- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారెవ్వా.. ఇటాలియన్ జీటీలో ఇండియన్ ఫెరారీ రేసర్.!
చెన్నయ్‌కి చెందిన మహవీర్ రఘునాథన్ రేసింగ్‌లో సత్తా చాటుతున్నాడు.

క్రికెట్ అంటే మనకు అదో పిచ్చి.
రెండు మూడేళ్ల వయసులోనే చేతిలో బ్యాట్ పడతారు.
అందుకే ఇప్పుడు ఇంటికో క్రికెటర్ ఉంటాడు.
అందరిదీ అదే దారి అయితే క్రికెట్‌కు ఆదరణ ఉంటుందా.?
26 ఏళ్ల ఒక యువకుడు ఇదే ఆలోచించాడు.
మోటార్ స్పోర్ట్‌నే కెరీర్‌గా ఎంచుకొని..
సక్సెస్ దారిలో రయ్‌మని దూసుకెళ్తున్నాడు.
- దిశ, ఫీచర్స్
చెన్నయ్‌కి చెందిన మహవీర్ రఘునాథన్ రేసింగ్‌లో సత్తా చాటుతున్నాడు. తాజాగా ఇటాలియన్ జీటీ ఛాంపియన్ షిప్‌లో ఫెరారీతో రేసింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇటాలియన్ జీటీ ఛాంపియన్‌షిప్‌లో ఫెరారీతో రేసింగ్ చేస్తున్న ఏకైక భారతీయుడు మహవీర్ రఘునాథన్.
క్రికెట్‌ను పక్కకుపెట్టి..
క్రికెట్ కు మక్కువ చూపించే దేశంలో మహవీర్ రఘునాథన్ ఒక అసాధారణ మార్గాన్ని ఎంచుకొని ఫెరారీ 296 జీటీ3 రేసింగ్ చేస్తూ ప్రతిభతో నడిచే కలలను ఏ అడ్డంకులు లేకుండా అధిగమించొచ్చని నిరూపిస్తున్నాడు. క్రికెట్ అకాడమీలు, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కోచింగ్‌లకు బదులు వేగం పట్ల మక్కువతో ప్రొఫెషనల్ రేసింగ్ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. చిన్నప్పటి నుంచే కార్లు, స్పీడ్ అంటే ఇష్టం అతడికి. 2011లో చెన్నయ్‌లోని గో కార్ట్ ట్రాక్లో తన మొదటి ల్యాప్‌ను తిరిగాడు. ఆ అనుభవం కేవలం సరదాగానే కాకుండా అతనిలో సాధించాలనే లక్ష్యాన్ని రగిలించింది. కోచింగ్ తీసుకున్న కొంతకాలానికే అమరాన్ కార్టింగ్ ఛాలెంజ్ వంటి స్థానిక ఈవెంట్లో పాల్గొని చెన్నయ, కొల్హాపూర్లలో సక్సెస్ సాధించాడు.
2021లో ఛాంపియన్
ఫార్మాలా-1 రేసులను టీవీలో చూస్తూ ముఖ్యంగా 2011-2013 మధ్య సెబాస్టియన్ వెట్టెల్ ఇండియన్ గ్రాండ్ ప్రీలో ఆధిపత్యం చెలాయిచిన సమయంలో మహవీర్ ఈ క్రీడను వృత్తిగా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఫార్ములా బీఎండబ్ల్యూ ఇండియా, జీపీ2 టెస్టులు, ఆ తర్వాత 2019లో ఫార్ములా- 2లోకి అడుగు పెట్టాడు. అయితే ఈ ప్రయాణం సుగమంగా సాగలేదు. ఆటో జీపీ నుంచి ఫార్ములా-2కి మారడం పెద్ద సవాల్. ఈ నిరంతర మెరుగుదల అతడికి మంచి ఫలితాలనిచ్చింది. 2021లో మహవీర్ రఘునాథన్ ఆల్ఫా రోమియోతో ఫార్ములా-1 కారును టెస్ట్ డ్రైవ్ చేసిన మూడవ భారతీయుడిగా నిలిచాడు. ఇది చివరి నిమిషంలో వచ్చిన అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకొని ఇతర డ్రైవర్లతో సమానంగా ల్యాప్ టైమ్స్ సాధించాడు.
పోడియం మిస్
మహవీర్ విజయం వెనుక తీవ్రమైన శిక్షణ ఉంది. రియల్ రేసుల్లో ట్రాక్ టైమ్ పరిమితంగా ఉండటంతో సిమ్యులేటర్లపై ఆధారపడ్డాడు. మోటార్ స్పోర్ట్ ఆర్థికంగా సవాలుతో కూడుకున్నది. మహవీర్‌కు లక్కీగా స్పాన్సర్లు దొరికారు. 2016-2018 మధ్య కోలోని మోటార్ స్పోర్ట్‌తో ఛాంపియన్ షిప్ గెలిచాడు. 2025 మే ఆరంభంలో ఇటాలియన్ జీటీ సీజన్ ఓపెనర్లో మహవీర్, అతడి ఏఎఫ్ కోర్స్ టీమ్ మేట్ మొత్తంగా 6వ స్థానం, ప్రొ యాప్ క్లాస్లో 4వ స్థానం సాధించారు. అయితే కేవలం 1.2 సెకన్ల తేడాతో పోడియం స్థానాన్ని చేజార్చుకున్నారు. అంత తక్కువ తేడాతో పోడియం మిస్ అవడం నిరాశపరిచింది. కానీ రేసు మొదటి సగంలో 15వ స్థానం ఉండి, చివరికి మంచి పాయింట్లు సాధించాడు.
ఏకైక భారతీయుడు
మహవీర్ జీటీ రేసింగ్‌పై దృష్టి పెట్టాడు. ఏఎఫ్ కోర్స్ టీం కోసం ఫెరారీ 296 జీటీ3 నడుపుతున్నాడు. ఈ సీజన్లో 36 కార్లతో, ఎఫ్ఐఏ వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్ షిప్, జీటీ వరల్డ్ ఛాలెంజ్ అనుభవాలతో మహవీర్ రాణిస్తున్నాడు. ఇటాలియన్ జీటీ ఛాంపియన్ అతడికి చాలా ఇష్టమైనది. గత మూడేళ్లలో దీంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. 2025 ఇటాలియన్ జీటీ ఛాంపియన్‌షిప్లో ఏకైక భారతీయ డ్రైవర్‌గా మహవీర్ ఉండటం నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అతడి లక్ష్యం ఇటాలియన్ జీటీ ప్రో యామ్ ఛాంపియన్‌షిప్‌లో గెలవడం. కష్టపడి నమ్మకంతో పనిచేస్తే గెలుపు మన చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నాడు మహవీర్ రంగనాథన్.






