పాలిటిక్స్‌లో ఇరుకున్న రూపాయి చిహ్నం

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-03-17 15:28:31  IST  )

పాలిటిక్స్‌లో ఇరుకున్న రూపాయి చిహ్నం
X

కోటలు మేడలు కట్టాలన్నా..

కాటికి నలుగురు మోయాలన్నా..

గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా..

ప్రాణం తీయాలన్నా..

పోయే ఊపిరి నిలవాలన్నా..

పోరాటంలో గెలవాలన్నా..

రూపాయి కావాలి.

చేతులు మారి.. రాతలు మార్చే కరెన్సీ కాగితమే ఈ రూపాయి.

తెలుగువాళ్లయినా.. తమిళులు అయినా.. కన్నడిగులైనా అందరికీ ఒక్కటే రూపాయి.

అదే ₹ ఇది.

అట్లాంటి ₹ మీద పెద్ద చర్చే జరుగుతోంది.

దేశంలో బర్నింగ్ టాపికై.. రాజకీయాలను బరస్ట్ చేస్తున్న ₹పై స్పెషల్ స్టోరీ.!

- దాయి శ్రీశైలం

One rupee.. ఒక్క రూపాయి.. ಒಂದು ರೂಪಾಯಿ.. ஒரு ரூபாய்.. ഒരു രൂപ.. एक रुपया.. ఇలా ఎవరి భాషలో వాళ్లు రూపాయి అని రాసుకుంటారు. రాష్ట్రమేదైనా రూపాయి అని కాకుండా అధికారికంగా సింబల్ ద్వారా సూచిస్తాం. అదే ₹. ఇప్పుడదే మాకొద్దూ అంటున్నారు తమిళులు. దేశవ్యాప్తంగా ₹ గురించి పెద్ద దుమారమే లేపారు.

₹కి ఏమైందసలు.?

తమిళనాట భాషా వివాదం రాజుకొని అది రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం స్టాలిన్ 2025-26 వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నమైన ₹ని తొలగించి దాని స్థానంలో తమిళ పదం రూబాయి ௹ని చేర్చారు. ద్రవిడియన్ మోడల్.. టీఎన్ బడ్జెట్ హ్యాష్ ట్యాగులతో విడుదల చేసిన బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నం ₹ మాయమవడం పెద్ద చర్చకు దారితీసింది. గత రెండు వార్షిక బడ్జెట్లలో మాత్రం అధికార చిహ్నమే లోగోలలో కనిపించింది. 2023-24 బడ్జెట్ లోగోలో కూడా ₹యే ఉంది.

ఏంటీ ₹లొల్లి.?

జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకించడంలో తగ్గేది లేదని కేంద్రానికి స్పష్టంచేస్తూ ₹ని మార్చేసింది తమిళ సర్కారు. 2020లో కేంద్రం ఎన్ఈపీని ప్రవేశపెట్టింది. దీనిని త్రిభాషా విధానం అంటారు. దీని ప్రకారం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో కనీసం రెండు జాతీయ భాషలై ఉండాలి. ఐతే దీనితో హిందీని బలవంతంగా తమపై రుద్దుతున్నారని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడింకా దూకుడు పెంచి దీన్ని అమలుచేసే ప్రసక్తే లేదని.. రూ.10వేల కోట్లిచ్చినా ఒప్పుకోం అని ₹ని బహిష్కరించింది. ₹ సింబల్‌ను హిందీ స్ఫూర్తితో డిజైన్ చేశారనేది వారి వాదన.

చరిత్రలో తొలిసారి

జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఐతే.. తమ ఉద్దేశం ₹ని తిరస్కరించడం కాదనీ.. తమిళ అక్షరం ௹ను పెట్టి మాతృభాషను ప్రోత్సహించే ప్రయత్నం అంటున్నారు. ఇదిలా ఉంటే రూపాయి అధికారిక చిహ్నంగా ₹ను పెట్టడాన్ని మొదట్నుంచి తమిళ పండతులు.. నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ₹ దేవనాగరి లిపి నుంచి ఉద్భవించిందని వారి వాదన. లిపి ఆధారంగా కాకండా తటస్థ లేదా సమగ్రమైన డిజైన్ పెట్టాలన్నారు. ₹ని అమలైనప్పుడు కొందరు ఆర్థిక విశ్లేషకులూ ప్రశ్నించారు. కరెన్సీ చిహ్నం కంటే ఆర్థిక సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు.

₹రూపకర్త తమిళుడే

భారతీయ కరెన్సీ చిహ్నం ₹ను రూపొందించింది తమిళియన్ ఉదయ్ కుమార్. ఐఐటీ గౌహతిలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆయన. 2009లో భారత ప్రభుత్వం రూపాయికి ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించేందుకు పోటీని ప్రారంభించింది. వేలాది ఎంట్రీలొచ్చాయి. వాటన్నింటిలో ఉదయ్ కుమార్ డిజైన్ ది బెస్ట్ అని ₹ను ఫైనల్ చేశారు. ₹లో భారతదేశ వారసత్వం.. సంస్కృతి ప్రతిబింబించే అంశాలు ఉన్నాయని నిపుణులు భావించారు. ఒక తమిళుడు.. అదికూడా డీఎంకే నాయకుడి కుమారుడు రూపొందించిన ₹ను బడజెట్ నుంచి తొలగించి స్టాలిన్ తమిళ ప్రజలను అవమానించారనే విమర్శలు వస్తున్నాయి.

ఏయే అంశాలున్నాయి.?

జులై 15, 2010లో భారత రూపాయి చిహ్నంగా ₹కి అధికారిక ఆమోదం లభించింది. ఇది భారతీయ, లాటిన్ మిశ్రమం. ఈ చిహ్నం దేవనాగరి అక్షరం "₹" (Ra), లాటిన్ అక్షరం "R" కలయిక. ఇది ఆంగ్లంలో "రూపీ "ని, హిందీలో "रुपया" ని సూచిస్తుంది. పైభాగంలో రెండు క్షితజ సమాంతర రేఖలు ఉంటాయి. ఇవి భారత త్రివర్ణ జెండాను.. దేశ ఆర్థిక సమానత్వాన్ని సూచిస్తాయి. డాలర్ ($).. యూరో (€).. ఫౌండ్ (£).. యెన్ (¥) వంటి ఇత ప్రధాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీ చిహ్నాలతో సమలేఖనం చేయబడి గ్లోబల్ గుర్తింపు సాధించింది. వివిధ కీబోర్డులు.. స్క్రిప్టులలో టైప్ చేసే అనుకూలతలు ఉన్నాయి.

Rs నుంచి ₹ వరకు

₹ని అధికారిక చిహ్నంగా స్వీకరించడానికి ముందు దేశమంతా ఒకే ప్రామాణిక చిహ్నమైతే లేదు. సాంప్రదాయకంగా ఆంగ్లంలో "Rs" లేదా "Re" వంటి సంక్షిప్తీకరణలతో సూచించేవారు. హిందీ.. ఇతర భారతీయ భాషలలో "रु" లేదా "૱" వంటి సంక్షిప్తీకరణలతో సూచించేవారు. బ్రిటీష్ పాలనకంటే ముందు వివిధ రాజ్యాలు కరెన్సీని జారీ చేసినందున దేవనాగరి.. పర్షియన్.. ప్రాంతీయ వైవిధ్యాల వంటి లిపితో రూపాయిని సూచించేవారు. 19–20వ శతాబ్దంలో ఆంగ్ల సంప్రదాయాలను అనుసరించి "Rs." సంజ్ఞామానంతో సూచించేవారు. 1947–2010 మధ్యకాలంలో "Rs.", "Re."గా కొనసాగింది.

రూపాయి చరిత్ర

6వ శతాబ్దంలో వెండి.. రాగితో చేసిన పంచ్ మార్క్‌డ్ కరెన్సీ నాణాలు ఉండేవి. 4-6వ శతాబ్దంలో వెండి. బంగారు దినార్లు ప్రవేశపెట్టారు. 13-16వ శతాబ్దం ఢిల్లీ సుల్తానుల కాలంలో వెండి.. రాగితో చేసిన టంకా.. జితల్ నాణాలు ఉండేవి. మొదటి ప్రామాణిక రూపాయిని 1540లో షేర్ షా సూరి ప్రవేశపెట్టారు. ఇది భారతీయ ద్రవ్య విధానికి పునాదిగా మారింది. 1556-1605లో మొఘల్ పాలకులు దాన్ని కొనసాగించారు. 1835లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వివిధ ప్రాంతీయ కరెన్సీలను ప్రామాణికం చేసింది. భారత స్వాతంత్య్రానంతరం రూపాయి జాతీయ కరెన్సీగా మిగిలిపోయింది. 1957లో రూపాయిని దశాంశం చేశారు. 16 అణాలు= 1 రూపాయి నుంచి 100 పైసలు= 1 రూపాయికి మార్చారు. 2010లో అధికారిక కరెన్సీ చిహ్నం ₹ను ప్రవేశపెట్టారు.

కరెన్సీ చిహ్నాల మార్పు

- రష్యా 1917కి ముందు రష్యన్ రూబుల్ ₽ లేదా руб. 1917-1991లో సోవియట్ రూబుల్ руб. ప్రస్తుతం రష్యన్ రూబుల్ ₽

- జర్మనీ 1923కి ముందు జర్మన్ పేపియర్ మార్క్ ℳ. 1923-1924లో రెంటెన్ మార్క్. 1924-1948లో రీచెస్ మార్క్ ℛℳ. 1948-2002లో డ్యూయిష్ మార్క్ DM. ప్రస్తుతం యూరో €

- చైనా 1948కి ముందు యువాన్ 圓 లేదా 元. ప్రస్తుతం రెన్మిన్బి ¥


ప్రతిఘటనలు

- యూఎస్ డాలర్‌ ($)ని టెక్సాస్.. కాలిఫోర్నియా స్టేట్స్ ఇంకా కొన్ని బ్యాంకులు వ్యతిరేకించాయి. వారి సొంత చిహ్నాలతో కరెన్సీ నోట్లను జారీ చేశాయి.

- యూకే యురోపియన్ యూనియన్ కరెన్సీ చిహ్నం € ను స్వీకరించలేదు. ఈయూ సభ్యదేశంగా ఉన్నా పౌండ్ (£)ను ఉంచాలని పట్టుబట్టింది.

- కెనడాలోని క్యూబెక్ $కు భాషా ఆధారిత ప్రతిఘటన తప్పలేదు. $ యూఎస్ డాలర్‌తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉందని "CAD"గా మార్చుకున్నాయి.

- రష్యా 2013లో రూబుల్ కోసం ₽ చిహ్నాన్ని ప్రవేశపెట్టినప్పుడు టాటర్సాన్.. సఖా వంటి ప్రాంతాలు విమర్శించాయి.

Read More..

LIC Best Scheme: ఈ ఒక్క స్కీమ్‌తో ఎన్నో బెనిఫిట్స్‌.. ప్రతినెలా అకౌంట్‌లోకి డబ్బులు.. ఎంత వస్తుందంటే?

Next Story