- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్వాడీలు దోపిడీదారులా? ఇక్కడికి ఎప్పుడు, ఎలా వచ్చారు?
మార్వాడీలపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం తీవ్రమైంది. అందుకు కారణం లేకపోలేదు..

దిశ, వెబ్ డెస్క్: 'మార్వాడీ గో బ్యాక్'.. ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారని, స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. మార్వాడీలపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం తీవ్రమైంది. అందుకు కారణం లేకపోలేదు.. పార్కింగ్ విషయమై ఓ యువకుడిపై మార్వాడీలు దాడి చేయటం, గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల వ్యాపార ఆధిపత్యాన్ని, దోపిడిని విమర్శిస్తూ పాట పాడటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి దారితీసింది. ఈ సందర్భంగా అసలు మార్వాడీలు ఎవరు? తెలంగాణలో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయాలను తెలుసుకుందాం.
సాధారణంగా చాలామందికి మార్వాడీ అనగానే మహారాష్ట్ర నుంచి వచ్చారని అనుకుంటారు. కానీ, నిజానికి మార్వాడీలు రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు. జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు. అందుకే వీరిని మార్వాడీలుగా పిలుస్తారు. మారు (థార్ ఎడారి ప్రాంతం), వాడి (నివాసం) రెండు పదాల కలయిక నుంచి మార్వాడీ అనే పదం వచ్చింది. ఇక మార్వాడీల్లో ఎక్కువగా హిందువులే ఉంటారు. అయితే వారు జైన, హిందూ ఆచారాల ఆధారంగా ప్రత్యేకమైన జీవనశైలిని అనుసరిస్తారు. వీరి ఆచారాలలో కుటుంబ విలువలు, సమాజ సేవ, మతపరమైన కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మార్వాడీలు దీపావళి, హోలీ, వినాయక చవితి వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. రాజస్థాన్‌లో వీరు నివసించే ప్రాంతంలో సారవంతమైన నేల లేకపోవడంతో వ్యవసాయం చాలా తక్కువగా ఉండేది. దీంతో ప్రధానంగా వ్యాపారంపై దృష్టి పెట్టారు. వీరు ఎక్కువగా వస్త్రాలు, బంగారం, ఆభరణాలు, ఫైనాన్స్ రంగాల్లో రాణిస్తున్నారు.
వ్యాపార రంగంలోకి మార్వాడీలు
భారతదేశంలో వ్యాపార రంగ అభివృద్ధిలో మార్వాడీ పాత్ర కీలకమనే చెప్పాలి. సుమారు క్రీస్తు శకం 6వ శతాబ్ధం నుంచి మార్వాడీలకు వ్యాపార చరిత్ర ఉంది. అప్పట్లోనే రాజ్‌పుత్ రాజవంశాలకు చెందిన రాజులకు ఆర్థిక సలహాదారులుగా, వ్యాపారులుగా, రుణదాతలుగా సేవలందించారు. అయితే, 16వ శతాబ్ధంలో మొఘల్ పాలన కాలంలో మార్వాడీల వ్యాపారాలకు గుర్తింపు వచ్చింది. వారి కాలంలోనే రాజస్థాన్, గుజరాత్ నుంచి వారణాసి, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలు స్థాపించి, తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించారు. అనంతరం బ్రిటిష్ పాలనలో మార్వాడీలు ఆంగ్లేయులకు ఆర్థిక సేవలు అందించటం ద్వారా వారి వ్యాపారాలను మరింతగా విస్తరించుకున్నారు. ఈ క్రమంలోనే వారు బ్యాంకింగ్ (దూరప్రాంతాలలో డబ్బు బదిలీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది ఆధునిక బ్యాంకింగ్‌కు ముందడుగుగా నిలిచింది), బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు.
ఎక్కడికెళ్లినా వ్యాపారంలో ముందంజ
ఇక ప్రస్తుతం ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా దేశంలో ఏ నగరంలో చూసినా మార్వాడీలు లేని ప్రాంతం లేదు. వీరు ఎక్కడికి వెళ్ళినా వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. కస్టమర్లతో చక్కటి సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో దిట్టలు. అంతేకాదు, మనీ మేనేజ్‌మెంట్‌లో వీరిది ప్రత్యేక శైలి. మన దేశంలోని బిలియనీర్లలో 42 శాతం మంది మార్వాడీలే ఉన్నారు. బిర్లా కుటుంబం కూడా మార్వాడీ సమూహానికి చెందినదే. 'బిజినెస్ ఈజ్ ఏ వార్' అని ఆంగ్ల రచయిత మేరియా ప్యూజో చెప్పినట్లుగా.. ఆ యుద్ధంలో గెలవడానికి కావలసిన అన్ని ఎత్తుజిత్తులు మార్వాడీల వద్ద పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. అలాగే, మార్వాడీ సముదాయం బలమైన సామాజిక బంధాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇది వీరికి వ్యాపార విస్తరణలో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
నిజాం పాలనలో వలస
తెలంగాణలో మార్వీడీల ప్రయాణం 19వ శతాబ్ధంలో మొదలైంది. నిజాం పాలనలో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా మారడంతో, మార్వాడీలు వ్యాపార అవకాశాల కోసం ఇక్కడి వలస వచ్చారు. వారి వ్యాపారదృక్పథంతో నిజాం పాలన సమయంలోనే బంగారం, వస్త్రాలు, కిరాణా, ఆయిల్ మిల్లు వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత, మార్వాడీలు తమ వ్యాపార నెట్‌వర్క్‌ను మరింత విస్తరించారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. స్వీట్ షాపులు, పానీపూరి స్టాల్స్, బంగారం దుకాణాలు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలను స్థాపించారు.
గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం
ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యం కొంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ చోట్లా మార్వాడీలే ఉంటున్నారని, తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మార్వాడీ వ్యాపారులు తమ వస్తువులను తక్కువ ధరలకు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గుతోందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వాచ్‌మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్ళకి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారు తప్పా స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వరని మరో ఆరోపణ వీరిపై వినిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లో ఓ యువకుడిపై పార్కింగ్ విషయంలో మార్వాడీలు దాడి చేశారు. ఆ తర్వాత గోరేటి రమేష్ మార్వాడీలను విమర్శిస్తూ రాసిన పాట పాడటంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో మార్వాడీలపై వ్యతిరేకత మళ్లీ తెరపైకి వచ్చింది. 'మార్వాడీ గో బ్యాక్' వంటి నినాదాలు సోషల్ మీడియాలో వినిపించాయి.
అయితే, తాజాగా తెలంగాణలో మార్వాడీల వ్యతిరేక ఉద్యమానికి రాజకీయ రంగు కూడా పులుముకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలకు మద్ధతుగా నిలిచారు. మార్వాడీలను లక్ష్యంగా చేయడం కంటే, అక్రమ బంగ్లాదేశీలు , రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని, ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. అలాగే, టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్ సైతం మార్వాడీలకు మద్ధతుగా వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, ఇదే తరహా మార్వాడీలపై వ్యతిరేక పరిణామాలు గతంలో చెన్నైలోనూ చోటుచేసుకున్నాయి కానీ, అక్కడ త్వరలోనే ఉద్యమం సద్దుమణిగింది. మరీ తెలంగాణలో పరిస్థితి ఎలా మలుపుతీసుకుంటుందో వేచి చూడాలి.
పరిష్కారం అయ్యేది ఎలా?
కాగా, తెలంగాణలో మార్వాడీ వ్యాపారులు, స్థానిక సమాజం మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి, సామాజిక ఏకీకరణ, ఆర్థిక సమతుల్యత, సహకార వాతావరణం అవసరం. మార్వాడీలు స్థానిక సంస్కృతి, భాష, ఆచారాలను గౌరవించే విధంగా వ్యవహరించాలి. అలాగే, వారి వ్యాపారాలలో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు.. మార్వాడీలు నిర్వహించే దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారాలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించటం ద్వారా స్థానికులలో విశ్వాసాన్ని పెంచవచ్చు. ఇక స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నట్లుగా మార్వాడీలు తమ కమ్యూనిటీ వారికి తక్కువకు స్థానిక దుకాణదారులకు ఎక్కువ ధరలకు విక్రయించకుండా ధరలలో సమానత్వం, పోటీని ప్రోత్సహించే విధంగా న్యాయమైన వ్యాపార పద్ధతులను పాటించాలి. అలాగే, స్థానిక వ్యాపారులు కూడా వ్యాపార పోటీని సానుకూల దృక్పథంతో స్వీకరించాలి.






