- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడప దాటొద్దు.. పొలిమేర వీడొద్దు.!
ఒకడు మనముందే పని ప్రారంభించి.. విజయవంతంగా చేస్తున్నప్పుడు.. మనమెందుకు చేయలేం.?

మన పని మనం చేస్తే..
ఎవ్వడూ వేలెత్తి చూపించడు.
పని మొదలు పెట్టకముందే..
దాంట్లో రాణిస్తామా.?
అది మనవల్ల అవుతుందా.?
ఒకవేళ నష్టం వస్తే.?
అనే అపోహలొద్దు.
ఒకడు మనముందే పని ప్రారంభించి..
విజయవంతంగా చేస్తున్నప్పుడు..
మనమెందుకు చేయలేం.?
- దాయి శ్రీశైలం
మనొళ్లపై బయట కొంత బ్యాడ్‌గా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. మనం పని చెయ్యమట. మనకు చేతకాదట. ఒకవేళ చేసినా ఒక్కరోజు చేసి రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటమట. దీన్ని ఎవరు ప్రచారం చేశారో.. ఎందుకు చేశారోగానీ ఇదైతే మన ఇమేజ్‌ను చాలా డ్యామేజ్ చేస్తోంది. అసలే ఇట్లా బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు జరుగుతున్నాయిరా అయ్యా అని మొత్తుకుంటుంటే.. మనొళ్లు కూడా కొందరు అట్లనే తయారయ్యారు.
నిజంగా మనకు చేతకాదా.?
అనేవాడు ఎన్నో అంటాడు. అవన్నీకాదుగానీ.. నిజంగనే మనకు చేత కాదా.? అని విశ్లేషిస్తే మనొళ్లు మంచి నైపుణ్యమున్నవాళ్లు. ప్రతీ పనిలో.. ప్రతీ రంగంలో ఆరితేరిన వాళ్లు. వర్తక, వ్యాపార, వ్యవసాయాల్లో మనల్ని మించిన మొనగాళ్లెవరూ లేరు. రంగమేదైనా.. అగ్రస్థానంలో ఉండి పదిమందికి ఆసరైనవారేగానీ.. చెయ్యిచాచిన వాళ్లు కాదు. తన సమస్యనే కాకుండా పక్కోడి సమస్యను కూడా తీర్చేంత దయాగుణం.. సేవాభావం ఉన్నవాళ్లు మనొళ్లు. ఉన్నదాంతో సంతృప్తిపడి ఉన్నంతలో హాయిగా ఉండాలనుకుంటారు. మోసంతో కాకుండా మోటు కష్టంతో పనిచేసే కష్టజీవులున్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నించి.. న్యాయం జరిగేవరకు పోరాటం చేసే పటిమ ఉన్నవాళ్లు. చేతగానివాళ్లు కాదు.. చైతన్యవంతులు మనొళ్లు.
మరి ఈ ప్రచారమేంటి.?
అంతబాగనే ఉన్నంక మనొళ్లు పనిచెయ్యరనే ప్రచారమెందుకు జరుగుతోందంటే.. అక్కడొకరు ఇక్కడొకరు కొందరు మోపైండ్రు. సుఖ జీవనానికి అలవాటు పడి వచ్చిన పనిని, నేర్చిన కళను పక్కకు పెట్టి షార్ట్ కట్ వెతుక్కుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు.? మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది కూడా ఆలోచించాలి. లాభం లేదని కొందరు.. ఎన్నిరోజులు చేస్తామని మరికొందరు వారు ఉత్తమంగా రాణించిన రంగాలనే విస్మరిస్తున్నారు. ఒకటికాదు.. రెండుకాదు.. పది పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఈజీ మనీకి అలవాటుపడి వచ్చినదాన్ని కాకుండా వేరే ఇంకోదాని కోసం పాకులాడుతూ పనిచేతగాని వాడిలా చిత్రీకరించబడుతున్నాడు. చేసేంత దమ్మున్నా.. చేసేస్తా అనే ధైర్యం చెయ్యలేకపోతున్నాడు.
మనం చేస్తలేం కాబట్టే..
ఒకసారి ఊర్లల్ల చూస్తే.. అంతా బయటి నుంచి వచ్చినొళ్లే అన్ని పనుల్లో ఉన్నారు. ఈ పనీ ఆ పనీ అనే తేడా ఏం లేదు. ఏ పనిలో అయినా వాళ్లే ఉన్నారు. ఇక్కడ వాళ్లొచ్చి మన పనికి ఎసరు పెట్టడం లేదు. మనం చేస్తలేం కాబట్టే.. దాన్ని వాళ్లు రీప్లేస్ చేస్తున్నారు. మనం చేతులెత్తేయడం వల్లనే వాళ్లు దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇక్కడ మనది అవసరం. వాళ్లది అనివార్యత. అదే మనకు మైనస్ అవుతోంది. పనులు చెయ్యడం లేదనే పాయింట్‌ను హైలైట్ చేసి మనకు చేతగాదనే ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ప్రచారం చేయడానికి వేరే ఇంకొకడు అవసరమే లేదు. మనలో ఒకడే తన పబ్బం గడుపుకోవడానికి ఇలా ఉల్టా ప్రచారం చేసి ఉన్నూర్లనే పలుచన చేస్తుంటారు. ఇది చాపకింద నీరులా మనకు పెద్ద సమస్యగా మారుతోంది.
పనే లేకపోతే ఉనికెక్కడిది.?
మనం పనిని వదిలేయడం వల్లనే పట్టు కోల్పోతున్నాం. ఒకసారి పనిలో పట్టు కోల్పోతే మనం మన ఉనికి కోల్పోయినట్టే. ఇక్కడ అదే జరుగుతోంది. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టే పని ఉందనుకోండి. అక్కడ మేస్త్రీ పని నుంచి.. పెయింటర్.. ప్లంబర్.. ఎలక్ట్రిషియన్.. కార్పెంటర్.. ఫాల్స్ సీలింగ్.. బండలుు ఇలా అన్నింట్లో బయటి నుంచి వచ్చినవాళ్లే పనిచేస్తున్నారు. పశ్చిమబెంగాల్.. ఛత్తీస్ గఢ్ నుంచి మేస్త్రీలు వచ్చి ఇక్కడ ముఠాలుగా ఏర్పడి ఏ ఊర్లో పనిచేస్తే ఆ ఊర్లోనే ఇల్లు కిరాయికి తీసుకొని పనిచేస్తున్నారు. పెయింటింగ్.. ఎలక్ట్రిషియన్ పనులకు యూపీ నుంచి వస్తున్నారు. కార్పెంటర్.. ఫాల్స్ సీలింగ్.. బండల పనులకు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనొళ్లు చేస్తలేరని ఇట్లా అన్ని రకాల పనుల వాళ్లను బయటి నుంచే తెప్పించుకుంటున్నారు.
మనం వెళ్తామా ఇలా.?
రాజస్థాన్ బ్యాచ్ ఏ పనిచేసినా వాళ్లు పనిచేసే జాగాలోనే ఉంటారు. యూపీ, బీహారీ వాళ్లు చిన్న చిన్న రూములు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. ఎక్కడో పశ్చిమబెంగాల్ నుంచి వచ్చి ఇక్కడివాళ్లతో కలిసిపోయి పనులు చేసుకుంటున్నారు. వాళ్లలా మనం వేరే చోటుకు వెళ్లి అలా ఉండమంటే ఉంటామా.? "చల్.. ఉపాసమన్నా ఉంటాంగానీ.. నేనైతే వెళ్లనయ్యా" అని అంటాం. అది మనకు మైనస్ అవుతుందా.? ప్లస్ అవుతుందా అనేది ఆలోచించుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. వేరేవాడు ఇక్కడొచ్చి.. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడి.. ఇక్కడి వాళ్లతో కలిసిపోయి బతుకుతున్నాడంటే వాడికి సంపాదన మీద సోయి ఉన్నట్టు. మనొళ్లేమో ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉంటారు. దానివల్ల వచ్చిన అవకాశం పోగొట్టుకుంటారు.
పని అనే కాదు.. ఉద్యోగమైనా..
ఉపాధి.. కూలీ పనులు అనే కాదు. మనొళ్లకు కోటి రూపాయల ఉద్యోగమేదైనా వచ్చిందంటే ఫస్ట్ "అదెక్కడా" అని అడుగుతారు. ఎందుకంటే మనకు కొలువు మన ఇంటి దగ్గర్నే ఉండాలి. మన ఊర్లోనే ఉండాలి. మన అమ్మానాన్నకు దగ్గర్లోనే ఉండాలి. పెద్దగా కష్టపడొద్దు. కానీ జీతం భారీగానే ఉండాలి. ఇదంతా ఎలా అలవాటయ్యిందంటే "కంఫర్ట్ జోన్" వల్ల. అదే మన ప్లేసులో వేరేవాళ్లుంటే ఠక్కుమని అందిపుచ్చుకుంటారు. మనమేమో వెళ్లకముందే అక్కడెలా ఉంటుండొచ్చు.? ఆ నీళ్లు పడతాయా లేదా.? ఫుడ్ బానే ఉంటుండొచ్చా.? మనవాళ్లెవరైనా ఉన్నారో.? అని ఆలోచిస్తూ కూర్చుంటాం. దీనివల్ల నష్టం ఎవరికి.? మనకే కదా.? అవకాశమెక్కడొస్తే అక్కడికి వెళ్తామనే తపన ఉంటే.. వేరేవాడెవడూ మనల్ని వేలెత్తి చూపించడు.
హోంసిక్ ఒక సంప్రదాయమా.?
పేరెంట్స్ ముచ్చట కూడా చాలా గమ్మతుంటది మన దగ్గర. పిల్లలకు ఢిల్లీ.. బెంగళూర్.. చెన్నయ్ వంటి ప్రాంతాల్లో జాబొస్తే.. "హయ్యో నా కొడుకు ఎలా ఉంటాడో" అనే బెంగ పెట్టుకుంటారు. వాడేమైనా చంటి పిల్లోడా.. పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యే వయసుంటుంది. ఆ హోంసిక్ అలవాటే పిల్లలకూ వస్తుంది. "ఇల్లిడిస్తే పిల్లి కరుస్తుంది" అనే విధంగా తయారవుతారు. హోంసిక్ అనేదేమైనా వారసత్వ సంపదనా.? తప్పక పాటించాల్సిన సంప్రదాయమా.? ఎందుకు దాన్నలా పట్టుకొని వేలాడుతా.? ఇంకేమైనా అంటే "ఒక్కగానొక్క కొడుకు.. వాడిని చూడకుండా ఎలా ఉండగలం.. వాడిని పెద్దయ్యేదాక చంకలో ఎత్తుకొని తిరిగా" అంటుంటారు. మనం ఇలా ఉంటున్నం కాబట్టే అవకాశాలు చేజారిపోయి.. ప్రాబల్యం తగ్గిపోతుంది.
దూరమైనా.. భారమైనా..
ఉద్యోగమొస్తెనే పోవడానికి మనకు లక్షా తొంబై కారణాలు.. సమస్యలు అడ్డొస్తాయి. కానీ అదే వేరేవాళ్లు వీటిలో దేనినీ సాకుగా చూపకుండా బాజాప్తా వచ్చి పనిచేసుకుంటూ బతుకుతున్నారు. సిటీలోని బార్బర్ షాపుల్లో చూడండి. మొత్తం ఢిల్లీ బ్యాచ్ వచ్చింది. ఇక్కడ హాస్టల్స్‌లో ఉంటూ పనిచేస్తున్నారు. ఆర్నెళ్లకోసారి ఢిల్లీ వెళ్లి.. ఓ వారం రోజులు ఉండి వస్తారు. అదే మనొళ్లయితే వారం రోజులకే మొఖం తూర్పుదిక్కు పెట్టి ఎప్పుడు పోదామా అని ఎదురుచూస్తుంటారు. వచ్చిన పనే ఊర్లోనే చేయాలంటే వాళ్లేమనుకుంటారో.. వీళ్లేమనుకుంటారో అనే నామోషీ. లేదు ఎటైనా బయటకు వెళ్లి చేయాలంటేనేమో దూరం అనిపించె. ఎలా ఇలా ఉంటే.? బయటి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి.. సంపాదించి వేరేవాళ్లు ఎలా ఉంటున్నారు.? మనమెందుకు ఉండలేకపోతున్నాం.?
వ్యవసాయానికీ దూరమేనా.?
ఏది ఎలా ఉన్నా వ్యవసాయానికి మనం మొనగాళ్లం అనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది మనొళ్లు చేతికి మట్టి అంటకుండా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో బీహారీ వాళ్లే కనిపిస్తున్నారు. మొగవాళ్లు ఒరాలు తీయడం, చదును చేయడం వంటి పనులు చేస్తే.. ఆడవాళ్లు నాట్లేయడం.. కలుపు తీయడం వంటి పనులు చేస్తున్నారు. ఇక వడ్లను ఆరబోయడం.. మిల్లుకు తీసుకెళ్లడం వంటి పనులను కూడా వాళ్లే చేస్తున్నారు. మనొళ్లేమో వాళ్లతో సూపర్ వైజింగ్ చేయిస్తుంటారు. దీంతో రానురానూ వ్యవసాయానికి కూడా మనం దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చేమో అనిపిస్తోంది. వ్యవసాయమైనా.. ఇంకేదైనా.. మనం చేస్తేనే దానిమీద పట్టు ఉంటుంది. పైసా సంపాదన ఉంటుంది.
మరి మనవాళ్లేం చేయట్లేదా.?
ఎందుకు చేయట్లేదు చేస్తున్నారు. కాకపోతే పని తీరు మార్చారు. రియల్ ఎస్టేట్ బూచీ ఇలా పనులు చేసుకునేవాళ్లందరినీ ఏజెంట్లుగా.. బ్రోకర్లుగా మార్చేసింది. మనవాళ్లు పని చేసే స్థితి నుంచి చేయించే స్థాయికి ఎదిగాం అనుకుంటున్నారు. ఒకరికి భూమి కావాలి.. ఇంకొకరికి భూమిని అమ్మాలి. ఆ అమ్మేవాడిని.. కొనేవాడిని ఒక్కదగ్గరకు చేర్చి.. వాడిదగ్గరో 2శాతం.. వీడిదగ్గరో 2శాతం కమీషన్ తీసుకొని ఇదే సంపాదన.. ఇదే మా ప్రొఫెషన్ అనుకుంటున్నారు మనొళ్లు. అందుకే ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉంటారు. ఇదేం కరాబయ్యే పనేం కాదు. కానీ.. అదొక్కటే ప్రపంచంగా బతికి ఇతర రంగాల్లో ఉనికి కోల్పోతున్నాం. భూముల అమ్మకం.. కొనుగోలు ప్రక్రియ ఏజెంట్లుగానే కాకుండా.. వాటిని మనమే తీసుకునే స్థాయికి వెళ్లే దిశగా ఎదగాలి.
వ్యాపారాలు ఎందుకు చేయొద్దు.?
బయటొక పెద్ద చర్చ జరుగుతోంది. "గో బ్యాక్ మార్వాడీ" అనేది పెద్ద ఉద్యమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా.. సామాజికంగా.. రాజకీయంగా వాళ్లు అభివృద్ధి అవగా.. మనమెందుకు కాకూడదు.? వాళ్లు సక్సెస్ కాగా లేనిది మనమెందుకు కాలేం.? దో నంబర్ దందా చేసుకుంటూ డెవలప్ అయ్యి మనల్ని "రెండు వేలు సంపాదిస్తే రెండు రోజులు తాగి పంతరు" అన్నోడికి మన వ్యాపార నైపుణ్యంతోనే బుద్ధి చెప్పాలి కదా.? వాళ్లు దో నంబర్ మాల్ దందా చేస్తే.. మనం ఏక్ నంబర్ మాల్ దందా చేద్దాం. ముళ్లును ముళ్లుతోనే కదా తీయాల్సింది.? మరెందుకు ఇంకా ఇలాగే ఉంటాం అని గిరిగీసుకుందాం.? మేం చేతగానొళ్లం కాదు.. చైతన్యవంతులం అని నిరూపించి వ్యాపారంలో మన టాలెంట్ చూపిద్దాం.
మనకెందుకు ఉండొద్దు సిండికేట్.?
మార్వాడీల ధైర్యం సిండికేట్. వాళ్లే అంటున్నారు కదా "మాకేమైనా జరిగితే మా సమాజ్ చూసుకుంటదీ" అనీ. కానీ.. మనకున్న అతిపెద్ద మైనస్ ఇలాంటి వర్తక సమాజ్‌లు లేకపోవడమే. మనోడు ఎవడైనా దుకాణం పెట్టిండంటే వానిమీద ఉన్నవి లేనివి చెప్పి ఎంతసేపూ ఎలా బలహీనం చెయ్యాలని ఆలోచిస్తారు కానీ.. అరే మనోడు బాగు పడుతున్నాడు అండగా నిలబడదాం అని అనుకోరు. దీనివల్లనే వ్యాపారాల్లో మనొళ్లు నిలదొక్కుకోలేక పోతున్నారు. ఇంకా మార్వాడీల్లో సమాజ్‌ల నుంచి పది పైసలు.. పావలా మిత్తీకి అప్పిస్తారు. దందా పెట్టుకొని డెవలప్ అవమని ప్రోత్సహిస్తారు. అదే మనోడైతే ఐదు రూపాయల మిత్తీకైతేనే ఇస్తా అంటాడు. మార్వాడీ తరహాలో సిండికేట్లు.. వర్తక సమాజ్‌లు మనకు లేనంత కాలం వ్యాపారాల్లో మనం రాణించలేం. కాబట్టీ అలాంటివి మనకూ ఉంటే మంచిది.
చేతగాక కాదని చెప్పొద్దా.?
ఒకడు మనకు చేతగాదు అని కామెంట్ చేసేదాక మనం చూసుకోవద్దు. వాస్తవానికి మనకు దందాలు.. యాపారాలు చేసే నైపుణ్యం లేక కాదు. చాలా రంగాల్లో మనొళ్లు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్లుగా రాణిస్తున్నారు. ఐతే.. గ్రామాల్లో పైసా ఉన్నోడిదే పలుకుబడి.. ఏలుబడి. ఇవాళ రేపు గ్రామాల్లో దుకాణాలు.. యాపారాలు ఉన్నవాళ్ల చేతుల్లోనే పైసలుంటున్నాయి. కాబట్టీ వాళ్ల మాటే చలమాణి అవుతుంది. ఈ అవకాశం మన చేతుల్లో నుంచి జారిపోయి వేరేవాళ్ల చేతుల్లో పడొద్దంటే మాత్రం మనం కచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. మేం చేతగానొళ్లం కాదురా బాబూ.. మీలా మాకు చేయూతనిచ్చేవాళ్లు లేక ఇలా ఉన్నాం.. మేం కనుక రంగంలోకి దిగితే అందరి లెక్కలూ సరిచేస్తాం అని గళ్లా ఎగరేయాలంటే మాత్రం ఇంట్లో ఉండటం కాదు.. బయటకొచ్చి బరిలోకి దిగాల్సిందే.
ఎన్ని దుకాణాలున్నా: మాయిని శ్రీశైలం, హోల్‌సేల్ కిరాణం వ్యాపారి
మేం హోల్ సేల్ దుకాణం పెట్టి 20 ఏళ్లకు పైనే అవుతుంది. అప్పుడు అసలు మార్వాడీ దుకాణాలే లేవు. ఇప్పుడు గల్లీకొకటి అయ్యాయి. అయినా కూడా మా గిరాకీ అయితే ఎక్కడా దెబ్బతినలేదు. ఇంకా కొందరు మార్వాడీ షాపు వాళ్లయితే మా దగ్గరే సరుకులు తీసుకెళ్తారు. మన నిర్వహణ సరిగా ఉంటే మన వ్యాపారాల్ని ఎవరూ దెబ్బ తీయలేరు.
అన్ని పనులు వాళ్లే: బోళ్ల పోచయ్య, రైతు
రెండేళ్ల నుంచి పొలంలో ఏ చిన్న పని అయినా బీహారీ లేబర్ తోనే చేయిస్తున్నాను. మనవాళ్లు ఒరాలు తీసుడు.. మందు పిచికారీ చేసుడు వంటి పనులు చేయడం లేదు. ఒకవేళ వచ్చినా పైసలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఈ సారి అయితే నాట్లేయడానికి కూడా బీహారీ ఆడొళ్లనే తీసుకొచ్చాం. వీళ్లంతా పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు.






