- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాశతో.. అధిక వడ్డీ ఊబిలో!
పేదలే టార్గెట్‌గా బ్రోకర్‌గాళ్ల దందా.. తొందరగా డబ్బు సంపాదించానే ఆశే బలహీనత.. ఊరి జనాలకైతే ఏం తెల్వదని అక్కడే మోసాలు.. ముందు నమ్మిస్తరు.. తర్వాత వంచిస్తరు.. రియల్ ఎస్టేట్, మైక్రోఫైనాన్స్, సోషల్ మీడియా - ఏడ చూసినా ఇదే కథ.. కానీ మారని జనం.. ఆగని దగా..

దిశ, ఫీచర్స్: ఆశకువోతే ఏషం మారిందంట ఎనకటికి. సేమ్ అట్లనే ఐతుంది మనోళ్ల పరిస్థితి. ఎవడో పైస ఆశ చూపిస్తడు. ఐదిస్తే పదిస్తా అని నమ్మిస్తడు. పుస్తెలమ్మి.. పుట్టింటి ఆస్తి పేపర్లు తాకట్టువెట్టి అప్పటికప్పుడు పైసలుదెచ్చి వాని చేతిలవెడ్తం. మన చేతిలకెల్లి వాని చేతిల పడితే అంతే సంగతి. వాడిచ్చేదుందా సచ్చేదుందా? భూముల మీద పెట్టిన అని బుకాయిస్తడు. మైక్రో ఫైనాన్స్ అని మభ్యపెడ్తడు. తాపకొక కథ చెప్పి తప్పించుక తిరుగుతడు.
ఒకర్నిచూసి ఒకరు గొర్రెల్లా పెట్టుడేనా?
చూస్తున్నం కదా ఓ పది పదిహేను రోజుల నుంచి మంగ్లీ చుట్టూ ఓ కథ నడుస్తోంది. అదేందోగానీ బాధితులు లబోదిబోమంటున్నా.. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఆ ముచ్చట ఒడుస్తలేదు. రమావత్ మధు అనేటోడు ఈ మొత్తం కథలో పెద్ద తల్కాయ. ఈ మహానుభావుడు ఏం చేసిండంటే.. పేదోళ్లను నమ్మించి మోసం చేశిండు. పైసా ఆశజూపి పాపం జనాలను నట్టేటా ముంచిండు అని లాయర్ ఆరోపిస్తుండు. వందల మందిని నమ్మించి మోసం చేసిండనీ.. వందా రెండు వందల కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలొస్తున్నయి. ఐతే.. ఏంజూశి వీళ్లంతా అన్ని పైసలు ఇచ్చిండ్రని అడిగితే.. మంగ్లీ మొఖంజూశి అని చెప్తున్నరు. దీని వెనకాలుండి నడిపిస్తున్నదే మంగ్లీ అని చెప్పేసరికి ఒకర్నిజూశి ఒకరు గొర్రెల్లా ఉన్నదంతా తాకట్టు పెట్టి సమర్పించుకుండ్రు.
మిత్తీ అంటే పోయిన పానం లేసొస్తదా?
అందరిదీ ఒకటే ఆశ. పైసకు పైసా ఇస్తంటుండ్రు కదా? అంతకన్నా ఎక్కువేంగావాలని ఆశ పడ్డరు. మామూలుగా బయట ప్రైవేటు ఫైనాన్షియర్ల దగ్గర రెండు లేదా మూడు రూపాయల మిత్తి నడుస్తోంది. ఐతే ఇక్కడ మైక్రోఫైనాన్స్‌ల పేరుతో దందాలు చేసేటోళ్లు పది రూపాయల మిత్తీ కట్టిస్తమని నమ్మించిండ్రు. పది రూపాయల మిత్తి అంటే ఎవరికైనా పానం లేశొస్తది కదా? ఇక్కడ అదే జరిగింది. పది రూపాయల మిత్తి అని వడ్డీ ఆశకువొయ్యి నడ్డి విరుచుకుండ్రు. ఒకొక్కరిది ఒక్కో కథ. కూలిపని చేసుకొని బిడ్డె పెండ్లికి పైసలు.. బంగారం కూడబెట్టుకున్నోళ్లు.. పెయిమీద బంగారం తాకట్టుపెట్టి కొందరు.. అప్పులు తెచ్చి కొందరు.. ఇలా అంతా పేదొళ్లే ఆశకువొయ్యి మోసపోయిండ్రు. మా పైసలు పాయె అని గోసవడ్తుండ్రు. ఇసొంటి మోసంజేసే ముఠాలు చాలా మోపైనయి మన దగ్గర.
మొదటికే మోసమని గ్రహించరా?
ఇంకొకటి రియల్ ఎస్టేట్ ముఠా ఉంటుంది. వీళ్లు చేసేది ఏంటంటే.. సామాన్యులకు ఎరేసి ఔటర్ రింగు రోడ్డుకు పక్కనే అని.. రీజినల్ రింగు రోడ్డుకు ఆనుకునే తమ వెంచర్లు ఉన్నాయని నమ్మిస్తరు. లక్ష రూపాయలకు 120 గజాలు.. రెండు లక్షలకు 250 గజాలు అంటారు. ఇప్పుడైతే ఇంతే రేట్.. ఓపెనింగ్ అయినంక 5 లక్షలైతది అనేసరికి అమాయక జనాలు ఉత్తగనే నమ్మేస్తరు. మోసపోతున్నామని ఏ మాత్రం గ్రహించకుండా హిప్నటైజ్ చేస్తరు బ్రోకర్‌గాళ్లు. చేతిలో పైసలు పడంగనే మాట మారుస్తడు. ఔటర్ రింగురోడ్డు పక్కనే.. రీజినల్ రింగురోడ్డుకు ఆనుకునే అని చెప్పినోడు ఓనర్ అమెరికాలో ఉంటడు.. చిన్న ఇష్యూ వల్ల ఆయన వస్తలేడు అని ఏదో బొంకి ఎక్కడో మారుమూల శివారు గుట్టలల్ల చూపిస్తడు. అదికూడా పక్కా ఇదే నీ ప్లాట్ అని చూపించడు.
ఎగిరి దుంకితే ఏం ఫాయిదా?
అగ్గువకే ప్లాట్ అని నమ్మించి.. వారం రోజులకే డబులైతదని బుదరకిచ్చి.. చేతిలో పైసల్లేకున్నా అప్పుజేశో.. అదలు బదలు అడుక్కొచ్చో.. బంగారం తాకట్టు పెట్టో పైసలు తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే.. ఏండ్లకేండ్లు సైట్ చూపించడు. ఫోన్ చేస్తే లేపడు. చూసి చూసి ఆఫీస్‌కువోతే దానికెప్పుడూ తాళమే ఉంటది. కల్వక కల్వక ఫోన్ కలిస్తే ‘అరే ఏందయ్యా నీ లొల్లీ.. నువ్వుగాక ఇచ్చినవు లచ్చ రూపాలు’ అని అదిరిచ్చి బెదిరిచ్చి మాట్లాడి ఆయింత నోరు మూపిస్తడు. ధైర్యం తక్కువోడైతే మోసపోయినా అనీ.. ఇంట్లో ఏం చెప్పాలనీ.. అప్పులోనికి ఏమియ్యాలని లోలోపల మదనపడి పానం తీసుకునేందుకు సిద్ధమైతరు. ‘ఆశకువోతే గోశూడిపాయె’ అంటే ఇదేగావచ్చు. ఏం ఫాయిదాకొచ్చింది? ఉన్నది వొయ్యింది.. దాశిపెట్టుకున్నదీ వొయ్యింది.
అత్యాశకు పోతే ఏమైందిప్పుడు?
ఆశ మనిషిని నిమ్మళంగా ఉండనియ్యదు. ఎవడో వాడి స్వార్థ ప్రయోజనం కోసం వేసిన ఎరకు చిక్కి ఉన్నదంతా అమ్మి వాడి చేతిలో పెట్టాలన్నంత డీప్‌లోకి తీస్కపోతది. మంగ్లీ మైక్రోఫైనాన్స్ కథనే చూద్దాం. వందల మంది ఇరుక్కున్నారు దాంట్లో. ఒకొక్కరు కనిష్టంగా పది లక్షలు.. గరిష్టంగా కోటి రూపాయలు సమర్పించుకుండ్రు. వాళ్లంతా అత్యాశతోనే అప్పులు తెచ్చి మరీ అప్పనంగా సమర్పించుకున్నోళ్లే. పాపం.. ఏమైందిప్పుడు ఏండ్లకేండ్లు గడిచినా సడి లేదు.. సప్పుడు లేదు. అదొక మోసం.. భారీ కుంభకోణం అని తెలిసిపోయింది. అత్యాశకు పోతే ఏమైందిప్పుడు? ఆశ ఉండాలె. కానీ పది రూపాయల మిత్తీ వస్తుందని నమ్మి ఉన్నదంతా పెట్టేటంత అత్యాశ మంచిది కాదు. అవెప్పుడొస్తయో తెల్వదు. అసలు వస్తయో రావో కూడా తెల్వదు.
జనాల ఆశకు హద్దేది?
మనం కష్టపడి సంపాదించుకున్న పైసలే మనకు ఉంటయి. ఏదో 3-4% అంటే ఏమో అనుకోవచ్చు. 10% ఇంట్రెస్ట్ అంటే అత్యాశే అవుతుంది కదా? ఇట్లా ఎన్నో జరుగుతున్నయి. వెలుగులోకి వస్తున్నయి. అయినా మోసాలు ఆగడం లేదు. జనాల ఆశకు హద్దులేదు కాబట్టి పెట్టుబడులు పెట్టి మోసపోతనే ఉన్నరు. ఇవన్నీ పోన్జీ స్కీమ్ తరహా మోసాలు. అంటే కొత్తవాళ్ల దగ్గర డబ్బుతీసుకొని కొంతకాలం పాతవారికి వడ్డీ చెల్లించడం అన్నమాట. అట్లా హైదరాబాద్‌లో ఇటీవల ఒక మోసం జరిగింది. వ్యాపారం పేరుతో ఒక వ్యక్తి పెట్టుబడులు సేకరించాడు. 5% వడ్డీ ఇస్తా అని హామీ ఇచ్చిండు. కొంతకాలం మిత్తీలు చెల్లించి నమ్మించిండు. తర్వాత మొత్తం పైసలతో ఉడాయించిండు. ఈ మొత్తం మోసం 10 కోట్ల వరకు ఉండొచ్చు.
నమ్మితే నట్టేటా మునగడమేనా?
గ్రామాలనే టార్గెట్ చేసుకొని ఈ మోసాలు జరుగుతున్నయి. ఊర్లలో అయితే అమాయక జనాలుంటారు. ఏది చెప్పినా నమ్ముతరు అనేది వాళ్ల ఉద్దేశం. ఒకవేళ ఒకరిద్దరు ఒత్తిడి చేసినా దబాయిస్తే గమ్మునుంటరు అనే చిన్నచూపుతో భారీ మోసాలకు పాల్పడుతుండ్రు. గిరిజనులు, రైతులు, కూలీ పని చేసేవాళ్లే లక్ష్యంగా ఈ కుట్ర సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇసొంటి దోపిడి ఎక్కువైతోంది. ఇటీవల నల్గొండలోనే లక్షకు రూ.10000- 15000 ఇంట్రెస్ట్ ఇస్తమని నమ్మించిండ్రు. కోట్ల రూపాయలు వసూలు చేసి.. మొదట కొంతకాలం నమ్మకంగా ఇంట్రెస్ట్ చెల్లించిండ్రు. నెల నెలకు మిత్తీ వస్తుంది.. బయట ఏం పనిజేస్తే ఇంత మొత్తం వస్తుందని జనాలు నమ్మడమే పాపమైపోయింది. బిచానా ఎత్తేసి సామాన్యుల నెత్తిలో శఠగోపం పెట్టిండ్రు.
పైసలను ఫలారం లెక్క పంచుడేనా?
సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని మోసాలు జరుగుతుంటయి. ఇటీవల హన్మకొండలో అసొంటిదే జరిగింది. అది చిట్ ఫండ్ తరహా మోసం. ‘చిన్న పెట్టుబడి.. పెద్ద లాభం’ స్కీమ్ పేరుతో డబ్బులు తీసుకుండ్రు. ఐతే.. ఈ మోసం భిన్నంగా ఉంటది. ‘చిన్న పెట్టుబడి.. పెద్ద లాభం’ అంటూ మొదట వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయాలు ఏర్పరుచుకున్నరు. మెల్లగా ముగ్గులోకి దింపి ఆలోచించిన ఆశాభంగం అని ప్రచారం చేసిండ్రు. అమాయక జనాలు ఆశపడ్డరు. నమ్మి పైసలను ఫలారం లెక్క పంచి పెట్టిండ్రు. తొలుత పెట్టుబడి పెట్టినవారికి లాభాలిచ్చి ఖుషీ చేసిండ్రు. దానివల్ల మరింత మంది చేరి పెట్టుబడి పెట్టేటట్లు ప్లాన్ వేసిండ్రు. పాపం.. ఆ ప్లాన్‌లో ఇరుక్కుని జనాలు అప్పుసప్పుజేసి పైసలు పెట్టిండ్రు. కట్‌చేస్తే.. నిర్వహకులు దుకాణం ఎత్తేశిండ్రు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా?
సైబర్ మోసగాళ్ల వలలో కూడా మనోళ్లు ఈజీగా చిక్కుకుంటుండ్రు. ఆన్‌లైన్ ట్రేడింగ్ అని.. క్రిప్టో కరెన్సీ అని ఈ మధ్య మోసాలు ఎక్కువైనయి కదా? ఆ మోసాలకు కూడా సామాన్యుడే బలైతుండు. సోషల్ మీడియా ద్వారా ‘డైలీ రిటర్న్స్’ అంటూ ప్రకటిస్తరు. వాటికి మనోళ్లు అట్రాక్ట్ ఐతుంటరు. ఫేక్ యాప్స్.. వెబ్‌సైట్లలో అకౌంట్లు తెరిపిస్తరు. మొదాలు చిన్న లాభాలు చూపించి మరింత పెట్టుబడి పెట్టేటట్లు ప్రేరేపిస్తరు. తర్వాత అకౌంట్ బ్లాక్ చేసి దోసుకుంటరు. ఇసొంటి మోసాలల్ల మనోళ్లు ఇర్కిపోయి లబోదిబోమంటున్నరు. కొందరు బయటకి చెప్పుకోలేక.. పోయిన సొమ్మును రాబట్టుకునే మార్గంలేక లోలోపల కుమిలిపోతుండ్రు. చేతులు కాలినంక ఆకులు పట్టుకొని అమ్మో.. అయ్యో అని మొత్తుకుంటే ఏం ఫాయిదా?
బోర్డు తిప్పేశాక బోరుమనుడేనా?
కేసులు పెట్టినా.. కేసులు కోర్టుదాక వెళ్లినా మోసం చేసెటోడు చేస్తనే ఉన్నడు. పైస ఆశకువొయ్యి జనాలు చేతులు కాల్చుకుంటనే ఉన్నరు. ఎవరూ తగ్గుతలేరు. నల్గొండలో రమావత్ మధు అనేటోడు ఇట్లనే జనాలందర్నీ నమ్మించి రూ.50 కోట్ల టోకరా వేసిండు. 6% ఇంట్రెస్ట్ అనేసరికి అందరూ ఆశపడ్డరు. ఉన్నదంతా తాకట్టుపెట్టి మరీ రమావత్ మధు హుండీలో వేసిండ్రు. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టి మరీ దందా నడిపించిండ్రు. మెల్లగా డేరా ఎత్తేసి బోర్డు తిప్పేసిండ్రు. కేసు ఫైల్ అయింది. పోలీసులు కార్లు.. ప్రాపర్టీ సీజ్ చేశిండ్రు. ఇంత జరిగినా జనాలు మల్లా మల్లా ఈ బ్రోకర్‌గాళ్లను నమ్ముతనే ఉన్నరు. ఒకరి తర్వాత ఒకరు వరుసబెట్టినట్లు మోసపోతనే ఉన్నరు. కేసుల దాకా వెళ్లినా ఇటు జనాలకుగానీ.. అటు బ్రోకర్‌గాళ్లకుగానీ భయం లేకుండా పోతోంది.
బిచానా ఎత్తేస్తే బిచ్చెం ఎత్తుకునుడేనా?
మోసాల పరంపరను లోతుగా పరిశీలిస్తే అన్నీ ఒకే కామన్ పాటర్న్‌లో జరుగుతున్నయి. పేదలే టార్గెట్‌గా బ్రోకర్‌గాళ్ల కొత్త దందా నడుస్తోంది. పిచ్చి జనాలు పైసలెక్కువొస్తయనే ఆశతో పూటకు లేకున్నా లక్షల రూపాయలు పెడుతుండ్రు. నమ్మించి జనాలను నట్టేటా ముంచుతున్నరు బ్రోకర్‌గాళ్లు. బిచానా ఎత్తేసి జనాలకు బిచ్చెం ఎత్తుకునే పరిస్థితి తీసుకొస్తుండ్రు. కేసులన్నింటిలో ఒకే విధానం కనిపిస్తుంది. అసాధారణ వడ్డీ ఆశ చూపించడం.. మొదట నమ్మకం కోసం లాభాలు ఇవ్వడం.. పరిచయాలు ఇంకింత పెంచుకొని పెట్టుబడులు పెంచుకోవడం.. ఎకాయెకిన చెల్లింపులు ఆపేయడం వంటివి కామన్‌గా ఉంటున్నయి. బ్యాంకులు.. చట్టబద్ధ సంస్థలు ఇవ్వలేని స్థాయిలో అధిక వడ్డీలు ఇస్తామని చెప్తే అది 99% మోసం అనేది జనాలు గుర్తించాలి.
మిత్తీల ఆశ ఎంతకాలం?
జనాలది అత్యాశ కాకపోతే.. నెలకు 10%-20% ఇంట్రెస్ట్ అంటే ఎట్ల నమ్ముతరు? అసలది ఎట్ల సాధ్యం? మోసపోయి గోసపడితే.. అంతా అయ్యాక లబోదిబోమంటే ఏం ఫాయిదా? అధిక మిత్తీల ఆశతో ఆగమవ్వుడు ఇంకెంత కాలం? ఈ మోసాలన్నింటినీ పరిశీలిస్తే అందరూ ఒకే పాయింట్ దగ్గర బెండవుతుండ్రు. తొందరగా పైసలు సంపాదించాలనే ఆశ.. బ్యాంక్ వడ్డీలు బయటిచ్చే వడ్డీలకన్నా తక్కువ అనిపించడం.. పరిచయాల పేరుతో వ్యక్తులను గుడ్డిగా నమ్మడం.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్లనే జనాలు ఈజీగా మోసపోతుండ్రు. ఈ బలహీనతను ఆసరగా చేసుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులని చెప్పి ఒకడు.. మైక్రోఫైనాన్స్‌లో పెట్టుబడి అని ఇంకొకడు కోట్లు కొల్లగొడుతుండ్రు. జనాల ఆశను క్యాష్ చేసుకోవడానికి కుట్రలు చేస్తుండ్రు.
సామాజిక దోపిడీ: శేఖర్ మల్యాల, బిల్డింగ్ కాంట్రాక్టర్
‘డబ్బు ఎక్కువ సంపాదించాలి’ అనే ఆశను దళారులు బలహీనతగా భావిస్తున్నారు. మా దగ్గరికి పనికొచ్చే కొందరిలో ఈ సమస్యను గమనించాను. ఒకరు లాభపడ్డారని చూపించి మరొకరిని ఈ ఊబిలోకి దింపుతున్నారు. ఈ మోసాల వల్ల కేవలం డబ్బు పోవడం కాదు.. కుటుంబాలు కూలిపోతున్నాయి. అప్పుల బారిన పడి కొన్ని సందర్భాల్లో సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు.
అంత వడ్డీ సాధ్యం కాదు: రామ్ జె, రియల్ ఎస్టేట్ వ్యాపారి
నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిగా చెప్పగలను.. ఒక చట్టబద్ధమైన వ్యాపారంతో నెలకు 5%–10% వడ్డీ ఇవ్వడం సాధ్యం కాదు. అలా ఎవరైనా చెబితే అది పక్కా మోసమే. అందుకే జనాలు అత్యాశకు పోవద్దు. మన పెట్టుబడిని వ్యాపారంలో కాకుండా ఇతర వేరే వ్యాపకాలకు వాడుతున్నారని గ్రహించాలి. ఇంకో సమస్య ఏంటంటే.. ఇలాంటి మోసాల వల్ల మొత్తం మార్కెట్‌కే చెడు పేరు వస్తుంది.
సమాచారం ఇవ్వాలి: దయాకర్ నాయక్, రాచకొండ పోలీస్ కమిషనర్ పీఆర్వో
అధిక వడ్డీల కేసులన్నింటికీ ఒకే ప్యాటర్న్ ఉంది. మొదట చిన్న మొత్తంలో వడ్డీ ఇచ్చి నమ్మకం తెచ్చుకుంటారు. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని కనిపించకుండా పోతారు. ఇలాంటి కేసుల్లో బాధితులు ముందుగా ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేస్తారు. చివరికి డబ్బు పోయాక వస్తారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బు సేకరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియా.. వాట్సాప్ స్కీమ్స్ విషయంలో జాగ్రత్త అవసరం.






