91 ఏళ్లలోనూ.. బ్యాడ్మింటన్ లెజెండ్.!

by Daayi Srishailam |

అతడి జీవిత ప్రయాణం నేటి యువతకెంతో స్ఫూర్తిగా నిలుస్తోంది

91 ఏళ్లలోనూ.. బ్యాడ్మింటన్ లెజెండ్.!
X

దిశ, ఫీచర్స్: చెన్నయ్‌కి చెందిన 91 ఏళ్ల బీఎం విశ్వనాథన్ ఫిట్నెస్ చూస్తే వయసుకు.. శారీరక ధారుడ్యానికి సంబంధం లేదనిపిస్తుంది. ఆయన పొద్దున 6 గంటలకే బ్యాడ్మింటన్ కోర్టులోకి ఒక యువకుడిలా ఉరిమే ఉత్సాహంతో అడుగుపెడతాడు. అతడి జీవిత ప్రయాణం నేటి యువతకెంతో స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఎప్పుడూ మిస్ చేయడు..

చెన్నయ్‌లోని ఆద్యార్ ప్రజలు ఇంకా నిద్రలేవకముందే విశ్వనాథన్ బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెడతాడు. 1970 చివరి నుంచి ఆయన షటిల్‌కాక్‌ ఆడుతున్నాడు. కర్పగం గార్డెన్స్‌లో ఉండే విశ్వనాథన్ 1993లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రిటైరయ్యే వరకు ఆ సంస్థకు ప్రాతినిధ్యం వహించాడు. గత మూడు దశాబ్దాలుగా ఇందిరా నగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆయనకు రెండవ ఇల్లుగా మారింది. వర్షమైనా, ఎండైనా ఆటను దాదాపు ఎప్పుడూ మిస్ చేయలేదు. ఆయన అభిరుచి, క్రమశిక్షణ ఆధునిక సమాజానికి ఒక గొప్ప ఉదాహరణ.

80 కేటగిరీలో రన్నరప్

ఆధునిక జీవనశైలిలో యువకులు ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ 91 ఏళ్ల వయసులో విశ్వనాథన్ రోజూ ఆడతాడంటే.. వయసు కంటే మనసు, ఆత్మవిశ్వాసం ముఖ్యమని చెప్పొచ్చు. ఇటీవల తాంబరంలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్, నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025లో విశ్వనాథన్ అత్యంత వయోవృద్ధుడైన క్రీడాకారుడిగా వార్తల్లో నిలిచాడు. 81 ఏళ్ల మణి షణ్ముగంతో కలిసి ఆడి 80 ఏళ్లు పైబడిన వారి కేటగిరీలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో 800 జట్లు, 1500-2000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విశ్వనాథన్ ఆట, ఉత్సాహం అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

ఏ హెల్త్ ఇష్యూ లేదు..

విశ్వనాథన్‌ది ఒక విజయం మాత్రమే కాదు. ఒక సామాజిక సందేశం కూడా. వృద్ధాప్యంలో చాలామంది శారీరక శ్రమను వదిలేస్తారు. కానీ విశ్వనాథన్ లాంటి వారు చురుకుగా ఉండటం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఎలా మెరుగుపడతాయో చూపిస్తున్నాడు. ఆయనకు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు లేవు. ఇది ఆయన ఫిట్‌నెస్ జీవనశైలికి నిదర్శనం. విశ్వనాథన్‌కు బ్యాడ్మింటన్‌ను తన జీవన విధానంగా చెప్పుకుంటాడు. శారీరక శ్రమ, అభిరుచి మన ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని ఎలా మెరుగుపరుస్తాయో అతడు నిరూపిస్తున్నాడు.

స్నేహ వారధిగా..

బ్యాడ్మింటన్ ఆయనకు ఒక శారీరక వ్యాయామమే కాకుండా.. ఒక సామాజిక కార్యకలాపంగా మార్చుకున్నాడు. 90 ఏళ్ల వయసులో ఎవరితో ఏం మాట్లాడగలరు.? ఆయన చెప్పింది ఎవరు వింటారు.? అందుకే దీనినొక స్నేహ వారధిగా మలుచుకున్నాడు. ఇందిరా నగర్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆయన ఇతర క్రీడాకారులతో కలిసి ఆడటం, స్నేహ బంధాలను పెంచుకోవడం ద్వారా సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాడు. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడుతుంది. అందుకే ఆ వయసులో కూడా యువకుడిలా ఉత్సాహంగా కనిపిస్తాడు.

Next Story