ఒలింగా.. ఓలింగా! గొల్లగట్టుకు పయనమైన 7 రాష్ట్రాల భక్తులు.. సంతానప్రాప్తినిచ్చే లింగన్నగా ప్రసిద్ధి

by Bhoopathi Nagaiah |
ఒలింగా.. ఓలింగా! గొల్లగట్టుకు పయనమైన 7 రాష్ట్రాల భక్తులు.. సంతానప్రాప్తినిచ్చే లింగన్నగా ప్రసిద్ధి
X

మేడారం జాతర ఎంత గొప్పగా జరుగుతుందో.. ఎంత భారీస్థాయిలో భక్తులు వస్తారో అందరికీ తెలుసు కదా.. దాదాపు మేడారం తర్వాత అంత గొప్పగా సాగే జాతరే గొల్లగట్ట. ఒలింగా ఓలింగా నామస్మరణతో లక్షలాది గొంతులు ఒక్కటయ్యే వేదిక ఇది. యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామి. చౌడమ్మ తల్లి యాదవుల కుల దేవత. లింగమంతుల స్వామిని కొలిచి.. సోదరి అయిన చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించడమే ఈ జాతర విశిష్టత. దేవరపెట్టెను పల్లకీలో తీసుకురావడం.. పొట్టేళ్లను బలివ్వడం.. బోనం సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేక ఘట్టాలు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో గొల్లగట్టు జాతర ఉంది. అక్కడ కొలువుదీరింది లింగమంతుల స్వామి కాబట్టి లింగమంతుల జాతర అని కూడా అంటారు. పెద్దగట్టుపై ఉండటం వల్ల పెద్దగట్టు జాతర అని కూడా పిలుస్తారు. సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్- విజయవాడ రహదారి (65వ నంబర్)కి అతి సమీపంలో పాలసేర్లయ్య గుట్టపై ఈ ఆలయం ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు మాఘ పౌర్ణమినాడు శ్రీకారం చుడతారు. ఈ ఘట్టం జరగడానికి పదిహేను రోజుల ముందు దిష్టితీసే కార్యక్రమం ఉంటుంది. దీంట్లో భాగంగా మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టికుంభాన్ని మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెలో తీసుకొస్తారు. సూర్యాపేట నుంచి మకర తోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ప్రతీ ఆది.. సోమవారాల్లో పూజలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల ఈ జాతర సాగుతుంది.

- శ్రీశైలం దాయి

యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతీ రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి వచ్చే దేవరపెట్టెతోనే జాతర ప్రారభమవుతుంది. మొదటి రోజున 36 విగ్రహాలున్న దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకెళ్లి పూజలు చేస్తారు. తర్వాత కంకణాలు కట్టి.. ఊరేగింపుగా గుట్టపైకి తీసుకొస్తారు. చౌడమ్మ తల్లికి మొక్కిన తర్వాత.. ఖాసీమ్‌‌పేట యాదవులు పసిడి కుండను ఆలయ గోపురం మీద అలంకరిస్తారు. రెండోరోజు బోనాలతో ఊరేగింపుగా వచ్చి లింగమంతుల స్వామికి.. చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. చివరి రోజున సూర్యాపేట యాదవులు మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. కేసారానికి దేవరపెట్టెను తరలించిన మరుసటి రోజున జాతర పరిసమాప్తం అవుతుంది. చీకటాయపాలెం దేవర వంశీయులు.. నల్గొండ తుండు.. మట్ట వంశస్తుల పూజారులు ఈ జాతరను నిర్వహిస్తారు.

దేవరపెట్టే కీలకం

చీకటాయెపాలం నుంచి తీసుకొచ్చిన దేవరపెట్టెలో చౌడమ్మ తల్లి ధరించే తీరొక్క ఆభరణాలుంటాయి. గొర్ల.. మెంతబోయిన.. మున్నా వంశస్థులు పసుపు కుంకుమ.. పాలు నెయ్యి.. పిల్ల తల్లి పొట్టేళ్లను వెంటబెట్టుకొని ఆ దేవరపెట్టెను మోసుకుంటూ కాలినడకన గుట్టకు చేరుకుంటారు. బోనాలు సమర్పించిన తర్వాత కొత్త కుండలో తెచ్చిన బియ్యాన్ని వండి నివేదిస్తారు. తర్వాత మూడు గొర్రెల్ని బలిచ్చి అమ్మవారికి అన్నంతోపాటు మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారు. నెయ్యితో కలిపిన అన్నం.. మాంసాన్ని కేవలం మెంతబోయిన వంశానికి చెందిన ఐదుగురు పెద్ద మనుషులు మాత్రమే తింటారు. జంతుబలి అయ్యాక మున్నా వంశస్థుల గొర్రె నెత్తుటి చుక్కను పాలల్లో కలిపి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది స్వీకరించేవారు మద్యం.. మాంసం ముట్టుకోకూడదని ఆచారం. ఇలా చేస్తే కులదైవంగా.. ఇలవేల్పుగా భావించే తమ స్వామి పశువులను సల్లగా చూస్తాడని నమ్ముతారు యాదవులు.

పెట్టెలో ఏముంటాయి.?

జాతరలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవరపెట్టెలో ఆభరణాలతో పాటు లింగమంతుల స్వామి.. గంగమ్మ.. ఆకుమంచమ్మ.. యలమంచమ్మ.. చౌడమ్మ దేవతామూర్తుల విగ్రహాలుంటాయి. వాటితో పాటు బియ్యం.. పాలు.. పెరుగు.. నెయ్యి.. కుంకుమ.. కొబ్బరికాయలు.. నిమ్మకాయలు.. గుగ్గిలం.. మైశాచి ఉంటాయి. దేవరపెట్టె గొల్లగట్టకు తరలిరాగానే ఒక్కసారిగా లక్షల గొంతులు ఒలింగా ఓలింగా అని నామస్మరణ చేయగానే దురాజ్‌పల్లి అంతా దద్దరిల్లిపోతుంది. డప్పులు.. భేరీల చప్పుళ్లు.. గజ్జెల లాగుల సవ్వడితో గుట్టపైకి దేవరపెట్టెను చేర్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బైకాను కథకుడి ఆధ్వర్యంలో దేవరపెట్టె ముందు చంద్రపట్నం వేసి.. పట్నానికి రెండు వైపులా నూనెతో దీపాలు వెలిగిస్తారు. లింగమంతుల స్వామి దిష్టికుంభంపై ఉన్న అన్నం ముద్దును మున్నవారికి.. చౌడమ్మతల్లి దిష్టికుంభంపై ఉన్న అన్నంముద్దను మెంతబోయిన వారికి ప్రసాదంగా అందించి దిష్టిపూజ ముగిస్తారు.

సంతాన ప్రాప్తి

లింగమంతుల స్వామి.. చౌడమ్మ తల్లి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తారని ప్రజల నమ్మకం. అందుకే ప్రతి జాతరకు 10 లక్షలకు పైగా భక్తులు తరలివస్తుంటారు. ఆర్నెళ్ల పసిపాప నుంచి పండు ముసలిదాక అందరూ ఇక్కడ తలనీలాలు ఇచ్చేందుకు వస్తుంటారు. మూడు కత్తెర్ల తల వెంట్రుకలు.. రూపాయి నాణెంతో జోడించి నాగదేవత పుట్టపై మొక్కుచెల్లిస్తారు. సంతానం లేని మహిళలు దేవున్ని స్మరిస్తూ గుండంలో స్నానంచేసి తడిబట్టలతో గుడిచుట్టూ పొర్లుదండాల ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఏమున్నా పోతాయట. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్.. గజ్జెల లాగులేసుకొని ఒలింగా ఓలింగా అంటూ నృత్యం చేస్తుంటే మహిళలు తడిబట్టలతో పసుపు.. కుంకుమ.. పూలదండలు.. అగరబత్తీలతో అలంకరించిన మందగంపను నెత్తిన ఎత్తుకొని దేవుడి సన్నిధికి చేరుకుంటారు.

స్థల పురాణం.?

అమృత మథనం కోసం శివుడు రాక్షస సంహారం చేస్తు్న్నప్పుడు భూమిపై పడే ప్రతి నెత్తుటి చుక్క నుంచి మరో రాక్షసుడు పుట్టేవాడట. అలా రాక్షసుల్ని వధిస్తూ చివరకు పెద్దగట్టుకు చేరుకొని అలసిపోయాడట శివుడు. ఆ సమయంలో శివుడి చెమటచుక్క పెద్దగట్టుపై పడటంతో చౌడమ్మ దేవి జన్మించిందని అంటుంటారు. ఆ నేపథ్యంలోనే జాతర పుట్టిందనే కొందరి మాట. రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఒక గ్రామాన్ని నిర్మిస్తే కాలక్రమేణా అదే దురాజ్‌పల్లిగా మారిందని కొందరంటుంటారు. ఇంకా కొందరు చెప్పేదంటంటే.. పూర్వం శివాలయాలను పిండారీలు ధ్వంసం చేసి దోపిడీ చేసేవారట. అలా చోరీ కాకుండా ఉండేందుకు అప్పటి యాదవులు దేవతా విగ్రహాలను పాత బావిలో దాచిపెట్టారట. ఫలితంగా కరువుకాటకాలు సంభవించాయి. స్వామివారు ఒక యాదవుడికి కలలో వచ్చి తనకు గుడి కట్టాలని ఆదేశించగా అప్పటి నుంచి లింగమంతుల జాతర సాగుతుందని అంటుంటారు.

ఎలా చేరుకోవాలి.?

తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్‌‌గఢ్.. ఒడిశా.. మహారాష్ట్ర.. కర్ణాటక.. తమిళనాడు నుంచి కూడా భక్తులు గొల్లగట్టు జాతరకు భారీ సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు నేరుగా దురాజ్‌పల్లి చేరుకొని అక్కడ్నుంచి జాతరకు వెళ్లొచ్చు. కోదాడ నుంచి 34 కిలోమీటర్లు. నేరుగా బస్సు సౌకర్యం ఉంటుంది.

వాహనాల రూట్ మ్యాప్

నార్కట్‌పల్లి: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్గొండ వైపు మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా విజయవాడ వెళ్లాలి.

కోదాడ: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా వెళ్లాలి.

సూర్యాపేట- కోదాడ: కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వెళ్లే ఆర్టీసీ బస్సులు.. ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి బీబిగూడెం వద్ద సూర్యాపేటకు వెళ్లాలి. సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవాపురం స్టేజీ నుంచి నామవరం గ్రామం మీదుగా గుంజులూరు స్టేజీ వద్ద జాతీయ రహదారి- 65 మీదుగా కోదాడ.. విజయవాడ వెళ్లాలి.

పార్కింగ్ జోన్

జాతరకు వచ్చేవారు తమ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలకు పోలీసులు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు.

పార్కింగ్-1: సూర్యాపేట మీదుగా జాతరకు వెళ్లే భక్తుల వాహనాలను జాతీయ రహదారి -65 మీదగల హెచ్‌పీ పెట్రోల్ బంక్ నుంచి రాంకోటి తండాకు వెళ్లే మార్గంలో పార్కింగ్ చేయాలి.

పార్కింగ్-2: గరిడేపల్లి.. పెన్ పహాడ్ నుంచి మీదుగా జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను పాత కలెక్టరేట్ వెనుక స్థలంలో పార్కింగ్ చేయాలి.

పార్కింగ్-3: కోదాడ.. మునగాల.. గుంపుల వైపు వచ్చే భక్తుల వాహనాలను ఖాసీపేట గ్రామం వెళ్లే మార్గంలో పార్కింగ్ చేయాలి.

పార్కింగ్-4: మోతె.. చివ్వెంల మండల కేంద్రాల మీదుగా జాతరకు వచ్చే భక్తులు వాహనాలను చివ్వెంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా వద్ద పార్కింగ్ చేయాలి.

Next Story