‘హలో స్టూడెంట్స్’.. ఇవి తప్ప మరో కోర్సులే వేరా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-24 17:43:18  IST  )

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం నామాపురం. అది చాలా చిన్న గ్రామం. 500 కుటుంబాలే ఉన్నాయి. దగ్గరలోనే రిజర్వాయర్ కూడా వస్తుంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరిగే చాన్స్ ఉంది.

‘హలో స్టూడెంట్స్’.. ఇవి తప్ప మరో కోర్సులే వేరా?
X

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం నామాపురం. అది చాలా చిన్న గ్రామం. 500 కుటుంబాలే ఉన్నాయి. దగ్గరలోనే రిజర్వాయర్ కూడా వస్తుంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరిగే చాన్స్ ఉంది. మరి మీ పిల్లలను ఏ రంగానికి పంపిద్దామని అనుకుంటున్నారు? అని అడిగితే .. అందరిదీ ఒక్కటే మాట.. ఊర్లోనైతే ఉండొద్దు. పట్నం వెళ్లాలి. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి. అందుకే మేమంతా మా పిల్లలను హైదరాబాద్‌లో చదివిస్తున్నాం. ఉన్నత చదువుల కోసం మా భూములనైనా అమ్మేందుకు రెడీ అన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రం.. దేశవ్యాప్తంగా ఉంది. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందరి దృష్టి బీటెక్ మీదనే.. అందరూ ఇంజినీర్లుగానే స్థిరపడాలని, రాణించాలని కోరుకుంటున్నారు. అందులోనూ సీఎస్సీ, ఈసీఈ గ్రూపుల్లో తప్ప మరొకటి ఇష్టపడడం లేదు. కంప్యూటర్ ఇంజినీర్లుగానే పని చేయాలని కోరుకుంటున్నారు. మిగతా ఏ రంగంపైనా దృష్టి లేదు. ఇదిలా కొనసాగితే రానున్న రోజుల్లో కోర్ గ్రూపులేవీ ఉండవమోనన్న అనుమానం కలుగుతున్నది.

ఐతే ఈ రెండింట్లోనే చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఏ కాలేజీలో బీటెక్ పూర్తి చేస్తే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టొచ్చు? తెలంగాణ, ఏపీలో వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మరి అన్నింట్లోనూ ఈ రెండు టాప్ గ్రూపులుగా ఉన్నాయి. వాటిల్లో బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారా? ఐతే ఈ పదేండ్లల్లో బీటెక్ ఈ రెండు గ్రూపుల్లో పూర్తి చేసిన వారి సంఖ్య 5 లక్షలకు పైగానే ఉంది. వారందరికి జాబ్ అవకాశం లభించిందా? ఎంత శాతం మంది చదివిన చదువుకు, చేసే వృత్తికి సంబంధం ఉంది? అసలేం జరుగుతుంది? ప్రతి పేరెంట్ తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఆస్తులనైనా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు బీటెక్ మాత్రమే ఉద్యోగాన్ని ఇస్తుందా? దీనిపై చర్చ జరగాల్సిందే! రానున్న రోజుల్లో ఇది ప్రమాదకరంగా మారుతుంది. బీటెక్ కోసం క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ కొట్టగలిగే టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులకు పరీక్షగా మారింది. = (శిరందాస్ ప్రవీణ్ కుమార్)

జేఈఈని అందుకునేదెట్లా?

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ కాలేజీల్లో బీటెక్ చేయడం ద్వారానే కాస్తో కూస్తో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్న నమ్మకం బలపడింది. ఐతే వీటిల్లో సీటు సంపాదించడమంటే అంత ఈజీ కాదు. దేశంలోనే అత్యంత కఠినతరమైన ఎగ్జామ్ గా గుర్తింపు ఉన్నది. ఈ పరీక్షల్లో అడిగే ప్రశ్నలు సామాన్యులకైతే సాధ్యం కాదన్నది వాస్తవం. నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ దిగ్గజ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ వంటి వాటిలో చదివిన వారికే సాధ్యమన్నది నిజం. అవుననన్నా.. కాదన్నా ఇది నిజం. అతి కొద్దిమంది మాత్రమే మిగతా కాలేజీల్లో చదివిన వారు జేఈఈ ఎగ్జామ్ ద్వారా సీటు సాధిస్తున్నారు. ఈ పరీక్ష నార్మల్‌గా స్టేట్ సిలబస్ మీద ఆధారపడితే వచ్చేది కూడా కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో అసాధారణ స్థాయిలో ప్రశ్నలు ఉంటున్నాయి. అందుకే దేశ వ్యాప్తంగా 14 నుంచి 15 లక్షల మంది విద్యార్ధులు హాజరైతే అడ్వాన్స్ కి క్వాలిఫై చేసేది 2.50 లక్షల మందిని మాత్రమే. జనరల్, బీసీ కేటగిరీ విద్యార్థులకైతే 98 పర్సంటైల్ కి మించి మార్కులు వస్తే తప్ప ఎన్ఐటీ, ఐఐఐటీల్లో సీటు వచ్చే చాన్స్ లేదు. ఇందులోనే సీఎస్సీ, ఈసీఈ గ్రూపులోనే సీటు కావాలంటే 99 పర్సంటైల్ దాటాల్సిందే. ఇంతటి టఫ్ ఎగ్జామ్ ద్వారా సీటు దక్కించుకోవడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకే అసాధ్యంగానే ఉన్నది. విద్యావంతులు, ప్రజా సంఘాలన్నీ కార్పొరేట్ విద్యా సంస్థల తీరును, విద్యా బోధన పద్ధతులను తప్పుబడుతున్నాయి. నిజానికి ఈ టఫ్ ఎగ్జామ్ ని ఎదుర్కోవడానికి ఈ తరహా సిస్టం తప్పదన్నది వాస్తవం. ఐతే తప్పు ఎక్కడ చోటు చేసుకుంటుందంటే ఆ కఠినతర విద్యా బోధనను అందుకోని విద్యార్ధులను ఆయా కాలేజీల్లో చేర్చడమే. అటు తల్లిదండ్రులు, ఇటు యాజమాన్యాలు విద్యార్థి ఐక్యూ లెవెల్స్ ని అంచనా వేయకుండా శిక్షణ ఇవ్వడం పొరపాటు. అందుకే ఈ ఒత్తిడి నేపథ్యంలోనే విద్యార్థులు సతమతమవుతున్నారు.


– ఇందులో సీఈసీ, ఈసీఈ మినహా మరే ఇతర కోర్సులను కోరుకోవడం లేదు. ఈ రెండు గ్రూపుల్లోనే సీటు రావాలని కోరుకునే వారి సంఖ్య 90 శాతం మంది. మిగతా గ్రూపుల్లో చదివేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టాప్ ర్యాంకర్లంతా ఈ రెండు కోర్సుల్లో సీటు దొరక్కపోతే మిగతా వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఈఈఈ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రి, ఇంట్రిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్ వంటి కోర్సుల పట్ల ఆసక్తి చూపడం లేదు.


– ఈ డేటాను బట్టి ఏ గ్రూపులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు, మూడు మినహా మిగతా గ్రూపుల్లో పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి కారణాలను అన్వేషించాలి. దేశంలో టాప్ 2 గా ఉన్న వరంగల్ ఎన్ఐటీ లాంటి కాలేజీలో కూడా కోర్ గ్రూపులకు ప్రాధాన్యత దక్కకపోవడానికి ఉపాధి అవకాశాలు లేకపోవడమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

సౌతిండియాలో బీటెక్స్ అధికం

దేశ వ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు ఉన్నాయి. ఐతే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 48.80 శాతం అంటే 6,37,775 సీట్లు ఉన్నాయి. ప్రతి ఏటా సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. తమిళనాడు 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానం, 1.83 లక్షలతో ఏపీ రెండో స్థానం, 1.45 లక్షల సీట్లతో తెలంగాణలో నాలుగో రాష్ట్రంగా నిలిచాయి. మహారాష్ట్ర అంత పెద్దదైనప్పటికీ 1.64 లక్షల సీట్లు మాత్రమే ఉన్నాయి. అది మూడో రాష్ట్రంగా ఉంది. తెలంగాణలో సివిల్, మెకానికల్ వంటి బ్రాంచీల్లో ఉన్న సీట్ల సంఖ్య 10 వేలకు మించి లేవు. అందరూ సీఈసీ, ఈసీఈ మాత్రమే కోరుకుంటుండడంతో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆ సీట్లనే పెంచారు. మిగతా కోర్ గ్రూప్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఎప్ సెట్ ద్వారా 61 వేలకు పైగా కంప్యూటీ సైన్స్, దాని అనుబంధ గ్రూపుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. సివిల్, మెకానికల్, అనుబంధ బ్రాంచీల పట్ల అనాసక్తి నెలకొన్నది. కోర్ ఇంజినీరింగ్ సీట్లు పరిమితంగా ఉన్నప్పటికీ దాదాపు 25 శాతం ఖాళీగానే ఉండడం గమనార్హం. 2020 నుంచి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ నుంచి ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ యుగంగా మారింది. అప్పటి నుంచి 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో కోర్ ఇంజినీరింగ్ సీట్ల బలాన్ని 50 నుంచి 75 శాతం వరకు తగ్గించుకున్నాయి.

జేఈఈ పేదలకు దూరమే

పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఐఐఈ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్ఐటీ కాలేజీల్లో చదవడం అసాధ్యమే. ప్రభుత్వ కాలేజీల్లో చదివి జేఈఈ ఎగ్జామ్ లో 99 పర్సంటైల్ అంటే 20 వేల లోపు ర్యాంక్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. స్టేట్ సిలబస్ తో ఇంటర్ కంప్లీట్ చేసినా, ఐపీఈలో మంచి మార్కులు సాధించినా జేఈఈ పరీక్షను ఎదుర్కోవడం కష్టం. పైగా తెలంగాణ, ఏపీల్లో పోటీ కూడా అధికం. దేశ వ్యాప్తంగా 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఈ రెండు రాష్ట్రాల నుంచే 3 లక్షల దాకా ఉన్నారు. హోం స్టేట్ కోటాలో ఉన్న మూడు, నాలుగు కాలేజీల్లో సీటు దక్కించుకోవడమంటే మాటలు కాదు. అత్యంత కఠినతరమైన పరీక్ష రాసి టాప్ ర్యాంకు తెచ్చుకుంటే తప్ప ఈ కాలేజీల్లో చదవలేరు. కేవలం కార్పొరేట్ కాలేజీల్లో చదువుతూ.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటే తప్ప వీటిల్లో గెట్ ఆన్ కావడం కుదరదు. ఇది చేయాలంటే పేద కుటుంబాలకు సాధ్యమయ్యే పని కాదు. జేఈఈ ఎగ్జామ్ కోచింగ్ కే రూ.లక్ష దాకా తీసుకునే సెంటర్లు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయొచ్చు. అంత భరించినా రూరల్ ఏరియాలో చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్ లో రాణించే శక్తి కలిగిన విద్యార్ధుల సంఖ్య లక్షల్లో ఒకరిద్దరు మాత్రమే. ప్రభుత్వం పేదలకు కూడా జాతీయ స్థాయి నేషనల్ టెస్ట్ అథారిటీ నిర్వహించే జేఈఈ పరీక్ష రాసేందుకు ప్రత్యేక కోచింగ్ ఇప్పించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. జాతీయ స్థాయి టాలెంట్ టెస్టుల్లో పేద విద్యార్ధులు పాల్గొని విజయం సాధించడానికి అవసరమైన సహాయ సహకారం ప్రభుత్వం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కోర్ కోర్సులకు ఉపాధి కల్పించాలి

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లినప్పుడు.. ఓ బ్యాంక్ నుంచి హెచ్ఆర్ పర్సన్ ప్రిన్సిపల్ ని కలిశాడు. మీ కాలేజీల్లో 100 శాతం ప్లేస్ మెంట్ వచ్చేలా తాను చేస్తానన్నాడు. అదెలా సాధ్యం? అంటే బీటెక్ పూర్తయిన వారందరినీ తనకు అప్పగిస్తే వారికి ప్రైవేటు బ్యాంకుల్లో కలెక్షన్, వెరిఫికేషన్ పనులు చేసేందుకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తానన్నాడు. వారు చదివిన చదువుకు, ఇచ్చే పనికి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అలాగే బీటెక్ చదివి ఏ ఉపాధి దొరక్క ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. సీఎస్సీ, ఈసీఈ కోర్సులు చదివిన వారు కూడా మరేఇతర సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేస్తే తప్ప ఎంప్లాయ్మెంట్ లభించడం లేదు. దేశ వ్యాప్తంగా ఈఈఈ, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రి, ఇంట్రిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలార్జికల్, మెటీరియల్ వంటి కోర్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు వస్తాయన్న భరోసా లేకపోవడం వల్ల విద్యార్ధుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అటు ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐ కాలేజీల్లోనూ ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తగ్గుతుంది.

Next Story