- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APAAR: విద్యార్థులకు స్పెషల్ డిజిటల్ ఐడీలు.. ఇక సర్టిఫికెట్స్ పోయినా నో టెన్షన్
మార్కుల మెమో, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు, స్టడీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను విద్యార్థులు అపురూపంగా చూసుకుంటారు. ఏది మిస్సైనా, పాడైనా పై చదువులకు ఇబ్బందే.

మార్కుల మెమో, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు, స్టడీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను విద్యార్థులు అపురూపంగా చూసుకుంటారు. ఏది మిస్సైనా, పాడైనా పై చదువులకు ఇబ్బందే. ఒక్క ఇయర్ స్టడీ సర్టిఫికెట్ లేకున్నా ఆ విద్యా సంస్థకు వెళ్లి వాటిని మళ్లీ తెచ్చుకునే పరిస్థితి. ఇక తరుచూ స్కూల్ లేదా కాలేజీ మారాల్సి వస్తే చుక్కలే. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ 2020 నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడీ తెచ్చింది. ఇది స్టూడెంట్ల సర్టిఫికెట్లన్నింటినీ డిజిటల్‌గా ట్రాక్ చేస్తుంది, నిల్వ చేసుకుంటుంది. ఆధార్‌తో ఆథెంటికేట్ చేసి డిజిలాకర్‌తో లింక్ చేయడంతో డాక్యుమెంట్లు ఇటు విద్యార్థులకు, అటు విద్యాసంస్థలకు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకు ఇది లైఫ్‌లాంగ్ అకడమిక్ పాస్‌పోర్టు వంటిది, ఒక డిజిటల్ బ్యాంక్ వంటిది. ప్రభుత్వ పర్యవేక్షణలోనే పని చేయడంతో నకిలీ సర్టిఫికేట్లకూ దీనితో చెక్ పడుతుంది. స్కూళ్లు లేదా కాలేజీలు మారినా విద్యాసంస్థలే డిజిలాకర్‌లోని సర్టిఫికేట్లను సరిచూసుకుని అడ్మిషన్ ఇచ్చే ఈజీ ప్రాసెస్‌ను ఈ ఐడీ అందిస్తుంది. = మహేశ్ కొన్నెగంటి
అపార్ అంటే ఏమిటీ?
నూతన జాతీయ విద్యా విధానం 2020కు లోబడి అపార్ ఐడీని కేంద్రం ప్రవేశపెట్టింది. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని అపార్‌గా పిలుస్తారు. వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ అనే విజన్‌ను అపార్ సాకారం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి, ఒక్కో 12 అంకెల అపార్ ఐడీ ఉంటుంది. సదరు విద్యార్థి అకడమిక్‌గా సాధించిన ప్రతి విజయం, ప్రతి స్కిల్, ప్రతి సర్టిఫికేట్ ఈ ఐడీ కింద రిపోజిటరీలో ప్రత్యేకించిన అపార్ ఐడీ కింద సురక్షితంగా స్టోర్ అవుతుంది.
ప్రయోజనాలు ఇవే..
ప్రతి స్టూడెంట్‌కు నిర్దేశిత 12 అంకెల అపార్ ఐడీ ఉండటం వల్ల వారివారి అకడమిక్ విజయాలు, డిగ్రీలు, డిప్లోమా, అవార్డులు, స్కాలర్‌షిప్, ఇతర క్రెడిట్ల వివరాలూ యూనిక్‌గా స్టోర్ అవుతాయి. అంటే సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై సదరు విద్యార్థి రికార్డు మొత్తం నిల్వ ఉంటుంది. రియల్‌టైంలో వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను పరిశీలించుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. స్కిల్స్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. తద్వార ఆ విద్యార్థి మరో విద్యాసంస్థలో చేరేటప్పుడు లేదా రిక్రూట్‌మెంట్ అయేటప్పుడు ఈ ఐడీ ద్వారా సులువుగా మారొచ్చు, అకడమిక్ ప్రొఫైల్‌ను చూపించుకోవచ్చు. అడ్మిషన్, రిక్రూట్‌మెంట్, జాబ్ అప్లికేషన్,ఎంట్రెన్స్ పరీక్షలు వంటివాటికి హార్డ్ కాపీల అవసరం లేకుండా అపార్ ఐడీతో దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల రికార్డు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. కాలేజీల నుంచి నేరుగా అప్‌డేట్ అవుతుంది. కాబట్టి, నకిలీ సర్టిఫికెట్లకు చాన్స్ ఉండదు. వాటిని సులువుగా ఏరివేయడమే కాదు, వాటి నియోగించడానికి ఆస్కారమే ఉండదు.
డేటా భద్రమేనా?
విద్యార్థుల డేటాకు అపార్ అత్యున్నత ప్రాధాన్యతనిస్తుంది. అవసమైన ప్రభుత్వ ఏజెన్సీలకు మినహా మరెవరికీ ఈ వివరాలు అందించదు. సదరు విద్యార్థి అనుమతితోనే డాక్యుమెంట్ల షేరింగ్ జరుగుతుంది. అంటే.. అపార్ నుంచి డాక్యుమెంట్ సమాచారం పంచుకోవాలంటే ఓటీపీ లేదా మరే ఇతర మార్గాల ద్వారా విద్యార్థి సమ్మతి తప్పకుండా ఉంటుంది.
అపార్ నమోదు ఎలా?
అపార్ నమోదు స్కూల్‌లో జరుగుతుంది. పేరెంట్స్ ముందుగా తమ పిల్లలు చదివే స్కూల్‌కు వెళ్లి అపార్ ఐడీ గురించి ఆరా తీయాలి. అప్పటికే సృష్టించకుంటే అపార్ ఐడీ కోసం తమ సమ్మతిని తెలుపాలి. యూడీఐఎస్ఈ సిస్టమ్ ఆ విద్యార్థి పెన్(పర్సనల్ ఎడ్యుకేషన్ నెంబర్) ద్వారా అపార్ ఐడీని సృష్టిస్తుంది. అపార్ ఐడీ స్టూడెంట్ డిజిలాకర్ అకౌంట్‌కు పుష్ చేస్తుంది. ఈ డిజిలాకర్ రిపోజిటరీలోనే విద్యార్థుల డాక్యుమెంట్లు స్టోర్ అవుతాయి. సురక్షితంగా ఆన్‌లైన్‌లో తమ డాక్యుమెంట్లను డిజిలాకర్ వేదికగా యాక్సెస్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ల సమ్మతికి విద్యార్థులు మైనర్ అయితే పేరెంట్స్ ఆధార్‌తో ఆథెంటికేట్ చేస్తారు.
ఏబీసీ బ్యాంక్‌కు అపార్ ఖాతా
నూతన జాతీయ విద్యా విధానంలో కీలకమైన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ నిర్వహణకు అపార్ ఐడీ అత్యవసరం. ఏబీసీ బ్యాంకు అనుకుంటే.. అపార్ ఐడీ సదరు విద్యార్థికి ఖాతా నెంబర్ వంటిది. తమ క్రెడిట్లను ఏబీసీలో ఈ ఐడీ ద్వారానే జమ చేసుకుంటారు. ఈ క్రెడిట్లే మన డిగ్రీని నిర్దారిస్తాయి. కాబట్టి. నూతన విద్యావిధానంలో అవసరమైన క్రెడిట్ల కోసం కోర్సులు ఎంచుకోవాలన్నా.. ఎంచుకున్న కోర్సుల క్రెడిట్లు ఏబీసీలో చేర్చుకోవాలన్నా అపార్ ఐడీ విద్యార్థులకు అత్యవసరం. ఇప్పటి వరకు యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థలు మొత్తం 2274 ఏబీసీలో రిజిస్టర్ అయ్యాయి. సుమారు 31.56 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు.
అపార్ ఆవశ్యకత
నూతన విద్యా విధానం 2020లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులు తమకు ఇష్టమున్న కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తున్నది. ఒకే కోర్సులో మల్టిపుల్ ఎంట్రీలు, ఎగ్జిట్‌లకు అవకాశం ఇస్తున్నది. ఒక విద్యార్థి ఎకనామిక్స్ మేజర్ కోర్సు ఉన్నా.. ఫిజిక్స్ సబ్జెక్టును కూడా మైనర్ కోర్సుగా చదువుకోవచ్చు. అలాగే.. డిగ్రీని మూడేళ్లు చదవాలనే కచ్చితమైన నియమేమీ లేదు. ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో వేగంగా పూర్తి చేయొచ్చు లేదంటే గరిష్టంగా ఏడేళ్లలో డిగ్రీని పూర్తి చేసుకోవచ్చు. మొత్తంగా మూడేళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు, నాలుగేళ్ల యూజీ డిగ్రీ(ఆనర్స్)కు 160 క్రెడిట్లు విద్యార్థి సంపాదించుకోవాలి. అయితే, కోర్ సబ్జెక్టులో ఎక్కువ క్రెడిట్లు పొందాలి. ఒక విద్యార్థి తొలి సంవత్సరమే కోర్సు నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే అతను కనీసం 40 క్రెడిట్లు, సమ్మర్ వెకేషన్‌లో నాలుగు క్రెడిట్ల ఒక వొకేషనల్ సబ్జెక్ట్ పూర్తి చేస్తే యూజీ సర్టిఫికేట్ పొందవచ్చు. మూడేళ్లలో మళ్లీ అదే కోర్సులో రీజాయినై ఏడేళ్ల గరిష్ట గడువులో డిగ్రీ పూర్తి చేసుకోవాలి. కాబట్టి, ఇలా కోర్సు మారాలన్నా.. మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్లకూ.. సింగిల్ మేజర్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయాలన్నా క్రెడిట్ల లెక్కలు చాలా ముఖ్యం. అపార్ ఐడీతో ఇవి ఏబీసీలో రికార్డ్ అవుతాయి.
వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్
అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు రీసెర్చ్ జర్నల్స్ యాక్సెస్ అవకాశాన్ని కల్పించే వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్ పథకానికి కేంద్ర కేబినెట్ నవంబర్ 25న ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద 30 అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్స్ సబ్‌స్క్రిప్షన్‌కు కేంద్రమే డబ్బులు చెల్లిస్తుంది. వాటి యాక్సెస్‌ను దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు అందిస్తుంది. ఇది విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, విద్యా సంస్థలకు వరంగా మారనుంది. సుమారు 13 వేల ఈ జర్నల్స్‌ను విద్యార్థులు ఈ పథకంలో భాగంగా పొందగలరు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ సహా అనేక శాఖల రీసెర్చ్ జర్నల్స్‌ను సెంట్రల్ లైబ్రరీగా ఈ పథకం విద్యార్థులకు అందిస్తుంది.
విలువైన అకడమిక్, పరిశోధక జర్నల్స్‌ను ఉచితంగా ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఫ్యాకల్టీకి అందుబాటులోకి తెచ్చే పాలసీనే వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్. 30 ప్రధాన అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్‌లను కేంద్రమే సబ్‌స్క్రిప్షన్ చేస్తుంది. ఇందుకోసం మూడు సంవత్సరాల కోసం రూ. 6,000 కోట్లు కేటాయించాలనే నిర్ణయం ప్రాథమికంగా తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంస్థలు వేటికవిగా ఈ జర్నల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నాయి. వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మన దేశంలో పరిశోధన, అభివృద్ధి వాతావరణాన్ని వృద్ధి చేసే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ ఈ వ్యవహారాన్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఉన్నత విద్యా శాఖ ఒక్కో విద్యా సంస్థకు యునైఫైడ్ పోర్టల్ అందించి జర్నల్స్‌ను యాక్సెస్ చేయడానికి సదుపాయం కల్పిస్తుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ స్కీం వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. పది లైబ్రరీ కన్సార్షియాలతో సుమారు 2,400 విద్యాసంస్థలకు ఈ స్కీం ఫలాలు అందనున్నాయి. నరేంద్ర మోడీ కేబినెట్ ఈ స్కీంకు ఆమోదం తెలుపగా, త్వరలోనే స్కీం అందుబాటులోకి రానున్నది.






