మేడారం స్పెషల్ : సారలమ్మకు నీటి హారతి

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-26 11:34:23  IST  )

సారలమ్మను కన్నెపల్లి నుండి మేడారం గద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో నిర్వహించే 'నీళ్ల హారతి' ఇస్తారు. సాధారణంగా దేవుళ్లకు కర్పూరంతో హారతి ఇస్తారు.

మేడారం స్పెషల్ : సారలమ్మకు నీటి హారతి
X

సారలమ్మను కన్నెపల్లి నుండి మేడారం గద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో నిర్వహించే 'నీళ్ల హారతి' ఇస్తారు. సాధారణంగా దేవుళ్లకు కర్పూరంతో హారతి ఇస్తారు, కానీ మేడారంలో తల్లీకూతుళ్లకు ఇచ్చే ఈ హారతి పద్ధతి ప్రత్యేకం. కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను వెదురు బుట్టలో (సిద్ద) ఉంచుకుని పూజారి గద్దెల వైపు వస్తున్నప్పుడు, ఊరి మహిళలందరూ తమ ఇంటి ముందు నిలబడి దేవతకు స్వాగతం పలుకుతారు. ఒక వెడల్పాటి పళ్లెంలో నీళ్లు పోసి, అందులో పసుపు, కుంకుమ కలుపుతారు. ఆ ఎర్రటి నీటిలో చిన్న చిన్న దీపాలను వెలిగించి, దేవత వస్తున్న మార్గంలో ఆమెకు ఎదురుగా హారతి పడతారు. దీనినే ‘నీళ్ల హారతి’ అంటారు. మహిళలు ఈ సమయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి, తలలపై పసుపు నీళ్ల కుండలు పెట్టుకుని దేవతకు నీరాజనాలు అర్పిస్తారు.

తల్లిని శాంతింపజేసేందుకు..

సారలమ్మ అడవి నుంచి గ్రామానికి వస్తున్నప్పుడు ఆమెకు ఎలాంటి ‘నరదృష్టి’ తగలకుండా, చెడు శక్తులు దరిచేరకుండా ఉండాలని ఈ హారతి ఇస్తారు. ఇది తల్లికి బిడ్డపై ఉండే ప్రేమకు చిహ్నం. అదేసమయంలో దేవతలు వనంలో ఉండి వస్తున్నప్పుడు చాలా ఆవేశంతో (ఉగ్రరూపంలో) ఉంటారని గిరిజనుల నమ్మకం. చల్లని నీళ్ల హారతిని చూపడం ద్వారా దేవతలను శాంతింపజేసి, వారిని ప్రసన్నం చేసుకుంటారు. కన్నెపల్లి గ్రామ మహిళలందరూ సారలమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. సమ్మక్కకు సారలమ్మ కుమార్తె కాబట్టి, కన్నెపల్లి వారు ఆమెను తమ 'పుట్టింటి ఆడపడుచు'గా చూస్తారు. ఆడబిడ్డ అత్తగారింటికి (మేడారం గద్దెలకు) వెళ్లేటప్పుడు తల్లులు, అక్కచెల్లెళ్లు ఎలాగైతే ప్రేమగా వీడ్కోలు పలుకుతారో, అలాగే నీళ్ల హారతులతో సారలమ్మను సాగనంపుతారు.

హారతి సమయంలో పూనకాలు

ఈ సమయంలో కన్నెపల్లి నుంచి మేడారం వరకు దారి పొడవునా లక్షలమంది మహిళలు వరుసగా నిలబడి ఉంటారు. పూజారి సారలమ్మను తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటే, మహిళలు భక్తితో పూనకంతో ఊగిపోతూ, తమ పళ్లెంలోని నీళ్లను దేవత పాదాల చెంత చల్లుతారు. ఈ దృశ్యం భక్తులలో ఒక రకమైన భావోద్వేగాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. దీనితోపాటు చాలా మంది భక్తులు జంపన్న వాగులో స్నానం చేశాక, ఒక కుండలో పసుపు నీళ్లు పోసి, ఆ కుండపై దీపం వెలిగించి గద్దెల వరకు మోసుకెళ్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఎర్రటి ఎండలో వచ్చే దేవతలకు చల్లదనాన్ని ఇస్తామనే ఒక ప్రతీకాత్మకమైన ప్రేమ.

Read More... సమ్మక్క-సారలమ్మ వీరగాథల ‘పటం కథ’

Next Story