పథకాలుండగా పనెందుకు దండగ.?

by Daayi Srishailam |

వాళ్లకంటూ ఏదో ఒక పథకం ఉండే ఉంటది కదా.?

పథకాలుండగా పనెందుకు దండగ.?
X

పొద్దున లేవాలె.

మొఖం కడుక్కోవాలె.

రోడ్డుమీదికి పోవాలె.

వాడో వీడో కలిస్తే బాతాఖానీ కొట్టి కడుపుల ఇంత ఆసరేసుకోవాలె.

మాపటీలి ఇంత సుక్కనో ముక్కనో ఏస్కుంటే ఐపాయె ఇగ.

"సుక్క.. ముక్కకైనా పైసలు కావాలెగా.. పనే చెయ్యకపాయె పైసలెట్లొస్తయీ" అని అనుకోకుండ్రి.

మనొళ్లు తల్సుకుంటే కుక్కను కొట్టినా పైసలు రాల్తయి.

కాకపోతే పని చెయ్యరు.

వాళ్లకంటూ ఏదో ఒక పథకం ఉండే ఉంటది కదా.?

- దాయి శ్రీశైలం

కూసున్న జాగల్నే..

మనొళ్లెవరు పన్జేస్తుండ్రు చెప్పుండ్రి.? "మీద మీద తిరిగి మిద్దెమీద పంతుర్రు" మనొళ్లు. ఈజీ మనీకి అల్వాటు పడ్డరు. చేతికి మట్టి అంటకుండా బతకడం నేర్శిండ్రు. అట్లనే బగ్గ పైసలొస్తున్నయాయె. ఇగ ఒళ్లొంచి పన్జేసి టైం కరాబ్ చేసుకునుడెందుకు చెప్పుండ్రి.? తెల్లబట్టలేసుకొని పొద్దున లేస్తే ఎమ్మార్వో ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు ముంగట కనిపిస్తరు. పెద్ద పైరవేదైనా చేస్తరా అంటే అదీ ఉండదు. గిట్లనే ఎవరైనా రేషన్ కార్డు అప్లయ్ చెయ్యరానొళ్లు.. చేసినా స్టేటసేందో తెల్వనొళ్లు.. భూమి పంచాయతీలుంటే కార్వాయి ఎర్కలేనొళ్లను పట్టుకుంటరు. అదీ ఇదీ అని చెప్పి శారాన పనికి బారాన కర్సువెట్టించి నెలరోజులు పబ్బం గడుపుతరు. కూసున్న జాగల్నే సంపాదించే ఉపాయమున్నంక ఇగ పన్జేసుడెందుకు.?

పన్జేసే అవసరమేముంది.?

ఇసొంటి పన్జేసెటొళ్లంతా ఒకప్పుడు మంచిగా పన్జేసినొళ్లు. ఎప్పుడైతే భూముల ధరలకు రెక్కలొచ్చిందో అప్పట్నుంచి "బ్రోకర్ దందా"కు అలవాటు పడ్డరు. "మరీ.. అన్నిరోజులూ ఇట్లా గిరాకీ ఉండదు కదా..? పూట గడిచేది ఎట్లా.?" అని అంటరా.? దానికీ వాళ్ల దగ్గర మంచి ఉపాయమే ఉంది. ఏముంది.. ఇంట్ల గిన్నెలు కొట్లాడకుండా ఉంటందుకు సర్కారు ఫ్రీ బియ్యమిచ్చె. ఎన్కనో ముందో రైతు భరోసా పైసలు అకౌంట్ల పడె. మధ్యల మధ్యల పీఎం కిసాన్ కింద మోడీ పైసలు రానే వచ్చె. ఇంట్ల ఎవరికో ఒకరికి ఫించెన్ రానే వస్తుండె. బిడ్డె పెండ్లిజేస్తే లక్ష రూపాయల చెక్కే వస్తుండె. రోగమో.. నొప్పో వచ్చి దవఖాన్ల పడితే పతారె చూపించుకొని ఎల్వోసీ తెచ్చుకునె. అది వర్కవుట్ కాకపోతే సీఎంఆరెఫ్ పైసలన్నా వచ్చె. ఇగ పన్జేసే అవసరం ఏడుంది చెప్పుండ్రి.?

పనిజేస్తే నామోషీ

అందరూ ఇట్లనే ఉండ్రని చెప్పలేంగానీ.. చాలామంది ఊర్లర్ల ఇట్లనే తయారైతుండ్రు. సర్కారు నుంచి ఏదో ఒక రూపంలో పైసలొచ్చి పూట గడుస్తది కాబట్టీ.. బయటకువొయ్యి పనులేమీ చేస్తలేరు. "ఒకని చేతికిందికి పనికివోతే ఆడు చెప్పినట్టే వినాలె. ఇట్లా సొంత తెలివితో తిప్పలవడితే పావలో పరకో ఎంతొచ్చినా సాలు" అనే ఉద్దేశంతో చాలామంది ఉంటరు. సరే.. కొంత వయసు మీదవడ్డొ్ళ్లంటే ఏదో అనుకోవచ్చు. కానీ యూత్ పోరగాళ్లుగూడ ఇట్లనే తయారై కాలవడ్తుండ్రు. ఫ్రీ కరెంటు.. ఫ్రీ వాటర్.. ఫ్రీ రేషన్.. ఫ్రీ హాస్పిటల్.. ఇట్లా అన్నీ ఫ్రీ దొరికితే బయిటికివొయ్యి కొలువెందుకు చేస్తరు చెప్పుండ్రీ.? వాళ్లు సదువుకున్న సదువుకు మంచి కంపెనీలల్ల మంచి కొలువులు వస్తయి. కానీ అట్లా పనిజేసుడు నామోషీ అనుకుంటరు.

పని విలువ తెలుసుకో

మనొళ్లేమో ఇట్లా పథకాల మీద.. పక్కొళ్ల అవసరాల మీద ఆధారపడి బతికుతుంటె.. బయిటొళ్లొచ్చి బాజాప్తా మన పనుల్ని కబ్జా చేస్తుండ్రు. ఇయాల ఎక్కడజూశినా అన్ని పనులల్ల బయిటొళ్లే ఉన్నరు. "మేంజెయ్యం.. మాతోనిగాదు" అనేది ఒక సిద్ధాంతం లెక్క భావించి వాటికి దూరముంటుండ్రు.పనే ఉండదనుకోండ్రీ. ఎందెందు వెదికినా అందందు గలరు అన్నట్లు ప్రతీ పనిలో బయిటొళ్లే ఉంటుండ్రు. "ఎప్పటికీ పన్జేస్కుంటనే ఉండాల్నా.. ఎదగొద్దా.?" అనెటొళ్లు కూడా ఉన్నరు. "ఎదగొద్దు.. సంపాదించొద్దు" అని ఎవరూ అనరు. కానీ స్కిల్స్‌కు తగిన పని చేస్తలేరని చెప్తున్నం. చదివిన చదువుకు, నేర్చుకున్న పనికి సార్ధకతేదీ అని అంటున్నం. మనం నామోషీ ఫీలై వదిలేసిన పనుల్ని వాళ్లు కండ్లకద్దుకొని చేస్తుండ్రంటే ఆ పని విలువేందో సూడుండ్రి.?

చేసేవాడికి దూరం లెక్కనా.?

సరే.. మనొళ్లు చదువుకుండ్రు కాబట్టీ "సైట్ ఇంజనీర్ పనుంది చేస్తవా" అని అడిగితే.. ఫస్ట్ "ఎక్కడ" అని అడుగుతరు. జాబ్ చేసెటోనికి ఎక్కడైతే ఏంది.? ఏడ దొర్కితే ఆడికి పోవాలెగానీ.? "అబ్బా అంత దూరమా.? నైట్ ఇంటికొచ్చేసరికి లేటైతదేమో కదా.? ఫ్యామిలీని మిస్సయితనేమో" అనే కథలు చెప్తుంటరు. కొలువుల్లేక కొట్టుకుంటుండ్రు ఒకొక్కరు. మనొళ్లేమో "పిలచి పిల్లనిస్తే ఏమో అన్నరంట సూడుండ్రీ".. ఆ శాస్త్రం చేస్తరు. చంపాపేట్లో ఉండేటోనికి చందానగర్ ఒక దూరమా.? ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లికి పొమ్మంటే.. అదేదో కువైటంత దూరమున్నట్లు ఫీలైతుంటరు. ఇంకా "నేను పుట్టి పెద్దగైనప్పటి నుంచి హాస్టల్లో ఉండలేదు.. నాకిక్కడ ఫుడ్ పడదు.. నీళ్లు పడవు" అని ఏవేవో సాకులు చెప్తుంటరు.

సుఖూన్ లైఫ్

మనకు చెయ్యడం చేతనైత లేదు కాబట్టే వేరేవాళ్లొచ్చి చేస్తుండ్రు. ఏ పనిలో లేరు చెప్పుండ్రి.? వాస్తవానికి ఈ పనులన్నీ మనొళ్లకు వస్తయి. ఆయా పనులల్ల మంచి ఎక్స్‌పర్ట్‌లు కూడా. కానీ.. ఇప్పుడు పనికి ఒంగుతలేరు. మస్తు చేసినం.. ఇంకెన్ని రోజులు చేస్తం అని నేర్చిన పనిని వదిలేస్తుండ్రు. జేబులో పైసల్లేకపోతే మల్లా పనికి పోవాలనిపిస్తది కానీ.. ఎవరేమనుకుంటరో అనే ఈగో అడ్డమొచ్చి పోతలేరు. అవన్నీ చేసే ఖర్మ మనొళ్లకేంది.? నెల నెలకు రేషన్ బియ్యమొచ్చె.. ఆ పథకమో ఈ పథకమో అని అకౌంట్లో పైసలు పడె. అత్యవసరంగా పైసలవసరమొస్తే మహిళా సంఘాల గ్రూపులో పావలా మిత్తీకి యాబై అరవైవేలు అప్పు దొరికె. అంత సుఖూన్ లైఫున్నంక ఆ పనీ ఈ పనీ ఎందుకు చెప్పుండ్రీ.?

వ్యాపారం నామోషీనా.?

మీద మీద తిరిగి.. అప్పో సప్పోజేశి కంఫర్ట్ జోన్లో బతకడం అలవాటు పడ్డ జనాలు మెల్లె మెల్లెగా ఊరును విడిచి పట్నం బాట పడుతుండ్రు. ఏమన్నంటే పిల్లల సదువు కోసం ఇబ్బందైతుందని అంటరు. మరి బిజినెస్ చేస్తందుకు ఏమయ్యింది.? మనకు చేతనైతే.. దందా చేసే తెలివే ఉంటే.. ఫ్రీ పథకాల మీద కాదు సొంత తెలివి మీద సంపాదిస్తం అనే ధీమానే ఉంటే వాళ్లలెక్క దుకాణాలు మనమెందుకు పెడతలేం.? లాభాలెందుకు పొందుతలేం. ఇదైతే మంచి పనే కదా.? ఏ ఉద్యోగం చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తం చెప్పుండ్రి.? ఈ షాపులన్నీ పెట్టి మార్వాడీలు నెలకు మినిమం రూ.లక్ష సంపాదిస్తుండ్రు తెలుసా.? వ్యాపారం కూడా నామోషీనా మనకు.?

గవర్నమెంట్ ఇస్తెనే ఇల్లా.?

ఉన్నదున్నట్టంటే కోపమొస్తది కానీ.. మనం ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంటిచ్చే ఇందిరమ్మ ఇల్లు మీదనే ఆధారపడాల్నా.? ఎక్కడి నుంచో వచ్చినొళ్లు మాత్ర సొంత జాగా తీసుకొని రెండు మూడు అంతస్థుల ఇండ్లు వాళ్లెట్ల కడుతుండ్రు.? మనం ఇల్లు కట్టాలంటే ఇందిరమ్మ ఇల్లు రావాలె.. దుకాణం పెట్టుకోవాలంటే రాజీవ్ యువ వికాసం పథకం ఆసరా అవ్వాలె. అంతేగానీ ఎవడో ఎక్కడ్నుంచో వచ్చి మన దగ్గర దందాలు చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించి స్థిర నివాసాలు కట్టుకుంటుండ్రు అనే ఆలోచన ఉండదు. ఇంకేమన్నా గవర్నమెంట్ సొత్తు మాకు ఒక్కటీ దక్కదు అనే నిష్టూరం. మన పని మనం చేసుకొని.. మన సంపాదన మనం చేతిలో పట్టుకునేదానికి ఎవరో ఇచ్చే పథకం ఎందుకో ఆలోచించుండ్రీ.?

ఎందుకు ఆ ఎదురుచూపులు.?

ఎదగాలి. కానీ ఏమీ చేయకుండా కాదు. ప్రతీ పనిలో కష్టం ఉంటుంది. అది సాఫ్ సపాయి పనైనా.. లేదా సాఫ్ట్‌వేర్ జాబైనా చేయాలె.. సంపాదించాలె అనే తపన ఉంటే మనకు తగిన పని వెతుక్కొని సంపాదిస్తం. పనిచేసి రుబాబ్ బతుకు బతకాలె. అట్లగాకుండా రేషన్ బియ్యమెప్పుడొస్తయో.. ఫించనెప్పుడొస్తదో.. రైతు భరోసా పైసల టైమయ్యిందా.. ఇందిరమ్మ ఇండ్ల ఇన్‌స్టాల్మెంట్ పడ్తుండొచ్చా అని కాలుమీద కాలేస్కొని ఇదే జీవితం అనుకుంటే పొరపాటే. ఏ పనీ చెయ్యకుండా ఫ్రీగా సంపాదించే ఐడియాలు ఎల్లకాలం పనిచెయ్యవు. అవి అప్పటి మందం ఆకలి తీరుస్తుండొచ్చుగానీ.. మన జీవితాలను నిలబెట్టలేవు.

అంతా వాళ్లే: మల్యాల శేఖర్, అర్బన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్

నేను బిల్డింగ్ కాంట్రాక్టర్‌ని. వందలమంది మా దగ్గర పనిచేస్తారు. నేను ఇరవైయేండ్లు దుబాయ్‌లో ఇదే ఫీల్డులో మేనేజర్‌గా పనిచేశాను. అప్పుడు.. ఇప్పుడు అబ్జర్వ్ చేసిందేంటంటే.. మనొళ్లెవరూ ఇప్పుడు పనులకు ఒంగుతలేరు. మీద మీద సంపాదించడం నేర్చిండ్రు. ఇంకోటి ప్రతీ దానికి ఏదో సర్కారు స్కీము ఉండనే ఉండే. మా కన్‌స్ట్రక్చర్ వర్క్‌కు బయిటి వర్కర్సే వస్తుంటరు. నేనే నా ఇంట్రెస్టుతో కావాలనీ.. సైట్ ఇంజనీర్లను మనవాళ్లను పెట్టుకుంటా.

డబ్బుల పరుగులు: పల్లె శ్రీకాంత్ గౌడ్, మేనేజర్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ

ఏ పనీ చెయ్యకుండా సంపాదించాలనే ఆలోచన ఎక్కువైంది జనాలకు. చేయాలంటే ఎన్నో జాబులున్నాయి. వ్యాపారాలున్నాయి. కానీ అవేవీ చెయ్యరు. మా దగ్గరికి చాలామంది కస్టమర్లు డబ్బుల కోసం వస్తుంటారు. కొన్నిసార్లు చిన్న చిన్న అమౌంట్ కూడా అడుగుతుంటారు. నా విశ్లేషణ ప్రకారం మనొళ్లు మిత్తీలకు పైసలు తీసుకొనే దానిపై పెట్టే శ్రమ పని మీద పెట్టరు. అందరూ అలా ఉంటారని కాదుగానీ.. కొందరైతే ఇట్లనే ఉంటుండ్రు.

ఎక్కడికైనా వస్తారు: సురేంద్ర సింగ్, గ్రానైట్ కాంట్రాక్టర్

మాకు గ్రానైట్ షాపు ఉంది. ఇంకా గ్రానైట్ వర్క్ కూడా చేస్తాను. సిటీ మొత్తం మా పనులు నడుస్తయి. మా దగ్గర 50 మందికి పైగా వర్కర్స్ ఉంటారు. అంతా రాజస్థాన్ నుంచి వచ్చినవాళ్లే. ఇదే పని కోసం వచ్చి కష్టపడి.. సంపాదించి ఇక్కడే స్థిరపడ్డాం. మావాళ్లు ఎక్కడ పనుందని చెప్పినా.. దూరం అని భావించకుండా వచ్చేస్తారు. ఎక్కడ సైట్ ఉంటే అది అయిపోయే వరకు అక్కడే వంటా వార్పు చేసుకొని ఉంటారు. లోకల్ వాళ్లు ఎవరూ రారు.

Next Story