మెస్మరైజ్ చేస్తోన్న టెంపుల్స్.. పర్యాటకానికి ది బెస్ట్ డెస్టినీ

by Gantepaka Srikanth |

భూటాన్ లేదా థాయ్ లాండ్ .. ఎక్కడికి వెళితే బాగుంటుంది? అన్న మీమాంసలో థాయ్‌లాండ్‌కే వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాము నేను నా సహ ప్రయాణికురాలు కొల్లాపురం విమల.

మెస్మరైజ్ చేస్తోన్న టెంపుల్స్.. పర్యాటకానికి ది బెస్ట్ డెస్టినీ
X

(గిరిజ పైడిమర్రి)

భూటాన్ లేదా థాయ్ లాండ్ .. ఎక్కడికి వెళితే బాగుంటుంది? అన్న మీమాంసలో థాయ్‌లాండ్‌కే వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాము నేను నా సహ ప్రయాణికురాలు కొల్లాపురం విమల. బియాండ్ బార్డర్స్ (BB) గ్రూపుతో మా ప్రయాణం ఖరారైంది. నేను వీళ్లతో కలిసి ఇంతకు ముందు బాలి, కశ్మీరుకు వెళ్లాను. ఈ గ్రూపు నిర్వాహకురాలు మోహిత నార్త్ ఇండియన్ అమ్మాయి. చక్కటి వసతి ఏర్పాట్లతో, సమయపాలనతో, క్రమశిక్షణతో టూర్స్ నిర్వహిస్తున్నది. వారంలో థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, క్రాబీ, బ్యాంకాక్ ఈ మూడు నగరాలు దర్శించడం మా ప్రయాణ ప్రణాళిక.

థాయ్‌లాండ్.. సర్వం బౌద్ధమయమే..

థాయ్‌లాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ నగరం. సాంస్కృతిక, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ఉన్నది. థాయ్ సంస్కృతి భారతీయ, లావో, బర్మా, కంబోడియా, చైనా సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకుంది. పర్యాటక రంగంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది. థాయ్ కరెన్సీనీ బాట్ అంటారు. ఒక బాట్‌కు మన కరెన్సీ రెండు రూపాయల యాభైరెండు పైసలు. ఇది హెచ్చుతగ్గులు కావచ్చు (1= 2-52 INR ). మేము ఒక బాట్‌కు సుమారుగా రెండున్నర రూపాయలు లెక్క వేసుకొని ఖర్చుపెట్టేవాళ్లం. దేశ అధికార భాష థాయ్. 95% ప్రజలు బౌద్ధమతాన్ని అనుసరించడం వలన కాబోలు చాలా సౌమ్యులు. వాళ్ల క్యాలెండర్ కూడా బౌద్ధ మతాన్ని అనుసరించి రూపొందిస్తారని గైడ్ చెప్పింది. అక్కడ మహిళలు కష్టపడి పనిచేస్తారు. మాకు టాక్సీ డ్రైవరు, సిటీ గైడులు, ఫెర్రీ గైడులు కూడా మహిళలే కావడం విశేషం.

ఇప్పుడు వీసా కూడా రద్దు

హైదరాబాదు నుంచి తొమ్మిది, బెంగళూర్ నుంచి ఇద్దరు, ముంబై నుంచి ఒక్కరు మొత్తం పన్నెండు మంది మహిళలం థాయ్ లాండ్ ప్రయాణం చేసాము. ఇందులో 22 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసు వారు ఉన్నారు. హైదరాబాదు నుంచి థాయ్ ఎయిర్ లైన్స్‌లో దాదాపు ఐదు గంటలు ప్రయాణించి ఫుకెట్ ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యాము. ఇమ్మిగ్రేషన్ ముగించుకొని అక్కడి నుంచి వాహనంలో హోటల్ గదికి చేరుకున్నాము. వీసా రుసుము ఒకరికి 4,100 రూపాయలు. మేము వెళ్లి వచ్చిన రెండు నెలలకే అక్కడి ప్రభుత్వం ప్రయాణికులకు వీసా రద్దు చేసిందని పేపర్లో చదివాను. అంటే ప్రస్తుతం ఆ దేశానికి వీసా అవసరం లేదన్నమాట.

బంగారు బుద్ధుడు.. చైనీస్ పెయింటింగ్స్

మొదటిరోజు పాతనగరాన్ని చుట్టివచ్చాము. పాత పట్టణం చారిత్రకమైంది. చైనా వాస్తు శిల్పంతో, పోర్చుగీసు శైలి నిర్మాణంలో ఉన్న అబ్బుర పరుస్తాయి. సాయంత్రం హోటలు గదికి చేరువలో ఉన్న బీచికి వెళ్లాము. కొందరు పారాసెయిలింగ్ చేస్తున్నారు. మేము కూడా చేయాలని అనుకున్నాం. కానీ అప్పటికే చీకటి పడడం వలన చేయడానికి వీలు కాదని చెప్పారు. నిరాశతో హోటలు గదికి చేరుకున్నాము. మరుసటి రోజు ఉదయమే అల్పాహారం ముగించి నగర పర్యటన మొదలు పెట్టాము. వాట్ ఫ్రా థాంగ్ అనే పురాతన బౌద్ధ దేవాలయానికి వెళ్లాము. పడుకొని ఉన్న బంగారు బుద్ధుడు ప్రత్యేకత. అక్కడి నుంచి అత్యంత పురాతనమైన థా రువా బౌద్ధ ఆలయానికి వెళ్లాము. ఎరుపు, బంగారు, పచ్చల రంగులతో అత్యంత అద్భుతంగా ఉన్న చైనీస్ పెయింటింగ్‌లు మనలను దృష్టి మరల్చనీయవు. మరో బౌద్ధ దేవాలయం వాట్ చాలోంగ్. స్థానికులు ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ప్రార్థనలు చేస్తున్నారట. మేము కూడా కొంచెం సేపు ప్రార్థనలో కూర్చున్నాము. అక్కడ ఇచ్చిన థాయ్ నాణాలు తీసుకొని ఒకొక్క పాత్రలో ఒక్కటి వేస్తూ సరదాగా తిరిగాము. అలా చేయడం వలన కోరిన కోరికలు సిద్ధిస్తాయి స్థానికుల నమ్మకం.

టైగర్ కింగ్‌డమ్.. పులిని నిమరవచ్చు

మరో రోజు టైగర్ కింగ్ డమ్‌కు వెళ్లాము. ప్రవేశ రుసుము రూ.3100లు. అంత డబ్బు పెట్టడం అవసరమా? అని ఆలోచించాను. కానీ పులులను దగ్గరగా చూడడమే కాకుండా వాటిని తాకడం లాంటివి చేయొచ్చునని తెలిసి టికెట్ తీసుకొని నలుగురం మాత్రమే లోపలికి వెళ్లాము. పులి పిల్ల కావాలా? పెద్ద పులి కావాలా? అని అడిగారు. దానినిబట్టి కూడా టికెట్ ధర ఉంటుంది కాబోలు. లోపలికి ప్రవేశించడానికి ముందు నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి.. నిశ్శబ్దాన్ని పాటించాలి. ఒంటరిగా ఉండకూడదు. నిద్రిస్తున్న పులిని ఆటంక పరచకూడదు. అంటే తాక కూడదు. పులి ముఖం వైపు నుంచి తోక వైపు నుంచి మాత్రమే ముట్టుకోవాలి. పులిని మాలిమి చేసుకున్న వ్యక్తి కూడా ఉంటాడు. ఎంతైనా క్రూర మృగం కదా.. ముందు భయం వేసింది. దానితో పాటు ఉద్వేగం.. నెమ్మదిగా తోకతో మొదలు పెట్టి నా చేతిని దాని పొట్ట వరకూ పోనిచ్చాను. నా ధైర్యాన్ని చూసి పులి మాలకుడి ప్రోత్సాహంతో దాని తోకతో కొన్ని క్షణాలు ఆడుకున్నాను. ఉద్వేగంతో కూడిన ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఏదో సాధించానన్న ధీమాతో వెనక్కి తిరిగాను.

ఉరంగుటాన్‌, డాల్ఫిన్ల ముద్దులు

మరోచోట విదేశీయులు, యువకులు ఉరంగుటాన్‌ను కౌగిలిస్తూ, ముద్దులు పెడుతూ కనిపించారు. దానికోసం వెయ్యి బాట్లు టికెట్ తీసుకోవాలి. కానీ మేము సఫారీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ప్రవేశ రుసుము 4100 రూపాయలు. ప్రత్యేకమైన వాహనంలో లోపలికి తీసుక వెళ్లారు. వాహనానికి అడ్డుగా గుంపులు గుంపులుగా పులులు వచ్చాయి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకూ ఏ సఫారీలోనూ నేను అన్ని పులులను చూడలేదు. అక్కడి నుంచి మేము డాల్ఫిన్ నారియం చూడడానికి వెళ్ళాము. ప్రవేశ రుసుము 500 రూపాయలు. డాల్ఫిన్లు చేసే విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంటె డాల్ఫిన్లు ప్రేక్షకులను సైతం నీటితో తడిపేసాయి. ప్రేక్షకుల మధ్యకు రావడం, ముద్దులు పెట్టడం భలే తమాషాగా అనిపించింది.

సముద్రంలో కొండలు, గుహలు

తర్వాత రోజు స్పీడు బోటులో కొన్ని ద్వీపాలకు బయలుదేరాము. అందమైన ప్రకృతి.. సముద్రంలో కొండలు మొలచాయా! అన్నట్లుగా దూరంగా కొండలు కనువిందు చేసాయి. కొంతదూరం స్పీడు బోటులో వెళ్లి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కూర్చోగలిగే చిన్న పడవలో చిన్న పడవలో ప్రయాణం .. సముద్రంలో సహజంగా ఉద్భవించిన కొండ గుహలలోనికి ఆ ప్రయాణం. అంటే దూరం నుంచి కొండలలాగా కనిపించినవి కొండలు కాదు, కొండ గుహలన్న మాట. సముద్రంలో గుహలను చూడడం నాకు అదే మొదటి సారి. కింద నీటిలో పడవ ప్రయాణం .. సరిగ్గా కూర్చోగలిగినంత ఎత్తులో ఉన్న గుహలు..ఒక చోట పడుకుని కూడా వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఏమరుపాటుగా ఉన్నవాళ్లకు చిన్నచిన్న దెబ్బలు కూడా తగిలాయి. పడవలు నడుపుతున్న పిల్లల తలలకు ఉన్న లైట్ల కాంతి నది లో కార్తీక దీపాలు వదిలినట్లుగా ఒక వింత సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది. అలా ప్రయాణం చేస్తూనే సహజంగా ఏర్పడిన విభిన్న ఆకారాలను చూసాము. ఎంతో ఉద్వేగంతో సముద్ర కొండగుహలను చుట్టిరావడానికి మాకు దాదాపు అరగంట పట్టింది.

జేమ్స్‌బాండ్ ఐలాండ్‌ సోయగం

అక్కడనుంచి స్పీడు బోటులో జేమ్స్‌బాండ్ ఐలాండ్‌కు వెళ్లాము. ఆ దీవిలో సహజంగా సున్నపురాయితో ఏర్పడిన శిలారంధ్రాలు నన్ను అబ్బుర పరిచాయి. ఆ రాళ్లపైకి ఎక్కి, ఆ రంధ్రాల లోనుంచి దూరి రకరకాల ఫొటోలు తీసుకున్నాము. మనసుకు కళ్లుంటే ప్రకృతిలో ఎన్ని సోయగాలను చూడవచ్చునో అనిపించింది. 1974 లో జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్ ఈ దీవిలోనే జరిగిందట. అప్పటినుంచి జేమ్స్‌బాండ్ దీవి అనే పేరు స్థిరపడింది. ఆ ప్రశాంత వాతావరణం అక్కడినుంచి సందర్శకులను కదలనీయదు.

క్యాబరే డాన్స్.. మెరుపు తీగలు

థాయ్‌లాండ్ సంస్కృతి కొంత తెలియాలంటే క్యాబరేడాన్స్ షో చూడడం తప్పనిసరి అని భావించాము. మా బృందంలో ఐదుగురు మాత్రమే వెళ్లాము. ప్రవేశ రుసుము 2000 రూపాయలు. ప్రదర్శన సుమారు గంటపాటు కొనసాగింది. యువతీ యువకులు తళుకు బెళుకుల అలంకరణతో మెరుపు తీగలలాగా శారీరక విన్యాసాలు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయాను. షో ముగిసేవరకూ సమయమే తెలియలేదు. షో ముగిసి బయటకు వచ్చిన తరువాత కొంత మంది ఔత్సాహికులు వాళ్లతో ఫోటోలు చేయించుకున్నారు. ఒక ఫొటోకు వంద బాట్స్ తీసుకున్నారు. దీనిని బట్టి క్యాబరే షో నిర్వాహకులు డాన్సర్లకు ఇచ్చే డబ్బు తక్కువే అని అర్థమైంది.

ట్రావెలర్లు విడిపోతే...

బయటకు వచ్చే సమయంలో ఆ రద్దీలో నేను నా మిత్రులు విడి పోయాము. చాలా సేపు వాళ్లకోసం వెతికాను. ఒక క్షణం కంగారు పడ్డాను. కానీ మేము వచ్చిన వాహనం ఫొటో తీసుకున్న సంగతి గుర్తుకు వచ్చి వెతుక్కుంటూ టాక్సీ స్టాండు వైపు వెళ్ళాను. నాకు ఎదురుగా మా టాక్సీ డ్రైవర్ కనిపించాడు. అప్పటికీ మా మిత్రులు అక్కడికి చేరుకోలేదు. అతనే వెళ్ళి వాళ్ళను కూడా వెతికి తీసుకొచ్చాడు. అక్కడి మనుషులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పడానికే ఈ సంఘటన రాసాను. అంతేకాదు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను టాక్సీ స్టాండుకు చేరుకున్న విధానం చెపుతుంది. మా బృందంలో మరికొందరు కార్నివాల్‌కు వెళ్ళారు. ప్రవేశ రుసుము 800 భాట్స్. అందరం హోటలుకు చేరుకుని డిన్నర్ ముగించి నిద్రకు ఉపక్రమించాము.

Next Story