కొడితేనే వాయిలెన్సా ? అమ్మాయిలందరూ చూడాల్సిన సినిమా..

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-19 07:27:22  IST  )

మనలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి సొంతిల్లు అనేది ఓ కల. చిన్నదైనా సరే మనకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ఎంతో కష్టపడుతూ రూపాయి, రూపాయి పొగుచేస్తుంటారు.

కొడితేనే వాయిలెన్సా ? అమ్మాయిలందరూ చూడాల్సిన సినిమా..
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి సొంతిల్లు అనేది ఓ కల. చిన్నదైనా సరే మనకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ఎంతో కష్టపడుతూ రూపాయి, రూపాయి పొగుచేస్తుంటారు. ఇదే కాన్సెప్ట్‌తో హీరో సిద్ధార్థ్ ఇటీవల 3BHK సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మధ్య తరగతి కుటుంబ జీవన విధానం, సొంత ఇంటి కోసం కనే కలల మీద తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని సొంతింటి కలను కాస్త పక్కన పెట్టితే, ఇందులోని ఒక కీలక సన్నివేశం ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఆలోచింపజేస్తోంది. ఇందులో హీరో చెల్లెలు అత్తింటిలో ఎదుర్కొన్న బాధ, మానసిక వేదన స్త్రీల మనోభావాలను తెలియజేస్తుంది. 'కొడితేనే వాయిలెన్సా?' అని పుట్టింటి వారికి ఆమె వేసిన ప్రశ్న సమాజంలో వాయిలెన్స్‌ను గుర్తించే పద్ధతులపై మరోసారి లోతైన చర్చను రేకెత్తిస్తోంది.

సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద మలుపు. నేటితరం అనుకుంటున్నట్లుగా ఇది కేవలం ఒక్క వేడుక మాత్రమే కాదు.. జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి తొలి అడుగు. అందులోనూ ఒక అమ్మాయికి పెళ్లి అంటే.. తను చిన్ననాటి నుంచి కలలు కన్న ప్రపంచాన్ని విడిచి మరో ప్రపంచంలోకి అడుగుపెట్టడం అనే చెప్పాలి. అందుకే పెళ్లిపై ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. అయితే, అంతా సవ్యంగా జరిగి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకుని సంతోషంగా ఉంటే పర్లేదు. కానీ, అదే పెళ్లి చేసుకున్నాక భర్త వేధిస్తే, అత్తింటి వారు సూటిపోటీ మాటలతో బాధపెడితే ఆ అమ్మాయి వేదన వర్ణాతీతం. సరిగ్గా 3BHK సినిమాలో కూడా ఇలాంటి ఓ సన్నివేశం ఇప్పుడు సమాజంలోని వాయిలెన్స్ రూపాన్ని ప్రశ్నిస్తుంది.

3BHK సినిమాలో ఆసక్తికర సన్నివేశం

3BHK సినిమాలో ఆర్తి (మీథా రఘునాథ్) హీరో చెల్లెలికి ఎన్నో ఏళ్ల తమ సొంతింటి కలను పక్కన పెట్టి మరీ ఎంతో ఘనంగా పెళ్లి చేస్తారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఒకరోజు సడెన్‌గా హీరోకి ఓ ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే బయలుదేరి ఆస్పత్రికి వెళ్తాడు. అక్కడ ఆర్తి అత్తింటి కుటుంబం తన తండ్రిపై అరుస్తూ.. గృహహింస కేసు పెడతామంటూ బెదిరిస్తుంటారు. కారణం.. ఆర్తి తన భర్తను సీసా బాటిల్‌తో కొట్టడంతో తలకు బలమైన గాయం అవుతుంది. హీరో, అతడి తండ్రి వారికి సర్ధి చెప్పి, ఆర్తిని తీసుకుని పుట్టింటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక 'నీ భవిష్యత్తు బాగుంటుందనే కదా, మంచి సంబంధం అని పెళ్లి చేశాం' అసలేం జరిగిందని తల్లిదండ్రులు ఆమెను అడుగుతారు. అసలైన సన్నివేశం ఇక్కడే ఉంటుంది. వాళ్లు, వీళ్లు చెప్పారని గొప్ప సంబంధమని పెళ్లి చేశారని ఆర్తి తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. వెంటనే తండ్రి అబ్బాయి ఎప్పుడు కొట్టలేదు కదమ్మా అంటాడు. దీంతో ఆర్తి 'కొడితేనా వాయిలెన్సా?' అని ప్రశ్నిస్తూ.. నాలుగేళ్లుగా తను పడిన మనోవేదన వెల్లబుచ్చుకుంటుంది. ఆ ఇంట్లో తనకి గౌరవం లేదని, ప్రతి ఒక్కరికి చిన్నచూపేనని, జీతం లేని పనిమనిషిగా చూసేవారని, తనను ఓ బానిసగా భావించేవారని ఆవేదన పంచుకుంటుంది. ఆ సన్నివేశంలో ఆర్తి చెప్పిన చాలా విషయాలు నిజజీవితంలో ఎంతో మంది గృహిణులు అనుభవిస్తున్నాయనే చెప్పాలి. తల్లిదండ్రులతో ఇన్నాళ్లు తన చెప్పుకోకపోవడానికి కూడా ఆర్తి కారణాలు చెబుతోంది. నిజానికి చాలా మంది ఆడవాళ్లు ఇలాంటి పరిస్థితులనే తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నారు. అత్తింట్లో తమ సమస్యలను పుట్టింట్లో చెప్పి కనిపెంచిన కన్నవారిని బాధపెట్టడం ఎందుకని చెప్పుకోరు. అలాగే, తల్లిదండ్రుల కోసమని, పిల్లల కోసమని.. భర్త, అత్తింటి వారు సూటిపోటీ మాటలతో ఎంత వేధించిన సైలెంట్‌గా తమలో తామే బాధపడిపోతుంటారు.

వాయిలెన్స్ అంటే శారీరక హింసేనా?

ఇక ఈ సన్నివేశం వాయిలెన్స్ అనేది కేవలం శారీరక హింసకు మాత్రమే పరిమితమైంది కాదని స్పష్టం చేస్తోంది. అయితే, ఆర్తి తన భర్తను కొట్టడం శారీరక చర్యగా కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆమెదే తప్పుగా చూస్తారు. కానీ, ఆమె చెప్పింది విన్న తర్వాత తనలోని లోతైన మానసిక గాయాలను తెలుసుకున్న ఆమెను అర్థంచేసుకుంటారు. అత్తింటిలో అనుభవించిన అవమానాలు, భావోద్వేగ నిర్లక్ష్యం, ఆధిపత్య ధోరణి ఆమెను ఆ చర్యకు ప్రేరేపించాయని తెలుసుకుంటారు. నిజానికి చెప్పాలంటే.. ఆర్తి చేసింది ఒక రకమైన ఆత్మరక్షణ చర్యగా కూడా భావించవచ్చు. కానీ, ఆర్తి విషయంలో వాయిలెన్స్ అనేది శారీరకంగా కనబడటం లేదు. సమాజంలో కూడా సాధారణంగా గృహ హింస చర్చకు వచ్చినప్పుడు శారీరక హింసకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నిజ జీవితంలో చాలా మంది గృహిణిలు తాము గృహహింసకు గురవుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించలేక తమలో తామే తీవ్ర మనోవేదన, మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారు. అయితే, ఈ సన్నివేశం ఆ ధోరణిని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. వాయిలెన్స్ అంటే.. కేవలం శారీరక హాని మాత్రమే కాకుండా, మానసిక ఒత్తిడి, భావోద్వేగ నిర్లక్ష్యం కూడా హింసలో భాగమని గుర్తించాల్సిన అవసరం ఎతైన ఉందని తెలియజేసింది. ఈ భీకర వాస్తవాన్ని ఈ సన్నివేశం సమర్థవంతంగా హైలైట్ చేసింది.

మరీ మానసిక వేధింపులను ఏం అనాలి?

అంతేకాదు, సినిమాలో హీరో చెల్లి తన భర్తను కొట్టడం సమాజంలో స్త్రీలు వ్యక్తపరిచే ఆగ్రహాన్ని, కోపాన్ని ప్రతిబింబిస్తుంది. సాధారణంగా నిజ జీవితంలో స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సమాజం స్త్రీల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం, వారిని వెలేత్తి చూపటం, దారుణమైన నేరంగా పరిగణం వంటివి చేస్తుంది. కానీ, అందుకు గల కారణాలను అన్వేషించదు. ఈ సన్నివేశంలో కూడా అంతే, ఆర్తి భర్తను కొట్టడం అత్తింటి వారు వాయిలెన్స్‌గానే భావిస్తారు తప్పా ఆమె బాధను అర్థం చేసుకునేందుకు చూడరు. పుట్టింటి వారు సైతం ఆమె అనుభవిస్తున్న మనోవేధన చెప్పే వరకు తనవైపు తప్పు ఉన్నట్లుగానే చూస్తారు. అచ్చం ఇలాగే, స్త్రీలు తమ కోపాన్ని, ఆవేశాన్ని వ్యక్తం చేసినప్పుడు సమాజం వారి చర్యలను మాత్రమే ఖండిస్తుంది. కానీ, ఆ చర్యలకు కారణమైన పరిస్థితలను తెలుసుకునేందుకు ప్రయత్నించదు. ఈ సన్నివేశం స్త్రీల ఆగ్రహాన్ని సమర్థించడమే కాక, దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని సమాజానికి సూచిస్తుంది.

ఇక, 'కొడితేనే వాయిలెన్సా?' అనే ప్రశ్న.. వాయిలెన్స్‌ నిర్వాచనంపై మన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది. కొడితేనే వాయిలెన్స్ అని చెప్పడానికి లేదు. కొట్టకుండా కూడా మానసికంగా వేధించటం వాయిలెన్స్ కిందకే వస్తుంది. వాయిలెన్స్ అంటే శారీరకంగా హింసించటమే అనుకునే వారందరికీ ఈ సినిమాలోని సన్నివేశం ఇదే తెలియజేస్తుంది. వాయిలెన్స్ గురించి చర్చ వచ్చినప్పుడు కచ్చితంగా శారీరక చర్యలతో పాటు, మానసిక వేదనలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి.

Next Story