తాగుదాం.. ఊరంతా ఊదుదాం.!

by Daayi Srishailam |

బహిరంగ ధూమపానం నిషేధం అని తెలిసినా స్మోకింగ్ చేస్తుంటారు

తాగుదాం.. ఊరంతా ఊదుదాం.!
X

కొందరికొక సోకుంటది.

అద్దగంటకోసారి సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటరు.

ఉఫ్.. మని గాల్లోకి నాలుగు రింగుల పొగ ఊదేసి ఏదో జయించినట్లు సంతోషపడతరు.

''దమ్ము కొట్టేది'' వాళ్లు.. దాని పొగేమో వేరేవాళ్లకు.

అసలు స్మోకింగే తప్పురా నాయనా అంటే..

వీళ్లేమో గాల్లోకి కాల్పులు జరిపినట్లు దర్జాగా స్మోక్ రౌండ్లేసి ధూమ జపం చేస్తరు.

''బహిరంగ ధూమపానం''తో ఎన్ని సమస్యలొస్తయో తెలుసా.?

హెల్త్ కరాబ్.. దిమాగ్ కరాబ్.. వెదర్ కరాబ్.

హలో.. దమ్మున్న మొనగాళ్లూ.. మిమ్మల్నే.. సోంచో జర.!!

- దాయి శ్రీశైలం

"Smoking is injurious to health. Smoking causes cancer", "धूम्रपान स्वास्थ्य के लिए हानिकारक है", "పొగతాగడం ఆరోగ్యానికి హానికరం, అది క్యాన్సర్ కారకం".. సినిమాకు ముందు వినిపించే డైలాగ్ ఇది. ప్రతీ ఆఫీసులో, ప్రజా సముదాయాల్లో "నో స్మోకింగ్" అని రాసి ఉంటుంది. కానీ దాన్నెవరూ పట్టించుకోరు. జేబులకెల్లి సిగరెట్ తీసి.. పక్కకు వేలాడదీసిన లైటర్‌తో అంటించుకొని గాల్లోకి పొగ ఊదుతూ రిలాక్సవడం ఇప్పుడొక ప్యాషన్.

దమ్ముకొడితేనే దమ్మున్నట్టా.?

డియర్ పేరెంట్స్. మీ పిల్లలెవరైనా ఇంజినీరింగ్ స్టూడెంట్సయితే ఓ కన్నేసి ఉంచండి. ఎందుకూ అంటారా.? వీలైతే ఒకసారి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి చౌరస్తా వద్దకు వచ్చి చూడండి తెలుస్తుంది. అక్కడొక 100 వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉంటయి. ఒక్క ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లేదుగానీ.. 10-20 సిగరెట్ షాపులుంటయి. ఫస్టియర్.. ఫైనలియర్ అనే తేడా ఏం కనిపించదు. క్లాసుకెప్పుడెళ్తరో తెలియదుగానీ పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పదింటి వరకు రోడ్డుమీదనే కనిపిస్తరు. ఎవరూ ఉత్తగనే ఉండరు. ఇక్కడ అందరి చేతిలో సిగరెట్ పీక ఉంటది. "Smoking is not a habit, it's an addiction" అని అందరికీ తెలుసు. అడిక్షన్ అయ్యారు కాబట్టే క్లాసెసైనా వదుల్తరు కానీ.. దమ్ముకొట్టడాన్ని వదలరు.

చదువంటే పొగలూదడమా.?

అసలు వాళ్ల వయసెంత.? ఒకనికొకడు పోటీలు పడి, ఒకన్నిచూసి ఇంకొకడు దమ్ముకొట్టి "ఇదీ మా దమ్ము" అనేలా ఫీలైతుంటరు. అరే సామీ.. "దమ్ము కొడితేనే దమ్మున్నట్టు కాదు".. ఆ దమ్ము దుమ్ము లోపలికి పోతే ఏమైతదో అప్పుడు తెలుస్తది కథ. "సిగరెట్ పీక"లే ప్రపంచమనుకుంటున్న పిల్ల బచ్చాలు తెలుసుకోవాల్సింది ఏందంటే.. "Smoking is a slow suicide" అనేది. అంటే ఎవరికి వాళ్లు తమకు తెల్వకుండనే తమను తాము మెల్లగా పానం తీసుకుంటుండ్రన్నమాట. అదేం సోకో.. ఒకని మూతిలకెల్లి ఒకడు తీసుకొని సిగరెట్ తాగుతుంటరు. అవిగూడ పది రూపాయలవో, ఇరవై రూపాయలవో కాదు. ఒక్కొక్క సిగరెట్ మినిమం రూ.40 ఉంటది. ఇంజినీరింగ్ అంటే ఇట్ల పూటకు పది సిగిరెట్లు తాగి పొగలు ఊదడమేనా.?

పీలిస్తేనే మైండ్ ఫ్రెష్ ఐతదా.?

స్టూడెంట్సే కాదు. ఉద్యోగం చేసేవాళ్లు, కూలీ పనిచేసుకునేవాళ్లు, ఖాళీగ ఉంటూ ఉత్తగనే తిరిగేవాళ్లు కూడా గంటకో సిగరెట్టో, బీడీనో తాగుతరు. వీళ్లంతా "స్మోకింగ్"ను మైండ్ రీఫ్రెష్‌గా ఫీలైతుంటరు. అదిచ్చే ఐదు నిమిషాల ఆనందం కోసం జీవితాన్ని పాడుచేసుకుంటున్నం అనే సోయి ఎవరికీ ఉండదు. తెల్వకపోతే ఎవరికైనా చెప్పొచ్చు. వీళ్లకు అన్నీ తెలుసుకానీ.. "మనకేమైతదిలే" అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచుతోంది. "Don't let smoking steal your happiness and health. Quit today" అనేది గ్రహించుకుంటే మంచిది. మైండ్ రీఫ్రెషైతదీ.. మనసు ప్రశాంతమైతదీ అని తాత్కాలిక ఆనందం కోసం తహతహలాడితే మీ ఇష్టం ఇగ.. శాశ్వత సంతోషాన్ని దూరం చేసుకున్నట్టే.

మేం ఉన్నొళ్లం ఖరీదైనదే తాగుతం

"ఏ రాయైతే ఏముంది నెత్తి పలగ్గొట్టుకోనీకె". నువ్వు ఉన్నోడివా.? నీకు పైసలు ఎక్కువున్నయా అని సోదాలు నిర్వహించి దాడి చేస్తదా సిగరెట్. పొగను పీలిస్తే ఉన్నోడైనా.. లేనోడైనా పొగలు కక్కుతూ పోవాల్సిందే. ఇలా ఎందుకంటున్నమంటే.. చాలామంది సంపాదన ఎక్కువైతే ప్రెస్టేజ్ కోసం స్మోకింగ్ చేస్తుంటరు. ఏదో పాష్‌‌‌గా ఉండాలనీ ఓ ఖరీదైన ప్యాకెట్లకెల్లి సిగరెట్ తీసి అసిస్టెంట్‌తో అంటువెట్టించుకుంటడు. సిగరెట్‌కు ఉన్నోడు లేనోడు అనే తేడా ఏముండదు. లోపలికి పీల్సుకున్న అందరికీ అది ఆత్మీయురాలే. హనీ ట్రాప్ చేసినట్లు మెల్లగా ట్రాప్ చేసి మైండంతా పొగ కమ్మేట్లు చేస్తది. అందుకే ఉన్నొళ్లయినా.. లేనొళ్లయినా పొగల్లోంచి బయటకొచ్చి "life is precious. Don't gamble with it by smoking" అనే నిజం తెలుసుకోవాలి.

మేధావైతే పీల్చాల్సిందేనా.?

బహిరంగ ధూమపానాన్ని ప్రోత్సహిస్తు్న్నది మేధావులే. సమాజంలో గుర్తింపున్నొళ్లు, మంచి హోదాలో ఉన్నొళ్లు, సమస్యలపై మాట్లాడేవాళ్లే ఎక్కువ స్మోకింగ్‌ ప్రియులు. "కొండంత రాగందీసి పాసుపండ్ల పాట పాడినట్లు" ఏవేవో సమస్యల మీద ఉపన్యాసాలిస్తుంటరు. అదైపోగానే గప్పుమని దమ్ము కొడతడు. ఎవరో మారాలి అని గొంతు చించుకొని ఎంత అరిస్తే ఏం ఫాయిదా.? ముందు మారాల్సింది విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్‌‌‌‌‌ను స్ప్రెడ్ చేస్తున్నొళ్లు. ఇంకా కొందరు పుస్తకాలు రాసేవాళ్లు, సినిమాలు తీసేవాళ్లు, ఇంటెలెక్చువల్స్ ఎన్ని ఎక్కువ సిగరెట్లు కాలిస్తే అంత ఎక్కువ క్రియేటివిటీని చూపించొచ్చనే భ్రమలో ఉంటారు. ఓ మేధావీ.. జర "Your body is not a ash tray" అని తెలుసుకోవయా.

మీ పీల్సుడు ఎవరికి శాపం.?

"Smoking thrills, but it also kills". ఎవర్ని.? పొగతాగేవాళ్లనే కాదు. గాల్లోకి వచ్చిన సిగరెట్ పొగను తమకు తెలియకుండానే పీల్సుకున్నవాళ్లను కూడా. సరే, ఏదో స్టయిల్ కోసమో, గుతికొద్దో బహిరంగంగా స్మోకింగ్ చేసి పోతరు. కానీ అది వాళ్లకంటే పక్కనున్నొళ్లకే ఎక్కువ డేంజర్. దీన్నే "సెకండ్ హ్యాండ్ స్మోక్" అంటరు. ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల విడుదలయ్యే పొగలో 7000కు పైగా కెమికల్స్ ఉంటయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ కారకమైనవి. మనకు తెల్వకుంటనే సిగరెట్ పొగ శరీరం లోపలికివెళ్లి ఆస్తమా, హార్ట్ ఎటాక్ వంటి రోగాలను తెస్తుంది. కొందరు చిన్న పిల్లల ముందే సిగరెట్ తాగుతుంటరు. ఆ పొగను వాళ్లు పీల్సుకుంటే "సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్" సమస్య వస్తది.

పీల్చకపోయినా డేంజరే.!

బహిరంగ ధూమపానం "సెకండ్ హ్యాండ్ స్మోక్" మాత్రమే కాదు.. "థర్డ్ హ్యాండ్ స్మోక్" కూడా చాలా ప్రమాదం. "సెకండ్ హ్యాండ్ స్మోక్" వల్ల స్మోకింగ్ చేసిన వ్యక్తులు కాకుండా పక్కవాళ్లు తమకు తెలియకుండానే పొగను పీల్చుకుంటరు. ఇక "థర్డ్ హ్యాండ్ స్మోక్" వల్ల ఆ పొగ ఆ ప్రదేశంలోని ధూళి, గోడలు, ఫర్నీచర్‌పై అంటుకొని హానికరమైన రసాయనాలను వదులుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కదిలిస్తుంది. అంటే సిగరెట్ తాగేదొకడు. బలయ్యేది ఇంకొడు అన్నమాట. "థర్డ్ హ్యాండ్ స్మోక్" వల్ల "కార్సినోజెనిక్" వంటి రసాయనాలు పొగతాగని వాళ్ల ఆరోగ్యానికి హాని చేస్తయి. ఇద్దరికీ తీరని నష్టాన్ని కలిగిస్తయి. అందుకే.. "Smoking is not only injurious to health, but it's also a death trap for your wallet" అని గ్రహించండి.

లెక్కలేం చెప్తున్నయి.?

"Every cigarette you don't smoke is a victory". ఈ పాయింట్ ఎప్పుడు అర్థం చేసుకుంటరు.? ఇవేవీ పట్టించుకోక పోవడం వల్లనే దేశంలో పొగాకు ప్రతీయేడు 1.0 నుంచి 1.35 మిలియన్ మరణాలు నమోదవుతున్నయి. ఇందులో ధూమపానం వల్ల 79.8% మరణాలు సంభవిస్తున్నయి. "సెకండ్ హ్యాండ్ స్మోక్" పెరిగిపోయి 2021లో ఇండియాలో 2,20,600 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నయి. 2016-17 గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం ఇండియాలో 29% పెద్దలు పొగాకు వినియోగదారులు. ఇందులో 10.38% స్మోకింగ్, 21.38% స్మోక్‌లెస్ పొగాకు వాడుతున్నారు. 2019 గ్లోబల్ యూత్ టొబాకో సర్వే ప్రకారం 13-15 ఏళ్ల వయసున్న 1.4% యువత స్మోకింగ్ చేస్తోంది.

ఈ నష్టానికి బాధ్యులెవరు.?

బీడీ, సిగరెట్ 27% క్యాన్సర్లకు కారణమైతున్నయి. స్మోక్‌లెస్ పొగాకుతో 70% నోటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2017-18లో పొగాకు సంబంధిత వ్యాధులు, అకాల మరణాల వల్ల దేశం 1.04% జీడీపీ నష్టపోయింది. ఇందులో ఆరోగ్య ఖర్చులు 5.3%గా చెప్పొచ్చు. యువత కీలకమైన లైఫ్ పీరియడ్‌‌‌ను సిగరెట్ల దగ్గరే కోల్పోతుంది. 21% యువత బహిరంగ ప్రదేశాల్లో సెకండ్ హ్యాండ్ స్మోక్‌కు గురవుతోంది. 11% మాత్రం ఇంట్లోగానీ, వర్క్‌ప్లేస్‌లో గానీ స్మోకింగ్ వల్ల నష్టపోతోంది. దమ్ము కొడితేనే దమ్మున్నొళ్లం అనుకునే మోతెవర్లు ఎవరైనా ఉంటే ఈ నష్టాన్ని చూసి మాట్లాడండి. సిగరెట్ చేతిలో పట్టుకొని ప్రతీ ఒక్కరూ దీనికి బాధ్యులే. ఇప్పటికైనా గ్రహించండి నాయనా.. "Smoking is not a solution, it's a problem"

పర్యావరణం

సిగరెట్ పొగ కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా, ఇతర హానికరమైన వాయువులను విడుదల చేస్తుంది. ఇది గాలి నాణ్యతను దెబ్బతీస్తుంది. సిగరెట్ ముక్కలు పర్యావరణంలో అతిపెద్ద వ్యర్థాలలో ఒకటి. ఇవి బయోడిగ్రేడబుల్ కావు. నీటి వనరులను కలుషితం చేస్తాయి. ఈ ముక్కలలో నికోటిన్, ఆర్సెనిక్, లెడ్ వంటి విషపదార్థాలు ఉంటాయి. ఇవి నేల, నీటిని కలుషితం చేస్తాయి.

సామాజిక ప్రభావం

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, లేదా రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో. ఇది యువతను ధూమపానంవైపు ఆకర్షిస్తుంది. పొగతాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల చికిత్సకు గణనీయమైన ఆర్థిక భారం పడుతుంది. ఇది వ్యక్తులు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి తెస్తుంది.

చట్టపర పరిణామాలు

భారతదేశంలో సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే జరిమానా లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది సామాజిక క్రమశాసనాన్ని ప్రభావితం చేస్తుంది. బహిరంగ ధూమపానం ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం వల్ల సామాజిక బాధ్యత లోపిస్తుందనే అభిప్రాయం ఏర్పడుతుంది.

ఏ దేశంలో ఎలా.?

- ఆస్ట్రేలియాలో బహిరంగ భవనాల ఎంట్రన్స్‌లకు 4 మీటర్ల దూరంలో, పిల్లల ఆటస్థలాలకు 10 మీటర్ల దూరంలో, బీచ్‌లు, స్పోర్ట్స్ స్టేడియంలలో ధూమపానం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే $154.80 పెనాల్టీ వేస్తారు.

- కెనడాలో 2035 నాటికి ధూమపాన రేటును 5% కంటే తక్కువకు తగ్గించే లక్ష్యంగా బహిరంగ రవాణా, పనిస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం అమలు జరుగుతోంది. సిగరెట్ ప్యాకేజీలపై హెచ్చరిక లేబుల్స్ తప్పనిసరి.

-చైనాలో బహిరంగ రవాణా, పిల్లల ఆటస్థలాలు, ఆసుపత్రి ఆవరణలు, బస్ స్టాప్‌లలో ధూమపానం నిషేధం. ఒకవేళ చేస్తే మున్సిపల్ అధికారుల ద్వారా అడ్మినిస్ట్రేటివ్ పర్యవేక్షణ, ఫైన్‌లు ఉంటాయి. $29.6 (¥200) వరకు జరిమానా విధిస్తారు.

- సింగపూర్లో బహిరంగ భవనాలు, రెస్టారెంట్లు, బస్ స్టాప్‌లు, బీచ్‌లు, ఈవెంట్‌లలో ధూమపానం నిషేధం. ఇ-సిగరెట్లపై కూడా కఠిన నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే మొదటిసారి $200, రెండోసారి $500 ఫైన్ వేస్తారు.

- జపాన్లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. స్థానిక అధికారుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు, హెచ్చరికలు ఉంటాయి.

అవగాహన కల్పిస్తా: డబ్బికార్ పెంటోజీ, పర్యావరణవేత్త

నేను స్వతహాగా జానపద, సామాజిక గాయకుడిని. పర్యావరణ పరిరక్షణ కోసం గత 30 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నా. హాస్టల్స్, కాలేజీల దగ్గరికి వెళ్లి చూస్తే గంపలకొద్ది సిగరెట్ పీకలు కనిపిస్తయి. వాటన్నింటినీ నేనే స్వయంగా గంపలోకి ఏరి, విద్యా్ర్థులకు చూపించి ఇదీ మీ తీరు అని అవగాహన కల్పిస్తుంటా. ఎప్పటికైనా మారతారనే నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను.

స్కూల్లో చెప్తుంటా: చిందం శ్రీనివాస్, గవర్నమెంట్ టీచర్

బహిరంగ ధూమపానం పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సిగరెట్ ముక్కలు వాతావరణంలో విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి గాలి కాలుష్యాన్ని పెంచుతాయి. సిగరెట్ ఫిల్టర్‌లు, సెల్యులోజ్ ఎసిటేట్‌తో తయారైనవి. బయోడిగ్రేడబుల్ కాదు. నేల, నీటి వనరులను కలుషితం చేస్తాయి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చిన్నప్పటి నుంచే పిల్లలకు వీటివల్ల కలిగే దుష్ఫ్రభావాల గురించి వివరిస్తుంటా.

ఓపెన్‌గా చేస్తుంటారు: యాట రాజు, ఆర్టీసీ కండక్టర్

బహిరంగ ధూమపానం వల్ల కలిగే నష్టాలను తలుచుకుంటే ఆందోళన కలుగుతోంది. బస్టాండ్లు, బస్టాపుల్లో స్మోకింగ్ చేయొద్దనే కామన్ సెన్స్ అందరికీ ఉండాలి. కానీ రోజూ చూస్తుంటాం "ఎవరేం చేస్తారులే" అనే ఉద్దేశంతో ఓపెన్‌గా స్మోకింగ్ చేస్తుంటారు. అందరి ఫ్రెండ్స్ సర్కి్ల్స్‌లో ఈ "దమ్ము"న్న వాళ్లుంటారు. వాళ్లకది కూల్‌గా అనిపిస్తుంది. కానీ వాళ్లతో పాటు దాంతో సంబంధం లేనివారికి కూడా నష్టం చేస్తుంది.

Next Story