- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం తెలంగాణోళ్లం.. దిల్‌దారోళ్లం.!
తాగుడు తినుడే గాదు.. త్యాగాలు కూడా తెలుసు మాకు.

"తెలంగాణోళ్లం"టే..
బయటొక అభిప్రాయం ఉంది.
"తాగుతరు.. తింటరు" అనీ.
"తాగనోడెవడు.. తిననోడెవడు" కానీ..
అట్ల బద్నామెందుకైతున్నం.?
"బొక్కలు" మెడలో ఎందుకేసుకుంటున్నం.?
"మనకు ఇగురం తక్కువ" అనేటొళ్లూ ఉన్నరు.
మనది "ఇగురంగల్ల నేల" అని వాళ్లకు తెల్వక కాదు.
బట్టగాల్చి మీదేసి బద్నాంజేస్తరట్లా.
ఎవడు దొంగరా అంటే..
"గుడ్డ బట్టలోడు దొంగ" అనాలె కదా.?
అందుకే జర.. మనం మారాలె.
ఇక "వాళ్లింతే" అనిపించుకోవద్దు.
- దాయి శ్రీశైలం
అవ్.. మేం తెలంగాణొళ్లం. ఇట్లనే ఉంటం. ఒకని నాశనాన్ని కోరుకోం. ఒకనికి చెడు తలపెట్టం. నమ్మితే ప్రాణమిస్తం. నక్రాల్ జేస్తే తోడ్కల్ తీస్తం. తాగుడు తినుడే గాదు.. త్యాగాలు కూడా తెలుసు మాకు. పక్కోనికి ఆపదొస్తే పరదా వేస్కునేటొళ్లం కాదు.. పక్కా సాయంజేశి పరేషాన్ లేకుంట జేస్తం. అవ్.. నివద్దే. మాక్కొంచెం తిక్కుంటది.. కానీ దానికో లెక్కుంటది.
తాగుడు తినుడే కాదు..
అమెరికా నుంచి అట్లాంట వరకు ఎక్కడైనా సూడున్రీ. మనొళ్లు నలుగురు కలిస్తే "సిట్టింగ్" వేస్తరు. మనొళ్లేగాదు.. ఇయాలరేపు దునియాల ఎవ్వరైనా ఇట్లా గ్యాదరవ్వుడు కామన్. కాకపోతే మనొళ్లు దానికి కొంత హైప్ ఇచ్చి వీడియోలు తీసుకుంటరు. గళ్లా ఎగరేసుకుంట "మేం తెలంగాణొళ్లం బై" అని సోషల్ మీడియాలో పెడ్తుంటరు. మన "తాగుడు తినుడు" గురించి లోకమంతా తెలుసు. "అయ్య" హాల్లో కూసొని తాగితే.. "కొడుకు" బెడ్రూంలో కూసొని బరాబర్ బాజాప్త తాగుతరు. ఇది అందరికీ ఎర్కున్న ముచ్చట్నే. అందరికీ తెలిసినంకా దానికి మనమే "బ్రాండ్ అంబాసిడర్లం" అని ఫోకస్ అవుడెందుకు.? "తాగుడు తినుడే" కాదు.. మనది త్యాగాల నేల. తెలంగాణోడి త్యాగం దునియా మొత్తం తెలవాలె. మనం ఫోకస్ అవ్వాల్సింది అగో దాంట్ల.
మాకు సెంటిమెంట్లెక్కువ
"తెలంగాణొళ్లకు సెంటిమెంట్లెక్కువ" అంటరు చాలామంది. ఔను.. నిజమే. మనకు మస్తు సెంటిమెంట్లుంటయి. ఊరంటే ప్రాణం. అమ్మనాయిన అంటే ప్రేమ. తోడబుట్టినొళ్లంటే రెస్పెక్ట్. ఎవర్నీ తక్కువ జేయొద్దు.. ఎవరి మనసునూ నొప్పించొద్దనే మనస్తత్వం మనొళ్లది. తల్లిదండ్రులను.. ఊరును విడిచి పెట్టి ఉండబుద్ది కాదు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి దోస్తుగానికి దూరంగా ఉంటందుకు మనసు ఒప్పుకోదు. కానీ.. తప్పదు కదా.? సెంటిమెంట్ అనేది మనకు బలాన్నియ్యాలె. బలహీనతగా మారొద్దు. పెద్ద లక్ష్యాల ముందు పెంచుకున్న కోడిపిల్ల.. ప్రేమగల్ల కుక్కపిల్లలు అడ్డురావొద్దు. "అరే తెలంగాణొళ్లకు ఇల్లిడిస్తే పిల్లి కరుస్తదన్నట్లు ఇంట్లకెల్లే బైటికెళ్లరు" అని జరుగుతున్న ప్రచారాన్ని మనొళ్లు కొందరు నిజం చేస్తుంటరు. ఎన్నో అవకాశాలుంటయి. ఎన్నో ఆఫర్లు వెతుక్కుంటొస్తయి. కానీ "సెంటిమెంట్"ను సాకుగా చూపెట్టి చేజేతులా పోగొట్టుకుంటాం. దానివల్ల నష్టం మనకే కదా.?
ఇగురం తక్కువనా మనకు.?
ఇది నిజమో కాదో మనమే ఇంకోసారి ఆలోచించుకోవాలె. ఆత్మ పరిశీలనగూడ చేసుకోవాలె. ఏమాత్రం నామోషీగాకుండ వాస్తవాన్ని ఒప్పుకోవాలె. "మనకు ఇగురం తక్వ" అంటుంటరు కొందరు. అదెట్లా అంటరా.? మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నయనుకోన్రీ. వేరేవాడయితే దాన్ని రెండు లక్షలు ఎట్లజెయ్యాలె అని ఆలోచిస్తడు. మనమేమో "ఉంటయా పోతయా.? ఒగాల భూమ్మీద పెడ్తే లాసొస్తే.. మిత్తీకిస్తే తీస్కున్నోడు ఎగ్గొడ్తే" అని "లచ్చతొంబై" డౌట్లు వెతుకుతం. పోనీ బ్యాంకులో అయినా డిపాజిట్ చేస్తమా అంటే అదీ చెయ్యం. "గురిగిల పైసలు గురిగలనే" పిల్లలు పెట్టాలె అనుకుంటం. డేర్ చెయ్యం. ఎంతసేపూ కంఫర్ట్ జోన్‌నే వెతుక్కుంటం. అంతా అయిపోయినంక "ఆ ప్లాటును కొనమని నన్నుగూడ అడిగిండ్రు.. అప్పుడు పదివేలకే 100 గజాలు వస్తుండె" అని బాధపడ్తే కాదుగదా.?
పెట్టడంలో పెద్ద చెయ్యే
ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలె.. మనొళ్లది పెట్టుట్ల పెద్ద చెయ్యే. ఇంటిముంగటికి ఎవరన్నా వస్తే ఉత్త చేతుల్తో పంపరు. అది సుట్టమైనా.. దోస్తయినా.. ఆఖర్కి అడుక్కునేవాళ్లయినా. "పెట్టి పదిసార్లు" చెప్పుకునే బాపతయితే కాదు. దెప్పి పొడిచే రకం అయితే అస్సలు కాదు. అయితే కొన్నిసార్లు ఇదే కొంప ముంచుతుంది. అదెట్లా అంటరా.? "ఫలానోడు అడిగితే కాదనడు" అని వాడుకొని మోసం చేసేటొళ్లు మస్తు మంది ఉంటరు. "వాళ్లు నావాళ్లూ.. వీళ్లు నావాళ్లూ" అని ఆపతి సాపతికి అర్సుకుంటే ఆఖరికి "ఏం పెట్టినవయ్యా" అనేటొళ్లు కూడా ఉంటరు. అందుకే సాయం చెయ్.. కానీ పనికిరాని సాయం చెయ్యకు. ఎంతసేపూ వాళ్లకూ వీళ్లకూ అని ఆలోచించి.. నీ కుటుంబానికి "గుండు సున్నా" మిగల్చొద్దు అంటున్నాం. నీ గల్లాపెట్టె "సున్నా" అని తెలిస్తే సుట్టంగూడ మర్లిసూడడు.
కుట్రలు కుతంత్రాలుండవ్
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. నమ్మినా.. నమ్మకపోయినా తెలంగాణొళ్లు కల్లా కపటం లేనొళ్లు. మనకు కుల్లుకుతంత్రాలు ఉండవ్ భయ్. అందరూ మావొళ్లే అనుకుంటరు. ఏమున్నా ఖుల్లంఖుల్లా మొఖమ్మీదన చెప్పేస్తరు. కుట్రలు తెల్వయని ఎవడన్నా మోసం చెయ్యాలని చూస్తే మాత్రం ఊకునేది లేదు. ఐతే.. మనొళ్లు చేసే కొన్ని పనుల వల్ల "తెలంగాణొళ్లు అంబ్యాద మనుషులు" అంటుంటరు. అంటే "లోకజ్ఞానం" తెల్వనొళ్లు అన్నట్లు. లోకజ్ఞానం తెల్వనంత అమాయకులు కాదు తెలంగాణొళ్లు. మనం కల్మషం లేకుండా ఉంటం.. ఎవరేది అడిగినా కాదనం.. అన్నింటికీ రెస్పాండ్ అవుతం కాబట్టీ కొందరు మనల్ని "ఉత్త అంబ్యాదొళ్లు" అనుకుంటరు. కొన్ని విషయాలల్ల ఎంత ఇన్వాల్వ్ కావాల్నో అంతనే అయితే బాగుంటది. ప్రతీదానికి స్పందిస్తే కూడా ఎడ్డి బాగులొళ్లనే ముద్రేస్తరు.
ఊర్లు పల్లెలు కొనేస్తం
లష్కర్లో ఉన్నా.. లండన్లో సెటిలైనా సరే.. తెలంగాణ దిల్లున్నొళ్లను అబ్జర్వ్ చేయండ్రీ. బాటపొంటి పొయ్యెటొళ్లను బాగున్నవా అని పలకరించి భోజనం పెట్టే "దిల్దారొళ్లు" మనొళ్లు. చేతిలో పైసా లేకున్నా పోకడ పెద్దగా పోతరు. దిల్ ఖుషీగుంటే అంగట్ల నిలవడి అన్నీ బేరంజేస్తరు. అది అవసరముందా లేదా.. దాని రేటెంత.? జేబులో ఉన్న ఖజానా ఎంత.? అనేవేవీ పట్టించుకోరు. ఒకరకంగా లెక్క చేయరు. చేతిలో పైసా లేకున్నా "ఊర్లు పల్లెలు" కొనెటందుకు సవాల్ జేస్తుంటరు. ఇంట్లో సమరు లేకున్నా రుబాబుతోని సుట్టాలను పిలిపించి గట్టిగ "దావత్" జేద్దామనుకుంటరు. అందరూ వెళ్లిపోయినంక అయ్యో అంతయ్యిందా ఇంతయ్యిందా అని తలెశెంబులు ఎత్తేసుకుంటరుగానీ పక్కోన్ని పది పైసలు అడగరు. అందరూ ఇట్లనే ఉంటరని కాదు. సగటు తెలంగాణియన్ దిల్ ఇట్లనే ఉంటది.
మాటిస్తే తప్పం..
హాస్పిటల్స్ పొంటి.. పోలీస్ స్టేషన్ల పొంటి ఒకసారి చూడున్రీ. పైసా ఫాయిదా లేకపోయినా గాలికివొయ్య పంచాయతీలన్నీ భుజమ్మీదేసుకొని సాయం జేస్తుంటరు మనొళ్లు. అదే వేరేవాళ్లయితే ఎక్కడ్నో ఏసీల కూసొని "మావోడొక మనిషొస్తడు.. సూడు" అని చేతికి మట్టి అంటకుండా పైరవీలు చేస్తుంటరు. కానీ తెలంగాణొళ్లు అట్లగాదు. డైరెక్టు రంగంలకు దిగుతరు. ఏదన్న పని చేస్తా అని ఒప్పుకుంటే అది పక్కా చేస్తరు. సొంతం పనైనా పక్కకు పెడతరుగానీ.. "ఒప్పుకున్న పనైతే" పక్కా చేస్తరు. అందరిలెక్క మాటిచ్చీ.. మాటి మాటికీ బతిలాడించుకునుడు.. చెప్పులు అరిగెటట్లు తిరిగిపించుకునుడు మనొళ్లతో కాదు. ఆ పని చేసిపెడ్తే పైసా ఫాయిదా ఉండదని తెలుసు. టైం బొక్క.. మీదికెల్లి తిరుగుడు అని తెలిసినా.. బాస్ చేసిపెట్టమన్నడనో.. బామ్మర్ది అడిగిండనో ఉరికురికి పనులు చేసి పెడ్తరు. మర్యాదల్నే కాదు.. మాటిస్తే కూడా తప్పం అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటరు.
మట్టిని ప్రేమిస్తం
ఊర్లపొంటి సూడున్రీ. డిగ్రీ పీజీ చదివి.. మంచి టాలెంటున్నొళ్లు ఎంతోమంది బయట ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా "రెండెకరాల పొలం" కాడనే అంటిపెట్టుకొని ఉంటరు. అవే రెండు బర్లు.. రెండు ఆవులు.. రెండు మడుల ఆకుకూరలు.. ఇంటిమందం వరిసాగు. ఇంతే.. చిన్నప్పటి నుంచి తిరిగిన తొవ్వను.. తాకిన మట్టిని విడిచిపెట్టకుండా అక్కడ్నే ఉంటరు. టెక్నాలజీ ఎంత తెలిసినా.. ట్రెండ్స్ ఎన్ని మారుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా పొలంలో పెట్టుకున్న మైసమ్మ తల్లినే నమ్ముకుంటరు. మంచిగ యాట కోసి.. దావత్ చేసి "పంటలు మంచిగ పండనీ తల్లీ" అని మొక్కుకుంటరు. ఇట్లా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడి ఉండొచ్చు. ఆధునిక జీవనశైలిని అక్కున చేర్చుకోవడంలో వెనకబడి పోవచ్చు. రంగుల ప్రపంచంలో రాటుదేలకపోయి ఉండొచ్చు కానీ.. మట్టిని ప్రేమించడంలో ఎప్పుడూ ముందే ఉన్నారు.
లడాయికి అస్సలు తగ్గం
మట్టిని ప్రేమస్తమనీ.. సెంటిమెంట్లెక్కువనీ దేన్నిపడితే దాన్ని సహించరు తెలంగాణొళ్లు. లాలించడం తెలుసూ.. లడాయి చేయడమూ తెలుసు మనొళ్లకు. ఈ నేల చరిత్రలోనే పోరాటం.. ఉద్యమం ఉంది. "తల్లి తీరు పిల్ల.. ఇల్లు తీరు వాకిలి" అంటారు కదా.? ఇదే కొన్నిసార్లు చెడ్డపేరు తీసుకొస్తది. "అరే వీళ్లేందిరా చిన్నదానికీ.. పెద్దదానికీ లడాయి అంటరు" అనే భావన రానీయొద్దు. దేనికి తొడకొట్టి మీసం మెలెయ్యాల్నో దానికే రెస్పాండ్ కావాలె. పనికిరానీ.. పసలేని పంచాయతీ అని తెలిస్తే.. తగ్గాల్సిందే. మంచిని ప్రేమించడం.. చెడుతో చెడుగుడు ఆడుకోవడం మన బ్లడ్‌లోనే ఉంది కదా బాస్. "శరం గల్లొళ్లం" మనం. ఇజ్జత్ తక్కువ పనులు చేయకుండా విలువతో బతకాలి. సినిమాల్లో చూయించినట్లు రౌడీల లెక్క.. గుండాల మాదిరి ఉండొద్దు. ప్రతీ "తెలంగాణియన్" మంచి దిల్లున్నోడు అనిపించుకోవాలె.
పైసలే ప్రపంచం కాదు
కొందరుంటారు ప్రతీది పైసాతో కాలిక్యులేట్ చేస్తారు. ప్రతి పనికీ పైసా ఆశిస్తారు. ఎందుకో ఏమోగానీ ఆ పిచ్చి మొదట్నుంచీ మనొళ్లలో తక్కువనే ఉంది. ఒకరకంగా అదొక గిఫ్ట్ అనుకోవచ్చు. "ఇవీ మానవ సంబంధాలంటే" అని ఎంతోమంది మెచ్చుకున్నరు. అయితే ఈ మధ్యన ఆ సంప్రదాయం బ్రేక్ అవుతోంది. తెలంగాణొళ్లంటే తోడబుట్టినొళ్లకు ప్రాణమిస్తరనే పేరుంది కదా.? ఆ పేరు పెద్దవాగులో కొట్టుకపోతుంది. మన భూములకు విలువెక్కువ కదా.? వాటికోసం అన్నదమ్ముండ్ల మీద అక్కాచెల్లెండ్లు కేసులేస్తుండ్రు. తొవ్వలు పాశిపోతున్నయి. తోడబుట్టినొళ్లు కాబట్టీ అడగకముందే వాళ్లదేందో వాళ్లకు ముట్టజెప్పొచ్చు. లేదంటే మెట్టినింట్ల ఉన్నది చాల్లే.. వీళ్లదెందుకూ అని అక్కాచెల్లెండ్లే పెద్ద మనసు చేసుకోవచ్చు. పైసలే ప్రపంచం కాదు కదా.? బంధాలు ముఖ్యం.
ఎగురుతం దుంకుతం
"మాది తెలంగాణ" అని చెప్తే వెంటనే "దావత్ మస్తు జేస్తరు" అనే రిప్లయ్ వస్తుంటది. తెలంగాణను.. దావత్‌ను వేరుచేసి సూడలేం. బిడ్డ పుట్టినప్పటి నుంచి షురువైతది ఈ దావత్ ట్రెండ్. దావత్ లేని సీజనేదీ ఉండదు. దావత్ మన పేటెంట్ అంతే. ఎగురుతం.. దుంకుతం.. ప్రతీది పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటం. "దావత్ చేస్కుంటున్నం" అంటే ఇక్కడ తాగి తలకువోసుకునుడే కాదు. మంచి కమ్యూనికేషన్‌ను మెయింటెన్ చేస్తూ.. ఒకరి ఆపతి ఒకరు పంచుకొని సాల్వ్ చేసుకోనీకె జరిపే వేడుక దావత్. కానీ కొందరు దావత్ రూపాన్నే మార్చేస్తుండ్రు. తుమ్మినా దగ్గినా "పార్టీ లేదా పుష్పా" అని అడుగుడుతోని.. "ఎగిరి దుంకెటందుకే" దావత్ చేసుకుంటరనే రాంగ్ మెసేజ్ పోతుంది. అవ్ భయ్.. మనం తెలంగాణొళ్లమే.. ధూమ్ ధామ్ జేస్తంగానీ అంగీలు చింపుకొని ఎగిరి దుంకం.
దిల్‌దారోళ్లం: మార సురేష్, మంచాల
ఊర్లల్ల అందరం కలిసి మెలిసి ఉంటాం. సంబరాలు ఘనంగా చేసుకుంటం. తినడం తాగడం పక్కకు పెడితే.. జీవితంలోని ప్రతీ మూవ్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తాం. దావతొక్కటే కాదు.. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునే నేచర్ మనది. అందుకే మనల్ని "దిల్దారొళ్లు" అని అంటారు.
సెంటిమెంట్ మంచిదే: పల్లె సన్నీ, యాక్టర్
మేం బిర్యానీ.. ఫెస్టివల్స్.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తం. మా ప్రతీ గ్యాదెరింగ్‌లో మానవీయత.. సామాజిక సంబంధాల బలం దాగి ఉంటుంది. మనొళ్లకు ప్రేమలెక్కువ. సెంటిమెంట్లు ఎక్కువ. అవి ఎవరికీ నష్టం చేయవు. సెంటిమెంట్ లేకపోతే లైఫ్‌లో ఏదో వెలితి ఉన్నట్లే. నా ప్రతీ సినిమాలో తెలంగాణదనం కనిపిస్తుంది.
మట్టి వాసన: కుమార స్వామి, సినీ దర్శకుడు
తెలంగాణ మన సంస్కృతి.. మన జీవైనశైలి శ్వాస. తెలంగాణ భావనను సజీవంగా సినిమాల్లో చూపించేందుకు ప్రతీ సన్నివేశంలో తెలంగాణదనం ఉట్టిపడేలా చిత్రీకరిస్తాం. మాటల్లో మట్టి వాసన.. వేషభాషల్లో మన పల్లె గౌరవం.. సంఘటనల్లో మన ఆత్మీయతను పొందుపరుస్తున్నాం. ప్రేక్షకుడు గర్వంగా ఫీలయ్యేలా తెలంగాణను సినిమాల్లో ఇనుమడిం జేస్తున్నం.
అదొక ఎమోషన్: సుధీర్ జలగం, ఎన్నారై
మేం ఎక్కడున్నా తెలంగాణొళ్లమే. తెలంగాణ అంటే అదొక ఎమోషన్. అదొక అద్భుతమైన ఫీలింగ్. అమెరికాలో కూడా తరుచూ గ్యాదరింగ్స్ చేస్తుంటాం. అక్కడన్నీ తెలంగాణ ముచ్చట్లే పెట్టుకుంటం. మేం మాట్లాడే భాష.. యాస.. వేషధారణంతా తెలంగాణదనమే కనిపిస్తుంది. తెలంగాణ బాగోగుల గురించి చాలా డిస్కస్ చేస్తం. ఇక మన అస్తిత్వమైన బతుకమ్మ, బోనాలు, దసరా వంటి సంబరాలను అమెరికాలో చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తాం.






