- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లీగల్.. ఇల్లీగల్! గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక చట్టం అవశ్యం
ఒక చట్టం దృష్టిలో నేరమైన చర్య.. మరో చట్టం దృష్టిలో నేరం కావడం లేదు.

ఒక చట్టం దృష్టిలో నేరమైన చర్య.. మరో చట్టం దృష్టిలో నేరం కావడం లేదు. అలాగే ఓ ఆటపై ఒక రాష్ట్రంలో నిషేధం ఉంటే పక్కనే ఉన్న రాష్ట్రంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆటల వల్ల దేశంలో లక్షలమంది అప్పుల్లో కూరుకుపోతుండగా.. వందలమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనిని నివారించేందుకు చట్టాలు లేవా? అంటే ఉన్నాయి. కానీ, ఇదిగో పైన చెప్పినట్టుగా పకడ్బందీగా లేవు. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థలు కోట్లు గడిస్తున్నాయి. ఉదాహరణకు రమ్మీ, తీన్ పత్తి అనే రెండు ఆటలు తీసుకుంటే.. ఇందులో రమ్మీ ఆట నైపుణ్యం ఆధారితమైనదిగా చట్టం చెప్తున్నది.
తీన్‌పత్తీ పూర్తిగా అదృష్టంపై ఆధారపడిన ఆట కాబట్టి తీన్ పత్తీ ఆడటం చట్టపరంగా నేరం అవుతున్నది. అయితే, మరి రమ్మీ ఆడటానికి చట్టబద్దత ఉందా? అంటే అది ఆయా రాష్ట్రాల్లోని చట్టాలను బట్టి మారుతుంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో అనుకూల చట్టాలు ఉంటే.. కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూల చట్టాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ గందరగోళ పరిస్థితులకు చెక్ పెడుతూ కేంద్రం గ్యాంబ్లింగ్ పై ఓ ప్రత్యేక చట్టం, ఆన్ లైన్ గేమింగ్ పై ఓ కమిషన్ ఏర్పాటుచేస్తేనే వీటి నియంత్రణ సాధ్యం అవుతుంది. బెట్టింగ్ యాప్స్ కు చట్టబద్ధత ఉన్నదా? ఏయే రాష్ట్రాలు అనుమతించాయి? ఏయే రాష్ట్రాలు నిషేధించాయి? గ్యాంబ్లింగ్ నిరోధానికి జాతీయ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - ఎస్పీ హరీశ్
ఇండియాలో గేమ్ ఆఫ్ చాన్స్ (అదృష్టంపై ఆధారపడే ఆటలు) బెట్టింగ్ చట్టబద్ధత విషయం రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, జూదంపై చట్టాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పైగా దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన చట్టం లేదు. అందువల్ల ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. ప్రధానంగా, 1867లోని పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ద్వారా జూదం నియంత్రించబడుతుంది. ఈ చట్టం ప్రకారం, అదృష్టంపై ఆధారపడిన ఆటలు (గేమ్స్ ఆఫ్ చాన్స్) చాలాచోట్ల నిషేధించబడ్డాయి, కానీ నైపుణ్యంపై ఆధారపడిన ఆటలు (గేమ్స్ ఆఫ్ స్కిల్) ఈ నిషేధం నుండి మినహాయించబడ్డాయి. ఉదాహరణకు, రమ్మీ వంటి ఆటలను కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధంగా ఆడవచ్చు, ఎందుకంటే అవి నైపుణ్యంపై ఆధారపడతాయని భావిస్తారు.
గోవా, డామన్, సిక్కిం: ఈ రాష్ట్రాల్లో కాసినోలు చట్టబద్ధం. ఆన్‌లైన్ గేమింగ్‌కు లైసెన్సింగ్ ఇస్తారు.
నాగాలాండ్, మేఘాలయ: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, గేమ్ ఆఫ్ చాన్స్ అదృష్టంపై ఆధారపడిన ఆటలు ఆడవచ్చు. కొంత నియంత్రణ అమలుచేస్తారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా: డబ్బు పందాలతో ఆడే స్కిల్ గేమ్‌లపై కూడా నిషేధం విధించాయి. ఆన్ లైన్ బెట్టింగ్‌పై కూడా అదే విధానం అమలుచేస్తున్నాయి.
ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్ చట్టాలు
1. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1867: ఈ కేంద్ర చట్టం గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తుంది కానీ స్కిల్ గేమ్‌లను మినహాయిస్తుంది. ఇందులో ఆన్‌లైన్ గేమింగ్ గురించి ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది ఇంటర్నెట్‌కు చాలా ముందు రూపొందించిన చట్టం. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని స్వీకరించాయి. మరికొన్ని స్వంత చట్టాలను రూపొందించాయి. దీనివల్ల దేశంలో గ్యాంబ్లింగ్‌పై చట్టపరమైన అస్పష్టత ఏర్పడింది.
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 (సవరణలు 2023): ఆన్‌లైన్ గేమింగ్ ఇంటర్మీడియరీలను నియంత్రించడానికి 2023 ఏప్రిల్‌లో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇందులో ఆన్‌లైన్ గేమ్‌లను ‘ఇంటర్నెట్‌లో ఆధారంగా ఆడే ఆటలు’గా నిర్వచిస్తాయి. రియల్ మనీ గేమ్‌లు సెల్ఫ్-రెగ్యులేటరీ బాడీచే ధృవీకరించబడాలి.. అయితే, అవి పందాలతో సంబంధం లేనివిగా ఉండాలి. ఆడేవారి కేవైసీ, వయస్సు ధ్రువీకరణతోపాటు బాధ్యతాయుత గేమింగ్ విధానాలను తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు భారతదేశంలో భౌతిక చిరునామాను కలిగి ఉండటంతోపాటు చట్టానికి సహకరించాలి.
3. పన్నులు: ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై ప్రభుత్వం 2023లో 28% జీఎస్టీ విధించింది. ఇది స్కిల్ లేదా చాన్స్ గేమ్‌లకు కూడా వర్తిస్తుంది. అయితే, గెలిచిన మొత్తం రూ.10,000 దాటితే 30% TDS వర్తిస్తుంది.
స్కిల్ గేమ్ Vs గేమ్ ఆఫ్ చాన్స్
నైపుణ్యం ఆధారంగా ఆడేది స్కిల్ గేమ్.. కేవలం అదృష్టంతో నడిచే ఆటను గేమ్ ఆఫ్ చాన్స్ అంటారు. అంటే ఆటలో గెలుపు ఆటగాడి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందా? లేక అదృష్టంపై ఆధారపడి ఉంటుందా? అన్నదే ప్రధాన ప్రశ్న. ఈ ఆటల్లో గెలుపు ఆటగాడి నైపుణ్యం, వ్యూహం, జ్ఞానం లేదా నిర్ణయాత్మక సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడుతుంది. అసలు స్కిల్ గేమ్, గేమ్ ఆఫ్ చాన్స్ మధ్య ఉన్న తేడాలు చూద్దాం.
రమ్మీ (కార్డ్ గేమ్): ఆటగాడి వ్యూహంతోపాటు కార్డుల ఎంపిక నైపుణ్యం ఈ ఆటలో కీలకం.
చదరంగం: పూర్తిగా నైపుణ్యంతోపాటు ఆలోచనాశక్తిపై ఆధారపడుతుంది.
ఫాంటసీ స్పోర్ట్స్ (కొన్ని సందర్భాల్లో): ఆటగాళ్ల ఎంపికతోపాటు జట్టు వ్యూహం నైపుణ్యంగా పరిగణిస్తారు.
చట్టపరమైన స్థితి: భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం (ఉదా. 1968లో సత్యనారాయణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు), స్కిల్ గేమ్స్ జూదం కిందకు రావు కాబట్టి చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధంగా ఉన్నాయి.
గేమ్ ఆఫ్ చాన్స్: ఈ ఆటల్లో గెలుపు ఎక్కువగా అదృష్టం లేదా యాదృచ్ఛిక ఫలితాలపై ఆధారపడుతుంది, నైపుణ్యం పాత్ర చాలా తక్కువ లేదా లేదు. ఉదాహరణకు లాటరీ అనేది టికెట్ నంబర్ యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడుతుంది. స్లాట్ మెషీన్లు సైతం యాదృశ్చికంగానే గెలుపు సాధ్యమవుతుంది. చట్ట ప్రకారం.. భారతదేశంలో 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం, గేమ్స్ ఆఫ్ చాన్స్ ను పూర్తిగా జూదంగా పరిగణిస్తారు. దీనిపై చాలా రాష్ట్రాల్లో నిషేధం ఉన్నది. కానీ, గోవా.. సిక్కిం వంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నిబంధనలతో అనుమతిస్తున్నారు.
సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ
ఒక ఆట స్కిల్ గేమ్ లేదా గేమ్ ఆఫ్ చాన్స్ అని చెప్పడం కొన్నిసార్లు చట్టపరమైన వివాదానికి దారితీస్తున్నది. ఉదాహరణకు, రమ్మీని స్కిల్ గేమ్‌గా సుప్రీం కోర్టు గుర్తించింది, కానీ డబ్బు పందెం కోసం ఆడితే కొన్ని రాష్ట్రాలు దీనిని నిషేధిస్తున్నాయి. నిజానికి 1968లో జరిగిన సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (పూర్తి పేరు: స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె. సత్యనారాయణ, AIR 1968 SC 825) భారతదేశంలో జూదం (గ్యాంబ్లింగ్) చట్టాలకు సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. ఈ కేసు రమ్మీ ఆటను ‘గేమ్ ఆఫ్ స్కిల్’ (నైపుణ్య ఆట)గా గుర్తించి, అది ‘గేమ్ ఆఫ్ చాన్స్’ (అదృష్టంతో ఆడే ఆట) కాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు భారతదేశంలో జూదం చట్టాల వివరణలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ తీర్పు భారతదేశంలో ‘స్కిల్ వర్సెస్ చాన్స్’ అనే చర్చకు ఒక ప్రామాణికంగా మారింది. రమ్మీని చట్టబద్ధంగా ఆడవచ్చని ఈ కేసు ద్వారా స్థిరపడింది. ఇదే తీర్పు ఆధారంగా తర్వాత కాలంలో ఆన్‌లైన్ రమ్మీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా చట్టబద్ధతను క్లెయిమ్ చేసుకున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలు (ఉదా.. తమిళనాడు, తెలంగాణ) రమ్మీని డబ్బు పందెం కోసం ఆడితే నిషేధించాయి. ఫాంటసీ స్పోర్ట్స్ స్కిల్ గేమ్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వర్మా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, 2020 కేసులో తీర్పును ఇస్తూ.. అది ఆటగాడి జ్ఞానం మరియు విశ్లేషణ ఆధారంగా జరుగుతుందని వెల్లడించింది. వీటితోపాటు చమర్‌బాగ్‌వాలా vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1957 కేసులోనూ స్కిల్ ఆధారిత ఆటలను ఆర్టికల్ 19(1)(జీ) కింద వీటిని రక్షిత వ్యాపార కార్యకలాపాలుగా సుప్రీంకోర్టు గుర్తించింది. రమ్మీ, పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్‌ను స్కిల్ గేమ్‌లుగా వివిధ హైకోర్టులు (మద్రాస్, పంజాబ్ & హర్యానా, గుజరాత్) గుర్తించాయి. కానీ, ఢిల్లీ జిల్లా కోర్టు ఆన్‌లైన్ స్కిల్‌గేమ్‌లలో అవకతవకలు, మోసం, జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
గ్యాంబ్లింగ్ నిరోధానికి ఏం చేయాలి?
1. స్కిల్, చాన్స్ గేమ్‌లకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి.
2. జాతీయ చట్టం లేదా ఏకీకృత మార్గదర్శకాలు ఉండాలి. దీనివల్ల రాష్ట్రాల మధ్య చట్టపరమైన వైరుధ్యాలను తగ్గుతాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్‌లపై జాతీయ చట్టం రూపొందించాలి.
3. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గేమింగ్ చట్ట పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్ కూడా ఉండాలి.
4. ఈ సంస్థ లైసెన్సులు జారీతోపాటు నిబంధనలను అమలు చేస్తుంది.
5. అల్గారిథమ్ ఆధారిత కంప్యూటర్ ఆటలను సైతం స్వతంత్ర ఏజెన్సీలచే క్రమం తప్పకుండా ఆడిట్ చేయబడాలి,
6. నిర్వాహకులు ఆటల స్వభావంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి. గెలిచే అవకాశాలతోపాటు ఆర్థిక రిస్క్ స్పష్టంగా చెప్పాలి.
7. మైనర్లు ఆడకుండా నిరోధించేందుకు కేవైసీ, వయస్సు ధృవీకరణ తప్పనిసరి చేయాలి.
8. డబ్బు పందాలపై నియంత్రణ ఉండాలి. గరిష్ట పందాలకు పరిమితులు విధించాలి.
9. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి నియంత్రిత పేమెంట్ గేట్‌వేలను మాత్రమే ఉపయోగించాలి.
10. స్కిల్ గేమ్ ముసుగులో గ్యాంబ్లింగ్ నిర్వహించే ఆపరేటర్లపై భారీ జరిమానాలు, జైలు శిక్షలతోపాటు లైసెన్స్ రద్దు వంటి శిక్షలు విధించాలి.






