- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌ను కుదిపేస్తున్న ట్రంప్ నిర్ణయం.. 90 రోజుల తర్వాత ఏం జరుగబోతున్నది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత్‌ను కుదిపేస్తున్నది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత్‌ను కుదిపేస్తున్నది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాతో చాలా వస్తువులపై ట్యాక్సులు లేకుండా అమెరికాకు పంపే అవకాశాన్ని ట్రంప్ ఒక్క సంతకంతో తుడిచిపెట్టేశాడు. భారత్ ను ట్యాక్స్ కింగ్ గా అభివర్ణిస్తూ.. ప్రతి వస్తువుపై 10శాతం భారత్ పై గరిష్ఠంగా 26శాతం సుంకాలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది భారత్ లో కొన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా ఔషధ పరిశ్రమలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఆ పై ఐటీ సెక్టార్. అమెరికాకు ఐటీ సేవలు అందిస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి కావడంతో.. ఈ రంగంపై కూడా పన్నులు విధించే పరిస్థితి కనపడుతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రొయ్య సాగుకు గట్టి షాక్ తగిలింది. ఈ రంగంపై కనీసం రూ.600కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి 2023లో 2.5 బిలియన్ డాలర్ల సీ ఫుడ్ ఎగుమతి అయ్యింది. ఇందులో 92శాతం రొయ్యలే కావడం విశేషం. మొత్తంగా ట్రంప్ టారిఫ్ లతో ఏయే రంగాల్లోని భారతీయ పరిశ్రమలపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నది. ఇప్పటివరకు అమెరికా ఎగుమతి అవుతున్న వస్తువులపై ఎంత సుంకం వసూలు చేసేవారు.. ఇకపై ఎంత వసూలు చేస్తారో వివరంగా తెలుసుకుందాం.
ఎగుమతి అయ్యే ప్రధాన వస్తువులు
ఔషధాలు: 12.5 బిలియన్ డాలర్లు
వజ్రాలు: 7.61 బిలియన్ డాలర్లు
ఎలక్ట్రానిక్ పరికరాలు: 6.18 బిలియన్ డాలర్లు
పెట్రోలియం ఉత్పత్తులు: 2-3 బిలియన్ డాలర్లు
వస్త్రాలు: 3-4 బిలియన్ డాలర్లు
సీఫుడ్స్ : 2.5 బిలియన్ డాలర్లు
(ఇతరత్రా అన్నీ కలిపి ఏటా భారత్ నుంచి అమెరికాకు కనీసం 80బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతాయి.)
ఔషధాలు
అమెరికాకు భారత్ నుంచి అయ్యే ఎగుమతుల్లో ప్రధాన వాటా జనరిక్ ఔషధాలు వ్యాక్సిన్లదే. అమెరికన్లు వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40నుంచి 50శాతం భారత్ నుంచే వస్తాయి. ఇందులో బీపీ, డయాబెటిస్, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రధానంగా వాడే మందులు ఉన్నాయి. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఔషధాల వార్షిక విలువ12.7బిలియన్ డాలర్లు. ఈ ఔషధాలు భారత్ నుంచి రాకపోతే అమెరికా ఆరోగ్య వ్యవస్థపై 200బిలియన్ డాలర్ల భారం పడుతుంది. అందుకే ఇండియాకు మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ హోదా ఇచ్చి.. జనరిక్ మందులను అమెరికా దిగుమతి చేసుకున్నది. ఇవి అత్యవసరం కాబట్టి ఇందుకు సున్నా నుంచి 2.5శాతం మాత్రమే సుంకాలు వసూలు చేసింది.
ధరల పెరుగుదల
సుంకాలు పెంచడం వల్ల ఔషధాల ధరలు ఆటోమేటిగ్గా పెరుగుతాయి. ఔషధాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం 25శాతం సుంకాలు వసూలు చేస్తే కనీసంగా ప్రతి గోళీపై ఒక డాలర వరకు ధర పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పది గోళీలు ఉండే స్ట్రిప్ కు ఇప్పుడున్న ధరపై 10డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. క్యాన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధుల మందులపై వార్షి ఖర్చు దాదాపు 8వేలనుంచి 10వేల డాలర్ల వరకు అదనంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ ధరల పెరుగుదల వల్ల అమెరికన్లపై ముఖ్యంగా బీమాలేనివారిపై భారీ భారం పడుతుంది. బీమా ఉన్నప్పటికీ.. ఆ కంపెనీలు కూడా ప్రీమియం పెంచే అవకాశం ఉంటుంది. అంతిమంగా వినియోగదారులపై సుంకాలు తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఔషధాల కొరత
భారత్ నుంచి ప్రతి రోజూ పెద్ద ఎత్తున ఔషధాలు అమెరికాకు షిప్పింగ్ అవుతుంటాయి. అయినా, ఇప్పటికీ భారతీయ జనరిక్ ఔషధాలు అమెరికన్ మార్కెట్లో ఎంతోకొంత కొరత ఉంటూనే ఉన్నది. ఇప్పుడు ఈ సుంకాల భారం వల్ల ఉత్పత్తిదారులకు కనీస లాభాలు కూడా లేకపోతే వారు ఎగుమతి చేయరు.. దీనివల్ల చాలా ఔషధాలు అక్కడి మార్కెట్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఫలితంగా భారీ ధరలు చెల్లించి ఇతర ఔషధాలను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
సుంకాలపై నిర్ణయం వాయిదా
తొలుత భారత్ నుంచి వచ్చే ఔషధాలపైకూడా 25శాతం సుంకాలు వసూచలు చేస్తామని ప్రకటించారు. కానీ, వైట్ హౌస్ విడుదల చేసిన గెజిట్ లో ఔషధాల ప్రస్తావన లేదు. ప్రస్తుతానికైతే పాత పద్ధతిలో ‘సున్నా’ సుంకాలు ఉంటాయని అనుకోవచ్చు. కానీ, ట్రంప్ వర్గం మాత్రం మరికొన్ని వారాల్లో ఔషధాలపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్తున్నాయి. మరికొందరు మాత్రం ఔషధాలపై కూడా 25శాతం లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని ఊహాజనిత చర్చలు చేస్తున్నారు.
వజ్రాలు
ఆభరణాలు, వజ్రాల నాణ్యత విషయంలో భారత్‌పై అందరికీ నమ్మకం ఎక్కువ. ఇండియా లేబుల్ చూడగానే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి నాణ్యమైన వస్తువుగా భావిస్తారు. అందుకే అమెరికాకు ఏటా 7.61బిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు ఎగుమతి అవుతాయి. వజ్రాల నాణ్యత, ప్రత్యేకమైన డిజైన్ కటింగ్, పాలిషింగ్ నైపుణ్యం ఆధారంగా వినియోగదారులు భారతీయ ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. గతంలో ప్రాసెస్ చేసిన వజ్రాలపై 0 నుంచి 5.5% సుంకం వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 26శాతం ట్యాక్సులు వసూలు చేస్తే ఆభరణాలపై ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఎలక్ట్రానిక్స్
భారత్ నుంచి వచ్చే టీవీ, సెల్ ఫోన్ ఉత్పత్తులు.. వాటి విడిభాగాలు, ఉపకరణాలకు అమెరికాలో డిమాండ్ ఉన్నది. అందుకే భారీగా అక్కడికి ఎగుమతి అవుతుంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) ఒప్పందం కారణంగా ఈ విభాగంలోని వస్తువులపై చాలావరకు సున్నా లేదా నాలుగు శాతం వరకు సుంకాలు ఉండేవి. ఇప్పుడు 10శాతంనుంచి 26శాతం వరకు పెరగనున్నది.
పెట్రోలియం ఉత్పత్తులు
అల్ట్రా లో సల్ఫర్ డీజిల్, ఏవియేషన్ ఫ్యుయల్, నాఫ్తా, పెట్రోలియం కోక్, బేస్ ఆయిల్స్-లూబ్రికెంట్స్ ఇతరత్రా పెట్రోలియం ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. అక్కడ ఈ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు వ్యయం ఎక్కువగా అవుతుండటంతో ఇండియానుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ ఉత్పత్తులు అమెరికా ప్రయోజనాల కోసం చేస్తుండటం వల్ల వీటిపై కూడా సున్నా నుంచి ఒక శాతం మాత్రమే సుంకాలు వసూలు చేసేవారు. ఈ రంగంలో ఎగుమతుల విలువ ఏటా 2 నుంచి 3 బిలియన్ల డాలర్లు ఉంటుంది.
టెక్స్ టైల్స్
అమెరికాకు కాటన్ రెడీమేడ్ దుస్తులు ఎక్కువగా మనదేశంతోపాటు బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి అవుతాయి. ఈ రంగంలో ఎగుమతుల విలువ దాదాపు 3నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. కాటన్ దుస్తులపై 5 నుంచి 15శాతం సుంకాలు వసూలు చేసేవారు. రకాన్ని బట్టి షర్ట్స్ పై 12 నుంచి 15, నేత వస్త్రాలపై 7 నుంచి 10శాతం సుంకాలు ఉండేవి. ఇప్పుడు అన్నింటిపై కనీసం 10 శాతం.. గరిష్ఠంగా 26శాతం ఉండనున్నది.
రొయ్యలకు షాక్
భారతీయ ఆక్వా రంగం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. అమెరికా 26% సుంకాలు విధించడంతో, భారతీయ రొయ్యల ఖరీదు అమెరికా మార్కెట్‌లో భారీగా పెరుగుతాయి. దీనితో ఎగుమతిదారులు తమ లాభాలను కాపాడుకోవడానికి రైతుల నుంచి కొనుగోలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్నటివరకు ఎక్స్ పోర్ట్ క్వాలిటీ రొయ్యలు కిలో రూ.240 ఉండగా.. ఎగుమతిదారుల ఒత్తిడితో ధర రూ.200కు పడిపోయింది. ఇది రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చనున్నది. భారతదేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 70శాతం. దీనిలో ఎక్కువ భాగం (కనీసం 40నుంచి50%) అమెరికాకు ఎగుమతి అవుతుంది. 2023-24లో భారత్ నుంచి అమెరికాకు $2.5 బిలియన్ విలువైన సీఫుడ్ ఎగుమతి అయింది, దీనిలో 92% రొయ్యలే కావడం విశేషం.
సుంకాలతో లాభాలెలా?
ఈ ట్రేడ్ వార్ వల్ల భారతీయ రొయ్యలు ఇతర దేశాలతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంటుంది. ఈక్వెడార్, వియత్నాంవంటి దేశాలకు అమెరికా ఎగుమతి సుంకం 10శాతమే వసూలు చేయనుండటంతో సహజంగానే అక్కడినుంచి రొయ్యలను కొనుగోలు చేసేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతాయి. రొయ్యల ఎగుమతి వ్యాపారంలో లాభాలు సాధారణంగా 4-5% మాత్రమే ఉంటాయి. అమెరికా ప్రకటించిన తాజా సుంకం 26% దీనికి ఇప్పటికే ఉన్న 5.77% కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (CVD)తో కలిపితే, మొత్తం సుంకం 33%కి చేరుతుంది. ఈ అదనపు భారాన్ని ఎగుమతిదారులు భరించలేకపోతే, వారు ఆర్డర్‌లను తగ్గించవచ్చు లేదా వ్యాపారాన్ని ఆపేయవచ్చు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే రవాణాలో ఉన్న 2,000 కంటైనర్లు, కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న రొయ్యలపై కూడా ఈ సుంకాలు వర్తించే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు. ఈ ఖర్చును ఎగుమతిదారులే భరించాలి. దీనివల్ల వారికి రూ. 600 కోట్ల అదనపు నష్టం వచ్చే ప్రమాదం ఉన్నదని సీఫుడ్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఉపాధికి దెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో 5.7 లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతున్నది. ఇందులో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రధానమైనవి. ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది రైతులు, కూలీలు, చిన్న వ్యాపారుల జీవనోపాధి సుంకాల వల్ల ప్రమాదంలో పడింది. ఎగుమతులు తగ్గితే, ఉపాధి అవకాశాలు కూడా క్షీణిస్తాయి. ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడం వల్ల రైతులు కొత్త సాగు చేయడానికి ఆర్థికంగా భయపడవచ్చు. దీనితో ఆక్వా రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయి.
కేంద్రానికి చంద్రబాబు లేఖ
అమెరికాతో చర్చలు జరిపి రొయ్యలను సుంకాల నుంచి మినహాయించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ లేఖ రాశారు. భారత ప్రభుత్వం కూడా సుంకాలను తగ్గించేందుకు అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతుందని ప్రకటించింది. కనీసం రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం రొయ్య పెంపకందారులతో సమావేశాలు నిర్వహించి, ప్రత్యామ్నాయ చేపల సాగు, కొత్త మార్కెట్లను పరిశీలిస్తోంది.






