- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యథేచ్ఛగా ట్యాబ్లెట్ల వాడకం.. లివర్, కిడ్నీలు ఢమాల్!
భారతీయులందరూ మందు గోళీలను చాక్లెట్లలా వేసుకుంటున్నారు.. అని ఇటీవల ఓ సీనియర్ వైద్యుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

భారతీయులందరూ మందు గోళీలను చాక్లెట్లలా వేసుకుంటున్నారు.. అని ఇటీవల ఓ సీనియర్ వైద్యుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కొంతమంది దీనిని వ్యతిరేకించినా.. అది వందకు వందశాతం నిజం. నిజానికి మన శరీరం ఓ అద్భుత నిర్మాణం. ఏదైనా సమస్య వస్తే ఓ స్థాయి వరకు దానిని అదే బాగు చేసుకునే వ్యవస్థ ఉంటుంది. కానీ, మనకు ఏ చిన్న సమస్య వచ్చినా.. డాక్టర్‌ని అడగకముందే మనకు తెలిసిన వైద్యం చేసుకుంటాం. అది అవసరమా? కాదా? అని ఆలోచించం. దీనివల్ల సొంతంగా బాగుచేసే అవకాశం కూడా శరీరానికి ఇవ్వడం లేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాల్లో మనం చాలా తప్పులు చేస్తున్నాం. ముఖ్యంగా గోళీలు ఎలా వేసుకోవాలి? ఎంత మోతాదు వేసుకోవాలి? అన్న విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం. కానీ, అది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం అనేక తప్పులు చేస్తూ.. భవిష్యత్తు తరాలను రోగాలబారిన పడేస్తున్నాం. అందుకే మందులు వాడే ముందు వాటి అవసరం ఏంటి? అవి ఎలా వాడాలి? ఏ మోతాదులో వాడాలి? అన్న విషయాలను పూర్తిగా తెలుసుకోండి. లేదా ఆరోగ్యం మెరుగుకావడానికి వాడే మందులు అనారోగ్యంబారిన పడేసే ప్రమాదం ఉన్నది. బీ అలర్ట్. - హరీశ్ ఎస్పీ
మీరొక డాక్టర్ దగ్గరకు వెళ్లారని అనుకుందాం. ముందుగా బరువు, వయస్సు అడుగుతారు. కొందరు ఎత్తు కూడా అడుగుతారు. ఇవి ఎందుకు అని మీకు తెలుసా? మీకు రాసే ముందులకు మూలాధారం. మీ బరువు, వయస్సు ఆధారంగానే వైద్యుడు మెడిసిన్ డోస్ నిర్ణయిస్తాడు. ఆన్ లైన్ కన్సల్టెన్సీలోనూ వైద్యులు తప్పనిసరిగా ఈ విషయాలను అడుగుతారు.. ఒకవేళ అడగకపోయినా.. మీరు గుర్తుచేయాలి. మరిచిపోవద్దు. ఒక కేజీ బరువుకు 10 నుంచి 15ఎంజీ డోసు పవర్ గోళీలు రాయవచ్చు. ఉదాహరణకు మీరు 65కేజీల బరువు ఉండి 30ఏళ్లవారయితే మీకు 650 ఎంజీ గోళీలు వాడవచ్చు. అంత బరువు లేకపోతే డోస్ తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ బరువు, వయస్సు ఈక్వేషన్ కన్నా ఎక్కువ మోతాదులో డోస్ ఇస్తే కాలేయంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా డబ్ల్యూహెచ్‌వో కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. అందుకే మందులు వాడేముందు వివరాలు పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మందులు-వేళలు
ఔషధం అనేది ఒకరకంగా పులిపై స్వారీలాంటిది.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనల్ని మింగేస్తుంది. అందుకే ఔషధాన్ని ఎలా వాడాలి అన్న అంశంపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. యాంటీబయోటిక్స్, యాంటీడిప్రెసెంట్స్ కొన్ని మందులు శరీరంలో నిర్దిష్ట స్థాయిలో ఉండాలి. సమయానికి తీసుకోకపోతే, అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఫలితంగా వ్యాధి నయం కాకపోవడం మాట అటుంచి తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలకు మందులు సమయానికి తీసుకోకపోతే, రక్తంలో చక్కెర లేదా ఒత్తిడి స్థాయిలు అదుపు తప్పి, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. కొందరు ఉదయం టిఫిన్ చేసేముందు గోళీ వేసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం తిన్న తర్వాత మరొకటి వేసుకోవాల్సి ఉంటే.. ఉదయం మరిచిపోయామని మధ్యాహ్నం రెండు గోళీలు ఒకేసారి వేసుకుంటారు. ఇది చాలా సైడ్ ఎఫెక్టులకు కారణం అవుతుంది. శరీరంలో ఔషధం మోతాదు అధికమై, మైకం కమ్మడం.. వాంతులు, లేదా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మనలో చాలామందికి ఉన్న ఓ అలవాటు ఉంటుంది. డాక్టర్ ఐదు రోజుల కోర్సు రాస్తే.. మూడు రోజులకు తీసుకుంటాం. కానీ, యాంటీబయోటిక్స్ వంటి మందులను కచ్చితంగా సమయానికి వాడటమే కాకుండా వైద్యుడు సూచించిన ప్రకారం పూర్తి కోర్సు వాడాలి. తీసుకోకపోతే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అవ్వడం వల్ల ఆ మందు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు.
తిన్న తర్వాత తినక ముందు
చాలామంది ఔషధాలను తినడానికి ముందు లేదా తిన్న తర్వాత తీసుకోవాలనే సూచనలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోరు. దానివల్ల ఔషధం ప్రభావం.. ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల పరిణామాలు చూపుతాయి. ఐరన్ సప్లిమెంట్స్ వంటివి ఖాళీ కడుపుతోనే తీసుకోవాలి. అప్పుడే అవి సరిగా పనిచేస్తాయి. తిన్న తర్వాత తీసుకుంటే ఔషధం పూర్తి ప్రభావం చూపకపోవచ్చు, దీనివల్ల చికిత్స విఫలమవుతుంది. ఆహారం తీసుకోకుండా యాంటీబయోటిక్స్ మందులు తీసుకుంటే కడుపులో ఇరిటేషన్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. ఓఆర్‌ఎస్ లాంటి సాషెట్‌ను 200 ఎంఎల్ నీటిలో కలుపుకుని తాగాలని వైద్యుడు సిఫారసు చేస్తే.. చాలామంది అంచనా కొద్దీ తాగేస్తారు. ఉదాహరణకు 300ఎంఎల్ నీటిలో ఆ ద్రావణాన్ని కలుపుకుంటే ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ గాఢత తక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల మందు ప్రభావం ఏమాత్రం ఉండదు. అదే 100ఎంఎల్ నీటిలో కలుపుకుని తాగితే ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ గాఢత ఎక్కువగా ఉండి సమస్య మరింత జటిలంగా మారుతుంది. అందుకే ఓ లీటర్ నీటిని తీసుకుని అందులో 5 సాషెట్ల ద్రావణాన్ని కలుపుకుని రోజు మొత్తం తాగితే సరిపోతుంది. వ్యాధి నివారణకు మందుల డోసు అత్యంత ముఖ్యమైనది దాని విషయంలో నిర్లక్ష్యం చేయడం ఏమాత్ర సరికాదు.
నేనే రోగి.. నేనే డాక్టర్
ఒంట్లో కాస్త నలతగా ఉన్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోలో వేసుకుంటాం. అలసటకు జ్వరానికి ఉన్న తేడాను కూడా గుర్తుపట్టేలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక జలబు చేసిందా వెంటనే క్రోసిన్.. దగ్గు వచ్చిందా బెనడ్రిల్.. వీటికి అదనంగా ఓ డోలో కూడా వేసుకుంటాం. ఇలా అయినదానికి కాని దానికి అన్నింటికీ మందులే మందులు. దగ్గులో రెండు రకాలు డ్రై, వెట్. జ్వరంలోనూ ఎన్నో రకాలు ఉంటాయి. అసలు జ్వరం వచ్చిందో లేదో కూడా చెక్ చేయకుండానే హై డోస్ మందులు వేసుకుంటే.. ఇక నిజంగా జ్వరం వస్తే ఏ స్థాయి డోస్ వేసుకోవాలి. సాధారంగా మన దేశంలో జనరల్ మెడిసిన్ పేరిట ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టారాజ్యంగా మందులు కొనుక్కోవడం సర్వ సాధారణం. ఇంక కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్లేకంటే డైరెక్టుగా మందుల షాపుకి వెళ్లి.. అతడికే సమస్య చెప్పి మందులు తెచ్చేసుకుంటున్నారు. ఒక్క డోలో మెడిసిన్ 2020నుంచి 2022 వరకు రెండేళ్లలో ఇండియాలో 350కోట్ల గోళీలు అమ్ముడయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖర్చు తగ్గించుకునే ప్రయాసలో ఇలాంటి చర్యలు భవిష్యత్తులో చాలా నష్టాలను కలిగిస్తాయి. స్వీయ-చికిత్స వల్ల మూత్రపిండాలు, కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే జ్వరం రాకముందే గోళీలు వేసుకోవడం మానేసి.. జ్వరం ఉంటే వైద్యుడిని కలిసి అతడి సలహా మేరకే ఔషధాలు పూర్తిగా వాడాలి. సొంత తెలివితేటలు చూపిస్తే కాలేయంపై ప్రభావం పడి ఐసీయూపాలు కావాల్సి వస్తుంది.
పేషెంట్ శాటిస్ఫాక్షన్ ప్రయారిటీ
ఒక రోగికి చికిత్స చేసేముందు వైద్యుడు సమస్య తీవ్రత, అతడి బరువు, వయస్సును ప్రామాణికంగా తీసుకుని ఔషధం డోసు ఇస్తాడు. కానీ, ఇప్పుడు రోగి సంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే ఒక వ్యక్తికి సాధారణ జ్వరం వస్తే 350ఎంజీ సరిపోతుంది. మూడు రోజులు టాబ్లెట్లు వాడితే.. రెండో రోజునుంచే శరీరం కూడా తనవంతుగా సమస్యను సొంతంగా తగ్గించుకునే పనిచేస్తుంది. కానీ, ఇది రోగికి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇవ్వకపోవడంతో.. అతడు వైద్యుడిపై ఒత్తిడి తెస్తాడు.. లేదా హై డోస్ ఇచ్చే వైద్యుడిని ఎంచుకుంటాడు. ఫలితంగా శరీర నిర్మాణం సొంతంగా బాగుచేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అప్పుడు ఇంతకుముందు ఇచ్చిన డోసు కంటే ఎక్కువ డోసు ఇస్తేనే రోగి సంతృప్తి చెందుతాడు. కొందరిలో హై డోస్ వల్ల అలర్జీలు, కడుపు నొప్పి, వికారం వస్తాయి. వీటిని నివారించేందుకు వైద్యులు మరిన్ని సప్లిమెంట్స్ అదనంగా ఇవ్వాల్సి వస్తున్నది. ఇలా ఒక గోళీని వాడేందుకు మరో గోళీ వాడాల్సిన అగత్యం ఏర్పడుతున్నది. అంతిమంగా ఓవర్ డోస్ బారినపడే ప్రమాదం ఉంటుంది.
విదేశాల్లో ఇదే పరిస్థితా?
మందుల వాడే విధానంపై ఇండియా పోల్చుకుంటే అమెరికా, యూరప్ చాలా మెరుగ్గా ఉన్నది. ప్రతి ఔషధం వాడే విధానం, డోసు ప్రతి అంశంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా అర్థం కాకపోతే ఫోన్ చేసి మరీ అడుగుతారు. ముఖ్యంగా ఇండియాకంటే ఆ దేశాల్లో ఔషధాలపై నియంత్రణ ఎక్కువగా ఉన్నది. అక్కడ సాధారణంగా పారాసిటమాల్ 325 mg లేదా 500 mg డోస్‌లలో ఎక్కువగా వాడతారు, మరియు 650 mg డోస్‌ను సాధారణంగా మితమైన నొప్పి లేదా ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో మాత్రమే సిఫార్సు చేస్తారు. అమెరికాలో స్వీయ-చికిత్స ఉన్నప్పటికీ, ఇండియాతో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పవచ్చు. అమెరికా, యూరప్ లో పారాసిటమాల్ వంటి ఔషధాలను సిఫారసు చేసేముందు కాలేయం, మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేస్తారు. మనదేశంలో ఇలాంటివి చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా వైద్యులు పరీక్షలు చేయిస్తే.. అతడి వద్దకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.






