వద్దంటే వరే వేస్తాం.. ఉరికొయ్యలకు దగ్గరవుతాం..

by Sujitha Rachapalli |

చేనుకు చేవ ఉంటేనే పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చి రైతుకు రొక్కం మిగులుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు కళ్లలో ఆనందం కనిపిస్తుంది.

వద్దంటే వరే వేస్తాం.. ఉరికొయ్యలకు దగ్గరవుతాం..
X

దిశ, ఫీచర్స్: చేనుకు చేవ ఉంటేనే పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చి రైతుకు రొక్కం మిగులుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు కళ్లలో ఆనందం కనిపిస్తుంది. తర్వాతి పంటకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధం అవుతాడు. కానీ.. వ్యవసాయం చేసే ఏ రైతు మొఖాన కరీఫ్‌లో కనిపించే ఉత్సాహం రబీలో కనిపించదు. రబీలో కనిపించే ఉత్సాహం కరీఫ్‌లో కనిపించదు. ఇది వ్యవస్థ లోపమా? రైతు వైఫల్యమా??

తెలివైన వ్యవసాయం చేయాలి కదా?

రైతు కంటతడి పెట్టని రోజు ఉంటుందా? అన్నదాతే.. అన్నమో రామచంద్రా అని మొరపెట్టుకోలేని దినం ఉంటుందా? వ్యవసాయం గురించి మనమంతా గొప్పగా చెప్తుంటాం. కానీ వాస్తవ పరిస్థితి మనం చెప్పుకున్నంత గొప్పగా ఉండదు. గిట్టుబాటు లేక గిలగిలా కొట్టుకునే రైతులు.. దిగుబడి ఆశాజనకంగా రాక దిగులు చెందే రైతులు.. మన ఇంట్లో, మన వాడలో, మన ఊళ్లో అడుగడుగునా కనిపిస్తుంటారు. దీనికి వ్యవస్థలోని లోపాలు ఒక కారణమైతే రైతు స్వయంకృతాపరాధం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రైతును తప్పబట్టడం లేదు. తెలివైన వ్యవసాయం చేయాలి కదా? అని అంటున్నాం.

గిట్టుబాటు కోసం గింగిరాలు ఎంతకాలం?

దేశానికి అన్నంపెట్టే రైతన్న ఎవరో ఇచ్చే మద్దతు ధర గురించి ఎందుకు ఎదురు చూడాలి? ఎవరో ఆశచూపే గిట్టుబాటు ధరలో మనమెందుకు గింగిరాలు తిరగాలి? కాలానికి తగ్గట్టే రైతూ మారాలి. కాలానికి అనుగుణంగా పంట వేసే నైపుణ్యం ఏర్పరచుకోవాలి. అలా అనీ రైతుకేం తెలియదని కాదు. అందరికంటే ఎక్కువ.. అన్ని విషయాల్లో అవగాహన ఉండేది రైతుకే. వ్యవసాయ విస్తరణ అధికారి ఫలానా పంట వేయాలని చెప్తేనే వేసేంత విషయం లేనోడైతే కాదు రైతు. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఆకాశానికి ఎదురుచూస్తూ కూర్చోవడం.. అధికారి ఎవరో వస్తారని ఆశ పడటం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న.

లాభం దళారులకా? మనకా?

ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరమూ ఆపలేం. అతివృష్టినీ, అనావృష్టినీ మనమెవరమూ నియంత్రణ చేయలేం. కానీ వాటికి చిక్కకుండా, దొరకకుండా లాభసాటి వ్యవసాయమైతే చేయొచ్చు. దానినే తెలివైన వ్యవసాయం అంటారు. తెలివైన వ్యవసాయమంటే ఏదో నిఘంటువుల్లో శోధించాల్సిన అంశమేమీ కాదు. పుస్తకాలు తిరిగేయాల్సిన విషయమేం కాదు. తెలివైన వ్యవసాయం రైతుకు బాగా తెలిసిందే. మూసధోరణి సాగు కాకుండా లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచించాలి. మార్కెట్‌ను పరిశీలిస్తుండాలి. మార్కెట్లోని దళారులకు అనుగుణంగా కాకుండా.. మనకు లాభం వచ్చే విధంగా సాగును విస్తరింపజేయాలి.

గాల్లో దీపం పెట్టడం ఎందుకు?

వ్యవసాయం అంటే ఒక్క వరి పంటనేనా? ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలు వరే సాగుచేయాలా? ఏ.. ఐదెకరాలుంటే అందులో రెండెకరాలు వరి పంటేసి.. ఇంకో ఎకరంలో కూరగాయలేసి.. ఇంకో ఎకరంలో మక్కలేసి.. మిగిలిన దాంట్లో పశువులకు గడ్డి.. ఆకు కూరల్లాంటివి వేస్తే ఆర్నెళ్లదాక ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఉన్న ఐదెకరాల్లో వరే వేసి ఫలితం పైవాడి దయ అని గాల్లో దీపం పెట్టే పరిస్థితి ఎందుకు? వరేసినా అదే పని చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న కమతాలుగా విభజించి మార్కెట్‌కు అనుగుణంగా రకరకాల పంటలుగా సాగు చేసినా అదే పని చేయాల్సింది. అందుకే ఒక్క పంట వేసి కన్నీళ్లు పెట్టే బదులు.. రకరకాల పంటలు వేస్తే మంచిది కాదా?

వీటికేమైనా తక్కువవుతుందా?

తీరొక్క పంటవేస్తే పెట్టబడి ఎక్కువుంటుంది కదా అనిపించవచ్చు. వాస్తవమే. కానీ ఎంత పెడితే అంత వస్తుంది కదా? ఐనా.. వరికేం తక్కువవుతుందా? గతంలో సాంప్రదాయ సాగు చేసేవాళ్లు కాబట్టీ దున్నుడు, నాట్లు, కలుపు, మందులకు తక్కువ ఖర్చే అయ్యేది. కానీ ఇప్పుడంతా యాంత్రిక సాగే కదా? దున్నడం నుంచి కోత వరకు అంతా ట్రాక్టర్లు, వరికోత మెషిన్లతోనే చేస్తున్నాం. వీటికేమైనా తక్కువ ఖర్చువుతుందా? ఎంత పెట్టుబడి పెట్టినా ఆఖరికి సర్కారు ధాన్యం కొనకపోవడం.. మద్దతు ధర రాకపోవడం.. అతివృష్టికీ, అనావృష్టికీ పంటనష్టం జరిగి పరిహారం కోసం ఎదురుచూసే పరిస్థితే వస్తుంది కదా?

ఎంత పిచికారి చేస్తే ఏం లాభం?

వ్యవసాయం భారం కావద్దు. అంతకంతకూ లాభసాటి కావాలి అనంటే రైతు పంట మార్పిడి విధానం అవలంబించాలి. పోయినసారి వరి పంటే వేసి.. ఈసారి అదే వేసి.. వచ్చేసారి అదే వేసి.. ఇలా ప్రతీయేటా ఏకరీతి పంటలే వేయడం వల్ల భూమిలో సారం తగ్గుతుంది. భూసారం లేనప్పుడు ఎంత పెట్టుబడి పెడితే ఏం లాభం? ఎన్ని మందులు పిచికారి చేస్తే ఏం లాభం? మనం ఒకరోజు పప్పు.. ఇంకోరోజు ఆకుకూర.. ఇంకో రోజు మాంసం తిన్నట్లే భూమికి కూడా క్రమంగా పంట మార్పిడి విధానం అవలంభించాలి. ప్రతీ ఆర్నెళ్లకో, సంవత్సరానికో పంట మార్పిడి చేస్తేనే ఆశాజనక ఫలితాలు వస్తాయి.

ఒక్కరి ధాన్యమే ఉండదు కదా?

వ్యవసాయం అంటే వరి ఒక్కటే అన్నట్టు తయారైంది రైతు పరిస్థితి. ఒకర్ని చూసి ఒకరు.. పోటీలు పడి మరీ ఎకరాలకొద్దీ వడ్లను పండిస్తున్నారు. పుట్లకొద్దీ రాశులు పోస్తున్నారు. మార్కెట్లో మన ఒక్కరి ధాన్యమే ఉండదు కదా? సర్కారు మన ఒక్కరి వడ్లనే కొనదు కదా? గుంపులో గోవిందా. ఊరందరివీ కొన్నప్పుడే మనవీ కొంటుంది. మే నెల ప్రారంభంలో కోత కోసిన పంట.. జూన్ మూడో వారానికి కూడా కల్లాల్లోనే ఉంటుంది. వాన వస్తుందేమో అనే భయం.. కల్లాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతుందనే ఆందోళనతో రైతుకు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. తెల్లవార్లూ ఉరుములను చూస్తూ జాగారమే.

నేలను బట్టి సాగు చేస్తే?

పంట మార్పును స్వాగతించం. దళారుల చేతిలో ఇరుక్కుంటాం. అప్పులు చేసి పెట్టుబడి పెడతాం. ఆరుగాలం శ్రమించి ఎవరో వస్తారనీ.. ఏదో చేస్తారని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తాం. పంట కొనకపోతే మనకే పరేషాన్. ధాన్యం పారబోస్తాం. రోడ్లపై ఆందోళన చేస్తాం. అలాంటి పరిస్థితిని ఎందుకు కొని తెచ్చుకోవడం? కాలానికి, నేలకు అనుగుణంగా సాగు చేస్తే ఏమవుతుంది? ఒకసారి వరీ.. ఇంకోసారి మక్కలు.. కూరగాయలు సాగుచేసి ఎప్పటి మార్కెట్టుకు తగ్గట్టుగా అప్పుడే సత్వర ఫలితాలు పొందే విధంగా ఆలోచిస్తే ఏమవుతుంది? పంట మార్పిడిని ఫాలో అయ్యి నేల సారవంతాన్ని పెంపొందిస్తే ఏమవుతుంది?

ఉరికొయ్యలకు వేలాడటమెందుకు?

మన రైతులు చేసే ఇంకొక పొరపాటేంటంటే పంట పంటకూ గ్యాప్ అస్సలూ ఇవ్వరు. నేల సారవంతం కావాలంటే దున్నాలి.. ఆరాలి.. గాలి తాకాలి.. తేమ పడాలి. ఇవన్నీ తెలియక కాదు. అన్నీ తెలుసుగానీ.. ఎందుకో ఏమో మన రైతు ఒకవైపు కోసేది కోస్తూనే ఇంకోవైపు దున్నుతుంటాడు. బురద ఆరకముందే నిండా నీళ్లు పారబెడతాడు. ఎడం అనేది లేకపోతే పంట ఎలా దిగుబడి వస్తుంది? ఒకవైపు చేను కోసేది కోస్తూనే ఇంకోవైపు వరికొయ్యలు తగలబెడుతుంటాడు. పరుగెత్తి పాలుతాగి గిట్టబాటు రాక అప్పులు గుర్తుకొచ్చి ఉరికొయ్యలకు వేలాడటమెందుకు? భూమికి మనం ఎలా ఇస్తే అలా తిరిగి వస్తుంది కదా?

వ్యవసాయం వ్యాపారం కాదా?

విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్, కెనడా మొదలైన దేశాల్లో పంట మార్పిడి విధానం చాలా సాధారణం. ఇక్కడి రైతులు మూస ధోరణిలో కాకుండా మార్కెట్ డిమాండ్.. లాభదాయకత.. నేలసారం.. చీడపీడల నియంత్రణ వంటి అంశాలను బట్టి సాగు విధానాలను మారుస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూస్తారు. ఇక్కడ మొక్కజొన్న.. సోయాబీన్స్ మార్పిడి చాలా సాధారణం. ఒక సంవత్సరం మొక్కజొన్న.. తర్వాత సోయాబీన్స్ వేస్తారు. సోయాబీన్స్ ద్వారా నత్రజని నేలలోకి వెళ్తుంది. మొక్కజొన్నేమో ఎక్కువ నత్రజని వాడుతుంది. ఇది నేల ఫలదీకరణాన్ని మెరుగుపరిచి చీడపీడలను తగ్గిస్తుంది.

మార్కెట్‌కు తగ్గట్టు మారాలి కదా?

విదేశాల్లో సాధారణంగా ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి పంట మారుస్తారు. ఎక్కువ కాలం ఒకే పంట వేస్తే నేల సారం తగ్గిపోయి చీడపీడలు, వ్యాధులు పెరుగుతాయనేది అక్కడ ప్రతీ రైతుకు అవగాహన ఉంటుంది. రైతులు మార్కెట్‌కు అనుగుణంగా ధరలు, డిమాండ్, సబ్సిడీలను పరిగణలోకి తీసుకుంటారు. సేంద్రియ సాగులో కూడా పంటలు మార్చి వేస్తుంటారు. మన దగ్గరేమో ఎక్కువగా చిన్న రైతులు ఉంటారు. దాదాపు వర్షాధార, సబ్సిస్టెన్స్ సాగునే అవలంభిస్తారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా తెలివైన వ్యవసాయం చేస్తూ పప్పులు, చిరుధాన్యాల ద్వారా లాభాలు పొందుతున్నారు.

రైతు వైఫల్యం కాదు: పులి రాజు, రైతు సామాజిక కార్యకర్త

రైతు ఎప్పుడూ కష్టపడటంలో వెనుకాడడు. మార్కెట్లో ధరల నియంత్రణ లేకపోవడం.. సరైన మద్దతు ధర లేకపోవడం రైతు చేతిలో ఉండవు. దేశంలో ఇప్పటికి 63% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ కూడా దేశంలో వ్యవసాయ విధానం లేకపోవడం దురదృష్టకరం. పంటల ప్రణాళిక లేకపోవడం.. తన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం బాధాకరం. పంటలకు లాభసాటి ధర ఉంటే రైతు ఏడాది పొడవునా ఒకే ఉత్సాహంతో పని చేస్తాడు.

మాకు అవకాశం లేదు: బోళ్ల పోచయ్య, రైతు

మాది మూసీ పరివాహక ప్రాంతం. రైతుకు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలు వరే వేస్తాం. తడి ఆరినట్టు ఉండదు. తేమ తగిలినట్టు ఉండదు. ఒక దిక్కు వరికోత కోస్తూనే ఇంకోదిక్కు పొలం దున్ని తర్వాతి పంటకు సిద్ధం చేయాల్సిన పరిస్థితి. పంట కోసి కల్లంలో పెట్టుకొని దేవునికి దండం పెట్టి ఎదురుచూడాలి. అందరిలా మాకూ తీరొక్క పంట సాగు చేయాలని ఉంటుంది కానీ.. సాధ్యపడదు. వేల రూపాయల మందులు పిచికారి చేసి నేలతల్లి కోసం అప్పులు చేస్తుంటాం.

Next Story