Disha Special Story : మహాశివరాత్రిలో దాగిన ఎన్నో రహస్యాలు, ప్రత్యేకతలు

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-03-06 16:31:20  IST  )

Disha Special Story : మహాశివరాత్రిలో దాగిన ఎన్నో రహస్యాలు, ప్రత్యేకతలు
X

ఆటగదరా శివా..

ఆటగద కేశవా..

ఆటగద జననాలు..

ఆటగద మరణాలు

ఆటగదా నీకూ..

అంటూ శివుడి లీలలను.. శివతత్వాన్ని.. కీర్తనలను.. భజనలను ఆలపిస్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన "మహా శివరాత్రి" మహోత్సవాల సందర్భంగా శివాలయాల్లో భక్తులు శివ నామస్మరణలో మునిగిపోతున్నారు. ఈ మహా శివరాత్రి సందర్భంగా శివరాత్రి విశిష్టత, విశేషాలు, ఆలయాలు.. పూజలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.! - దాయి శ్రీశైలం

పిలిస్తే పలికే స్వామి శివుడు. భక్తులకు.. శివుడికి శివరాత్రి పర్వదినం ఎంతో ప్రీతిపాత్రమైనది. శివరాత్రికి రెండు మూడు రోజులు ఉందనగానే నియమ నిష్ఠలను అలవర్చుకుంటారు. ఓం నమః శివాయ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతాయి. భక్తులతో కిటకిటలాడుతాయి. ఉపవాసాలు.. జాగరణలతో శంభో శివ శంభో నామం జపిస్తుంటారు.

లింగోద్భవ కాలం

శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదంటారు. అంతటి గొప్ప విశిష్టత ఉంది భోళా శంకరునికి. తెలుగు సంవత్సరాది ప్రకారం మహా శివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజన జరుపుతారు. పంచాంగం ప్రకారం చతుర్దశి తిథి ఫిబ్రవరి 26న 11:08 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. అయితే మహా శివరాత్రి అంటే లింగోద్భవ సమయానాకి చతుర్దశి తిథి ప్రధానం కాబట్టి ఫిబ్రవరి 26నే శివరాత్రిని జరపుకోవాలని పండితులు చెప్తున్నారు. మహా శివరాత్రి అనగానే లింగోద్భవ సమయం గుర్తుకొస్తుంది. పండితులే కాదు ప్రజలు కూడా దీని గురించి చెప్పుకుంటారు. లింగోద్భవ సమయంలో శివుడికి పూజచేస్తే సంవత్సరమంతా శివానుగ్రహం ఉండి అష్టయిశ్వర్యాలు.. భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మహా శివరాత్రి రోజు రాత్రి 11.30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.00 గంట మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. దీనిని నాలుగు భాగాలుగా చెప్పుకుంటారు. ఒకొక్క సమయంలో ఒక్కోరకంగా పూజచేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందట.

పూజలు.. నైవేద్యాలు

లింగోద్బవ సమయంలో నాలుగు రకాల పూజలు చేస్తారు. మొదటి భాగంలో ఆవుపాలతో అభిషేకం చేయాలి. పద్మ పుష్పాలతో పూజచేసి పులగం నైవేద్యంగా సమర్పించాలి. రెండో భాగంలో ఆవు పెరుగుతో అభిషేకం చేసి తులసి దళాలతో పూజ చేయాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. మూడో భాగంలో ఆవునెయ్యితో అభిషేకం చేయాలి. మారేడు దళాలతో పూజించాలి. నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక లింగోద్భవ కాలం నాలుగో భాగంలో శివుడికి తేనెతో అభిషేకం.. తుమ్మి పూలతో పూజ.. తెల్లన్నతో నైవేద్యం సమర్పించాలి.

జాగారం ఎందుకు.?

శివరాత్రి రోజున సాయంత్రం వరకు శివున్ని ఆరాధించి చీకట్లో జాగారం చేస్తాం. ప్రపంచం చీకట్లోనే నిర్మితమైందనే అర్థం దానికుంది. మారుతున్న కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుంచి పుట్టినవే. అలాంటి శూన్యాన్ని మనం శివునిగా పూజిస్తాం.. ఆరాధిస్తాం. ధ్యానంలో జాగారం చేయడం వల్ల వెన్నెముక సరళ రేఖలో ఉండి శరీరం.. మనసు స్థాయిలు పెరిగి శాంతి.. మోక్ష జీవితాన్ని పొందే అవకాశం ఉంది. మనం నిటారుగా కూర్చున్నప్పుడు గ్రహాల అమరిక కుండలినీ శక్తి వలె.. మన ప్రాణశక్తిని పెంచుతుంది కాబట్టే జాగరణ అవసరం అంటున్నారు.

ముక్కంటికి ఒక్కపొద్దు

మహా శివరాత్రిలో ‘ఒక్కపొద్దు’ కు చాలా విశిష్టత ఉంది. దైవారాధనలో దీన్నొక ఉపవాస దీక్షగా భావిస్తారు భక్తులు. శివుడికి ‘ఒక్కపొద్దు’లుంటే మొక్కులు నెరవేరుతాయని అంటుంటారు. అయితే ‘ఒక్కొపొద్దు’లను ఒకొక్కరు ఒక్కో రకంగా పట్టుకుంటారు. ఎక్కువ సంఖ్యలో నిర్జలోపవాసం చేస్తుంటారు. అంటే కనీసం నీళ్లుకూడా తాగరు. కొందరు జలోపవాసం చేస్తుంటారు. అంటే అన్నం.. పండ్లు కాకుండా దూపయినప్పుడల్లా నీళ్లు తాగుతుంటారు. శివుడికి నైవేద్యంగా పెట్టిన సగ్గుబియ్యం.. మొక్కజొన్న వంటి వాటిని ప్రసాదంగా స్వీకరించి ఘనాహార ఉపవాసం చేస్తారు కొందరు.

శివుడికి మారేడు ప్రీతి

పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు దళం. చిన్న మారేడు దళంతో పూజచేస్తే కష్టాలను కడతేర్చుతాడాని భక్తుల విశ్వాసం. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. సమస్త సృష్టిలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఈ చెట్టు పాదులో ఉంటాయంటారు. మారేడు వృక్షం మొదట్లో స్నానం చేస్తే సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. సుగంధ పుష్పాలతో మారేడు చెట్టును పూజిస్తే శివలోక అర్హతను పొందుతారట. ఆ భక్తుల ఇంట సౌభాగ్యం.. సంతానం వర్ధిళ్లుతాయని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రికి మారేడు దళాలతో పూజ చేస్తారు.

శివుడి అవతారాలు

1. సంహార అవతారం: లోక వినాశనానికి పాల్పడే వారిని సంహరించేటప్పుడు.

2. అనుగ్రహ అవతారం: శివానుగ్రహం కోసం తపస్సు చేసే భక్తులను అనుగ్రహించే సమయంలో.

3. తిరోధాన అవతారం: ప్రతి ప్రాణికి అవసరమైనశక్తిని తనలో ఐక్యం చేసుకునేటప్పుడు.

శివరాత్రి రకాలు

  • 1. మహా శివరాత్రి: శివుని గౌరవార్థం ప్రతీయేడు జరుపుతారు.
  • 2. మాసిక్/మాస శివరాత్రి: ప్రతినెల క్షీణిస్తున్న చంద్రుని దశ 14వ రోజున.
  • 3. పక్ష శివరాత్రి: క్షీణిస్తున్న చంద్రుని దశ ప్రతీ పక్షానికి జరుపుతారు.
  • 4. శని శివరాత్రి: మాసిక్ శివరాత్రితో సమానంగా వచ్చే శనివారం రోజున.
  • 5. సోమస్వతీ శివరాత్రి: మాసిక్ శివరాత్రి సోమవారం వచ్చినప్పుడు.
  • 6. జన్మ శివరాత్రి: శివుని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుతారు.
  • 7. లక్ష్మీ శివరాత్రి: మాసిక్ శివరాత్రి గురువారం వచ్చినప్పుడు.
  • 8. కార్తీక శివరాత్రి: కార్తీకమాసంలో.
  • 9. నిత్య శివరాత్రి: ప్రతీరోజూ ఆచరిస్తారు.
  • 10. ప్రదోష శివరాత్రి: క్షీణిస్తున్న చంద్రుని దశ 13వ రోజున జరుపుతారు.

పురాణ గాథ

బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదనొచ్చినప్పుడు ఈశ్వరుడు లింగరూపం ధరించి ఆద్యాంతాలను కనుక్కోవాలంటాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో కనుగునేందుకు ప్రయత్నిస్తే.. బ్రహ్మ శివలింగానికి పైభాగంవైపు వెళ్తాడు. ఆ సమయంలో కేతకి పుష్పం.. గోవు దర్శనమిస్తాయి. గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపమని శివుడు శపిస్తాడు.. అయితే, తోక నిజం చెప్పిన కారణంగా.. గోపృష్ట భాగాన్ని చూస్తే పాప పరిహారమని చెప్తాడు. ఇక విష్ణువు సత్యం పలికినందుకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. ఇవన్నీ లింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ.. వాయు.. శివ పురాణాల్లో పేర్కొన్నారు.

శివరాత్రికి వెళ్లాల్సిన ఆలయాలు

  • 1. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం, మేడ్చల్ జిల్లా
  • 2. వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా
  • 3. శివగంగ రాజ రాజేశ్వర స్వామి ఆలయం, రంగారెడ్డి జిల్లా
  • 4. భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీశైలం, నంద్యాల జిల్లా
  • 5. శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం, తిరుపతి జిల్లా
  • 6. ఉమా మహేశ్వర క్షేత్రం, మహబూబ్ నగర్ జిల్లా
  • 7. ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా
  • 8. మహానంది, నంద్యాల జిల్లా
  • 9. అమరావతి అమరేశ్వరాలయం, పల్నాడు జిల్లా
  • 10. యాగంటి ఉమా మహేశ్వరాలయం, నంద్యాల జిల్లా

శ అంటే శివుడు.. వ అంటే శక్తి అని శివ పదమణి మాల చెప్తోంది. శివ అంటే శుభం.. ఆనందం.. మంగళం.. కైవల్యం.. శ్రేయం అని అర్థాలు. క్షీర సాగర మథన సమయంలో విషాన్ని శివుడు తన గరళంలో నిలిపి ముల్లోకాలను కాపాడిన కాళరాత్రే శివరాత్రి అని పురాణాలు చెప్తున్నాయి.

పంచ సౌగంధిక

శివరాత్రికి ఒక్కపొద్దులు ఉండకపోయినా పంచ సౌగంధిక తాంబూలం సమర్పిస్తే శివానుగ్రహం పొందుతారు. లవంగాలు.. ఇలాచీలు.. జాజికాయ.. జాపత్రి.. దాల్చిన చెక్కను పంచ సౌగింధికాలు అంటారు. రెండు తమపాకుల్లో వీటిని పెట్టి రెండు వక్కలు.. రెండు అరటి పండ్లను శివుడి ప్రతిమ దగ్గర పెట్టాలి.

శివరాత్రి రోజున నీళ్లలో పూలు ఉంచి.. ఆ పుష్ప జలంతో శివుడికి అభిషేకం చేయాలి. నవరత్న జలాలతో అభిషేకం చేస్తే సొంతింటి కల సాకారం అవుతుందట. అనారోగ్య సమస్యలున్న వాళ్లు ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతి చ అని స్మరిస్తే తగ్గిపోతాయట.

Next Story