- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అని దీవించాల్సిన చేతులతోనే.. పిల్లల గొంతు పిసుకుతున్న పేరెంట్స్
ఓ చోట కన్న తల్లే పిల్లలకు విషమిచ్చి చంపుతుంది... మరోచోట తండ్రి తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తాను దూకుతాడు.. ఇంకోచోట పిల్లలిద్దరి చేతులు కట్టి బకెట్లో ముంచి పంపాడు మరో తండ్రి..

చిన్నారులపై హింస
కాల్ 1098
చైల్డ్ హెల్ప్ లైన్
-----------
ఓ చోట కన్న తల్లే పిల్లలకు విషమిచ్చి చంపుతుంది... మరోచోట తండ్రి తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తాను దూకుతాడు.. ఇంకోచోట పిల్లలిద్దరి చేతులు కట్టి బకెట్లో ముంచి పంపాడు మరో తండ్రి.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. పాము తన పిల్లల్ని తానే తినేస్తుందట.. వీరు కూడా అలాగేనా అనిపిస్తుంది. చిన్నారుల జీవితాలను చిదిమేసే హక్కు వీరికెవరు ఇచ్చారు..? దీనినే మానసిక వైజ్ఞానిక పరిభాషలో ‘అల్ట్రూస్టిక్ ఫిలిసైడ్’ అంటారు. తమ పిల్లలను భవిష్యత్‌లో బాధపడనివ్వకూడదని భావించి ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. నాన్నంటే నమ్మకం కదా..? అమ్మంటే ఆయువే కదా.. అటువంటి అమ్మానాన్న పిల్లల ఆయువును తీస్తుంటే.. ఏం చేయాలి..? దీర్ఘాయుష్మాన్‌భవ అని దీవించాల్సిన చేతులతోనే పిల్లల గొంతు నులుపుతున్నారు.. వంద కారణాలు ఉండవచ్చు.. కానీ పిల్లల్ని చంపే హక్కు వారికెవరు ఇచ్చారు. మొన్నటికి మొన్న కాకినాడ ఘటన విన్న ప్రతి ఒక్కరిలో అదే ప్రశ్న మెదిలింది. = అనిల్ శిఖా
ఉదయం నిద్ర లేవగానే పిల్లలు ఉన్న ప్రతి ఇంటిలో అలారం మోగుతుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఇంటిలో ఒక్కసారిగా ఏదో యుద్ధమే జరుగుతుందన్న స్థాయిలో వాతావరణం మారిపోతుంది. బెడ్ నుంచి పిల్లలను అరుస్తూ లేపడం.. బ్రష్ చేసుకోవాలని అరవడం.. స్నానం చేయాలని చెప్పడం.. సబ్బు సరిగా పెట్టుకున్నారా? తల తుడుచుకున్నారా? యూనిఫాం కరెక్టుగా వేసుకున్నారా? ఇలా 9గంటలకు స్కూలు బస్సు వచ్చేవరకూ కనీసం 40 నుంచి 50సార్లు గట్టిగా అరిచే తల్లిదండ్రులు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు. కానీ, ఒక్కక్షణం ఆలోచించండి. మీరు కాస్త ముందుగానే లేచి.. వాళ్లకి పాలు, టిఫిన్ తయారుచేస్తూనే మధ్యలో వచ్చి ప్రేమగా వాళ్లను నిద్రలేపే ప్రయత్నం చేశారు అనుకోండి. కొద్దిరోజులకు వాళ్లే టిఫిన్ చేసే హడావిడి చూసి ఎవరూ లేపకముందే వాళ్లే నిద్ర లేస్తారు. అప్పుడు అందరి ఇళ్లల్లో ఉదయం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
పిల్లలతో చిన్న చిన్న విషయాలకు కూడా గట్టిగా అరవడం వల్ల వాళ్లు సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు. దీంతో మానసికంగా చాలా సున్నితంగా మారుతారు. అలా కాకుండా ప్రతి విషయంలో వాదించేలా చేయడం.. నో అని కచ్చితంగా చెప్తే మారాం చేయకుండా చూడటం.. దినచర్యను సరిగ్గా పాటించేలా చూడటం.. శుభ్రత నేర్పడం ఇలా చేయడం వల్ల పిల్లలు ఉత్తమ ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లల మానసిక వికాసం క్లాసు రూముల్లో 30శాతానికి మించి జరగదు.. 70శాతం మన ఇంటిలోనే జరుగుతుంది. అందుకని పేరెంట్స్ పిల్లలు మన దేశ భవిష్యత్తు.. వారిని సరైన దారిలో పెంచడం మన కర్తవ్యం. ఒక విత్తనాన్ని మంచి మానుగా చేసేందుకు తోటమాలి ఎంతగా కష్టపడుతాడో.. పేరెంట్స్ కూడా అలా చేయడం వల్ల భవిష్యత్ తరాలు కూడా ఉత్తమ ప్రవర్తన వారసత్వంగా వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లలతో ప్రేమగా ఉండండి. అంతేకానీ, చిన్న పిల్లలపై ప్రతాపం చూపకండి. అది హీనమైన చర్య.
ఇటువంటి ఘటనలు ఎన్నో..
_ పొద్దున లేస్తే తల్లి లేక తండ్రి తమ పిల్లలను చంపిన ఘటనలు వినిపిస్తూనే ఉంటాయి. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఘటన అందరినీ కలవర పరిచింది. ఓ తండ్రి తన పిల్లల చేతులు కట్టివేసి బకెట్లో ముంచి చంపేశాడు. తర్వాత అతను కూడా సూసైడ్‌నోట్‌రాసి ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన వెనుక కారణాలు ఏవైనా.. పిల్లల్ని అంత పాశవికంగా చంపే మనసు ఆ తండ్రికి ఎలా వచ్చింది..?
_ గత ఏడాది ఇటువంటి ఘటనే ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి బైక్‌సహా కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. పిల్లలు కాలువలో మునిగి చనిపోగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఇద్దరు ఆడపిల్లల మృతదేహాలను చూసి తల్లి గుండెలు అవిసేలా రోదించింది.
_ హైదరాబాద్హబ్సిగూడలో ఈ నెల 11న ఇద్దరు దంపతులను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ తల్లిదండ్రులు పిల్లలను ఒప్పించి వారికి విషం ఇచ్చారు. పిల్లలిద్దరి వయసు, 10, 15 సవంత్సరాలు. చనిపోయే ముందు వారు ఓ లేఖ రాశారు.
_ గత ఏడాది జనువరిలోఓ నాగర్‌కర్నూలు ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దానికి కారణం కూడా చాలా చిన్నది. సంక్రాంతికి పిల్లలకు దుస్తులు కొనివ్వమని ఆమె తన భర్తను అడిగింది. తన దగ్గర డబ్బు లేదని అతను బదులిచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పిల్లలను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది.
_గత ఏడాది రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్నడ్డాడు. కారణం ఆర్థికంగా నష్టంపోవడం..
_ రెండేళ్ల కిందట ఉత్తర్‌ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో ఓ వైద్యుడు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను డిప్రెషన్‌తో బాధపడ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో సుత్తి, రక్తపు మరకలు, మందు ఇంజెక్షన్లు లభించాయి. వైద్యుడు తన భార్య, పిల్లలకు స్పృహ కోల్పోవడానికి మందులు ఇచ్చాడు. ఆపై వారి తలపై కొట్టి చంపాడు. ఇటువంటి ఘటనలు రోజూ ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం.
తల్లిదండ్రుల మానసిక లోపం
తల్లిదండ్రులు చాలామంది తమ చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలను తమ పిల్లలకు కూడా ఇలా జరుగుతుందేమోనని ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఆ సమయంలో తాము సమస్యలు ఎదుర్కోలేకపోయామని.. ఇక తమ పిల్లలు కూడా అలాంటి సమస్యలు ఎదుర్కోలేకపోతారని భయపడుతుంటారు. నిజానికి చిన్నతనంలో ప్రతి ఒక్కరు కాస్త ఎక్కువో తక్కువో ఇబ్బందులు పడతారు. అవి సహజం. వాటినుంచి ఎలా రక్షించుకోవాలి? ఎలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి? అన్నది తల్లిదండ్రులు పిల్లలకు సందర్భోచితంగా చెప్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అప్పుడు పిల్లలు తాము ఎదర్కొనే సమస్యలను తల్లిదండ్రులతో భయపడకుండా చెప్తారు. అలాంటప్పుడు పిల్లలది తప్పు అయినా.. వారికి వివరంగా చెప్పాలి. ఇతరుల సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని తక్షణమే పరిష్కారం చూపాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైనది. ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ పిల్లలు మీ వయస్సు కంటే చాలా చిన్నవారని.. వారికి అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఒకసారి చెప్పడం వల్లనే వారు వింటారని అనుకోకుండా.. ప్రతి పనిని ఎలా చేస్తే ఇంకా సమర్థవంతంగా పూర్తి చేయవచ్చో చెబితే వారు అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు చెప్పినవేవీ.. వారు అర్థం చేసుకోవడం లేదని అంటే.. మీరు చెప్పే విధానమే మార్చుకోవాలని తెలుసుకోవాలి. పిల్లలు అర్థం చేసుకునే స్థితి ఒక్కొక్కరికీ ఒక్కోస్థాయిలో ఉంటుంది. అంతమాత్రాన వారు పనికిరానని ముద్ర వేయడం అత్యంత హీనం. ప్రతి ఒక్కరిలో ఎన్నో టాలెంట్లు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా వెలికితీస్తే ఆణిముత్యాలు అవుతారు. అంతేకానీ, మీ ఆలోచనలను వారిపై రుద్ది వారిని ఇబ్బంది పెట్టడం అంటే.. చిన్నసైజు బూట్లలో కాళ్లు పట్టించడమే అవుతుంది. అందుకే సహజసిద్ధంగా వారిని ఉన్న టాలెంట్ ఏమిటి? వారిని ఏ దిశగా ప్రోత్సహించాలి? అన్నది వారితో సమయం గడిపితేనే తెలుస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో కాస్త సమయం వెచ్చించండి. మీరు చెప్పిందే వాళ్లు వినడం కాకుండా.. వాళ్లు ఏది చెప్పినా మీరు కూడా వినడం నేర్చుకోండి. వాళ్లు చెప్తున్న అంశాల్లో నిజాలు ఉన్నాయా? లేక ఫిక్షన్ ఉందా? అన్నది గమనించండి. ఇలా చేయడం వల్ల పిల్లలను ఉత్తమ భావిపౌరులుగా తీర్చిదిద్దవచ్చు.
ఎందుకిలా ప్రవర్తిస్తారు..?
తల్లిదండ్రులు పిల్లలను హత్య చేయడాన్ని ‘అల్ట్రూస్టిక్ ఫిలిసైడ్’ (Altruistic Filicide) అని పిలుస్తారని డాక్టర్ రామకృష్ణ చెబుతున్నారు. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా, సైకోసిస్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇటువంటి దారుణాలకు ఒడిగడుతుంటారని ఆయన అన్నారు. కుటుంబ కలహాలు, విడాకులు, పిల్లలను కోల్పోతాననే భయం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ నష్టం, వ్యసనపరమైన ప్రభావం (మద్యపానం, మాదకద్రవ్యాలు), భయానక భవిష్యత్తు ఊహించి పిల్లలను కాపాడాలనే భ్రమలో వీరు ఇలా ప్రవర్తిస్తారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారు అలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యా భావనతో పాటు పిల్లల హత్య కూడా చేస్తారు. తమ పిల్లలను భవిష్యత్‌లో బాధపడనివ్వకూడదని భావించి తప్పుగా నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు కుటుంబ కలహాలు, విడాకులు కూడా కొంత కారణం కావచ్చు. భార్యపై కోపం వల్ల కొందరు పిల్లలను హాని చేస్తారు. ఇటువంటి సంఘటనల్లో కొందరు పిల్లలను హత్య చేసి తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు.
వీటిని నివారించవచ్చా..?
ఇటువంటి ప్రవర్తన కలిగిన వారికి మానసిక ఆరోగ్య పరీక్షలు, చికిత్స అందించాలి. కుటుంబ సమస్యలు స్నేహితులు, బంధువులతో పంచుకోవాలి. మద్యం, మాదకద్రవ్యాలను తగ్గించేందుకు డీ-అడిక్షన్ సెంటర్లను వినియోగించుకోవాలి. హింసాత్మక తల్లిదండ్రుల నుండి పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. సామాజిక మద్దతు, కౌన్సిలింగ్ అందించాలి. ఇటువంటివి జరిగితే పోలీసు, చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) ను సంప్రదించాలి. - డా రామకృష్ణ, డైరెక్టర్ (ట్రస్ట్ హాస్పిటల్)
బాల్యాన్ని బలి చేయకూడదు
అసలు ఒకటో తరగతి, ఎల్‌కేజీ పిల్లలు పోటీ పడలేకపోవడం ఏంటి? పేరెంటింగ్ మారాలి. పిల్లలకు సక్సెస్ గురించి చెప్పేవారే గానీ, ఫెయిల్యూర్ అందులో ఓ భాగమని చెప్పేవాళ్ళు లేరు. పిల్లల హత్యకు చదువే కారణం అయితే.. విద్యా వ్యాపారం కోసం ఇలాంటి భావజాలాన్ని పేరెంట్స్ మెదళ్లల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. పిల్లలు పేరెంట్స్ ఆశలకు, ఆశయాలకు ప్రతినిధులుగా చూడడం మానేయాలి. వాళ్లకు బంగారు బాల్యాన్ని అందించాలి. బాల్యం పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్‌తో నిండే విధంగా చూడాలి. అనవసరమైన పోటీతో పిల్లల బాల్యాన్ని బలి చేయకూడదు. - బి.కృష్ణభరత్, సైకాలజిస్టు (జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీఏ ఇండియా)






