- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోడలపై గలీజ్ రాతలు!
మనోళ్ల చేతులు ఊకెనే గులగుల పెడతయి. చెయ్యి ఖాళీగుంటే సాలు.. అది బాత్రూమా.. బస్టాండా.. కాలేజా.. కమ్యూనిటీ హాలా.. పాఠశాలనా.. దేవాలయమా అనేదేదీ సూడరు.

దిశ, ఫీచర్స్: మనోళ్ల చేతులు ఊకెనే గులగుల పెడతయి. చెయ్యి ఖాళీగుంటే సాలు.. అది బాత్రూమా.. బస్టాండా.. కాలేజా.. కమ్యూనిటీ హాలా.. పాఠశాలనా.. దేవాలయమా అనేదేదీ సూడరు. పబ్లిక్ ప్రాపర్టీ కనిపిస్తే కవిత్వం తన్నుకొస్తుందంతే. గోడలపై బూతు కవిత్వం.. బెంచీలపై సరస సాహిత్యం.. లేడీస్ సీట్ల మీద లేకి రాతలు.. రైలు బోగీలపై భోగపు సాహిత్య కళతో తమ జ్ఞానాన్ని వొలకబోస్తుంటారు. అదేం ఆనందమో మరీ? ఖాళీ గోడ కనిపిస్తే అంతా కవులై.. రచయితలైపోయి బూతు రాతలతో రోత పుట్టిస్తుంటారు.
గోడల మీద పనికిమాలిన రాతలా?
ఒకసారి బయట సూడండి. పబ్లిక్ ప్లేస్‌లో మనోళ్లు ఎట్లుంటరో? చెప్పమంటే నీతులు మస్తు చెప్తరు. కానీ బయటికెళ్తే గలీజును లీజుకు తీసుకున్నంత దర్జాగా పనికిమాలిన రాతలు రాస్తుంటారు. మామూలుగా ఇసొంటి చిల్లర పనులు సదువుకోని వాళ్లు.. మత్తు పదార్థాలకు బానిసైన వాళ్లు.. ఫ్రస్టేషన్లో ఉన్నవాళ్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఏది మంచో.. ఏది చెడో తెలిసిన మూర్ఖులే ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఒక వాస్తవ సంఘటన గురించి తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామం. ఒకడు బాగా సదువుకున్నోడే. ఊర్లోని వివాహిత మహిళ పరువు తీయాలనుకున్నాడు. చౌరస్తాలో అంబేద్కర్ బొమ్మ దగ్గర బొగ్గుతో పెద్ద పెద్ద అక్షరాలల్లో ఆ వివాహిత మహిళ పేరుతో ‘నేను ఈ రోజు అర్ధరాత్రి సురేష్‌తో పారిపోతున్నా’ అని రాసిండు.
పబ్లిక్ ప్లేసులో ఏం చేసినా నడుస్తుందా?
ఇదేం కల్చర్? ఆమెకు, వాడికి ఏం పంచాయతీ ఉందో తెల్వదు. సరే ఏమున్నా ఇట్లా రచ్చకీడ్చి ఇజ్జత్ తీసి పైశాచికానందం పొందడమేంది? వాడి సదువు, జ్ఞానం ఎక్కడ పోయినయి? అంటే తన పర్సనల్ పంచాయితీని పబ్లిక్ ప్లేస్‌లో పెట్టాల్నా? అంబేద్కర్ బొమ్మ దగ్గర ఏం రాసినా నడుస్తది? ఎవరూ పట్టించుకోరనే లెక్కలేని తనమా? పబ్లిక్ ప్లేసులో ఏంచేసినా నడుస్తుందనే నిర్లక్ష్యమా? పిచ్చిరాతలతో న్యూసెన్స్ చేయొచ్చనే బరితెగింపా? పబ్లిక్ ప్రాపర్టీని పాడుచేస్తే అడిగే వాడుండడు. ఆరా తీసే వాడుండడనేనా? ఒక్క ఈ సంఘటనే కాదు. గల్లీ గల్లీకి ఇసొంటి గలీజ్ రాతలు రాసే బ్యాచ్ ఒకటి తయారైంది. అట్లా చేస్తే తనకొచ్చేది పైశాచికానందం తప్ప పైసా ఫాయిదా ఉండదు. ఐనా.. తమ ఈగో సాటిస్‌ఫై కోసం రోత పుట్టిస్తుంటారు.
పబ్లిక్ టాయిలెట్స్‌లో కళా ప్రదర్శనా?
గోడల మీద గలీజ్ రాతలు రాసే పనికిమాలిన బ్యాచ్‌లో బూతు ఆణిముత్యాలు కూడా ఉంటారు. పబ్లిక్ టాయిలెట్స్‌లో బూతు బొమ్మల కళా ప్రదర్శనే వాళ్ల పని. అదే తమ గొప్ప నైపుణ్యంగా ఫీలవుతుంటారు. సులభ్ కాంప్లెక్స్‌లు, పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడుంటే అక్కడ తమ సైకోయిజానికి స్వాగతం పలుకుతుంటారు. తమ ప్రేమను తిరస్కరించిన వాళ్ల ఊహా చిత్రాలను అసభ్యంగా, అశ్లీలంగా టాయిలెట్ గోడలపై చిత్రీకరిస్తుంటారు. గలీజ్ మాటలు, గబ్బు సూక్తులు, మహిళల పేర్లు, ఊర్లు, ఫోన్ నెంబర్లు రాస్తుంటారు. కట్ చేస్తే వీళ్లంతా బయట పెద్ద పెద్ద నీతి వాక్యాలు వల్లించేవాళ్లే. పైకి ఒకలాగా.. లోపల ఇంకోలాగా ఉంటూ పబ్లిక్ టాయిలెట్స్‌లో పచ్చి బూతులతో సైకోయిజాన్ని చాటి చెప్తుంటారు. దీనిని ఎవరూ చూడరు.. ఏ శిక్షా ఉండదనే ధీమాతో ఉంటారు.
లేడీస్ సీట్లపై లవ్ సింబల్స్ న్యూసెన్సేలా?
బస్సులలో అయితే ఇక పిచ్చి రాతలకు అడ్డూ అదుపే ఉండదు. ఎవనికి వచ్చింది వాడు.. ఎవనికి తోచింది వాడు రాస్తుంటాడు. వాళ్ల దృష్టిలో బస్సు అందరిదీ. ఎవరైనా అడిగితే ‘నీదా? నీ ఇంట్లోకొచ్చి రాస్తున్ననా?’ అని ఎదురుదాడి చేస్తుంటారు. ‘మా ఊరి బస్సు మా ఇష్టం. మీరేంది వద్దని చెప్పేది’ అంటూ వితండవాదం చేస్తుంటారు. లేడీస్ సీట్ల వెనకాల, ఫుట్‌పాత్ మీద, రూఫ్‌టాప్ మీద లవ్ సింబల్స్, అమ్మాయిల బొమ్మలు గీసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇదే బ్యాచ్ ఇన్‌స్టాలో ‘స్త్రీలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’.. ‘ఈ బస్సు మనందరిది.. దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం’.. ‘ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం.. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరం’ అని సూక్తులు వల్లిస్తుంటారు.
నైపుణ్యం చూపేది వాటిలోనేనా?
రాతలే కాదు.. రాసి అంటించే పోస్టర్లకూ బస్సులు పుణ్యానికి దొరుకుతయి. ‘మీకు మనశ్శాంతి లేదా?’.. ‘అనారోగ్య సమస్యలున్నాయా?’ అని మన సమస్యల్ని క్యాష్ చేసుకోవచ్చని రకరకాల పాంప్లెట్స్ బస్సుల్లో అంటిస్తారు. ‘సిబిల్ స్కోర్ లేకున్నా పది లక్షల లోన్ ఇస్తాం.. వెంటనే కాల్ చేయండి’ వంటి బొగాట మాటలు.. ‘మీకు సంతాన సమస్యలున్నాయా?’.. ‘పెండ్లి కావడం లేదా’ అనే డూప్లికేట్ రాతల పోస్టర్లు బస్సుల్లో ఖాళీ జాగా లేకుండా అంటిస్తారు. ఇవేం బూతు రాతలు కావుగానీ.. అంతే నష్టం చేసే ప్రమాదముంది. ప్రజల సమస్యలను సొమ్ము చేసుకోవడానికి ఇలాంటి ఎర వేస్తుంటారు. ఇదీ ఒక రకంగా న్యూసెన్సే. బస్సు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కాబట్టీ దాంట్లో ఏమైనా రాసుకోవచ్చు.. ఏమైనా అంటిచ్చుకోవచ్చనే అభిప్రాయంతో ఉంటారు.
కట్టుదిట్టమైన మెట్రోనూ వదల్లేగా?
రైల్లో అయితే ఇక అంతా అసభ్యమే. ఇక్కడ అడిగేవాళ్లుండరు కదా? అంతా గబ్బుగబ్బు చేస్తుంటారు. బాత్రూమ్‌లు నీటుగా ఉంచకపోవడం.. కూర్చున్న చోటే ఉమ్మివేయడం వంటివే కాదు. అడ్డగోలు ఆగం రాతలకు కూడా రైళ్లు ఈజీగా దొరుకుతాయి. ఒకడు మంత్రాలు రాస్తడు. ఇంకొకడు అంత్రాలు కడతడు. లవ్వు ప్రపోజల్స్.. కొవ్వు పట్టిన బూతు ప్రవచనాలు వంటివెన్నో రాస్తుంటారు. ఇక మెట్రోలోకి కూడా ఎంటరయ్యారు వీళ్లు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సీసీ కెమెరాల భయమూ ఉంటుంది. మొదట్లో మెట్రోలో చిన్నపాటి పేపర్ ముక్క కింద పడినా మేనేజ్మెంట్ జరిమానా వేస్తుందనుకునేవాళ్లు. కానీ ఇప్పుడా భయం లేకుండా పోతోంది. మెట్రోలోనూ ఫ్లర్టింగ్ కోట్స్, పాష్ బూతు మాటలు, లవ్ సింబల్స్, అమ్మాయిల షిలౌట్స్ గీస్తున్నారు.
కాలేజీ బెంచీలపై కామ కవితలా?
కొందరికైతే కాలేజీ, యూనివర్సిటీ క్యాంపస్, హాస్టల్స్, స్టడీ హాల్స్ విలువ అస్సలు తెలియదు. సరస్వతీ నిలయమైన కాలేజీ గోడలపై పాడు రాతలు రాసి పైశాచికానందం పొందుతారు. సాహిత్య, కళా, చిత్రలేఖన పరిశోధనా విభాగాల ద్వారా ఎన్నో అవకాశాలున్నా వాటి అంచుకు కూడా వెళ్లరు. కానీ.. అదే సాహిత్య, కళా, చిత్ర లేఖన నైపుణ్యాన్ని పనికిమాలిన పనులకు వాడుతుంటారు. బెంచీల మీద, క్లాస్ రూమ్ గోడలపైన, బ్లాక్ బోర్డుపై, ఆడిటోరియం గోడలపై, ఎంట్రెన్స్ పిల్లర్లపై చిల్లర రాతలు రాసి చికాకు తెప్పిస్తుంటారు. అమ్మాయిల పేర్లు పెట్టి ‘నువ్వు నాకు నచ్చావ్’.. ‘నువ్వంటే నాకిష్టం’.. ‘పూజకోసం పువ్వు.. నా కోసం నువ్వు’.. ‘ప్రేమించుకుందాం రా’.. వంటి చెత్తనంతా నింపేసి క్యాంపస్‌లో కంపులేపుతుంటారు.
హాస్పిటల్స్‌లో రోత సూక్తులా?
సర్కారు హాస్పిటల్స్‌కి రకరకాల ప్రజలు రకరకాల సమస్యలతో వస్తుంటారు. ఎంతసేపూ ఆరోగ్య ధ్యాసే ఉంటుంది వాళ్లకు. వాస్తవానికీ వేరే సంగతుల గురించి ఆలోచించే ఓపిక ఉండదక్కడ. కానీ కొందరు చిచోరా గ్యాంగ్ హాస్పిటల్స్‌లోనూ ఆగమాగం చేస్తుంటారు. నర్సుల మీద డబుల్ మీనింగ్ డైలాగులు.. లేడీ డాక్టర్లపై ఎకసెక్కాలు.. ఇంకా బూతు సాహిత్యం రాస్తుంటారు. గోడలు, బెడ్లు మొత్తం చెత్త రాతలతో నింపేస్తారు. ఇంకా ఇదంతా చాలదన్నట్టు పోస్టర్లు అంటిస్తుంటారు. దాంట్లో కూడా అదే చెత్త. అంటే తమ కళల్ని ప్రదర్శించడానికి పబ్లిక్ ప్లేస్‌లే సరైనవని అనుకుంటారు. ఐనా.. ప్రైవేట్ ప్రాపర్టీస్‌లో ఇలాంటి వేషాలేస్తే ఊకోరు కదా? పబ్లిక్ ప్రాపర్టీ అయితే దర్జాగా ఎట్లంటే అట్ల చేసుకోవచ్చని అనుకుంటుంటారు.
నైపుణ్య ప్రదర్శన బూతు రాతల్లోనేనా?
మనకు ఎంత తెలివుంటే ఏం ఫాయిదా దానిని సరైన ప్లేస్‌లో, సరైన తీరుగా వాడకపోతే? సాహిత్యం మీద మంచి పట్టే ఉండొచ్చు.. చిత్రకళలో మంచి అనుభవమే ఉండొచ్చు.. కళా ప్రదర్శనలో మంచి నేపథ్యమే ఉండొచ్చు.. దానిని ప్రాపర్‌గా వాడకపోతే ఎంత నైపుణ్యం ఉంటే ఏం లాభం? ఐనా నైపుణ్యాన్ని రంగరించాల్సింది బూతు రాతల్లోనేనా? కళల్ని ప్రదర్శించాల్సింది పబ్లిక్ ప్లేసులోనేనా? అనే సోయి ఉండాలి కదా? అదేదీ పట్టకుండా పచ్చి బూతులతోనే ప్రవచనాలు చెప్తా అంటే కుదరదు. మనమున్నది పబ్లిక్ ప్లేస్ అని గ్రహించాలి. చెత్త వాగినా.. చెత్త రాసినా అది మొత్తం సొసైటీ మీద ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవాలి. ‘అవన్నీ మనకు తెలియవు.. పబ్లిక్ ప్రాపర్టీ అంటే అందరిది. నాకిష్టమొచ్చింది నేను రాసుకుంటా’ అంటే మాత్రం ఎవరేం చేస్తరు?
పిచ్చి రాతల మెంటాలిటీ దేనికి సంకేతం?
పబ్లిక్ గోడలపై పిచ్చి, పనికిమాలిన రాతలు రాయడం ఒక దురదృష్టకరమైన సమస్య. చాలామంది తమ వ్యక్తిగత జీవితంలోని అడ్డంకులు, వైఫల్యాల వల్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతారు. ఈ కోపాన్ని నేరుగా చూపించలేక ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీ గోడలపై.. ఇతర ప్రజా సముదాయాలపై వ్యక్తం చేస్తుంటారు. దీనిని డిస్‌ప్లేస్‌మెంట్ అనే మానసిక సమస్యగా పేర్కొంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యువత బస్సులు, కార్యాలయాలు, హాస్పిటల్స్ వంటి పబ్లిక్ ప్రాపర్టీలలో పేరు, ఫోన్ నంబర్, అసభ్య కోట్స్ రాస్తుంటారు. ఇది మనలోని అసహాయత, విలువల్లేని భావనను కవర్ చేసే గ్రాండియోజ్ డిఫెన్స్ మెకానిజంగా చెప్తున్నారు. నిషేధించబడిన పని చేయడం వల్ల వాళ్లకు ఎక్కడ లేని ఉత్సాహం అనిపిస్తుంది.
విదేశాల్లో ఇలాగే ఉంటుందా?
పబ్లిక్ ప్రాపర్టీ గోడలపై అసభ్య, పిచ్చి రాతలు రాసే చిల్లర ధోరణి యూరప్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఉంది. కాకపోతే ఇండియాలో ఉన్నంత తీవ్రంగా అయితే లేదు. పబ్లిక్ ప్లేసులు, టాయిలెట్లు, రైల్వే స్టేషన్లలో కొన్నిచోట్ల రాతలు కనిపిస్తాయి. కానీ అవి ఎక్కువగా ట్యాగింగ్ రూపంలో ఉంటాయి. అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇలాంటివి నియంత్రించడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. అమెరికాలో ‘బ్రోకెన్ విండోస్ థియరీ’ ప్రకారం సీరియస్‌గా తీసుకుంటారు. దీనిని వ్యాండలిజంగా చూస్తారు. ‘వ్యాండలిజం’ అంటే పబ్లిక్ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా చెడగొట్టడం, పాడు చేయడం అన్నమాట. మంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వల్ల అక్కడ ఇలాంటివి వెంటనే తొలగించబడతాయి.
నియమాలేవీ పనిచేయవనే తెగింపా?
వ్యాండలిజం చేయడం దాదాపు అన్ని దేశాల్లో అపరాధం. కానీ శిక్షల తీవ్రత, అమలు స్థాయి భిన్నంగా ఉంటాయి. అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా అమలవుతాయి. సీసీటీవీ, పోలీస్ పెట్రోలింగ్, ఫాస్ట్ క్లీనప్ బృందాలు ఉంటాయి. వ్యాండలిజం చేస్తే $400 వరకు జరిమానా వేస్తారు. 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. యూకేలో అయితే క్రిమినల్ డ్యామేజీ యాక్ట్ 1971 ప్రకారం £5000 వరకు జరిమానా.. 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఆస్ట్రేలియాలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు శిక్ష వేస్తారు. అంతెందుకు చేతిలో కలర్ మార్కర్లు కనిపిస్తే కూడా తప్పేనట. మన దగ్గర చట్టాలు లేవని కాదు. కానీ అమలు చాలా వీక్ ఉంటుంది. అసభ్య రాతలు రాస్తే మాత్రం సెక్షన్ 294 కింద కేసు పెట్టవచ్చు.
మన దగ్గర అంత సీన్ ఉందా?: విష్ణు, సామాజిక కార్యకర్త, హైదరాబాద్
పబ్లిక్ గోడల మీద పిచ్చి రాతలు రాసే వాళ్లు నా దృష్టిలో నాగరికత లేని వాళ్లు. సమాజానికి వీళ్లేం సందేశమిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇతరులు అసహ్యించుకునేలా బూతు మాటలు, ఫోన్ నంబర్లు రాయడం ద్వారా తమ ఫ్రస్ట్రేషన్‌ను వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఇంట్లో కూడా సరిగ్గా ఉండరు. వాళ్లను చూసి పిల్లలు కూడా చెడిపోతారు. కఠినంగా శిక్షిస్తే మళ్లీ చేయరు. కానీ మన దగ్గర అలాంటి సీన్ ఉందా? దీన్ని తగ్గించాలంటే మంచి చదువు, సృజనాత్మక అవకాశాలు, సివిక్ ఎడ్యుకేషన్, మెంటల్ హెల్త్ సపోర్ట్ అవసరం అని నేనంటాను.
ఈ కోణంలోనూ ఆలోచించాలి: స్వాతి, కౌన్సెలర్, బెంగళూరు
పబ్లిక్ ప్లేసుల్లో అసభ్య రాతలు రాసేవాళ్లను తప్పుబట్టినా వాళ్ల మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని అంటాను. దీనిని సైకాలజీ పరిభాషలో కండక్ట్ డిజార్డర్ లేదా యాంటీ సోషల్ ట్రెయిట్స్‌గా పేర్కొంటారు. అధ్యయనాల ప్రకారం.. ఇలాంటి వాళ్లు తక్కువ ఈగో డెవలప్‌మెంట్, ఎక్కువ వ్యతిరేక భావన వంటి సమస్య ఉన్నవాళ్లు. చాలామంది ఫ్రస్ట్రేషన్, సెక్సువల్ రిప్రెషన్ లేదా గుర్తింపు కోసం తహతహలాడుతూ ఇలా చేస్తుంటారు. ఇది సమస్య లక్షణం మాత్రమే కాదు. మన సమాజంలో మెంటల్ హెల్త్, యువకులకు సృజనాత్మక అవకాశాలు లేకపోవడం వంటి పెద్ద సమస్యలను కూడా చూపిస్తుంది.






