ట్రూలీ ట్రైబల్... గిరిజన కళలకు జీవం.!

by Daayi Srishailam |

కళాకారులకు మద్దతిస్తూ గిరిజన కళలను బతికిస్తోంది

ట్రూలీ ట్రైబల్... గిరిజన కళలకు జీవం.!
X

దిశ, ఫీచర్స్: శ్వేతా మీనన్ ఐటీ కెరీర్‌ను వదిలేసి "ట్రూలీ ట్రైబల్"ను స్థాపించింది. దీనిద్వారా భారతీయ సాంప్రదాయ కళలైన వార్లీ, పిచ్వాయ్ వంటివాటిని పునరుద్ధరిస్తూ కళాకారులకు ఆదాయం కల్పిస్తోంది. "ట్రూలీ ట్రైబల్" ఇప్పుడు ఇది 16 రాష్ట్రాల్లో 500 మందికి పైగా కళాకారులకు మద్దతిస్తూ గిరిజన కళలను బతికిస్తోంది.

ట్రూలీ ట్రైబల్..

"ట్రూలీ ట్రైబల్" ద్వారా గిరిజన కళాకారులకు ఎంత మేలు చేశారనేది అక్కడి ప్రజల జీవితాలను చూస్తే అర్థమవుతుంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా. ఒక చిన్న గ్రామంలో "వార్లీ కళాకారుడు" సంజయ్ సాంగ్లే. కళకు ఆదరణ కరువై వదిలేయాలనుకున్నాడు. ఇంకోవైపేమో తరతరాల తన వారసత్వకళ అంతరించిపోతుందేమోననే ఆవేదన. కానీ అతనేం చేయగలడు. వారసత్వాన్ని బతికించాలని వార్లీ చిత్రాల కళను కంటిన్యూ చేస్తే కుటుంబాన్ని బతికించుకోలేడు కదా.? ఇలాంటి సవాళ్ల మధ్య ఆశలు చిగురింపజేసింది శ్వేతా మీనన్. వార్లీ కళకు జీవం పోసి ఇలాంటివాళ్లను బతికించింది.

నాన్న చెప్పిన మాట..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పుట్టింది శ్వేత. ఇది ఒకప్పుడు గోండ్వానా రాజ్య రాజధాని. మార్వాడీ కుటుంబంలో పుట్టినప్పటికీ వాళ్ల కుటుంబం గిరిజన సముదాయాలతో కలిసి జీవించింది. వాళ్ల సంస్కృతిని స్వీకరించింది. సాధారణ మార్వాడీ కుటుంబాల్లో లేని విద్యా ప్రాధాన్యత వీళ్ల కుటుంబంలో ఉండేది. కానీ తన మనసంతా కళలు, చేతివృత్తుల గురించే ఆలోచించేది. దీనికితోడు వాళ్ల నాన్న చెప్పిన మాటలు ఆమెను మరింత ముందుకు తీసుకెళ్లాయి. సొంత పిల్లల్ని ఎవరైనా పెంచుతారు. కానీ ఇతరుల పిల్లల్ని పెంచడానికి సాయం చేస్తే, మద్దతిస్తే అదికదా నిజమైన మార్పు అంటే అని అనేవాడు వాళ్ల నాన్న.

కళాకారుడికే ఆధిపత్యం..

శ్వేత 2014లో మ్యూజియంలో కళాకారుడి దగ్గర ఒక వస్తువు కొనుక్కుంది. దాని సుందరమైన రూపం, సాంస్కృతికత తనను ఆకట్టుకున్నాయి. అదే వస్తువును ఆన్‌లైన్‌లో రూ.15,000కు అమ్ముతున్నట్టు తెలుసుకుంది. కళాకారుడిని అడిగితే తనకు రూ.2,500 మాత్రమే ఇస్తారని చెప్పాడు. మధ్యవర్తులు.. దళారులకే ఆ ధరపై ఆధిపత్యం ఉంటుందనే విషయం తెలుసుకుంది. కళాకారులకు గౌరవాన్ని, నైపుణ్యాన్ని గౌరవించే మార్గాన్ని ఏర్పాటుచేయాలని 2015లో ట్రూలీ ట్రైబల్‌ను స్థాపించింది. కళాకారులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేసింది. దళారి కంటే కళాకారుడికే ధర మీద ఆధిపత్యం ఉండేలా చేసింది.

18 రాష్ట్రాల్లో..

ఎగ్జిబిషన్లు, ప్రత్యక్ష అమ్మకాలతో సవాళ్లు ఎదుర్కొన్న తర్వాత 2019లో ట్రూలీ ట్రైబల్ బీ2బీ భాగస్వామ్యాల వైపు మళ్లింది. కార్పొరేట్లు, ఈవెంట్లు, ఎగుమతి సంస్థలు, సామాజిక సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. కార్పొరేట్లు, ఈవెంట్లతో కలిసి పనిచేయడం వల్ల స్థిరమైన డిమాండ్ వస్తుంది. ట్రూలీ ట్రైబల్ 18 రాష్ట్రాల్లో 150 కళా సమూహాలు, 500 మంది కళాకారులకు మద్దతిస్తోంది. వార్లీ, పిచ్వాయ్ చిత్రాలు, టెర్రాకోటా మట్టి పాత్రలు, వెదురు చేతివృత్తులు, గిరిజన ఆభరణాలు వంటి 25కు పైగా సాంప్రదాయ కళలకు జీవం పోస్తోంది. ఇవి 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కళలు.

Next Story