అమ్మా నీకు వందనం!

by Sujitha Rachapalli |

అమ్మ.. తాను మునిగిపోతున్నా.. తనువు చాలిస్తున్నా.. బిడ్డను ఒడ్డుకు చేర్చే గొప్ప హృదయంగలది. అడ్డుగా ఏమొచ్చినా.. ఆటంకం ఏ రూపంలో వచ్చినా.. తన ప్రాణాలనే అడ్డమేసి బిడ్డను బతికించుకునే నిస్వార్థ గుణం.

అమ్మా నీకు వందనం!
X

దిశ, ఫీచర్స్ : అమ్మ.. తాను మునిగిపోతున్నా.. తనువు చాలిస్తున్నా.. బిడ్డను ఒడ్డుకు చేర్చే గొప్ప హృదయంగలది. అడ్డుగా ఏమొచ్చినా.. ఆటంకం ఏ రూపంలో వచ్చినా.. తన ప్రాణాలనే అడ్డమేసి బిడ్డను బతికించుకునే నిస్వార్థ గుణం. తాను పీలుస్తున్నది ఆఖరి శ్వాసే అని అర్థమైనా.. కండ్ల ముందు కాల యముడు కరాళనృత్యం చేస్తున్నా.. ఆ ఆఖరి శ్వాసతోనూ బిడ్డకు ఊపిరి పోస్తూ ఊయలూపుతుంది.

శ్వాసకు శాశ్వతంగా దూరమైనా..

ఏప్రిల్ 30.. సాయంత్రం సుమారు ఆరున్నర.. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది బ్యాక్‌ వాటర్స్‌లో బోటు నడుస్తోంది. 29 మంది ప్రయాణికులున్నారు. పిల్లలతో నర్మదా జల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మధ్యలోకి వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. సైక్లోన్ లాంటి గాలులు మొదలయ్యాయి. అరుపులు.. కేకలు.. హాహాకారాలు మొదలయ్యాయి. కొందరు ఈదే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు తేలుతున్నారు.. బోటు శకలాల మధ్యలో ఇరుక్కున్నారు. వీరిలో ఒక తల్లి.. తన నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు. తానిక చనిపోతున్నానని తెలిసి కొడుకునైనా కాపాడుకుందామని ఆ తల్లి మనసు తల్లడిల్లింది. కొన ఊపిరిలోనూ కొడుకు క్షేమం కోసం కోటి దేవుళ్లకు మొక్కింది. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక ఆఖరి ప్రయత్నంగా మాతృ కౌగిట్లో కొడుకును భద్రంగా దాచుకోవడమే అని శ్వాసకు శాశ్వతంగా దూరమైతున్నా వెచ్చని కౌగిటితో నిద్రబుచ్చింది.

ఆ ప్రేమే ఒక శిఖరం..

అమ్మతనం ఇలా ఉంటుంది. అది మనకు గొప్పతనమే. కానీ అమ్మ అలా ఫీలవ్వదు. తాను తడుస్తూ మనల్ని నడిపిస్తుంది. బాధలెన్ని ఉన్నా తనకు మన భద్రతే ముఖ్యం. ఐతే.. ఖమరియా బోటు ఘటన సందర్భంగా వైరలైన తల్లీ బిడ్డల ఫొటో ఆర్టిఫిషియల్ ఫొటో అనీ.. దానిని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని కొందరు అన్నారు. సరే.. వాళ్లన్నట్టు ఏఐ ఫొటోనే అయుండొచ్చు. ఫొటో ఏఐ ఎడిట్ కావొచ్చుగానీ ఆ తల్లి తండ్లాట.. ప్రేమ అయితే కృత్రిమమైంది కాదు కదా? ఆ తల్లే కాదు.. ఈ మాతృమూర్తుల మమకారం అనేది ఏ ఎడిట్లకూ తావివ్వని సహజమైంది. ఈ అమ్మ ప్రేమే.. ఈ తల్లి తండ్లాటే.. ఆమె హృదయమే అందరి తల్లులకూ ఉంటుంది. తల్లి అనే పాత్రే తపనకూ.. త్యాగానికి.. బంధానికి.. భద్రతకు.. నిదర్శనం. అమ్మ ప్రేమ ఒక శిఖరం. అన్నీ ఇచ్చేసి.. ఏమీ ఆశించని బోలా మనసుగలది.

ఆనందపు అక్షయపాత్ర..

అమ్మ ఏ పరిస్థితిలో ఉన్నా.. ఎంతటి టెన్షన్‌లో ఉన్నా బిడ్డను చూడగానే మురిసిపోతుంది. నెత్తి నిమురుతూ మన ఆకలిని, అవసరాలను క్షణాల్లో కనిపెడుతుంది. హోదాలో మనమెంత పెద్దస్థాయిలో ఉన్నా.. పలుకుబడిలో మనకెంత పతారె ఉన్నా అమ్మకు మనమొక చంటి పిల్లాడిమే. గావురాల బిడ్డమే. తెలంగాణ నూతన డీజీపీగా ఇటీవల బాధ్యత తీసుకున్న సీవీ ఆనంద్ వాళ్ల అమ్మ ఆశీర్వాదం తీసుకున్న విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తీరికలేని బాధ్యత సీవీ ఆనంద్‌ది. బాస్ పొజిషన్. కానీ.. తల్లిని కలిసినప్పుడు ఎలా పిల్లోడైపోయాడో చూశాం కదా? ఆ తల్లి మంచమ్మీదే ఉండొచ్చు. అనారోగ్యంతోనే ఉండొచ్చు. కానీ.. బిడ్డను డీజీపీగా చూసినప్పుడు తనకు కలిగిన ఆనందం.. ఉపశమనం ఎన్ని ఔషధాలు ఇవ్వగలుగుతాయి. అందుకే అమ్మ ఆనందపు అక్షయపాత్ర.

త్యాగానికి వెల కట్టగలమా?

మార్చి 26.. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళుతున్న బస్సొకటి రాయవరం దగ్గర యాక్సిడెంట్‌కు గురైంది. టిప్పర్, బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే బస్సంతా వ్యాపించాయి. వీళ్లలో కనిగిరికి చెందిన ఉప్పు రమాదేవి, తన కొడుకు మనోహర్ కూడా ఉన్నారు. ప్రమాదం జరగ్గానే ఆమె అలర్టయింది. కర్టెన్లకు మంటలు అంటుకోవడం.. వేగంగా వ్యాపించడం గమనించిన తాను అనుకుంటే వెంటనే బస్సులోంచి దూకి తప్పించుకునేది. కానీ.. ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఆమె ఒక తల్లి. తనకు తన ప్రాణం కంటే కొడుకు ప్రాణం ముఖ్యం. మంటలు పూర్తిగా వ్యాపించి పొగ కమ్మేసి ఊపిరాడని పరిస్థితిలో కొడుకును కిటికీలోంచి బయటకు తోసేసింది. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతడిని కాపాడే క్రమంలో ఆ తల్లి మంటల్లో సజీవదహనం అయింది.

అందుకే..

అలాంటి మన అమ్మల ప్రేమ.. త్యాగాలను స్మరించుకోవడానికి మాతృ దినోత్సవమొక్కటే సరిపోదు.

ఆమెకు ఏ వర్ణనా సరి తూగదు.

అమ్మలు వర్ధిళ్లాలి..

వారి ప్రేమ సజీవంగా ఉండాలి.

Next Story