మాత్రం ఆలోచించరు. సరే అట్లా ఒక్కడి దగ్గరే తీసుకుంటరా అంటే. లేదు.. అందరి దగ్గరా తీసుకుంటారు. అందరికీ హామీ ఇస్తారు. గెలిచినోడికేమో "పుణ్యానికేశిండ్రా.. పైసలు తీసుకోలేదా" అనే రుబాబు ఉంటది. ఓడిపోయినోడికేమో "పైసలు తీసుకొని కూడా ఓటెయ్యలేదు" అనే పగ పెరుగుతది.

గుడ్డిగా ఇంకెన్నాళ్లు ఓట్లేద్దాం.?

ఓటుకు ధర ఒక్కో ఊర్లో ఒక్కోలా ఉంటుంది. నాయకుడేసే గాళం కూడా ఒకొక్కరికి ఒక్కోలా ఉంటుంది. "నన్ను గెలిపిస్తే మీకు కమ్యునిటీ హాల్ కట్టిస్తా" అని ఒకాయన హామీ ఇస్తాడు. ఓటరెంత సెంటిమెంటల్ ఫూలో నాయకుడు అనేవాడికి తెలుసు కాబట్టీ "కుల సంఘం" కోసం బిల్డింగ్ కట్టిస్తా అని ఎరేస్తాడు. ప్రతీసారి ఒకడు ఇలాగే వచ్చి బొట్టుపెట్టుకొని హామీ ఇచ్చి పోతాడు. ఐదేళ్లలో కనీసం ఓ ఐదారుసార్లు కూడా అటువైపు వెళ్లడు. ఎవరైనా అడిగితే.. "మీవోడు ఒప్పుకుంటలేడుగా.. జాగకూడా నేనే ఇప్పియ్యాలంటే ఎట్లా" అని వాళ్లదాంట్ల వాళ్లకే లొల్లిపెట్టి పోతాడు. ఒకసారి అనుభవం అయ్యాక అలాంటి హామీ ఇచ్చెటొళ్లను తరిమికొట్టాలి. కానీ.. మళ్లీ అదే గుడ్డి నమ్మకం. గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు గుడ్డిగా ఓట్లేయడం మనకు అలవాటు.

ఊరెక్కడిది.. డెవలప్మెంట్ ఎక్కడిది.?

"యువత రాజకీయాల్లోకి రావాలి" అని ఎవరైనా అంటే ముందు వాణ్ని నాలుగు తన్నాలి. అగో.. అలా ఎందుకు అంటారా.? ఈజీ మనీకి అలవాటుపడ్డ యువత మాత్రమే రాజకీయాల్లోకి వస్తుంది. పది పదిహేనేండ్లు టైంపాస్ చేసి.. ఆన్‌లైన్ బెట్టింగ్.. క్రికెట్ బెట్టింగుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకొని.. ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి సర్పంచ్ పదవికో.. వార్డు మెంబర్‌కో పోటీ చేయడానికి వస్తుంటారు. ఓట్లను కొనేందుకు ఇంకా కొన్ని లక్షలు అప్పుచేస్తారు. అలాంటివాళ్లు గెలిచినంక వాళ్ల అప్పు తీర్చుకోవాలని చూస్తడా.? "నా ఊరు.. నా వార్డు" అని సేవ చేయాలి అనుకుంటడా.? ముందు చేసిన అప్పులు తీర్చడానికి.. ఆ తర్వాత అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే సరిపోతుంది. ఇక ఊరెక్కడిది.. డెవలప్మెంట్ ఎక్కడిది.?

మళ్లీ మళ్లీ ఎందుకు పోటీచేస్తారంటే..

ఒకసారి గెలిచాక.. రెండు మూడు పర్యాయాలు పదవులు అనుభవించాక కూడా మళ్లీ మళ్లీ ఎందుకు పోటీచేస్తారో మనం ఎప్పుడైనా గ్రహించామా.? వాళ్లకు మన ఊరే ఒక పాలిచ్చే బర్రెలాంటిది. దూడెకు సైతం వదలకుండా ఎలా పిండుకోవాలో బాగా తెలుసు వాళ్లకు. ఊర్లో ఎక్కడ సర్కారు జాగాలు ఉన్నాయి.? ఎన్ని కంపెనీలు ఉన్నాయి.? ఏయే ప్రైవేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తు్న్నాయి.? అనే లెక్కలేసుకుంటారు. ఒకసారేమో అక్రమ వెంచర్లకు అనుమతులిచ్చి లంచం తీసుకుంటారు. ఇంకోసారేమో అక్రమ వెంచర్లను బెదిరించి పైసలు డిమాండ్ చేస్తారు. కంపెనీలకు పర్మీషన్లు వాళ్లే ఇస్తరు. వాటి నుంచి ఊరుని కాపాడుతా అని వాళ్లే హామీ ఇస్తారు. కంపెనీల కాలుష్యానికి మనల్ని అడ్డంపెట్టి కమీషన్లు తెచ్చుకుంటారు. మనం ఓట్లప్పుడు ఇవేవైనా అడుగుతామా.?

మనకెందుకులే అనుకుంటే..

మంచోడు కాదు ముంచేటోడు అని తెలిసినా పోటీలుపడి ఓట్లు గుద్దుతాం. కానీ వాళ్లు చేసేదేంటి తెలుసా.? అన్నంపెట్టిన ఊరికే కన్నంపెడతారు. ఊళ్లో ఉన్న గడి జాగను.. బడి జాగను.. ఆఖరికి గుడి జాగను కూడా అమ్మేసేందుకు కుట్ర చేస్తుంటారు. తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. ఊరికోసమే అని మనల్ని నమ్మిస్తారు. మనకు ఇవేవీ అక్కర్లేదు కదా.? వాడేదో పిలుపునివ్వంగనే ఎగేసుకొని ఉరికి ఓటేసి మోసపోతాం. కనీసం అనుభవమొచ్చినంక అయినా "మోసపోయాం" అని ఒప్పుకోం. "ఎవడన్నా ఏమన్నా చేస్కోనీ.. మనకెందుకు.. మన పనేంటో మనం చేస్కుందాం" అనే చాతగాని డైలాగులు కొడతాం. మనమేసే ఒక్క తప్పుడు ఓటే ఊరునంతా ముంచేసి.. ఒక కుటుంబంలోని ముగ్గురు నలుగురికి ఉపాధి వనరవుతుందనే వాస్తవిక ఆలోచన చెయ్యనంత కాలం మోస పోతూనే ఉంటాం.

కాళ్లు మొక్కితే కరిగిపోవాలా.?

సెంటిమెంటల్ బ్లాక్‌మెయిలింగ్‌కు మనం పడిపోతాం అని ఎన్నికల్లో పోటీచేసేవాడికి బాగా తెలుసు. దానికోసం ఏంచేస్తాడో తెలుసా.? ఫస్ట్ ఇంటింటికీ తిరిగి కాళ్లు మొక్కుతాడు. "ఈ ఒక్కసారి ఎలాగైనా బయట పేడయుండ్రీ.. మీదే దయ" అని వేడుకుంటాడు. కాళ్లమీద పడగానే మన గుండె కరిగిపోయి బలమైన హామీ ఇస్తాం. మనం వేసేది కాకుండా ఇంకా పదిమందితో ఓట్లేయిస్తాం. "పాపం.. వాడు కాళ్లు మొక్కిండు. ఓటెంత దాని బిసాదెంత" అని కరుణామయుడి మాటలు మాట్లాడి కండ్లకు గంతలు కట్టుకొని గెలిపిస్తాం. గెలిచినంక ఏమైతుందో గ్రహించేంత ఆలోచనాపరులం కాదు కదా మనం. ఏదైనా సమస్య ఉందని వెళ్తే.. మనతో పదిసార్లు కాళ్లు మొక్కించుకునేంత పనిచేస్తారు. అప్పుడైనా గుర్తుపడతామా అంటే అదీ ఉండదు. ఏదో కత చెప్పంగనే ఐస్ అయిపోతం.

ఉత్త పుణ్యానికి ముంచేస్తున్నాం..

పోటీచేసే వాళ్లంతా ప్రజాసేవ కోసమే అయితే.. ఊరి బాగుకోసమే అయితే ఈ లక్షలు వెదజల్లడం దేనికీ.? సరే.. అదీపోనీ. "ఈ సారి గెలిపించకపోతే ఉరేసుకొని సచ్చిపోతా.. పురుగుల మందు తాగుతా.. నా పిల్లలు ఆగమైతే మీదే బాధ్యత" అని బరిలో దిగినవాళ్లు బరితెగించి బెదిరిస్తే ఎందుకు తన్ని తరిమెయ్యం.? "నిజంగనే ఓటెయ్యకపోతే వాడు సస్తడేమో" అని మన గురించి.. ఊరు గురించి కాకుండా.. బెదిరించి బరిలో దిగినవాడి గురించి ఆలోచిస్తాం. వాళ్లు ఊరికి ఏమైనా చేస్తరా.? కనీసం పావలావంతు ఫాయిదా అయినా ఉందా.? అని ఏదీ ఆలోచించకుండా ఉత్త బెదిరింపులకు బెదిరిపోయి ఊరిని ఉత్త పుణ్యానికి ముంచేస్తాం. చేజేతులా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాం. సమస్యలను గాలికొదిలేసేవాడిని ఏలుకొమ్మని ఊరిని వదిలేస్తాం.

అలాంటి వాళ్లను తరిమేయండి..

మరి ఓటు ఎవరికెయ్యాలి.. ఎవర్ని గెలిపించుకోవాలి.? పైసలిస్తా అనేటోడు కాకుండా పనులు చేసేవాడే లేడా.? కోటర్ కాదు.. ఊర్లో వాటర్ సమస్య రాకుండా చూసేవాడే లేడా.? పొంకనాలు కాదు.. పొల్యూషన్ లేని ఊరు ఎలా సాధ్యమో చెప్పేవాడే లేడా.? రోషాలు.. వేషాలు వేసెటోడు కాదు. రోడ్లు బాగు చేయించేవాడే లేడా.? అంగట్లో అమ్మేసేవాడిని కాదు.. ఊరును అద్దంలెక్క చేసెటోడు ఒక్కడు కూడా లేడా.? "నాకు ఓటేస్తే కోటరిస్తా.. మీటరిస్తా.. చికెన్ మటన్ పంచిపెడతా.. వేలమేస్తా.. బగోన్లు పంచుతా.. కిట్లిప్పిస్తా.. కులసంఘం భవనం కట్టిస్తా.. గుడి కట్టిస్తా అనేటోన్ని తన్ని తరిమేయండి. ఫోన్లో చక్రాలు తిప్పి ఊరికి వెన్నుపోటు పొడవడం కాదు.. ఊరుని.. ఓటును కాపాడుకోండి. మనల్ని తిప్పించుకునే వాడిని కాకుండా.. మనవెంట తిరిగేవాడిని గెలిపించండి.

డబ్బు అనే చెదలు: కృష్ణ కంబాలపల్లి, వోటా సీఈఓ

ప్రజా సమస్యల్ని.. ప్రజల్ని విస్మరించిన మహా నాయకులనే ఓడించిన చరిత్ర ఓటరుకు ఉంది. ఓటు శక్తేంటో తెలిసినవాళ్లు ఇప్పటికీ దాన్నొక ఆయుధంగా వాడుతూనే ఉన్నారు. ఐతే.. ఓటును బలహీన పరిచే సంప్రదాయం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ "మేం ఓట్లు అమ్ముకోం.. ఓట్లు కొనేందుకు మా ఇంటికి రావద్దు" అని బోర్డులు పెట్టుకునేవాళ్లూ ఉన్నారు. ఈ స్పృహ అందరికీ రావాలి. ఓటేయడమొక ఈవెంట్‌ కాదు.. దాని వెనకాల ఐదేళ్ల అభివృద్ది దాగివుందనే అవగాహన రావాలి. ఓటు అత్యంత శక్తివంతమైంది. అలాంటి ఓటుకు డబ్బు అనే చెదలు పట్టడం విషాదకరం.. విచారకరం.

ఊరిని తాకట్టు పెట్టడమే: నరేందర్ గోకవరపు, పొలిటికల్ లాబొరేటరీ, మేనేజింగ్ డైరెక్టర్

ఓటు కొనుగోలు ఒకరి తప్పు కాదు. ఇది ఒక వ్యవస్థాత్మక లోపం. నాయకులు డబ్బు పంచడం తప్పే.. కానీ ఓటర్లు కూడా ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్లు తమ ఊరి భవిష్యత్తునే తాకట్టు పెట్టడం మరింత ప్రమాదకరం. ఇది ఒక లావాదేవీ కాదు.. ఒక తరం అభివృద్ధిని పణంగా పెట్టిన నిర్ణయం. ఓటేసే దాకా నా వంతు తర్వాత వాళ్లే ఊరిని చూసుకుంటారని జనాలు అనుకుంటున్నారు. అభివృద్ధి అంటే కేవలం మనం చూపించే లెక్కలు కాదు. ఓటు ద్వారా మనం చేసే ఎంపికే నిజమైన అభివృద్ధికి పునాది. నైతిక రాజకీయాలు కేవలం స్లోగన్ కాదు. అది ప్రజలు.. నాయకులు కలిసి చేసుకునే ఒప్పందం.

నాయకులదే బాధ్యత: చేగొండి చంద్రశేఖర్ (చేగొ), యాక్టివిస్ట్

ఓట్ చోరీ అంటే ఇదే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కో వ్యవస్థను క్రమంగా బాగు చేసుకుంటూ మరింత పారదర్శకంగా.. బలోపేతంగా తీర్చిదిద్దుతున్న దశలో ఇలాంటి ఘటనలు హృదయవిదారకం. దీనిపై ప్రజల కంటే రాజకీయ నాయకులదే ఎక్కువ బాధ్యత ఉంది. వ్యవస్థల పవిత్రతను.. సమగ్రతను కాపాడుకోవడం.. వాటిని రక్షించడం పూర్తిగా వారి బాధ్యత. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని నాయకులు ఓటును దుర్వినియోగం చేయొద్దు. ఇలా చేస్తే వారు గౌరవం కోల్పోతారు. ఫలితంగా వ్యవస్థల మీదే నమ్మకం పోతుంది. వ్యవస్థల మీద నమ్మకం పోతే అవి దేశానికే అతి ప్రమాదకరం.!

Next Story