- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఐఫోన్ అడిగితే ఆశ్చర్యపోకండి.. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నయ్!
వందమంది అమెరికన్లలో 60మంది చేతుల్లో ఐఫోన్ ఉంటుంది. ఆ ఫోన్‌తో వారికి ఉండే బాండ్ అలాంటిది. కానీ, ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవచ్చు.

వందమంది అమెరికన్లలో 60మంది చేతుల్లో ఐఫోన్ ఉంటుంది. ఆ ఫోన్‌తో వారికి ఉండే బాండ్ అలాంటిది. కానీ, ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవచ్చు. ఇకపై అమెరికాలో ఐఫోన్ సేల్స్ భారీగా పడిపోవచ్చు. ఇప్పటివరకు అమెరికాలో ఉండే ఫ్రెండ్స్ ని ఐఫోన్ పంపరా..? అని మీరు రిక్వెస్ట్ చేసినట్టు.. ఇప్పుడు వాళ్లే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంట్రీతో అమెరికాలో మొత్తం సీన్ మారిపోతున్నది. ఎవడి ఉద్యోగాలు ఊడతాయో? ఎవడి పరిస్థితి ఎలా మారుతుందో? తెలియని పరిస్థితి నెలకొన్నది. వలసదారులను తరిమిస్తే అమెరికన్లు సంతోషిస్తారని సంబరపడిన ట్రంప్ కు.. స్థానికులు గట్టిగా షాక్ ఇస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్, 505051 పేరిట ఉద్యమాలు చేస్తున్నారు. ట్రంప్ ది వెర్రిబాగులతనం అంటూ నిపుణులు మండిపడుతున్నారు. మొత్తంగా ట్రంప్ నిర్ణయాలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని అంటున్నారు. ట్రంప్ చర్యలతో అనేక రంగాలు, వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ సుంకాలకు ఐఫోన్ ధరల వ్యత్యాసాలకు తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు అమెరికన్లు వాడుతున్న ఐఫోన్ అమెరికాలో కంటే ఇతర దేశాల్లో ఎందుకు తక్కువ ధరకు వస్తాయి. అమెరికాలో తయారైతే దాని ధర ఎంత ఉండే అవకాశం ఉంటుంది. అనే అంశాలను పరిశీలిద్దాం. - ఎస్పీ హరీశ్
ఐఫోన్ అమెరికన్ కంపెనీయే అయినా.. దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు చైనా, భారత్‌లో ఉన్నాయి. అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ.. పైగా ముడిసరుకులు అన్నీ చైనా నుంచే తెప్పించుకోవాల్సి ఉంటుంది కాబట్టి చైనాలోనే తొలుత ఉత్పత్తి కేంద్రం ప్రారంభించింది. అయితే, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ముదురుతుండటంతో ముందుజాగ్రత్తగా భారత్‌కు తన కంపెనీలను విస్తరించింది. దీంతో ఎప్పుడు చైనాలో ఫ్యాక్టరీలను మూసివేయాల్సి వచ్చినా యాపిల్ కంపెనీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. గతంలో చైనాలో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25శాతం సుంకాలు విధించేది. అయితే, అమెరికన్లతో ఐఫోన్‌కు ఉన్న బాండింగ్ అమెరికన్ కంపెనీ ఉత్పత్తులు అమెరికాలోనే అమ్మే పరిస్థితి లేకపోవడాన్ని గమనించి.. 2019లో ఐఫోన్ దిగుమతులపై సుంకాలను మినహాయించారు. దీంతో యాపిల్ కంపెనీకి ఊరట లభించింది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతి వస్తువుపై 10శాతం సుంకం భారం వేయగా.. చైనా నుంచి వచ్చే వస్తువులపై 34శాతం అదనంగా విధించడంతో ఆ ఎఫెక్టు ఐఫోన్ పైనా పడింది. దీంతో సుమారు వెయ్యి డాలర్లతో చైనా నుంచి అమెరికాకు వచ్చే ఐఫోన్ 15ప్రోను యాపిల్ కంపెనీ 1199 డాలర్ల చొప్పున విక్రయించేది. కానీ, ఇప్పుడు చైనా నుంచి రావడానికి 1,474 డాలర్లు అవుతుంది. అప్పుడు కంపెనీ దాదాపు 2000డాలర్లకు విక్రయించే అవకాశం ఉంటుంది. దీంతో వినియోగదారుడిపై భారీ వ్యయం పడనున్నది.
ఐఫోన్ తయారీ ఖర్చు లెక్కలు
1. అమెరికా
ముడి సరుకులు : $220-$370.
మానవ వనరులు : $54-$113.
ఫ్యాక్టరీ, లాజిస్టిక్ : $55-$90.
పన్నులు : $89-$90 (లాభం ఆధారంగా).
మొత్తం ఖర్చు : $418-$663
2. భారత్
ముడి సరుకులు : $230-$365.
మానవ వనరులు : $0.92-$2 (చైనా కంటే తక్కువ).
ఫ్యాక్టరీ, లాజిస్టిక్ : $35-$60
పన్నులు ప్లస్ సెస్ : 25.17%
మొత్తం ఖర్చు : $267-$431
3. చైనా
ముడి సరుకులు : $200-$300.
మానవ వనరులు : $10-$20.
ఫ్యాక్టరీ, లాజిస్టిక్స్ : $25-$40
పన్నులు : 25% (లాభంపై).
మొత్తం ఖర్చు : $235-$375
అమెరికాకే నష్టం
అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభం చేకూర్చుతాయని అంటున్నా.. పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. అమెరికాలో మొదటినుంచి ఫెడరల్, రాష్ట్రాల పన్నులు అధికం. కార్మికుల వేతనాలు కూడా భారీగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉత్పత్తి చేయడం అనేది అంత లాభదాయకం కాదు. మానవ వనరులను ఇతర ఉపాధి మార్గాలపై మరల్చడమే ఏకైక మార్గం. అమెరికాలో ఫెడరల్ చట్టాల ప్రకారం ఒక కార్మికుడికి కనీస వేతనం గంటకు కనీసం 7 డాలర్లు చెల్లించాలి. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి రాష్ట్రాల్లో 17డాలర్ల వరకు కూడా ఉన్నది. వేతనం విషయానికి వస్తే చైనాలో కనీసం 10డాలర్లు, భారత్ లో అయితే గరిష్ఠమే 2డాలర్లు ఉన్నది. ఇలా ప్రతి విషయంలో అమెరికాతో పోల్చితే చీప్ లేబర్ ఇతర దేశాల్లోనే ఉంటుంది. పైగా అమెరికాలో ఉద్యోగులకు ఆర్థికభద్రత ఎక్కువ. ఉద్యోగం పోయినా.. ప్రభుత్వమే వారికి కనీస వేతనంతోపాటు నివాస ఏర్పాట్లు కూడా చూస్తుంది. కానీ, మనదేశంలో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. శ్రమ జీవనం ఎక్కువ. దీనివల్ల డెడికేటెడ్ వర్కర్స్ చైనా, భారత్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటారు. పైగా సగటు వయస్సు కూడా 25నుంచి 29 కావడంతో యువ ఉద్యోగులు లభిస్తారు. దీనివల్ల వేతనం తక్కువ ఇవ్వాల్సి రావడంతోపాటు ఎక్కువగా పనిచేయించుకునే అవకాశం ఉంటుందని పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తారు.
ఒక్కరోజుతోనే మారిపోతుందా?
అమెరికాలో స్వదేశీ ఉత్పత్తులు పెంచాలని ట్రంప్ అనుకుంటే ఒక్కరోజులోనే పరిస్థితులు అన్నీ మారిపోతాయా? అంటే అంతకుమించిన జోక్ ఉండదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఎవాల్యుయేషన్ గా జరగాల్సిన ప్రక్రియను హఠాత్తుగా అమలు చేయడం ఆర్థిక భూకంపం సృష్టించేడమేనని ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఉన్న శ్రామిక శక్తి, ఉత్పత్తి రంగంలో ఎంతమేరకు అవసరమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. తక్కువ స్కిల్స్ ఉన్నచోట ఆటోమేషన్ లాంటి రోబోటిక్ వ్యవస్థలు ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేసినా శ్రమశక్తి తగ్గినా యంత్రాల నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనా ట్రంప్ నిర్ణయాలు సహేతుకమైనవి కావని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సుంకాలతో ఐఫోన్‌కు చుక్కలే..
అమెరికా భారీగా విధించిన దిగుమతి సుంకాల కారణంగా ఐఫోన్ కొనుగోలుదారులపై భారీ ప్రభావం పడనున్నది. అమెరికాలో దిగుమతి సుంకాలే కాదు.. వస్తువులు తయారీ చేసినందుకు.. వస్తువులు అమ్మినందుకు వచ్చిన లాభంలో భారీగా పన్నులు ఉంటాయి. ఇందులో కేంద్రం, రాష్ట్రాల వాటా ఉంటాయి. మానవ వనరులతోపాటు పన్నులకే భారీగా చెల్లించాల్సి వస్తున్నదనే అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పాలయి. ఇప్పుడు పరిస్థితి మారడంతో.. వాటి పరిస్థితి సంకటంగా మారింది. నిజానికి గతంలో దొంగతనంగా ఐఫోన్లను అమెరికానుంచి ఇండియాకు తీసుకువచ్చినవారు ఇప్పుడు ఇండియానుంచి అమెరికాకు ఐఫోన్లను స్మగుల్డ్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్న ధరలు ఇప్పుడు ఎలా మారుతాయో చూద్దాం.
ఒక ఐఫోన్ దిగుమతిపై సుంకాల లెక్క
ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ తయారీకి $1,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఈ ఫోన్ చైనాలో తయారై అమెరికాకు దిగుమతి అవుతుంది.
2019 - 2024:: పాత సుంకం: 0 ట్యాక్స్
2025:: ప్రస్తుత సుంకాలు:
$1,000 × 10% = $100 అదనంగా చెల్లించాలి
ఏప్రిల్ 9, 2025 నుండి 34% అదనపు టారిఫ్
($1,000 + $100) × 34% = $374 అదనంగా చెల్లించాలి
మొత్తం సుంకం: $100 + $374 = $474
ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ తయారీ ఖర్చు = $1,000
సుంకం = $474
అమెరికాకు వస్తే అయ్యే ఖర్చు = $1,474
వినియోగదారుడిపై భారం
ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో మాక్స్ రిటైల్ ప్రైస్ $1,199
కొత్త టారిఫ్‌లతో ధర $2,000 వరకు వెళ్లే అవకాశం ఉంది.
స్మగ్లర్లకు పండగ
అమెరికాలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్మగ్లర్లు మెక్సికో, కెనడా ద్వారా భారీగా ఐఫోన్లను స్మగ్లింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో ఫోన్ పై కనీసం 50నుంచి 70 డాలర్లు లాభం ఉంటేనే స్మగ్లర్లు అమెరికా, దుబాయ్, సింగపూర్ నుంచి భారత్ వంటి దేశాలకు ఐఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాంటిది ఏకంగా ఒక్కో ఫోన్ పై కనీసం 300 నుంచి 500డాలర్లు లాభం వస్తున్నదంటే ఇంక విడిచిపెడతారా? సుంకాల వల్ల స్మగ్లర్లు లాభపడే ప్రమాదం ఉంటుంది. అంతిమంగా వినియోగదారులకు నష్టమే తప్ప లాభం ఉండదు. సామాన్యులకు లాభం చేకూర్చేలా ట్రేడ్ వార్ జరగాలే తప్ప వారి నడ్డి విరిచేలా ఉండకూడదని అందరం కోరుకుందాం.






